NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారు:
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం బాధాకరం అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ కష్ట కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అండగా నిలబడ్డారన్నారు. రాజ్యసభ పోయినా పర్లేదు, పార్టీకి సేవ చేయమని తాను కోరుతున్నానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విజయసాయి రెడ్డి శనివారం తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు.

పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేము:
పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేమని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తరువాత పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీలు మారిపోయారని విమర్శించారు. తనపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని, హోంమంత్రి రీల్స్ చూసుకుని కాలక్షేపం చేసేస్తే మంచిదని అమర్నాథ్ ఎద్దేవా చేశారు.

ఎన్నో అద్భుతాలు సృష్టించే ఓపిక నాకు ఉంది:
డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం.. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్ర్‌మెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది అని అన్నారు. ఈ రోజు రాజ్యంగ పరిరక్షణ కోసం చర్చ జరగడం దురదృష్టకరం అని తెలిపారు. ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ.. ప్రభుత్వ రంగ విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. తాను సీఎం కాగానే కేబినెట్ ఎంపికకు ఎంత ప్రాధాన్యత ఇచ్చానో… వీసీల నియామకానికి అంతే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. ఉన్నత విద్యా ప్రమాణాలు, సమాజంలో ఉన్న అన్ని వర్గాల సమూహం మాదిరిగానే వీసీలకు కూడా అందరికీ అవకాశం ఇచ్చామన్నారు. వీసీల నియామకంతో మా పని అయిపోయింది అని అనుకోవటం లేదని సీఎం అన్నారు.

వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం:
వరంగల్ జిల్లా మామునూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప రాడ్ల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు, ఒక కారుపై ఇనుప స్తంభాలు పడ్డాయి. దీంతో ఇనుప రాడ్ల కింద ఆటో ఉండటంతో ఎంత మంది చనిపోయారు అనే దానిపై స్పష్టత లేదు.. మరోవైపు ఈ ప్రమాదంలో సుమారు ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇనుప రాడ్ల కింద ఉన్న రెండు ఆటోలు బయటకు తీస్తే అందులో ఇంకెంతమంది ఉన్నారనే విషయం బయటపడుతుంది. కాగా.. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వం ఒక ఫెడరల్ సెటప్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్లి రాష్ట్రానికి లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే.. సంతోషించవలసిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఫెడరల్ సెటప్.. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‭లో కొత్త నిబంధనలు:
భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్‌ పరీక్ష కోసం సంసిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ సంవత్సరం నుండి యూపీఎస్సీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్‌ తాజాగా విడుదల అయింది. ఇందులో ఉన్న కొత్త మార్పుల ప్రకారం, ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్ కోటా ఆధారంగా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మార్పులు గతంలో పూజా ఖేద్కర్‌ కేసు తర్వాత అమలులోకి వచ్చాయి. గతేడాది, పూజా ఖేద్కర్‌ అనే వ్యక్తి తప్పుడు ఓబీసీ, మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించి దివ్యాంగుల కోటాలో ఐఏఎస్‌గా ఎంపికైంది. ఈ కేసు తర్వాత, యూపీఎస్సీ నిబంధనలను మరింత కఠినంగా తీసుకుంది.

కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి:
భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముజాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం మరింత ప్రత్యేకంగా ఉండడంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కఢ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తదితరులు కూడా హాజరయ్యారు.

రెండు కోట్లు వద్దునుకున్న వృద్ధుడు:
చైనాలోని శాంఘైకు పశ్చిమంగా ఉన్న జిన్‌కి పట్టణంలో ఒక వృద్ధుడు హువాంగ్ పింగ్ తన రెండు అంతస్తుల ఇంట్లో జీవిస్తున్నాడు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదిత పరిహారం తీసుకోకుండా ఒక రహదారి మధ్యలో తన సొంత ఇంటిలో జీవిస్తున్నాడు. నిజానికి ఆ వృద్ధుడు తనతో పాటు ఉంటున్న 11 నెలల మనవడు నివసిస్తున్న ఇంటి దగ్గర నేషనల్ హైవే నిర్మిస్తున్న కారణంగా దానిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు పరిహారంగా పువాంగుకు ఏకంగా 1.6 మిలియన్ CNY అంటే సుమారు రెండు కోట్ల రూపాయలు, అలాగే మరికొన్ని స్థిరాస్తులు ఇవ్వడానికి ప్రభుత్వం ఇవ్వడానికి ముగ్గు చూపినప్పటికీ అతడు వాటిని తిరస్కరించాడు. దీనితో చైనా ప్రభుత్వం ఏమి చేయలేక అతడి ఇంటి చుట్టూ నేషనల్ హైవేని నిర్మించింది. ఈ నేషనల్ హైవే అతి త్వరలో మొదలు కాబోతోంది. ఇంతవరకు బాగున్న ప్రస్తుతం పరిస్థితి హువాంగ్ పింగ్ కు పెద్ద తలనొప్పిలా మారింది.

ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల:
గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్‌తో హమాస్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, శనివారం నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల అయ్యారు. కరీనా అరివ్, డానియెలా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ మహిళా సైనికులు విడుదల చేసారు. వీరిని మొదట గాజాలోని రెడ్ క్రాస్ కు అప్పగించారు. ఈ విడుదల కార్యక్రమం సందర్భంగా, మహిళా సైనికులను ప్రత్యేక వాహనాలలో వేదికపైకి తీసుకువచ్చారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో క్షేమంగా కలుసుకున్నారు. ఈ మహిళా సైనికులు అక్టోబర్ 7 న హమాస్ దాడి సమయంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం నహాల్ ఓజ్ నుంచి అపహరించబడ్డారు. 477 రోజుల కాలంలో వారు గాజా నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోకి తీసుకెళ్లబడ్డారని, సూర్యరశ్మి కూడా లేని చోట తమని ఉంచారని తెలిపారు.

సిల్క్ స్మిత ఏఐ వీడియో:
ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు. అలాగే డీప్ ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కేటుగాళ్లు. ఆనందం, డబ్బు కోసం పిచ్చి పిచ్చి వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా సిల్క్ స్మిత కి సంబంధించిన ఏ ఐ జనరేటర్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ లో పోస్ట్ చేశాడు. ‘నేను ఏమి చేయలేను? సిల్క్ స్మితను ఎప్పుడు మరింత అందంగా చూడలేదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక వర్మ చెప్పినట్టుగానే ఈ వీడియోలో సిల్క్ స్మిత హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ లకు ఏ మాత్రం తక్కువ లేదు. ఈ తరం ట్రెండుకు తగ్గట్టు కాస్ట్యూమ్స్ తో వీడియో అద్భుతంగా తీశారు. నెటిజెన్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.

దళపతి విజయ్ చివరి చిత్రం పోస్టర్:
సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి, ప్రేక్షకులు సినిమా టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్ ఇంకా కొత్త అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరి చిత్రం దళపతి 69, దీని టైటిల్ కోసం మేకర్స్ నేడు ప్రకటించారు. వాగ్దానం చేసినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ మేకర్స్ చిత్రం టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్‌ను వెల్లడించారు. కెవిఎన్ ప్రొడక్షన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విజయ్ చివరి చిత్రం పోస్టర్‌ను విడుదల చేసింది. దానితో పాటు దాని టైటిల్‌ను కూడా ప్రకటించింది. ఇందులో సినిమా పేరును ‘జన నాయగన్’ గా ప్రకటించారు.