బంగారంతో ఉడాయించిన కారు డ్రైవర్:
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.10 కోట్ల విలువైన బంగారంతో ఓ కారు డ్రైవర్ ఉడాయించాడు. నగల వ్యాపారి రోడ్డు పక్కన టీ తాగుతుండగా.. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఒక్కసారిగా పరారయ్యాడు. కారును నందిగామ దగ్గర మునగచెర్ల వద్ద వదిలిన డ్రైవర్.. బంగారంతో పరారయ్యాడు. వ్యాపారి జగ్గయ్యపేట మండలం చిలకలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ప్రత్యేక బృందాలు డ్రైవర్ కోసం గాలిస్తున్నాయి. కారులో 7 కిలోల బంగారం ఉన్నట్లు వ్యాపారి కిషన్ లాల్ పోలీసులకు తెలిపాడు. బంగారం విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
రైతు భరోసా నిబంధనులు ఇవే:
రైతు భరోసా పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. జనవరి 26, 2025 నుంచి అమలు చేయనుంది. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12,000కు పెంచింది. దీంతో పాటు ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. భూ భారతి (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించాలని నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనుంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఆర్‌బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఈ పథకాన్ని వ్యవసాయశాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్‌ఐసీ, ఐటీ ఈ పథకానికి భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.
నాగర్‌కర్నూల్‌లో డిప్యూటీ సీఎం పర్యటన:
నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. మార్కండేయ లిఫ్ట్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఆయా గ్రామాల్లో సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలు, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. బిజినేపల్లి మండలంలోని శాయిన్‌పల్లిలో నిర్మించిన మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
ప్రభుత్వానికి రూ.88.55 కోట్ల సింగరేణి డెవిడెండ్:
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి కాలరీస్ రూ. 88.55 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ డివిడెండ్ చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి అందజేశారు. సింగరేణి కాలరీస్ చెల్లింపు మూల ధనం(పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ) లో 10 శాతాన్ని డివిడెంట్‌గా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తం సుమారు రూ.173 కోట్లు కాగా.. సింగరేణిలో 51 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో నుంచి 88.55 కోట్ల రూపాయలను డివిడెండ్ చెల్లించింది.
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్:
కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తాజాగా యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం, ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురు అయ్యప్ప భక్తులు మరణించడం వల్ల తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ బీమా పథకం ద్వారా యాత్రికులు ప్రమాదంలో మరణించినప్పుడు వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు. ఇందులో భాగంగా పథనంథిట్ట, కొల్లం, అలప్పుజ, ఇడుక్కి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబసభ్యులకు ఈ పరిహారం అందించనుంది. ఈ పథకం కోసం యాత్రికుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయబడదని అధికారులు తెలిపారు. వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఈ ప్రమాద బీమా పథకం వర్తిస్తుందని టీడీబీ తెలిపింది.
ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఆప్ విపత్తు పోతుంది:
ఢిల్లీ ఆప్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఫిబ్రవరి 5న ఆప్ విపత్తు పోతుందని జోస్యం చెప్పారు. శనివారం జేఎల్‌ఎన్ స్టేడియంలో జరిగిన ‘‘జుగ్గి బస్తీ ప్రధాన్ సమ్మేళన్’’ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని కేజ్రీవాల్ లక్ష్యంగా ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ ఢిల్లీకే కాదు.. ఆయన పార్టీకి కూడా విపత్తేనని పేర్కొ్న్నారు. చెడు రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలన్నీ కేజ్రీవాల్‌లో ఉన్నాయని తెలిపారు. దేశంలోనే నెంబర్ వన్ అవినీతి నేత కేజ్రీవాల్ అంటూ అమిత్ షా విమర్శించారు.
ట్రంప్ ఓడిపోయేవాడు:
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో కమలా హారిస్ ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్, డెమోక్రటిక్ పార్టీతో ఐక్యత కోసం పోటీలో పాల్గొనకపోవడం వల్ల తాను ట్రంప్‌ను ఓడించడంలో విఫలమైనట్లు తెలియజేశారు. ఒకవేళ నేను పోటీలో నేను ఉంటే ట్రంప్‌ను కచ్చితంగా ఓడించేవాడిని అని జో బైడెన్ నమ్మకంగా పేర్కొన్నారు. అధికారంలో తిరిగి పోటీ చేయకూడదనే నిర్ణయంపై నాకు విచారం లేదు. నేను, కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీకి కలిసి పని చేయాలనుకున్నాము. కమల హారిస్ విజయవంతమవుతుందని నాకు నమ్మకం ఉంది. నలుగురు సంవత్సరాల తర్వాత ఆమె మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుందని, ట్రంప్ తిరిగి అధ్యక్షుడు కావడాన్ని అడ్డుకోవడం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
చరిత్రకు టైటిల్ దూరంలో జొకోవిచ్:
కొత్త ఏడాదిలో గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నేటి నుంచే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఆరంభం అవుతోంది. ఆల్‌టైమ్ గ్రేట్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ 25వ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై దృష్టి పెట్టాడు. ఈ గ్రాండ్‌స్లామ్ గెలిస్తే టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ప్లేయర్‌గా జాకో చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్‌తో సమానంగా టైటిళ్లు 24 సాధించాడు. ఆ ఒక్కటీ గెలవాలన్న జాకో ఆశతో అతడు బరిలోకి దిగుతున్నాడు. చరిత్రకు టైటిల్ దూరంలో ఉన్న 37 ఏళ్ల జొకో.. కొత్త కోచ్ ఆండీ ముర్రేతో ఈ టోర్నీకి సిద్ధమయ్యాడు.
వెంకటేష్ కోసం క్యూ కట్టిన 4 బ్యానర్లు:
టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. వెంకటేష్ మాట్లాడుతూ ‘ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. ఈ సినిమాలో నా పాత్ర ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మరోసారి వింటేజ్ వెంకీని చూస్తారు. ఇక ఈ సినిమా తర్వాత నాతో సినిమా చేసేందుకు నాలుగు బ్యానర్లు రెడీగా ఉన్నాయి’ అని తెలిపారు.
దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్:
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టులో శనివారం విచారణ జరిగింది. ఈ కూల్చివేతపై విచారణ జరిపిన అనంతరం సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్ లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు షాకిచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు .. ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బీ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ ప్రారంభించారు.