NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం:
వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెలాఖరుకు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తవుంటుందని, ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం అని చెప్పారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. నేడు రాజధాని ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. నేలపాడులో ఐకానిక్ బిల్డింగ్ పునాదులను పరిశీలించారు. పునాదుల్లోకి నీరు చేరడంతో మిషన్ సహాయంతో నీటిని బయటకు పంపుతున్న కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు.

గౌతమ్ రెడ్డికి ఊరట:
వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని.. ఆధారాలు చేరిపి వేయడం, సాక్షులను బెదిరించడం వంటివి చేయరాదని ఆదేశించింది. మిగతా షరతులన్నీ దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం గౌతమ్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.

మంత్రి కాన్వాయ్‌కి ప్రమాదం:
లంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలకు ఘోర ప్రమాదం జరిగింది. నేడు మంత్రి హుజూర్‌నగర్‌ నుండి జాన్‌పహాడ్‌ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్న కాన్వాయ్‌ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 15 కార్ల ముందు భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. నల్గొండ జిల్లా గరిడేపల్లి వద్ద ఉత్తమ కుమార్ రెడ్డి కాన్వాయ్ వెంట వెలుతున్న కాంగ్రెస్ నేతల వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. మంత్రి ఉరుసుకు వస్తున్నాడన్న కారణంతో ఆయన అభిమానులు భారీగా కాన్వాయ్‌ ని ఏర్పాటు చేశారు. గరిడేపల్లి వద్దకు చేరుకున్న తర్వాత కాన్వాయ్‌ లోని ఒక వాహనం సడన్ గా బ్రేక్ చేయడంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనతో మొత్తం 15కు పైగా వాహనాల ముందు, వెనుక భాగాలు బాగా డ్యామేజ్ అయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కానీ, ప్రాణహాని జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి కోసం వెళ్తున్న అభిమానుల అతి ఉత్సాహం, వాహనాల వేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎమ్మెల్యేపై టమాటాలతో దాడి:
నేడు జరుగుతున్న కమలాపూర్ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సభ కాంగ్రెస్ నాయకులు, BRS నాయకుల మధ్య ఘర్షణకు దారితీసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లిస్ట్‌పై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమయంలో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. “మీ హయాంలో ఏమి చేయలేదని, మా ప్రభుత్వం అన్ని చేస్తోంది” అని కాంగ్రెస్ నాయకులు అనడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుల దాడికి ప్రతిగా బిఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు విసరడం ప్రారంభించారు. ఇరువర్గాలు ఒకదానికొకటి నినాదాలు చేస్తూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈ ఘర్షణతో గ్రామసభ పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు:
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భండారా జిల్లాలోని జవహర్ నగర్ లో గల ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో ఈ రోజు (జనవరి 24) భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. నేటి ఉదయం 10.30 గంటల సమయంలో ఫ్యాక్టరీలోని ఆర్‌కే బ్రాంచ్ విభాగంలో పేలుడు సంభవించింది అని జిల్లా కలెక్టర్‌ సంజయ్‌ కోల్తే పేర్కొన్నారు. అయితే, పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు ఒక్కసారిగా కూలిపోగా.. ఈ శబ్దం దాదాపు 5 కిలో మీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకోగా.. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది ఉండగా.. వీరిలో ఇద్దరిని రెస్క్యూ టీమ్ కాపాడినట్లు తెలుస్తుంది. అయినా, ఘటనా ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఇక, గాయపడిన వారిని అంబులెన్స్ ల ద్వారా స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పందిస్తూ.. ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు.

మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం:
ముంబై మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపరా నివాసి అయిన మహిళ మంగళవారం అర్థరాత్రి గోరేగావ్‌లోని రామ్ మందిర్ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానస్పదంగా కనిపించింది. దీంతో ఆమెను విచారించగా.. తాను ముంబైకి వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అక్కడ ఓ ఆటో డ్రైవర్ తనపై బలవంతంగా అత్యాచారం చేసిన తన ప్రైవేట్ పార్ట్‌లలో సర్జికల్ బ్లేడ్‌తో పాటు రాళ్లను చొప్పించాడని వెల్లడించింది.

బాలయ్య సినిమాల లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే:
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ జోష్‌లో ఇక నుంచి అసలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పుకొచ్చాడు బాలయ్య. అందుకు తగ్గట్టే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవర్ హౌజ్ కాంబో రిపీట్ చేస్తూ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేస్తున్నారు. ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమాలు చేయడానికి ఇద్దరు దర్శకులు దాదాపుగా ఫిక్స్ అయ్యారనే చెప్పాలి. వీరసింహారెడ్డితో బ్లాస్టింగ్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. అఖండ 2 తర్వాత ఈ కాంబోలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక తాజాగా డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ కూడా మరోసారి బాలయ్యతో అదిరిపోయే సినిమా చేస్తానని ప్రకటించాడు. ఈ సారి బాలయ్యతో డాకు మహారాజ్‌ని మించి పాన్ ఇండియా భాషలలో గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నాను అని ప్రకటించాడు బాబీ.

‘మాస్ జాతర’ టీజర్ రిలీజ్ డేట్:
మాస్ మహారాజ ర‌వితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజకు భంగపాటు ఎదురైంది. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భాను బోగ‌వ‌రపు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాను ‘మాస్ జాతర’ అనే టైటిల్ తో వస్తున్నాడు. బడా నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా ఇది రానుంది. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. మాస్ మహారాజ బర్త్ డే సందర్భంగా జనవరిలో 26న ‘ మాస్ జాతర ‘ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ధమాకా వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రవితేజకు మాస్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగిన జకోవిచ్‌:
కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న సెర్బియా టెన్నిస్ స్టార్‌ జకోవిచ్‌ను గాయంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 సెమీస్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌పై మ్యాచ్‌లో బరిలోకి దిగి తొలి సెట్‌ తర్వాత రిటైర్డ్‌హర్ట్‌ ప్రకటించి బయటకు వెళ్లిపోయాడు. గాయంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నాడు. జోక్ నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో జర్మనీ స్టార్ జ్వెరెవ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్ ఫైనల్‌కు వెళ్లాడు. ఈరోజు జరగనున్న రెండో సెమీస్‌లో విజేతగా నిలిచే ప్లేయర్ తో అతడు టైటిల్‌ కోసం బరిలోకి దిగనున్నాడు.