NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

గంజాయి సాగును పూర్తి స్థాయిలో అరికడతాం:
గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు వచ్చిందని, ఇంకా పూర్తి స్థాయిలో అరికడతాం అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ గంజాయి అరికట్టడంపై దృష్టి పెట్టిందన్నారు. స్కూల్స్, కాలేజీ పిల్లలు గంజాయికి బానిసలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని, జిల్లాల వారీగా వర్క్ షాప్స్ జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాలలో గంజాయి సాగు అరికట్టడంపై హోంమంత్రి మాట్లాడారు. ‘గంజాయి అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ గంజాయి అరికట్టడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో గంజాయి రూపం మార్చుకుంది. డ్రై లిక్విడ్ రూపంలో గంజాయి వస్తోంది. స్కూల్స్, కాలేజీ పిల్లలు గంజాయికి బానిసలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో అరికడతాం. మహిళలకు గంజాయి అలవాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హోంమంత్రి అనిత చెప్పారు.

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది:
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 వేల 336 వ్యవసాయ కనెక్షన్‌లు మంజూరు చేశామన్నారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు 2 లక్షల 60 వేలు, ఉచిత విద్యుత్‌కు 12 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో వేర్వేరు రేట్లకు ట్రాన్సఫార్మర్లు కొనుగోలు చేశారని, ఇక అలా లేకుండా చూస్తామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 వేల 336 వ్యవసాయ కనెక్షన్‌లు మంజూరు చేశాం. 22 వేల 709 కనెక్షన్‌లు రైతులకు ఇచ్చి వినియోగంలోకి తెచ్చాము. 69 వేల 70 కనెక్షన్‌లు పెండింగ్లో ఉంటే మరో 20 వేలు మంజూరుకు అనుమతి ఇచ్చాము. పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్రం ఇచ్చిన పీఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రప్రభుత్వం చేపడుతుంది అనగానే.. నాలుగున్నర లక్షలు కనెక్షన్‌లకు అవకాశం ఇచ్చారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు 2 లక్షల 60 వేలు ఖర్చు చేస్తున్నాం. ఉచిత విద్యుత్‌కు 12 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు జరిగితే వెంటనే పిర్యాదు చేసి వివరాలు ఇస్తే తప్పనిసరిగా కొత్తవి ఇస్తాం. అసైన్డ్ ల్యాండ్లకు దొంగ కనెక్షన్‌లు ఇస్తున్నారు, వాటిని రద్దు చేస్తాం. ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు జరగకుండా అల్యూమినియంతో వైరింగ్ చేయిస్తున్నాం. డిస్కంలకు మధ్య రేట్లలో అతరం లేకుండా చూస్తాం.. గతంలో వేర్వేరు రేట్లకు ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేశారు, ఇక అలా లేకుండా చూస్తాం’ అని మంత్రి చెప్పారు.

దుబాయ్ టూర్‌పై రేవంత్‌ రెడ్డి అబద్ధాలు మాట్లాడారు:
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్‌టీవీతో హరీశ్‌రావు మాట్లాడారు. తమ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానన్నారు. తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. నేను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లానని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. నా మిత్రుడు, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి వేడుకకు వెళ్లాను. నేను ఫిబ్రవరి 21వ తేదీన దుబాయ్‌కి వెళితే 22 ఉదయం ఎస్‌ఎల్‌బీసీ ఘటన జరిగింది. అయినా ప్రభుత్వంలో ఉన్న మీరు రెస్క్యూ పనులు చేయాలి. కానీ మమ్ములను అంటే ఎలా? గతంలో కూడా కాళేశ్వరం విషయంలో ఇలాగే మాట్లాడారు. మాకు అప్పగించండి చేసి చూపిస్తాం అంటే తోక ముడిచారు. ఇప్పుడు కూడా మీ వల్ల కాదు అంటే చెప్పండి.. మేము రెస్క్యూ చేసి చూపెడతాం. పది రోజులు అయినా డెడ్ బాడీలు ఇంకా బయటకు తీయలేదు. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత కచ్చితంగా డీఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహించాలి. మేము వెళితే టన్నెల్ వరకు రానీయలేదు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు వెళితే మాత్రం దగ్గరుండి చూపించారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటన విషయంలో ముఖ్యమంత్రికి సీరియస్‌నెస్ లేదు. అందుకే వనపర్తి రాజకీయ కార్యక్రమానికి వెళ్లి.. అక్కడ నుంచి ఎస్‌ఎల్‌బీసీ వెళ్లారు. ఈ విషయాలు అన్ని అసెంబ్లీలో ఎండగడతాం.’’ అని హరీశ్‌రావు తెలిపారు.

