NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

కోటి దీపోత్సవం రెండో రోజు కార్యక్రమాలు ఇవే:
కోటి దీపోత్సవం 2024లో నేడు రెండో రోజు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ (శ్రీ సిద్ధేశ్వరీ పీఠం, కుర్తాళం), రమ్యానంద భారతి మాతాజీ (శ్రీ శక్తిపీఠం, తిరుపతి) గారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. శ్రీ నండూరి శ్రీనివాస్ గారు ప్రవచనామృతం చేయనున్నారు. వేదికపై నర్మదా బాణలింగానికి కోటి భస్మార్చన, భక్తులచే స్వయంగా శివలింగాలకు కోటి భస్మార్చన, కోటి దీపోత్సవం వేదికపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణం ఉంటుంది. అనంతరం నంది వాహనంపై ఆదిదంపతులు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 5.30 నుంచి రెండో రోజు విశేష కార్యక్రమాలు ఆరంభమవుతాయి.

తిరుపతి ప్రత్యేక రాష్ట్రం కోసం పిటిషన్:
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిని ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేవలం 700 మందికిపైగా ఉన్న ప్రజల కోసం వాటికన్ సిటీ దేశంగా ఉందంటూ ఉదాహరణ చూపుతూ.. అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న తిరుపతిని కూడా ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని పిటిషన్‌లో ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టతను కాపాడేందుకే ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. పిటిషన్‌ను వ్యక్తిగతంగా కేఏ పాల్ వాదించారు. అయినా కూడా సుప్రీం ధర్మాసనం పిటిషన్ కొట్టేసింది.

నేడు బీజేపీ మేనిఫెస్టో:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తీర్మానం లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అంటే ఆదివారం ఉదయం 10.15 గంటలకు ముంబైలో విడుదల చేయనున్నారు. ఇవాళ హోంమంత్రి ప్రజల మధ్య పార్టీ హామీల పెట్టెను తెరవనున్నారు. బీజేపీ ఈ కార్యక్రమాన్ని బ్రాండాలోని సోఫిటెల్ హోటల్‌లో నిర్వహించనున్నారు. బిజెపి మేనిఫెస్టోను విడుదల చేయడానికి ముందు, నవంబర్ 5 న, సిఎం ఏక్‌నాథ్ షిండే కొల్హాపూర్‌లో జరిగిన ర్యాలీలో మహాయుతి మ్యానిఫెస్టోలోని 10 హామీలను ప్రకటించారు. ఇందులో లాడ్లీ బ్రాహ్మణ యోజన నుంచి రైతులు, సీనియర్ సిటిజన్లు, అంగన్‌వాడీల పెన్షన్ వరకు వాగ్దానాలు చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఇద్దరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మోడీజీ సమాధానం చెప్పండి:
బీహార్‌లో షంటింగ్‌లో ఇంజిన్‌కు, కోచ్‌కి బఫర్‌కు మధ్య ఇరుక్కుని రైల్వే ఉద్యోగి మృతి చెందడానికి రైల్వే శాఖ బాధ్యత వహించాలని.. ఇది దీర్ఘకాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ శనివారం అన్నారు. బఫర్ అనేది రైలు ఇంజిన్ .. కోచ్ రెండు చివర్లలో అమర్చబడిన పరికరం, ఇది షాక్‌ల నుండి రక్షిస్తుంది. బోగీల మధ్య తాకిడి ప్రభావాన్ని తగ్గించేందుకు బఫర్‌ను రూపొందించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని బరౌనీ జంక్షన్ వద్ద ప్లాట్‌ఫారమ్ నంబర్ 5 వద్ద లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ షంటింగ్ జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది. ఇంజన్‌కి, కోచ్‌ బఫర్‌కు మధ్య ఇరుక్కుని అమర్‌కుమార్‌ (25) మృతి చెందాడు. బఫర్ మధ్య ఇరుక్కున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద భారీ పేలుడు:
జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం రోడ్డు నంబర్‌ 1లో ఉన్న తెలంగాణ స్పైస్‌ కిచెన్‌ హోటల్‌లోని ఫ్రిజ్‌ కంప్రెసర్‌ ఒక్కసారిగా పేలింది. దీంతో హోటల్‌ ప్రహరీ ఒక్కసారిగా ధ్వంసమైంది. రాళ్లు ఎగిరి 100 మీటర్ల దూరంలోని దుర్గాభవానీ నగర్‌ బస్తీలో పడ్డాయి. అక్కడ నాలుగు గుడిసెలు ధ్వంసమయ్యాయి. పలు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ఓ మహిళ తలకు గాయం కాగా.. మరో బాలిక స్వల్ప గాయాలతో బయట పడింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

