NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

మాధవీ లతకు జేసీ క్షమాపణలు:
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టకేలకు దిగొచ్చారు. సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లతకు ఆయన క్షమాపణలు చెప్పారు. ‘సినీ నటి మాధవీ లత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పే. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను. 72 సంవత్సరాల వయసున్న నేను ఆవేశంలో అలా మాట్లాడానే తప్ప.. కించపరచాలనే ఉద్దేశం లేదు’ అని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇక జేసీ, మాధవీ లత మధ్య వివాదంకు తెరపడనుంది.

మెగా ఉచిత వైద్య శిబిరం:
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మెగా ఉచిత వైద్య శిబిరం జరుగుతోంది. విజ‌య‌వాడ కేబీఎన్ కాలేజీలో ఉచిత మెగా మెడిక‌ల్ క్యాంప్‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ‘పశ్చిమ నియోజకవర్గంలో వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌తో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్యాంపులో వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌పై నిపుణులైన వైద్యులు సేవలందిస్తున్నారు. ప్రజలందరూ ఉచిత మెగా మెడికల్ క్యాంపుని వినియోగించుకోవాలి’ అని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు.

ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకు ప్రకటించిన విధంగా సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ “అభయ హస్తం” పేరిట చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్ శాంతికుమారి, మరికొందరు ప్రజాప్రతినిధులు సైతం హాజరయ్యారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు:
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై మాట్లాడారు. ఆయన రైతు భరోసా పథకం గురించి మాట్లాడుతూ.. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని, సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తున్నాం అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మరొక ముఖ్యమైన విషయం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతూనే.. రైతు భరోసాలో 12 వేలు వేయాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. ఆర్థిక పరిస్థితి కుదుటపడటంతో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

పెళ్లికాని జంటలకు ఓయో బిగ్ షాక్:
ప్రముఖ హోటల్‌ అగ్రిగేటర్‌ ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఓయో రూపొందించిన పాలసీ ప్రకారం.. ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వరు.. కొత్త చెక్‌-ఇన్‌ పాలసీ ఆధారంగా.. ఇకపై ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లోనైనా రూమ్స్ బుకింగ్‌ సమయంలో అన్ని జంటలు పెళ్లి చెసుకున్నట్లు రుజువును చూపించాల్సి ఉంటుంది.. అంటే కచ్చితంగా పెళ్లిని నిర్ధరించే ఐడీ ప్రూఫ్ చూపించాలి.. లేకపోతే, పెళ్లికానీ వారి బుకింగ్‌లను తిరస్కరించే విచక్షణాధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటళ్లకు ఇచ్చింది. ఇక, మేరఠ్‌లోని తన భాగస్వామ్య హోటళ్లలో తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురావాలని ఓయో నిర్ణయించుకుంది. గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం:
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ విడతల వారీగా క్యాండిడెట్స్ పేర్లను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో వార్ నడుస్తుంది. అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తూ.. బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని విమర్శించింది. దీనికి జవాబుగా కమలం పార్టీ స్పందిస్తూ దేశ రాజధానిలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. దీంతో ఢిల్లీ ప్రజలకు వచ్చిన ఆపద తొలగిపోతుందని సూచిస్తున్న పోస్టర్‌ను పోస్ట్ చేసింది.

అమెరికాలో నోరో.. చైనాలో హెచ్‌ఎమ్‌పీవీ:
అమెరికాలో నోరోవైరస్ కేసులు పెరుగుతున్నాయి. డిసెంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు వందకు పైగా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. నోరోవైరస్ అనేది వేగంగా వ్యాపించే వ్యాధి. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకుతుంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో నోరోవైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా, డిసెంబర్‌ తొలివారంలో ఈ సంఖ్య 91 కి పెరిగింది. ప్రస్తుతం వందకు పైగా కేసులు నమోదైనట్లు సమాచారం. వాంతులు, విరేచనాలకు కారణమయ్యే అంటువ్యాధి వైరస్ పెరుగుదలపై ఆరోగ్య అధికారులలో ఆందోళన మొదలైంది.

డాకు మహారాజ్ లో దుల్కర్ సల్మాన్:
బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’ జనవరి 12న థియేటర్లలోకి రానుంది. భారీ బడ్జెట్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా, ఈ సినిమా ప్రమోషన్ కార్యకలాపాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇటీవలే అమెరికాలోని డల్లాస్‌లో ‘డాకు మహారాజ్’ ప్రీ-రిలీజ్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం డల్లాస్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు డల్లాస్ ‘డాకు మహారాజ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వేదికగా మారింది. బాలయ్య, ఇతర నటీనటులు, సిబ్బందితో కలిసి ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

‘జైలర్‌ – 2’ సినిమా రెగ్యులర్ షూట్:
వరుస పరాజయాల తర్వాత సూపర్ స్టార్ తన స్టామినాను నిలబెట్టిన సినిమా జైలర్. ఆ తర్వాత రజినీకాంత్ న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. రిలీజైన కొద్ది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ర‌జ‌నీకాంత్ ‘కూలీ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత వెంటనే జైల‌ర్ డైరెక్టర్ తో జైల‌ర్ -2 మొదలు పెట్టాలని ర‌జనీ సిద్ధం అవుతున్నారు. అయితే ప్రారంభానికి ముందే ర‌జ‌నీ లుక్ రెడీ అయిపోయింది. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన తీరు, అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మ్యూజిక్.. రజినీ మార్క్ స్టైల్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది.

ఈ ఓటమి చాలా బాధగా అనిపిస్తుంది:
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. 3-1 తేడాతో పదేళ్ల తర్వాత బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని ఆసీస్ కైవసం చేసుకుంది. టోర్నీలో భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రా 32 వికెట్లు తీసి టాప్‌ వికెట్ టేకర్‌గా నిలవడగా.. అతడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డు వచ్చింది. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గాయంతో బౌలింగ్‌కు రాలేదు అతడు. మ్యాచ్‌ తర్వాత బుమ్రా మాట్లాడుతూ.. ఈ ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది. కీలక సమయంలో బౌలింగ్‌ చేయలేకపోయినందుకు బాధగా ఉందన్నాడు. కానీ, మన శరీరాన్ని గౌరవించాలి.. దాంతో మనం పోరాటం చేయలేం.. శరీరం బాగుంటేనే ఏదైనా చేస్తామని బుమ్రా వెల్లడించారు.

Show comments