హైదరాబాద్‌లో మేధాపాట్కర్ ప్రత్యక్షం:
ప్రముఖ సామాజిక కార్యకర్ద మేధా పాట్కర్ హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. ఛాదర్‌ఘాట్‌ సమీపంలోని ఓ ఇంటికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మేధా పాట్కర్ ఉన్న ఇంటికి చేరుకున్నారు. మూసీ సుందరీకరణ పనులను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో మేధా పాట్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను స్నేహితుల ఇంటికి మాత్రమే వచ్చినట్లు ఆమె చెప్పారు. అయినా కూడా ఆమె మాటలను పోలీసులు వినలేదు. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని మేధా పాట్కర్‌కు పోలీసులు సూచించినట్లు సమాచారం.

గుజరాత్‌లోని గిర్ అడవుల్లో మోడీ సఫారీ:
భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను మోడీ పోస్టు చేశారు. ఇక గుజరాత్‌లోని మూడు రోజుల పర్యటన సందర్భంగా జునాగఢ్ జిల్లాలోని గిర్ అడవుల్లో మోడీ సపారీ చేశారు. పర్యటనలో భాగంగా ఆయన లయన్‌ సఫారీ చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీశాఖ అధికారులు వెంట ఉన్నారు. అపురూపమైన జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. వన్యప్రాణులను సంరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి గర్వపడుతున్నట్లు మోడీ తెలిపారు.

కాంగ్రెస్ కార్యకర్త హత్య కేసులో నిందితుడు అరెస్ట్:
కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (23) హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. మార్చి 1న రోహ్‌తక్-ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో నర్వాల్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు దర్యాప్తు కోసం హర్యానా ప్రభుత్వం.. ఆదివారం సిట్ ఏర్పాటు చేసింది. ఇక రంగంలోకి దిగిన సిట్ బృందం.. సోమవారం ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఝజ్జర్‌గా గుర్తించారు. నిందితుడు… నర్వాల్‌కు పరిచయం ఉన్న వ్యక్తేనని పోలీసులు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు నిందితుడిని.. పోలీస్ కస్టడీ కోరతామని సిట్ తెలిపింది. ఇద్దరి మధ్య వ్యక్తిగత ఘర్షణ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నర్వాల్.. రోహ్‌తక్‌లోని విజయ్ నగర్‌లో నివసిస్తోంది. శనివారం రోహ్‌తక్ జిల్లాలో సూట్‌కేస్‌లో ఆమె మృతదేహం దొరికింది. శరీరంపై గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

నేతల మధ్య మాటల యుద్ధం:
కుంభమేళా, అయోధ్య కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధాని మోడీ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కాంగ్రెస్‌పై బీజేపీ మాటల దాడి చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. 2024లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరకాలేదు. 2025లో మహా కుంభమేళాకు కాంగ్రెస్ నాయకులు హాజరుకాలేదని.. వాళ్లంతా హిందూ వ్యతిరేకులని బీజేపీ ధ్వజమెత్తింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఫొటోలు పెట్టి విమర్శలు చేసింది.

ఇజ్రాయెల్‌-జోర్డాన్ బోర్డర్‌లో కాల్పులు:
జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వ్యక్తిపై ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ మరణించాడు. గాబ్రియేల్.. కేరళలో రిక్షా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. టూరిస్ట్ వీసా మీద జోర్డాన్‌కు వెళ్లాడు. అక్కడ నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కాల్పులు జరపగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని స్వస్థలం తీసుకొచ్చేలా సాయం చేయాలని కేంద్రాన్ని గాబ్రియేల్ కుటుంబ సభ్యులు కోరారు.

