NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రైతులకు గుడ్‌ న్యూస్‌.. ఆగస్టు 15 న మూడో విడత రుణమాఫీ..

రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూడో విడత రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చేసింది. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆగస్ట్ 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారు. 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పింది. జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసింది. జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అమెరికా పర్యటన నుంచి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు. ఆ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుంది. రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాల్లో ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించింది.

 

కొనసాగుతున్న ఆవర్తనం.. ఈనెల 15 వరకు వర్షాలు..
మహానగరంలో మరోసారి వర్షం మొదలైంది. ఇవాళ (మంగళవారం) ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, షేక్ పేట్.. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వర్ష ప్రభావం హైదరాబాద్ నగరంలో మరో 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. వాతావరణం మేఘావృతమై ఉంటుందని అంచనా వేస్తున్నా అధికారులు. హైదరాబాద్‌లో ఆగస్టు 15 వరకు నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD)హెచ్చరించింది. గురువారం వరకు నగరంలో వర్షాలు కురుస్తాయని, వాతావరణం ప్రధానంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌లో వర్షం పడే సూచనలు ఉన్నాయి. మరోవైపు ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

 

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటివరకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను బొత్స సత్యనారాయణ పొందు పరిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పు 93లక్షలు, ఆస్తులు 73.14లక్షలు పెరిగినట్టు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చూపించారు. టీడీపీ తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ పోటీ చేస్తుందో లేదో వేచి చూడాలి. మరోవైపు.. గ్రేటర్ విశాఖ ఎన్నికల ఫలితాల తర్వాత అనుమానంతో ముందస్తుగా వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. దుష్టులకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సభ్యులను క్యాంపులకు పంపించామని బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మరో ముగ్గురు వైసీపీ ఎక్స్ ఆఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా, వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. మరీ టీడీపీ పోటీలో నిలుస్తుందా లేదా అనేది కాసేపట్లో ఖరారు కానుంది.

మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు
మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఉదయమే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న భూములను కబ్జా చేశారనే అనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదు కాగా.. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

పెళ్లి పేరుతో ఘరానా మోసం.. రూ.6లక్షలు కాజేసిన ముఠా
పెళ్లిపేరుతో మోసం చేసిన ఓ ముఠాపై ఫిర్యాదు చేశాడు బాధితుడు. అయితే ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. బాధితుడినే ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది నకిలీ పెళ్లికూతురు. ఫోన్‌ చేసి వేధించాడంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ పెళ్లి పేరుతో మోసం ఎలా జరిగిందంటే.. బాధితుడి ఊరు కాకినాడ.. వయస్సు 40 దాటింది.. కానీ ఇంకా పెళ్లి కాలేదు. జీవితంలో ఓ తోడు కావాలని ఇంకా పెళ్లి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యవర్తి శిరీష పరిచయమైంది. ఓ సంబంధం కూడా చూపించింది. కృష్ణమోహన్‌కు అమ్మాయి నచ్చకపోవడంతో వద్దని చెప్పేశాడు. రాజమండ్రిలో మరో అమ్మాయి ఉందంటూ నీరజ అలియాస్ చిన్ని ఫోటోను పంపించింది శిరీష. అమ్మాయి నచ్చిందని చెప్పగానే ఎంగేజ్‌మెంట్‌కు ఏర్పాటు చేసింది. పెళ్లికూతురు కుటుంబ సభ్యులు, బంధువులుగా కొంతమందిని సెట్‌ చేసింది. ఎంగేజ్‌ మెంట్‌ కోసం బంగారం, మొబైల్‌ ఫోన్‌ కొనుక్కెళ్లాడు కృష్ణమోహన్. కొంత నగదు కూడా ఇచ్చాడు. పెళ్లిపేరు చెప్పి కృష్ణమోహన్‌ దగ్గర రూ.6 లక్షలు కాజేశారు. తర్వాత కృష్ణమోహన్‌తో తెగదెంపులు చేసుకున్నారు. దీంతో కృష్ణమోహన్‌ పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లికూతురు నీరజ అలియాస్ చిన్ని గురించి ఆరా తీస్తే.. ఆమెకు ఇంతకు ముందే పెళ్లి అయిందని, పాప కూడా ఉందని పోలీసులకు చెప్పాడు. పెళ్లి పేరుతో జరిగిన మోసంపై జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కూడా ఆశ్రయించాడు. వయస్సు దాటిపోయినా పెళ్లి జరుగుతుందని ఆశ పడ్డానని, తన డబ్బులను తనకు ఇప్పించాలని బాధితుడు వేడుకున్నాడు. పెళ్లి పేరుతో తనను ఎలా మోసం చేశారో వివరించాడు కృష్ణమోహన్. ముఠాలో మొత్తం 11 మంది ఉన్నారని తెలిపాడు. అందులో ఆరుగురు మహిళలు కాగా.. ఐదుగురు పురుషులు ఉన్నారని వివరించాడు. తన కుటుంబసభ్యులు లేకపోవడం వల్ల ఎంగేజ్‌మెంట్‌కు స్నేహితులను తీసుకెళ్లినట్టు బాధితుడు కృష్ణమోహన్ చెప్పాడు. జూన్‌ 23న జరిగిన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను చూపిస్తున్నాడు. పెళ్లి పేరుతో మోసం కేసులో వధువు పాత్ర పోషించిన నీరజ అలియాస్ చిన్ని కూడా కౌంటర్ కేసు పెట్టింది. కాకినాడ ఎస్పీ ఆఫీసులో కృష్ణమోహన్‌పై ఫిర్యాదు చేసింది. మధ్యవర్తి శిరీష తమను మోసం చేసిందని అంటోంది. కృష్ణమోహన్‌తో తనకు పెళ్లి ఇష్టం లేదని.. బంధువుల ఇంటికి వస్తే బలవంతంగా ఎంగేజ్‌మెంట్‌ చేశారని నీరజ అంటోంది. కృష్ణమోహన్‌ చెప్పినట్లు తనకు పెళ్లి కాలేదని.. ఇక పిల్లలు ఎలా ఉంటారని ప్రశ్నిస్తోంది. ఎంగేజ్‌మెంట్‌ తర్వాత కృష్ణమోహన్‌ తనకు చాలా సార్లు ఫోన్‌ చేసి సింగిల్‌గా కలుద్దామని బెదిరించాడని ఆరోపించింది. కృష్ణమోహన్‌ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని అంటోంది నీరజ అలియాస్ చిన్ని. కృష్ణ మోహన్‌ ఫిర్యాదు మేరకు ఆరుగురు మహిళలపై కేసు నమోదు చేశారు పోలీసులు. తనలా చాలా మందిని ఈ ముఠా మోసం చేసిందని అంటున్నాడు కృష్ణ మోహన్‌. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నాడు. మొత్తానికి లేటు వయస్సు పెళ్లి కొడుకును మోసం చేసిన ఈ ముఠా కేసును పోలీసులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

