ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసాని:
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు ఓబులవారిపల్లెకు తరలించారు. ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసానికి వైద్య పరీక్షలు చేశారు. ఓబులవారిపల్లి ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యులు గురు మహేష్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గురు మహేష్ స్టేట్‌మెంట్‌ను రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశం ఉంది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని రాయదుర్గంలో పోసానిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పోసాని అరెస్టును ఖండించిన వైఎస్ జగన్:
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని మండిపడ్డారు. అరెస్ట్ నేపథ్యంలో పోసాని భార్య కుసుమలతను జగన్ ఫోన్‌లో పరామర్శించారు. అరెస్ట్ విషయంలో పోసానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని.. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. ‘ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోంది. అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి. పోసానికి వైసీపీ పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తాం. పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులతో లీగల్ గా ముందుకు వెళ్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సీఎం ఓటు వేశారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేశ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి యూపీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేశ్ చేరుకుని ఓటు వేశారు. కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానంలో 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో ఆలపాటి రాజేంద్రప్రసాద్ (కూటమి), కేఎస్ లక్ష్మణరావు (పీడీఎఫ్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వెయ్యాలి. సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి కావచ్చు.. ఓటు హక్కు వినియోగించుకుంటేనే సాధ్యం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది’ అని సీఎం పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి ధన దాహం వల్లే:
తన అసమర్థతను, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపైన నెపం నెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. జీఎస్‌ఐ, ఇంజనీరింగ్ నిపుణులు వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అవినీతి సొమ్ముల కోసం లాలూచీ పడి పాత యంత్రాలతో ప్రారంభించారని విమర్శించారు. కేవలం రేవంత్ రెడ్డి ధన దాహం వల్లనే ఈరోజు 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారని ఆరోపించారు. వారు బతికున్నారో లేదో అనే ఆందోళనకరమైన పరిస్థితి నెలకొందన్నారు. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే అన్నారు. రేవంత్ రెడ్డి కార్మికులను రక్షించాల్సింది పోయి బ్లేమ్ గేమ్ ప్రారంభించారని ఆరోపించారు. దేవుడిచ్చిన ముఖ్యమంత్రి అవకాశాన్ని వాడుకొని ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణకు మంచి జరిగేలా ప్రజలకు మంచి జరిగేలా వ్యవహరించాలని సూచించారు. చీఫ్ మినిస్టర్ గా మాట్లాడాలి కానీ ఒక చీప్ మినిస్టర్ గా మాట్లాడవద్దని రేవంత్ రెడ్డికి సూచిస్తున్నాన్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాకనే రాష్ట్రంలో జరుగుతున్న మరణాలపైన ఇతరుల పేరును ప్రస్తావిస్తున్నారని చెప్పారు.
బీజేపీ VS పోలీసులు:
మంచిర్యాల జిల్లా.. నస్పూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ నాయకులపై ఎస్సై దురుసుగా ప్రవర్తించాడని బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.. తమపై దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు.. పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బీజేపీ నాయకులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. తీగల పహాడ్ పోలింగ్ స్టేషన్ వద్ద బీజేపీ నాయకులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా ఎస్సై తోసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరగుతుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సైతం సమీపానికి వచ్చారు. దీంతో పోలీసులు రెండు పార్టీల నాయకులను పంపించేశారు. పోలీంగ్ బూత్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. ఎస్సై తోశాడనే ఆరోపణలపై రామగుండం సీపీ శ్రీనివాస్ వివరాలు సేకరిస్తున్నారు..
ఎన్ని కోట్ల మంది స్నానాలు చేశారు:
మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు మహా కుంభమేళా జరిగింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో కుంభమేళా గ్రాండ్‌గా ముగిసింది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంతేకాకుండా కోట్లలో బిజినెస్ కూడా నడిచింది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగంలో దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇక రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచాయని పేర్కొంది. పరోక్షంగా.. ప్రత్యక్షంగా 60 లక్షల మంది జీవనోపాధి పొందినట్లుగా వెల్లడించింది. దాదాపు 150 కి.మీ మేర వ్యాపారాలు జరిగాయని పేర్కొంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద మతపరమైన పండుగ ఇదేనని పరమార్థ నికేతన్ అధ్యక్షుడు స్వామి చిదానంద సరస్వతి తెలిపారు. ప్రయాగ్‌రాజ్ ఒక చరిత్ర సృష్టించిందని చెప్పారు.
అశ్లీల వీడియోలపై పిట్రోడా సంచలన ఆరోపణలు:
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా సంచలన ఆరోపణలు చేశారు. ఐఐటీ రాంచీ విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తున్న సమయంలో హ్యాక్ చేసి పోర్న్ వీడియో ప్రదర్శించారని తీవ్ర ఆరోపణల చేశారు. వంద మంది విద్యార్థులతో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగిందని.. అకస్మాత్తుగా ఎవరో హ్యాక్ చేసి అశ్లీల కంటెంట్‌ను చూపించారన్నారు. వెంటనే ఆపేయడం తప్ప మాకు వేరే మార్గం కనిపించలేదన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది న్యాయమా?, దేశంలో ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లే ఈ అంతరాయం ఏర్పడిందని పిట్రోడా ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో ఆరోపించారు.
