Site icon NTV Telugu

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఎమ్మెల్యే అనుచరుడి అడియో కలకలం:
చిత్తూరు జిల్లాలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ధామస్ అనుచరుడి గ్రానైట్ దందా సంబంధించిన ఆడియో కలకలం ‌రేపింది. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ధామస్ అనుచరుడు హారీష్ యాదవ్ తో సంతనూతలపాడుకు చెందిన గ్రానైట్ క్వారీ యాజమాని వెంకటేశ్వర్ రెడ్డి వద్ద యాబై లక్షలు తీసుకుని పనులు చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు గ్రానైట్ యాజమాని‌. కార్వేటినగరము నగరం మండలంలోని గ్రానైట్ ప్యాక్టరీ కోసం ఒప్పందంలో భాగంగా ఎమ్మెల్యే అనుచరుడు హారీష్ యాదవ్ కు 50 లక్షలు ఇచ్చిన వెంకటేశ్వర్ రెడ్డి.

వైసీపీలో చేరనున్న సీనియర్ నేత:
ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌, సీనియర్‌ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయవాడకు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బాలసుబ్రమణ్యం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రాకతో.. వైసీపీకి మరింత బలం చేకూరనుంది. బాలసుబ్రమణ్యం పార్టీని వీడడం రాజ‌కీయంగా టీడీపీకి దెబ్బే అనే చెప్పాలి.

కేసీఆర్ దమ్ము ఎంతో కాంగ్రెస్ నేతలకు తెలుసు:
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోమారు రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. నేడు ఆమె అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్ట్ కార్డ్ రాశారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ అని అన్నారు. తన కలలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టం చేయరని, కేసీఆర్ దమ్ము ఎంతో కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసునన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్:
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితిని తొలగించేలా.. రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్త పరుస్తున్నారు. ఈ అంశంపై ఆరుగురు మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది.

4013 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్:
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్తున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా 4013 పోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసింది ప్రణీత్ రావు అండ్ టీమ్. వీరిలో 618 మంది పొలిటికల్ లీడర్ల పోన్ ట్యాపింగ్ జరిగిందని సమాచారం. ఈ 618 మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ , పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్ట్ లకు సంబంధించినట్లుగా తెలుస్తోంది.

నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా:
హనీమూన్ మర్డర్‌ కేసులో సోనమ్ రఘువంశీ ఉదంతం ఇంకా మరిచిపోక ముందే మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తొలి రాత్రి శోభనం గదిలో నవ వధువు కత్తి పట్టుకుని చంపేస్తానంటూ భర్తను తీవ్రంగా బెదిరించింది. తాకితే 35 ముక్కలు చేస్తానని.. ఈ శరీరం అమన్‌కు అంకితం చేశానని బెదిరించింది. దీంతో 3 రాత్రులు కొత్త పెళ్లికొడుకుకి కాళరాత్రి అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేసిన మోడీ:
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైనా పరిస్థితులు, ఇబ్బందులపై ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ట్వి్ట్టర్ ద్వారా మోడీ వెల్లడించారు. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో తన ప్రయాణం ఎలా సాగిందో డైరీలో ఉందని చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో చాలా మందికి అనుభవాలు ఉన్నాయని.. ఎన్నో కుటుంబాలు బాధపడ్డాయని గుర్తుచేశారు. ఆనాటి పరిస్థితుల్ని యువతకు అవగాహన కల్పించాలని కోరారు. చీకటి రోజులను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

సోనమ్-రాజ్ కుష్వాహ బంధంపై పోలీసులు ఏం తేల్చారంటే:
హనీమూన్ మర్డర్ కేసులో మేఘాలయ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇక సోనమ్ రఘువంశీ-రాజ్ కుష్వాహ మధ్య సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఇద్దరు కూడా బంధం ఉన్నట్లు ఒప్పుకున్నారని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సాయిమ్ తెలిపారు. సోనమ్ రఘువంశీ, రాజ్ కుష్వాహ బంధానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. నార్కో పరీక్షలు నిర్వహించడం లేదని.. బాధిత కుటుంబం డిమాండ్‌ను అంగీకరించడం లేదని చెప్పారు. ఆధారాలు లేనప్పుడు మాత్రమే నార్కో పరీక్షలు నిర్వహిస్తారని.. అన్ని ఆధారాలు లభించాక ఇంకెందుకు అని ప్రశ్నించారు. నార్కో పరీక్షను సుప్రీం కోర్టు నిషేధించిందని వెల్లడించారు.

రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా:
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు రోదసి యాత్ర ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. ఇస్రో, నాసా యాక్సియం-4 మిషన్ ప్రయోగం చేపట్టింది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్ వ్యోమనౌక డాకింగ్ ప్రక్రియ అనుసంధానం అవుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకునేందుకు 28 గంటల ప్రయాణం సాగనుంది. 14 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో శుభాంశు శుక్లా గడపనున్నారు. శుభాంశు శుక్లా రోదసి యాత్ర కోసం భారత్ రూ.550 కోట్లు ఖర్చు చేస్తోంది. శుభాంశు శుక్లా.. యాక్సియం-4 మిషన్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసం చేశాం:
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం శాంతి వాతావరణం నెలకొంది. మంగళవారం నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలిగినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇక ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం తనకు లభించిన గొప్ప గౌరవంగా చెప్పుకొచ్చారు. యుద్ధం ఆపాలని ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు కోరాయని.. ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశాకే.. యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.

