NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

దుర్గగుడి ప్రధాన అర్చకులు మృతి:
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు కన్నుమూశారు. బుధవారం తెల్లవారు జామున బద్రీనాథ్ బాబు తన ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు. చాలా ఏళ్లుగా ఆయన దుర్గగుడి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. బద్రీనాథ్ బాబు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

కీచకోపాధ్యాయుడికి గ్రామస్తుల దేహశుద్ధి:
‘ఆచార్య దేవోభవ’.. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు కట్టబెట్టింది మన దేశం. అయితే ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెస్తున్నారు. కీచకోపాధ్యాయులకు దేహశుద్ధి చేసినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో లక్ష్మన్న ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా విద్యార్థినులపై లక్ష్మన్న లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినులను తాకరాని చోట్ల తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. టీచర్ లక్ష్మన్న తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. బాలికల తల్లిదండ్రులు, స్థానికులు స్కూల్‌కి వెళ్లి లక్ష్మన్నను చితకబాదారు.

పట్టపగలే నడిబొడ్డులో దారుణం:
వరంగల్ జిల్లా హనుమకొండలోని రోహిణి ఆసుపత్రి ముందు ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య జరిగిన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. వివరాల ప్రకారం, రెండు ఆటో డ్రైవర్ల మధ్య వివాదం మొదలవ్వగా.. ఈ గొడవ సమయంలో ఒక డ్రైవర్ మరో డ్రైవర్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అతను మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు కారణమైన గొడవపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి:
సిద్దిపేటలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల కోసం ప్రజలు ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టాలని ప్రశ్నించారు. దరఖాస్తు పెట్టినప్పుడల్లా 40 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, గతంలో ఇచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా మూలకు పడేశారని, దరఖాస్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమ మోసం విధానాలను ప్రకటించిందని అన్నారు/ రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ హైదరాబాద్ లో మాట్లాడుతున్నారని.. కానీ, ప్రజాపాలనలో రుణమాఫీ కాలేదని, దరఖాస్తులు వస్తున్నాయని హరీష్ రావు అన్నారు.

ఢిల్లీలో చైనీస్ సీసీటీవీ కెమెరాల వివాదం:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న కమలం పార్టీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేజ్రీవాల్ పంజాబ్ సర్కార్ వనరులను వినియోగించుకుని.. మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే పంజాబ్‌లోని ప్రభుత్వ స్కూల్స్ టీచర్లను ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీకి పిలిపించారని.. వారు ఆప్ కార్యకర్తలుగా మారిపోయి.. ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రవేశ్ వర్మ ఆరోపణలు చేశారు.

ఢిల్లీ సీఎం అతిషి తల్లిదండ్రులు టెర్రరిస్టుకు మద్దతు:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, విపక్ష బిజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా మరోసారి కమలం పార్టీ నేత రమేష్‌ బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అతిషి మార్లెనాని టార్గెట్‌ చేశారు. ఆమె తల్లిదండ్రులు పార్లమెంట్‌పై దాడి చేసిన టెర్రరిస్టు అఫ్జల్‌ గురుకు మద్దతు ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు. అతిషి తల్లిదండ్రులది భారత్‌ వ్యతిరేక మనస్తత్వం.. అందుకే పార్లమెంట్‌పై దాడి చేసిన వ్యక్తిని కాపాడేందుకు వారు ట్రై చేశారని పేర్కొన్నారు. ఇక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరపున రమేశ్ బిదూరి ముఖ్యమంత్రి అతిషిపై పోటీ చేయబోతున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికలు జరగనుండగా.. 8వ తేదీన తుది ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, సీఎం అతిషియే లక్ష్యంగా వరుసగా బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల, అతిషి తన తండ్రిని మార్చి మర్లెనా అనే పేరు నుంచి అతిషి సింగ్‌గా నామకరణం చేసుకుందని ఆరోపించారు. ఎన్నికలు రాగానే ఢిల్లీ వీధుల్లో అతిషి జింకలా పరుగులు పెడుతోందని మరోసారి కామెంట్స్ చేశారు. అలాగే, ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్‌ బిదూరి అన్న ప్రచారం కూడా జరుగుతుంది.

ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు:
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో మరోసారి దూకుడు పెంచాడు. జో బైడెన్‌ ప్రభుత్వం జారీ చేసిన 78 ఆదేశాలను క్యాన్సిల్ చేయడంతో పాటు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు జారీ చేశారు. తాజాగా, ఫెడరల్‌ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇవ్వడానికి ట్రంప్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని జీవో జారీ చేసింది. ఇక, అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్‌ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేయడానికి ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లపై సంతకం పెట్టారు.

భారత్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చిన ట్రంప్:
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి సమావేశంలో జైశంకర్‌తో భేటీ అయ్యారు. రూబియోతో పాటు యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌తోనూ ఆయన ద్వైపాక్షిక చర్చలు కొనసాగించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.. అందులో క్వాడ్ గ్లోబల్ శక్తిగా కొనసాగుతుందన్నారు. రూబియోతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పెన్నీ వాంగ్, జపాన్‌కు చెందిన తకేషి ఇవాయాతో కూడిన క్వాడ్ మంత్రులు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించారని పేర్కొన్నారు. అలాగే, తన సహచరులతో స్వేచ్ఛా, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్‌ను నిర్ధారించడానికి “విభిన్న కొలతలు” గురించి చర్చించామన్నారు. ఇక, ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే క్వాడ్ ఎఫ్‌ఎమ్‌ఎమ్ జరగడం గమనార్హం.. విదేశాంగ విధానంలో ఉన్న సభ్య దేశాలకు ఇచ్చిన ప్రాధాన్యత అని జైశంకర్ పేర్కొన్నారు.

అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇదేనట:
పటాస్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అనిల్ రావిపూడి.. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. వారం రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కరెక్ట్ చేసి రీజినల్ సినిమాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఆయనని మోడ్రన్ ఈవీవీ అంటూ పోలుస్తున్న నేపథ్యంలో ఇదే ప్రశ్న ఎదురయింది. దానికి అనిల్ రావిపూడి సమాధానం ఇస్తూ తన జీవితంలో ఇది బెస్ట్ కాంప్లిమెంట్ అంటూ చెప్పవచ్చాడు.. కేవలం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మాత్రమే కాదు అది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ కూడా అంటూ ఆయన కామెంట్ చేశాడు. ఈవీవీ లాంటి లెజెండరీ డైరెక్టర్ తో నన్ను పోల్చడం అది కూడా చిన్నప్పుడు నేను ఆయన సినిమాలను ఎంతో ఎంజాయ్ చేసేవాడిని. దాన్ని నేను జీవితంలోనే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ గా తీసుకుంటాను అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే తాను నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ లతో సినిమాలు చేశానని మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా పట్టాలెక్కబోతోందని అన్నారు. నాగార్జున గారితో కూడా 100% సినిమా చేస్తానని ఒకప్పుడు సినిమా పరిశ్రమకు ఫోర్ పిల్లర్స్ గా చెప్పుకొని సీనియర్ హీరోలతో చేసిన అతి తక్కువ మంది డైరెక్టర్లలో తాను కూడా ఒకడిగా నిలవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

సుకుమార్ ఇంటిపై ఐటీ సోదాలు:
హైదరాబాద్ లో ఐటి అధికారులు నిన్నటి నుండి పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. దాదాపు 200 మంది అధికారులు ఈ ఐటీ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం.

బీసీసీఐ తీరుతో యూజీ కెరీర్‌ ముగిసిపోయినట్లే:
ఈ నెల 18వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కార్ ప్రకటించారు. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ టోర్నీ స్టార్ట్ కానుంది. ఇందులో రోహిత్ శర్మ నేతృత్వంలోనే టీమిండియా బరిలోకి దిగబోతుంది. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు మహ్మద్ షమీ రెడీ అయ్యాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌కు ఛాన్స్ రావడంతో యుజ్వేంద్ర చాహల్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ పక్కకు పెట్టింది. గతంలో మంచి ప్రదర్శన చేసినా అతడికి ఛాన్స్ ఇవ్వకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. చాహల్‌ కెరీర్‌ దాదాపు ముగిసిపోయేలా చేశారని ఆరోపించాడు. గత రెండేళ్ల నుంచి అతడికి జాతీయ జట్టులో స్థానం కల్పించకపోవడం ఏంటని ప్రశ్నించారు.