రెడ్ జోన్ పరిధిలోకి ఆర్కే బీచ్ ఏరియా:
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ఏరియా తాత్కాలిక రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది. నేటి నుంచి 96 గంటల పాటు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ఆంక్షలు కొనసాగుతాయని వైజాగ్ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు. 5 కిలో మీటర్ల పరిధిలో ప్రైవేట్ డ్రోన్‌లను ఎగురవేయడం, నిరసనలు, ర్యాలీలు చేపట్టడం లాంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. జూన్ 17 ఉదయం 10 గంటల నుంచి జూన్ 21 ఉదయం 10 గంటల వరకు నాలుగు రోజుల పాటు బీచ్ ఏరియా రెడ్ జోన్ పరిధిలో ఉంటుంది.
సీఎం చంద్రబాబు ఇలాకాలో దారుణం:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పు వసూలు చేసేందుకు మహిళను చెట్టు కట్టి, దాడి చేసిన అమానవీయ ఘటన కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో వెలుగు చూసింది. నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం భరించలేక ఊరు విడిచి పెట్టి వెళ్లిపోగా.. అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ.. బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తున్నారు. సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి పట్టుకొని.. భర్త తీసుకున్న డబ్బు చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు. శిరీషను చెట్టుకు కట్టి దాడి చేయగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ కు కమిషన్ చీఫ్ మరోసారి లేఖ రాశారు. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు కమిషన్ లేఖ రాసింది. తాజాగా మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి సర్కార్ కు కమిషన్ లేఖ రాసింది. గతంలో ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి… ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదు. క్యాబినెట్ మినిట్స్ కమీషన్ కు ఇవ్వాలా?, వద్దా అనే అంశాన్ని క్యాబినెట్లో ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం.
నేడు మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు:
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఇటీవల విచారించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. నేడు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు మొదటి సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్నది సిట్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ కు వాంగ్మూలం ఇవ్వనున్నారు.
ఆసిఫ్ నగర్లో భర్తపై ప్రియుడితో కలిసి భార్య దాడి:
భార్యలపాలిట యుముడిగా మారిన భర్తలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడంతా రివర్స్ అయ్యింది. భర్తల పాలిట యముడిగా మారుతున్నారు కొందరు భార్యలు. హైదరాబాద్లో మరో ఘటన కలకలం రేపింది. ఆసిఫ్ నగర్ లో భర్తపై ప్రియుడుతో కలిసి దాడి చేసింది ఓ భార్య. ఏడాది క్రితం షైస్తాను అనే మహిళ ఓసామాను వివాహం చేసుకుంది. ఆరు నెల క్రితం భర్త ఓసామాను దుబాయ్ కి పంపించింది. భర్తను దుబాయ్ కి పంపి షైస్తాను అమీర్ తో సహజీవనం చేస్తోంది. ఇటీవల తిరిగి వచ్చిన ఓసామాకు విషయం తెలియడంతో భార్యను నిలదీశాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించిన షైస్తాను సుపరి గ్యాంగ్ ను పెట్టుకొని భర్త ఓసామాపై ప్రియుడుతో కలిసి దాడికి పాల్పడింది. ఈ దాడిలో భర్త ఒసామాకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
ర్యాపిడో రైడర్ దౌర్జన్యం:
బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్లకు సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలంలో ఎక్కువతున్నాయి. గతంలో ర్యాపిడో ట్యాక్సీ డ్రైవర్, తన స్నేహితుడితో కలిసి యువతిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం మర్చిపోకముందే, తాజాగా ర్యాపిడో స్కూటర్ రైడర్ ప్రయాణికురాలు పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన విషయంలోకి వెళితే.. జూన్ 14న బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల ర్యాపిడో రైడర్ దురుసుగా ప్రవర్తించాడు. ఆమె బుక్ చేసిన రైడ్ సమయంలో అతడు అతి వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తుండటంతో మహిళ నెమ్మదిగా వెళ్లాలని సూచించింది. కానీ, ఆమె మాట పక్కన పెట్టి ఆమెతో వాగ్వాదం చేసాడు. ఈ వాగ్వాదం చివరికి పెద్దగా మారి, ర్యాపిడో రైడర్ నడిరోడ్డుపై ఆమెకు చెంపదెబ్బ కొట్టేంతవరకు వెళ్లింది. అలా అతనయు కొట్టడంతో ప్రయాణికురాలు ఆమె నడిరోడ్డుపై కిందపడిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనను అక్కడున్న వారు ఆపకుండా కళ్లప్పగించి చూసారు కానీ ఎంటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడం విడ్డురం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాలువలో శీతల్ మృతదేహం లభ్యం:
హర్యానాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన మోడల్ శీతల్ శవమై కనిపించింది. సోనిపట్‌లోని కాలువలో ఆమె మృతదేహం లభించింది. శీతల్ హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. జూన్ 14న ఆమె అదృశ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా శవమై కనిపించింది. గొంతు కోసి చంపినట్లుగా తెలుస్తోంది. హర్యానా సంగీత పరిశ్రమలో శీతల్ గుర్తింపు తెచ్చుకుంది. కాలువలో ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని సోనిపట్ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం స్వాధీనం చేసుకున్నామని.. అది పానిపట్‌లో అదృశ్యమైన మోడల్ శీతల్‌దిగా గుర్తించినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సివిల్స్ ఆస్పత్రికి తరలించారు.