రెండో మ్యాచ్ కూడా గెలవాలని:
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఘన విజయంతో ఆరంభించిన భారత్‌.. మరో విజయంపై కన్నేసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. గెబేహా వేదికగా రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి టీ20లో బ్యాటర్లు, బౌలర్ల మెరుపులతో సంపూర్ణ ఆధిపత్యం చలాయించిన భారత్.. అదే ఊపులో రెండో మ్యాచ్ కూడా గెలవాలని చూస్తోంది. కానీ సఫారీ జట్టు ఈ మ్యాచ్‌లో బలంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు.

జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా:
భారత్‌తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా తొలి టెస్టు పెర్త్‌ వేదికగా నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన జట్టును శనివారం వెల్లడించింది. ఆసీస్ జట్టులోకి ఓ కొత్త ప్లేయర్‌ వచ్చాడు. భారత్‌-ఏతో అనధికారిక టెస్టుల్లో ఆస్ట్రేలియా-ఏకు సారథ్యం వహించిన నాథన్ మెక్‌స్వీనేకు అవకాశం దక్కింది. గాయం కారణంగా కామెరూన్‌ గ్రీన్‌ దూరమైన విషయం తెలిసిందే.

సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ మృతి:
ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూశారు. 400కు పైగా సినిమాల్లో నటించిన ఢిల్లీ గణేష్ వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఢిల్లీ గణేష్ మృతి ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఢిల్లీ గణేష్ మృతదేహాన్ని చెన్నైలోని రామవరంలోని ఆయన నివాసంలో ఉంచారు. ఢిల్లీ గణేష్ వయసు 80. చెన్నైలోని రామాపురం సెంథామిల్ నగర్‌లోని తన నివాసంలో నిన్న రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 1944లో నెల్లైలో జన్మించిన ఢిల్లీ గణేష్ 1976లో పట్టిన ప్రవేశం చిత్రంతో తెరంగేట్రం చేశారు.

భయపడుతున్న బడా సినిమా:
అత్యంత భారీ బడ్జెట్ పై భారీ స్కేల్ లో తెరకెక్కుతున్న పుష్ప -2 కు పోటీగా సినిమాలు రిలీజ్ చేసేంకు ఒకటికి పది సార్లు ఆలోచించి మరి డేట్ లు వదులుతున్నారు ఇతర సినిమాల నిర్మాతలు. పుష్ప డిసెంబర్ లో వస్తుంది అని తెలిసీ కూడా తాము కూడా డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని చావా అనే బాలీవుడ్ సినిమా ఒకటి ముందుకొచ్చింది. అందుకు కారణం చావా సినిమా మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీపై తీసిన ఈ సినిమా కావడం. విక్కీ కౌశల్-రష్మిక మందన నటించిన ఈ సినిమాపై హిందీలో కాస్త భారీ అంచనాలే ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. కానీ ఇప్పడు చావా మేకర్స్ కూడా పుష్ప తో పోటీకి తటపటాఇస్తున్నారట. అందుక్కారణం రోజురోజుకు పెరుగుతున్న పుష్ప 2 క్రేజ్. తెలుగు రాష్ట్రాలనే కాదు బాలీవుడ్ ను పుష్ప మానియా ఒక ఊపు ఉపేస్తోంది. దింతో ఇప్పుడు పుష్ప కు పోటీగా తమ సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని చావా ను వాయిదా వేస్తున్నారు. ఏదేమైనా ‘తెలుగోడి సినిమా వస్తుంటే తెలియకుండానే తప్పుకున్నారు తెలుగు సినిమా పవర్’.

Show comments