కోల్‌కతాలో డాక్టర్‌ హత్య.. హైదరాబాద్‌ లో జూడాల నిరసనలు..
హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోల్‌కతాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా.. హైదరాబాద్‌లోని కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. వైద్య నిపుణులకు, ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే సురక్షితమైన వాతావరణంలో పనిచేయడం కష్టమవుతుంది అని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే దేశంలో వైద్యుల కొరత తీరుతుందని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. కలకత్తాలో జూనియర్ వైద్యురాలి పై హత్యాచార ఘటనను నిరసిస్తూ గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. గాంధీ ఆసుపత్రిలో బాధిత జూనియర్ డాక్టర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఆసుపత్రి లో 36 గంటలు పనిచేసిన అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకి డ్యూటీ అయిన వెంటనే డాక్ రూమ్ సదుపాయం ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. సరైన భద్రత ప్రమాణాలు లేకపోవడం వలన ఇలాంటి ఘటన జరిగిందని, డ్యూటీలో ఉన్న వైద్యురాళ్ళ కు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రైనీ డాక్టర్ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి, దీనిపై దర్యాప్తు చేసేందుకు బెంగాల్ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో లైంగిక వేధింపులు, హత్యలు జరిగినట్లు తేలింది. ఆమె రెండు కళ్ళు, నోటి నుంచి రక్తం కారుతోంది. ముఖంపై గోళ్ళ గాయాలున్నాయి. ప్రైవేట్ భాగాల నుంచి కూడా రక్తస్రావం ఉంది. ఆమె కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులపై కూడా గాయాలు ఉన్నాయి.”అని నివేదిక పేర్కొంది. కెమెరాలో నిర్వహించిన పోస్ట్‌మార్టంలో ఇద్దరు మహిళా సాక్షులు, మహిళ తల్లి ఉన్నారు. ఈ నేరం తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగినట్లు కోల్‌కతా పోలీసు సీనియర్ అధికారి తెలిపారు. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సిసిటివి ఫుటేజీని పరిశీలించిన తర్వాత ఆగస్ట్ 9న సంజయ్ రాయ్ అనే తాత్కాలిక ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. 31 ఏళ్ల గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని మృతికి సంబంధించిన హత్య కేసుతో పాటు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం.. తెలంగాణ పీసీసీపై ప్రకటన!
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ఆరంభం కానుంది. తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులు ఎవరు, ఏఐసీసీ ప్రక్షాళన, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి, వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా దక్కించుకోవాలి.. ఇవే అంశాలు ప్రధాన ఎజెండాగా నేడు కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈరోజు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, జనరల్ సెక్రటరీలతో ఏఐసీసీ విస్తృత సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే దిశా నిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బృహత్తర కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ నియమించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ కీలక సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాలకు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లను నియామకం చేయనున్నారు. ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా యువ నేతలకు జాతీయ స్థాయిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో మరికొన్ని గంటల్లో తెలియరానుంది.

లాస్‌ఏంజిల్స్‌లో భూకంపం!
అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (యుఎస్‌జీఎస్) తెలిపింది. చైనాటౌన్ సమీపంలోని హైలాండ్ పార్క్‌కు దక్షిణ ఆగ్నేయంగా 2.5 మైళ్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12:20 గంటలకు భూకంపం సంభవించింది. లాస్‌ఏంజిల్స్‌ ప్రాంతం నుంచి మెక్సికో సరిహద్దులోని శాన్‌డియాగో వరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో పలు ఇళ్లలోని అద్దాలు, సామాన్లు ధ్వంసమయ్యాయి. భూకంపం తర్వాత లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.