జనాభా లెక్కల నోటిఫికేషన్ విడుదల:
దేశంలో జన గణనకు అంకురార్పణ జరిగింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జనాభా లెక్కింపునకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లైంది. దేశ వ్యాప్తంగా రెండు దశల్లో జనాభా లెక్కింపు జరగనుంది. 2027, మార్చి నాటికి ఈ జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కానుంది. 2026లో లడఖ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అక్టోబర్ 1 నాటికి జన గణన పూర్తి కానుంది. ఇక మిగతా ప్రాంతాల్లో 2027, మార్చి 1 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ తన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు లెక్కిస్తారు. 2011లో జన గణన జరిగింది. తిరిగి 2020లో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఇంతలో కోవిడ్ మహమ్మారి విజృంభించింది. దీంతో జన గణన ప్రక్రియ నిలిచిపోయింది. దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో కేంద్రం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అంటే మొత్తంగా 16 సంవత్సరాల తర్వాత జన గణన చేపడుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే చేపట్టాయి.
జీ7 నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన ట్రంప్:
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సులో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. హుటాహుటిన అమెరికాకు పయనం అయ్యారు. అత్యవసరంగా భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. వచ్చీరాగానే భద్రతా మండలి సమావేశంలో పాల్గొననున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తక్షణమే పౌరులు టెహ్రాన్ ఖాళీ చేయండి:
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు ఎక్కడకి దారి తీస్తాయేమోనని ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెహ్రాన్ ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికైనా ఇరాన్‌కు సమయం మించిపోలేదని.. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. కెనడా వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యనించారు. మరింత సమయం ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని.. ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ట్రంప్ గుర్తుచేశారు.
కెనడా చేరుకున్న ప్రధాని మోడీ:
ప్రధాని మోడీ కెనడా చేరుకున్నారు. కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘనస్వాగతం లభించింది. ఈరోజు, రేపు కెనడాలో పర్యటించనున్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు తెగిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు మోడీ కెనడాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. దీంతో ప్రపంచమంతా సర్వత్రా ఆసక్తిగా చూస్తోంది. ఇక ప్రధాని మోడీ 2019 నుంచి జీ7 సమావేశాలకు హాజరవుతూ వస్తున్నారు. కెనడాలోని ఆల్బెర్టాలోని కననాస్కిస్ గ్రామంలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ అధికారిక ఆహ్వానం మేరకు 2015 తర్వాత ప్రధాని మోడీ కెనడాలో పర్యటిస్తున్న తొలి పర్యటన ఇది.
ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం:
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి స్నేహ తన ఫేవరెట్ హీరో గురించి ఆసక్తికరంగా వెల్లడించింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిలో తమకు ఇష్టమైన నటీనటుల పై అభిమాన భావాలు ఉండటం సహజమే. కొంతమంది అది ఓపెన్‌గా చెబుతారు, మరికొందరు మాత్రం మనసులోనే దాచుకుంటారు. కానీ స్నేహ మాత్రం తన అభిమాన నటుడిని బహిరంగంగానే వెల్లడించారు. తమిళ్ లో కమల్ హాసన్, సూర్య, విజయ్, ధనుష్, ప్రశాంత్ లాంటి టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసిన స్నేహ… వారందరిలో తనకు అజిత్ అంటే ప్రత్యేకమైన ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ‘మీకు ఇష్టమైన హీరో ఎవరు?’ అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘అజిత్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడం ఒక మంచి అనుభవం’ అని చెప్పింది.
