ఎమ్మెల్సీ పదవికి జకియా ఖానం రాజీనామా:
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను ఛైర్మన్‌కు పంపారు. గత కొంత కాలంగా ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జకియా ఖానం రాజీనామాను ఆమోదిస్తే.. డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా పోతుంది. జకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయచోటి. జకియా ఖానంను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. రెండేళ్ల నుంచి ఆమె వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు. గతంలో మంత్రి నారా లోకేష్‌ను జకియా ఖానం కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి శాలువాతో లోకేష్‌ను సత్కరించారు కూడా. దీంతో అప్పుడే జకియా ఖానం టీడీపీలోకి వస్తారని చర్చ జరిగింది.
ఆసక్తిగా చీరాల మున్సిపల్ రాజకీయం:
బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ రాజకీయం ఆసక్తిగా మారింది. చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై టీడీపీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ జరగనుంది. మున్సిపల్ చైర్మన్ జంజనం ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పదవీ గండం నుంచి తప్పించుకోవాలని వైసీపీని వీడి టీడీపీలో చేరినా.. అవిశ్వాసం ఎదుర్కోక జంజనంకు తప్పడం లేదు. చైర్మన్‌గా జంజనం శ్రీనివాసరావును దించేందుకు పలువురు టీడీపీ, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గ కౌన్సిలర్లు పావులు కదుపుతున్నారు. నేడు క్యాంప్ నుంచి నేరుగా కౌన్సిలర్లు ఓటింగ్‌కు రానున్నారు. అవిశ్వాసం నెగ్గితే చైర్మన్ రేసులో ముగ్గురు నేతలు ఉన్నారు. ప్రస్తుతం చీరాల మున్సిపల్ రాజకీయాలు గజిబిజిగా ఉన్నాయి. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అటు నేతల్లో, ఇటు జనాల్లో నెలకొంది.
కన్సల్టెన్సీ ముసుగులో నకిలీ సర్టిఫికెట్ల దందా:
హైదరాబాద్‌లో నకిలీ విద్యా సర్టిఫికెట్ల విక్రయాలను చేపట్టిన ముఠాను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం గుట్టురట్టు చేశారు. కన్సల్టెన్సీ పేరుతో మోసాలను కొనసాగిస్తూ యువత భవిష్యత్‌ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ముఠాపై పోలీసులు ఘాటుగా స్పందించారు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరుతో ఈ నకిలీ దందాను నిర్వహిస్తున్న మహ్మద్ ముజీబ్ హుస్సేన్‌ను పోలీసులు పట్టుకున్నారు. మే 12న మాసబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాఠశాల వద్ద నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న సమయంలో ముజీబ్ హుస్సేన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై సీఎం సమీక్షలు:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (మే 14) పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు ఆయన వివిధ అధికార సమీక్షలు, నియామక పత్రాల పంపిణీ వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల పర్యవేక్షనకు సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత, సాయంత్రం 4:30 గంటలకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని నీటి వినియోగం, సాగునీటి పంపకాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో ముఖ్యమంత్రి ఈ అంశంపై సమగ్ర సమీక్ష చేయనున్నారు.
14 ఏళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపిన 6వ తరగతి విద్యార్థి:
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడిని 6వ తరగతి విద్యార్థి కత్తితో పొడిచి చంపాడనే ఆరోపణలతో పోలీసులు అతడ్ని మంగళవారం నాడు అరెస్టు చేశారు. అయితే, వివరాల్లోకి వెళ్తే.. హుబ్లీలో ఓ స్కూల్ లో ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నప్పుడు జరిగిన చిన్న గొడవ జరిగింది.. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ 6వ తరగతి పిల్లాడు ఒక్కసారిగా తన దగ్గర కత్తితో 9వ తరగతి స్టూడెంట్ ను పొడిచేశాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు భద్రత పెంపు:
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు భారీ భద్రత పెంచినట్లు సమాచారం. ఆయన భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును జత చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతా చర్యలు కూడా కఠినతరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, జైశంకర్‌కు ఇప్పటికే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలతో Z-కేటగిరీ భద్రత కొనసాగుతుంది. 24 గంటలూ ఆయనకు రక్షణగా సుమారు 33 మంది కమాండోల బృందం రక్షణగా ఉంటుంది.
సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం:
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13వ తేదీన పదవీ విరమణ చేశారు. అయితే, జస్టిస్ సంజీవ్ ఖన్నా కేవలం ఆరు నెలలు మాత్రమే సేవలందించారు. నిన్నటితో ఆయన పదవీ కాలం ముగిసింది. దీంతో భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
పాక్ హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన భారత్:
న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత్ బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకమిషన్ కార్యాలయం వెలుపల కార్యకలాపాలకు పాల్పడినందుకు భారతదేశం నుంచి అతడిని బహిష్కరించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఎఫెక్ట్:
డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రభావం ఐపీఎల్‌పై పడబోతుంది. పలు జట్లు కీలక ప్లేయర్స్ సేవలను కోల్పోయే అవకాశం ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో ఎనిమిది మంది ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. ఎవరెవరంటే.. రికెల్‌టన్, కోర్బిన్ బాస్ (ముంబై), లుంగి ఎంగిడి (ఆర్సీబీ), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ), మార్కో యాన్సెన్ (పంజాబ్), ఐడెన్ మార్క్‌రమ్ (లక్నో), కగిసో రబాడ (గుజరాత్), వియాన్ ముల్డర్ (హైదరాబాద్). ఇక, ఆసీస్ డబ్ల్యూటీసీ జట్టులో ఉన్న కమిన్స్, ట్రావిస్ హెడ్ (హైదరాబాద్), హేజిల్‌వుడ్ (ఆర్సీబీ), జోష్ ఇంగ్లిస్ (పంజాబ్), మిచెల్ స్టార్క్ (ఢిల్లీ) ఐపీఎల్‌లో పలు జట్లు తరపున ఆడుతున్నారు. ఇందులో ముంబై, ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో, పంజాబ్ జట్లకు ప్లే ఆఫ్స్ వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, భారత్, పాక్ మధ్య ఉద్రికత్తలతో ఇప్పటికే చాలా మంది విదేశీ ప్లేయర్స్ స్వదేశానికి వెళ్లిపోయారు. ఒకవేళ వారు భారత్‌కు తిరిగి వచ్చినా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో తాము ప్రాతినిధ్యం వహించే టీమ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరితే అందుబాటులో ఉండకపోవచ్చు.
రాజాసాబ్.. షూటింగ్ రీస్టార్ట్:
ఇటీవల రాజాసాబ్ నుండి ఎటువంటి అప్డేట్ లేదు. మరోవైపు ఏప్రిల్ 10న రిలీజ్ పోస్ట్ పోన్ తర్వాత అసలు ఎం జరుగుతుందని కూడా అప్డేట్ లేదు. ఇటీవల ప్రభాస్ ఇటలీ టూర్ తో అంత గప్ చుప్ అయిపోయింది. కాగా వెకేషన్ ముగించుకుని డార్లింగ్ హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. దాంతో షూటింగ్ మళ్ళి రీస్టార్ట్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై సీన్స్ తీస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ షెడ్యూలులో త్వరలో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నాడు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు టీజర్ రెడీ చేస్తున్నారు. ప్రభాస్ డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ఉండొచ్చు. ఇప్పటి వరకు జస్ట్ గ్లిమ్స్ మాత్రమే వదిలారు. టీజర్ తర్వాత దర్శకుడు మారుతి వర్క్ తో పాటుగా సినిమా గురించి కూడా గట్టిగా మాట్లాడుకుంటారని సమాచారం. భారీ బడ్జెట్ పై తెరక్కుతున్నరాజాసాబ్ కు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మరో ఆఫర్ అందుకున్న కీర్తి సురేష్:
తాజా సమాచారం ప్రకారం.. హిందీలో మరో ప్రాజెక్టు కోసం పలువురు దర్శక నిర్మాతలు కీర్తి సురేష్ తో చర్చలు చేస్తున్నట్లు, కొన్ని రోజులుగా నెట్టింట్లో వార్తలు వినపడుతుండగా, ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటికొచ్చింది. దేశంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ పై రూపొందుతున్న ఓ చిత్రంలో బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావుతో కలిసి కీర్తి నటించనున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ఖారారు కాని ఈ ప్రాజెక్టును, రాజ్ తన సొంత నిర్మాణ సంస్థ పై తీర్చిదిద్దుతున్నారు. ‘సెక్టార్ 36’ ఫేమ్ ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహిస్తుండగా,జూన్‌ల్లో ముంబయిలో చిత్రీకరణ ప్రారంభం కానుందట. ప్రస్తుతం విద్యను ఒక వ్యాపారంలా చేస్తున్నారు. ఈ వ్యవస్థలోని కుంభకోణాలను బయట పెట్టే విద్యావేత్తగా శక్తివంతమైన పాత్రలో కనిపించనుందట కీర్తి.
బాలయ్య కు కథ చెప్పిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్:
ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాలయ్య. బాలయ్య నెక్ట్స్ సినిమా గోపీచంద్ మలినేనితో చేస్తున్నాడు. బాలయ్య బర్త్ డే అనౌన్స్ మెంట్ రానుంది. అయితే ఇప్పుడు ఓ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కోలీవుడ్ లో అజిత్ కుమార్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ బాలయ్యను కలిసి ఓ పాయింట్ చెప్పాడట. అధిక చెప్పిన పాయింట్ కూడా బాలయ్యకు నచ్చిందని సమాచారం. రీసెంట్ గా అజిత్ ను ఫ్యాన్స్ కోరుకున్న విధంగా చూపించి భారీ హిట్ కొట్టాడు. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేస్తే మాస్ ఫీస్ట్ గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అన్ని అనుకున్నట్టు జరిగితే ఆధిక్ తో బాలయ్య ఉండే ఛాన్స్ ఉందని, మరికొద్ది రోజుల్లో ఇంకో నేరేషన్ ఉండొచ్చని వినికిడి. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమను మైత్రి మూవీస్ నిర్మించనుంది.