జనాల్ని కొట్టబోయిన ఏఐ రోబో:
AI Robo: కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) ఆధారంగా రూపొందించిన రోబోలు మనిషి జీవనశైలిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. వీటి సహాయంతో పరిశ్రమలు, ఆరోగ్య రంగం, విద్య, భద్రత వంటి అనేక విభాగాల్లో నూతన మార్గాలు సృష్టించబడుతున్నాయి. హ్యూమనాయిడ్ రోబోలు, ముఖ్యంగా, మనుషులను అనుకరించే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి మానవ చర్యలను అర్థం చేసుకోవడం, అందుకు అనుగుణంగా స్పందించడం వంటి పనులు చేస్తాయి. కానీ, తాజా సంఘటనలు ఈ రోబోల భద్రతపై కొత్త చర్చలను తెరపైకి తెచ్చాయి. చైనాలోని టియాంజిన్ నగరంలో నిర్వహించిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలో భాగంగా ప్రదర్శనకు ఉంచిన ఓ హ్యూమనాయిడ్ రోబో అకస్మాత్తుగా అదుపు తప్పి, జనాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీనితో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి, రోబోను నియంత్రించే ప్రయత్నం చేశారు. ఈ రోబో చూడటానికి చాలా ఆకర్షణీయంగా, కలర్‌ఫుల్‌గా ఉన్నా.. మొదటిలో ఇది సాధారణంగా ప్రవర్తించగా, కొద్ది సేపటి తర్వాత అనుకోకుండా జనాల మీదకు దూసుకొచ్చింది. బారికేడ్ బయట ఉన్న ప్రజలపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ హడావుడి మొదలైంది. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, రోబోను సమర్థంగా అదుపులోకి తెచ్చారు. అయితే, అదే సమయంలో ప్రదర్శనలో ఉన్న మరొక రోబో మాత్రం ప్రశాంతంగా ఉండటం గమనార్హం.
కోమాలో భారతీయ విద్యార్థిని:
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో ఉంది. ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నీలం షిండేది మహారాష్ట్రలోని సతారా జిల్లా. ఈ పరిణామంపై లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. కుమార్తెను చూసేందుకు తల్లిదండ్రులకు అత్యవసర వీసా మంజూరు అయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
కూలీలో పొడుగు కాళ్ల సుందరి పూజా:
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీతో పాటు అక్కినేని నాగార్జున మరికొందరిపై కీలకమైన సీన్స్ ను వైజాగ్ షెడ్యుల్ లో ఫినిష్ చేసాడు కనగరాజ్. ఇక ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయింది. రజినీ కాంత్ కాంబినేషన్ లో కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో పాటు మరికొందరిపై సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హస్కి బ్యూటీ శృతి హాసన్ నటిస్తుండగా తాజాగా మరొక యంగ్ భామను తీసుకున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన పూజా హెగ్డే ఇప్పుడు కూలీ సినిమాలో నటిస్తోంద తెలియజేస్తూ పూజా పోస్టర్ రిలీజ్ చేసారు. పూజా హెగ్డే ఇటీవల వరుస తమిళ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఒకవైపు సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తున్న రెట్రోలో హీరోయిన్ గా ఫిక్స్ అవగా లారెన్స్ డైరెక్షన్ లో కాంచన 4లోను నటిస్తుంది. లేటెస్ట్ గా కూలీ లో నటిస్తుంది. తెలుగు సినిమాలకు మాత్రం దూరంగా ఉంటుంది, టాలీవుడ్ కు నో చెప్పి బాలీవుడ్ లో జై కొట్టి తీరా అక్కడ ఫ్లాప్స్ రావడంతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే కూలీలో స్పెషల్ సాంగ్ లో నటిస్తుందా లేక ఏదైనా ముఖ్య పాత్ర అన్నది క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.
అక్కడ ‘అనగనగా’ షూటింగ్:
తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతోనే హీరోగా సూపర్ హిట్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక లేడీ స్టార్ స్వీటీ శెట్టితో చేసిన మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా అలా సాగుతూనే ఉంది. నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా అనగనగా ఒక రాజు సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ ప్రోమో అదిరిపోయింది అనే చెప్పాలి. కాగా ఇటీవల ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా చేసేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని పాలకోల్లులో జరుగుతుంది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి తో పాటు మిగతా నటి నటులపై సీన్స్ తీస్తున్నారు. అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దాదాపు 15 రోజుల పాటు షూటింగ్ చేయనుంది యూనిట్. ఆ తర్వాత హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను చక చక షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సారి పొంగల్ లో అటు మెగాస్టార్ చిరు, యంగ్ టైగర్ డ్రాగన్ తో పోటీపడనున్నాడు అనగనగా ఒక రాజు.