స్పిరిట్’ కోసం కసిగా:
ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజంట్ నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టాడు.ఇందులో ‘స్పిరిట్’ మూవీ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్పిరిట్ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. దీంతో ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ విషయంలో సందీప్, రాజమౌళిని ఫాలో అవుతున్నాడట. ‘స్పిరిట్’ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా హర్షవర్ధన్ క్రేజీ కామెంట్స్ చేశారు.. ‘డార్లింగ్ ప్రభాస్‌కి నేను వీర అభిమానిని.అందుకే ఈ చిత్రం కోసం కసిగా పనిచేస్తున్నాను. కచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అద్భుతమైన సంగీతం అందిస్తాను. ప్రస్తుతం సందీప్‌ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ మూవీలో మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.. ఈ విషయంలో మీకు ఫుల్ మీల్స్ పక్క’ అని తెలిపారు.

మార్చి 7న డబ్బింగ్ చిత్రాల పోటాపోటీ:
సంక్రాంతికి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్ పోటాపోటీగా దిగి టాలీవుడ్‌కు అసలు సిసలైన బాక్సాఫీస్ ఫీస్ట్ అందించారు. ఇక ఫిబ్రవరిలో నాగచైతన్య, విశ్వక్ సేన్, బ్రహ్మానందం, సందీప్ కిషన్లు మాత్రమే హాయ్ చెప్పారు. బాక్సాఫీస్ దగ్గర కాస్త ఎంటర్మైనెంట్ మిస్సయ్యామని ఫీల్ అవుతుంటే ఆ లోటు లేకుండా చేశాయి డబ్బింగ్ చిత్రాలు. అజిత్ పట్టుదల, ధనుష్ డైరోక్టోరియల్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా, ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ఆది శబ్దం, జీవా అగత్యా చిత్రాలు ఫిబ్రవరి నెలలో టాలీవుడ్‌లో సందడి చేశాయి. డబ్ చేసినందుకు మార్కెట్ చేసుకున్నామా లేదా అని పక్కన పెడితే ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ ఆఫ్ ది పరిశ్రమగా మారుతోన్న టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేశామా లేదా అన్నదే చూస్తున్నాయి. నాట్ ఓన్లీ తమిళ పరిశ్రమ మెయిన్ స్ట్రీమ్ సినీ ఇండస్ట్రీస్ తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు రాబోయే మార్చి ఫస్ట్ వీక్‌పై ఫోకస్ చేస్తున్నాయి నాలుగు ఇండస్ట్రీలు. ముందుగా బాలీవుడ్ థియేటర్లను షేక్ చేస్తోన్న విక్కీ కౌశల్ ఛావా మార్చి 7న రిలీజ్ చేస్తోంది గీతా ఆర్ట్స్. అలాగే మాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోన్న కుంచకో బోబన్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా అదే రోజు డ్యూటీ ఎక్కుతోంది. తమిళ్ నుండి జీవీ ప్రకాష్ 25వ సినిమా కింగ్ స్టన్ తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇక శాండిల్ వుడ్ నుండి ప్రజ్వల్ దేవరాజ్ ‘రాక్షస’ పేరుతో రాబోతున్నాడు. ఇలా టాలీవుడ్ బాక్సాఫీసును టార్గెట్ చేస్తోన్న ఈ నాలుగు డబ్బింగ్ సినిమాల్లో ఏ సినిమా టాలీవుడ్ లో భారీ వసూళ్లు రాబడుతుందో చూడాలి.

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విడాముయార్చి:
తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా ‘విదాముయార్చి’. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. ఫిబ్రవరి 6న విదాముయార్చి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. హాలీవుడ్ సినిమా బ్రేక్ డౌన్ రీమేక్ గా వచ్చిన విదాముయార్చి అజిత్ ఫ్యాన్స్ ను కొంత మేర కొంతమేర మెప్పించింది. యాక్షన్ పార్ట్ స్టైలిష్ కాస్త మెప్పించాడు దర్శకుడు. ఓవరాల్ గా విదాముయార్చి ఓ సారి అజిత్ కోసం చూడగలిగే యాక్షన్ చిత్రంగా మిగిలింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోకపోవడంతో డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది నెట్ ఫ్లిక్స్. మార్చి 3 న అనగా నేటి నుండి విదాముయార్చి నెట్ ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా తెలుగులో పట్టుదల పేరుతో ప్రముఖ పంపిణి దారులు ఏషియన్ సురేష్ విడుదల చేసారు. ఫైనల్ గా థియేటర్స్ లో కేవలం 27 రోజులు మాత్రమే ప్రదర్శింపబడి నెల తిరగగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది అజిత్ కుమార్ విదాముయార్చి.