కోలీవుడ్‌లో ఈ వారం.. తంబీలకు త్రిబుల్ బొనాంజ:
కోలీవుడ్‌లో ఈ వీక్‌లో స్టార్ హీరోల సినిమాలకు సంబందించి బిగ్ అప్డేట్స్ రానున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాయి ఆయా ప్రాజెక్ట్స్ టీమ్స్. జూన్ 20న రిలీజయ్యే కుబేర సంగతి పక్కన పెడితే టాప్ హీరోల అప్ కమింగ్ ఫిల్మ్స్ నుండి అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ముందుగా జూన్ 20న ఆర్జే బాలాజీ బర్త్ డే సందర్భంగా సూర్య 45 టైటిల్, టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్లీ ఈ విషయాన్ని రివీల్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్. టీజర్ వచ్చే రోజే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఆరు మూవీ తర్వాత సూర్య- త్రిష నటించబోతున్న మూవీ ఇదే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక జూన్ 21న రజనీకాంత్ అప్ కమింగ్ ఫిల్మ్ జైలర్ 2 నుండి అప్డేట్ రానుందట. ఆ రోజు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ బర్త్ డే. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నుండి చిన్న సర్ ప్రైజ్ రానుందని టాక్. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నా ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ టీజర్‌తోనే గూస్ బంప్స్ తెప్పించాడు. తమిళ తంబీలు మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూస్తున్న డేట్ జూన్ 22. ఆరోజు కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ బర్త్ డే. విజయ్ హై ఆక్డేన్ మూవీ జననాయగన్ నుండి అప్డేట్ రాబోతుంది. దళపతి లాస్ట్ మూవీ కావడంతో జననాయగన్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఆ రోజు ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చేందుకు గట్టిగా ప్లాన్ చేస్తుందట టీం. ఇలా ఒకే వారంలో ముగ్గురు హీరోల క్రేజీ అప్డేట్స్ తో తమిళ్ లో సినిమా సందడి నెలకొంది.
పెళ్లి పుకార్లపై స్పందించిన హీరోయిన్:
అందం, చలాకీ నటనతో యువ హృదయాలను దోచిన నటి జెనీలియా. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహ బంధం లోకి అడుగు పెట్టి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రజంట్ ఆమె ఇప్పుడు సెకండ్ ఈన్నింగ్ ప్రారంభించి సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు చేస్తోంది. ఈ నెల 20న విడుదల కానున్న ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రంలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తుండగా ఆమె కీలక పాత్రలో కనిపించబోతుంది. అయితే.. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జెనీలియా తన గతానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. దాదాపు 14 ఏళ్ల క్రితం తనకు, నటుడు జాన్ అబ్రహామ్‌కి పెళ్లయిందనే పుకార్లు తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.. ‘ఆ వార్తలను కొందరు కావాలనే సృష్టించారు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు కూడా. సెట్ ల్లోనే మా పెళ్లి జరిగిందని చాలా పెద్ద ప్రచారమె చేశారు. అలా ఎందుకు చేశారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే వీటి తర్వాత ఏడాదిలోనే బాలీవుడ్ హీరో, తన స్నేహితుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న జెనీలియా ఆ పుకార్లకు చెక్ పెట్టింది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్న ఆమె, నటిగా మళ్లీ తనదైన శైలిలో వెలుగొందుతోంది.
అదరగొట్టిన కేఎల్ రాహుల్:
ఇంగ్లాండ్ తో జూన్ 20 నుండి జరగబోతున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా.. భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం అతను టీమ్ ఇండియాలో భాగంగా సిద్ధమవుతున్నాడు. అయితే టెస్ట్ సిరీస్‌కి ముందు రాహుల్ ఒక విభిన్నమైన క్రికెట్ అనుభవాన్ని పంచుకుంటూ కనిపించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తో కలిసి అతను పాల్గొన్న ఈ అనుకోని ఛాలెంజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ విభిన్నమైన చాలెంజ్‌ను రెడ్ బుల్ సంస్థ నిర్వహించింది. క్రీడలను ప్రోత్సహించేందుకు తరచూ వినూత్న సవాళ్లను రూపొందించే రెడ్ బుల్, ఈసారి భారత్, ఇంగ్లాండ్ సిరీస్ ప్రచార భాగంగా ఇద్దరు క్రికెట్ స్టార్ లను ఛాలెంజ్‌లో పాల్గొనేలా చేసింది. ఇందులో మొత్తం 4 చాలెంజ్‌లను ఏర్పాటు చేసింది రెడ్ బుల్ సంస్థ. అందులో మొదటి చాలెంజ్‌లో కేఎల్ రాహుల్ ఒక 18 వీలర్ల ట్రక్ పై అమర్చిన బౌలింగ్ మిషన్ నుంచి వస్తున్న బంతులను ఆడాల్సి వచ్చింది. మొత్తం 8 బంతుల్లో కలిపి 500 మీటర్ల దూరానికి షాట్లు కొట్టాలనే ఈ సవాలు రాహుల్‌కు సమయ నిర్వహణ, పవర్ ఫుల్ హిట్టింగ్ సామర్థ్యాలను పరీక్షించింది.