ఆ రెండు సినిమాల శాటిలైట్ రైట్స్ కొనేవారు కరువు?:
గుడ్ బ్యాడ్ అగ్లీ, రెట్రోను భారీగా వెచ్చించి ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. రెట్రో రూ. 80 కోట్లు, జీబియు 95 కోట్లకు OTT రైట్స్ అమ్ముడయ్యాయి. కానీ ఈ రెండు సినిమాలకు బిగ్ హ్యాండ్ ఇచ్చింది ప్రముఖ ఛానెల్ సన్ టీవీ. జీబీయూని ఫస్ట్ సన్ టివీ శాటిలైట్ రైట్స్ అగ్రిమెంట్ చేసుకుంది. తీరా సినిమా రిలీజయ్యాక డీల్ క్యాన్సిల్ చేసింది. రెట్రో విషయంలోనూ ఇదే జరిగిందని తెలుస్తోంది. దీంతో అన్ సో’ల్డ్‌ చిత్రాలుగా మిగిలిపోయాయి. స్టార్ హీరోల చిత్రాల శాటిలైట్స్ రైట్స్ సోల్డ్ కాకపోవడానికి ఓటీటీ మాత్రమే కారణం కాదు. థియేటర్లలో సినిమా సరిగ్గా ఆడకపోయినా, పెద్దగా బజ్ క్రియేట్ చేయకపోయినా టీవీ ఛానల్స్ భారీగా ఖర్చుపెట్టడానికి ఆలోచిస్తున్నాయి. అలాగే సినిమా విడుదలైన ఎప్పటికో టీవీల్లో చూసేందుకు నిరీక్షించడం లేదు ఆడియన్స్. రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీల్లోకి రావడం అంతకన్నా ముందే పైరసీ రూపాల్లో చూసేయడం కూడా శాటిలైట్స్ ఛానల్స్‌కి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. భారీ రేటుకు కొన్న ఒక్కసినిమాకి కూడా సరైన రేటింగ్ రాకపోవడం సదరు ఛానల్స్‌కి పేద్ద హేడేక్‌గా మారింది. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే భవిష్యుత్తులో సినిమాలు అనేవి టీవీల్లో చూడడం అనేది వండర్ అవుతుంది.

సౌరవ్ గంగూలీ బయోపిక్ పై లేటేస్ట్ అప్‌డేట్:
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఒక బయోపిక్ తెరకెక్కనున్నట్లు.. గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గంగూలీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తన బయోపిక్ గురించి కీలక విషయాలను వెల్లడించారు. 2026 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమవుతుందని, సినిమా పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అంతేకాదు.. ఈ బయోపిక్‌లో గంగూలీ పాత్రను బాలీవుడ్ స్టార్ నటుడు రాజ్‌కుమార్ రావు పోషించనున్నారని గంగూలీ స్పష్టంగా తెలిపారు. ఇప్పటికే నటుడు కొన్ని రోజులుగా ఈ పాత్ర కోసం ప్రిపరేషన్‌లో ఉన్నారట. ఈ పాత్రకు తగినంత న్యాయం చేయగల నటుడిగా రాజ్‌కుమార్ రావును ఎంపిక చేయడం పై అభిమానులు సంతృప్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయని గంగూలీ తెలిపగా.. స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే సినిమాకు సంబంధించిన అన్ని పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. షూటింగ్ ఎక్కువ సమయం పడకపోయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రం కొంత సమయం పట్టవచ్చని ఆయన చెప్పారు.

వెంకీ – త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్:
టాలీవుడ్‌ క్లాసిక్ కాంబోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. మరోసారి స్క్రీన్‌పై మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన సినిమాలు ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి టైమ్‌లెస్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారని చేస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని అందుకొని వెంకీ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. దీంతో ఆయన తర్వాత చేయబోయే సినిమా ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇలాంటి టైంలో అనూహ్యంగా త్రివిక్రమ్-వెంకటేష్ కాంబో తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు సినిమాలు వెంకటేష్, ఎన్టీఆర్ తో ఉంటాయని ఇప్పటికే నిర్మాత నాగవంశీ కూడా తెలిపాగా ,అందుకు తగ్గట్టుగానే ముందుగా వెంకీ మామ మూవీ పట్టాలెక్కుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. వెంకీ–త్రివిక్రమ్ చిత్రం ఆగస్టు నెలలో ప్రారంభం కానుందట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా. స్క్రిప్ట్ లాక్ అయి, లొకేషన్, టెక్నికల్ టీమ్, క్యాస్టింగ్ పనులు కూడా పూర్తి దశలో ఉన్నట్లు టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

 

Exit mobile version