NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

అభివృద్ధి అంతకంటే లేదు:
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యిందని.. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో తమ ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాటలు చెప్తున్నారు తప్ప వాస్తవ రూపం లేదని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.

ఎదురు దాడి చేస్తున్నారు:
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ధరలు నియంత్రించమని ప్రశ్నిస్తే.. ఆవు కథలాగా మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ తిప్పుతారన్నారు. ఒక్కో యూనిట్‌కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే సామాన్యుడికి పెను భారంగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం 70 వేల కోట్లు అప్పు చేసిందని, దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతోంది అని బొత్స ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ఆరు నెలల కాలానికి 18 వేల కోట్లు సంక్షేమ పథకాలు విడుదల చేసే వాళ్లమని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.

తెలంగాణలో మరో పరువు హత్య:
తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుందని లేడీ కానిస్టేబుల్‌ నాగమణిని ఆమె తమ్ముడు పరమేష్‌ దారుణంగా నరికి చంపేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో ఈ పరువు హత్య కలకలం రేపుతోంది. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగమణి.. ఈ రోజు (డిసెంబర్ 2) ఉదయాన్నే స్వగ్రామం రాయపోలు నుంచి హయత్‌నగర్‌ వెళ్తుండగా.. ఈ క్రమంలో ఆమె కోసం దారికాచిన తమ్ముడు పరమేష్.. ముందు కారుతో ఢీకొట్టి.. ఆ తర్వాత కొడవలితో మెడ పై నరికాడు పరమేష్. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

బీజేపీ ఓర్వలేక పోతుంది:
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది ఉత్సవాలను చేస్తుంటే.. కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ ఓర్వలేక పోతుందని విమర్శించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత బస్ రవాణా ఇస్తున్నారా?.. రైతు రుణాలు మాఫీ చేశారా?.. ఎంఎస్పీ ఇవ్వాల్సిన మీరు.. చట్టబద్దత కల్పించడం లేదు అని ప్రశ్నించారు. కానీ మేము వరి బోనస్ ఇచ్చి కొంటున్నామన్నారు. బీజేపీ వాళ్లు కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే విచిత్రం అనిపిస్తుంది.. కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తున్నామని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఢిల్లీకి పాదయాత్రగా రైతులు:
పార్లమెంట్‌ను ముట్టడించేందుకు వేలాది మంది రైతులు ఇవాళ ఢిల్లీకి పాదయాత్రగా వెళ్లనున్నారు. ప్రస్తుతం రైతులు నోయిడాలో ఏకమయ్యారు. ఈ నేపథ్యంలో నోయిడాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 5000 మంది సైనికులను మోహరించారు. రైతుల పాదయాత్రతో నోయిడాలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహామాయ ఫ్లైఓవర్ కింద రైతులు ఏకం అయ్యేందుకు ప్లాన్ చేశారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా కొనసాగిస్తున్నారు. పలు మార్గాలను దారి మళ్లించారు.

సాయంత్రం సినిమా చూడనున్న ప్రధాని:
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించారు. గుజరాత్‌లోని గోద్రా ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. న్యూఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధానమంత్రి ఈ చిత్రాన్ని వీక్షిస్తారు.

అవార్డ్ గెల్చుకున్న సుప్రీమ్ హీరో:
2024 ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి ముంబయిలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. వివిధ కారణాల వలన నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అద్భుత నటన ప్రదర్శించిన నటీనటులు, టెక్నిషియన్స్ కు ఈ అవార్డులను ప్రకటించారు. సినిమా విభాగంలో ఉత్తమ నటిగా బాలీవుడ్ భామ కరీనా కపూర్‌, ఉత్తమ నటుడిగా దిల్జిత్‌ దొసాంజ్‌ అవార్డు గెలుచుకోగా, ఉత్తమ సిరీస్ గా రైల్వేమెన్ అవార్డు గెలుచుకుంది.

దుమ్ములేచిపోయే ఐటం సాంగ్:
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్‌ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సందీప్‌.. సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేశాడట. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పిరిట్‌లో చాలా స్పెషల్‌గా ఒక ఐటెం సాంగ్‌ కూడా ఉండబోతుందట. ఆ పాట కోసం ఇప్పటికే హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ట్యూన్‌ని రెడీ చేశాడట. ఆ స్పెషల్‌ సాంగ్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, సౌత్‌లోనూ మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ చేయబోతుందని టాక్. స్పిరిట్‌లో హీరోయిన్‌ ఎవరనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు.

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఘర్షణ:
పశ్చిమాఫ్రికాలోని గినియాలో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ అభిమానులు తమలో తాము ఘర్షణ పడ్డారు. ఇందులో 100 మందికి పైగా మరణించారు. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన జెరెకొరె నగరంలో ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన ఘర్షణల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారని స్థానిక ఆసుపత్రి వర్గాలు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ కి తెలిపాయి.