NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం.
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరామమన్నారు. మిర్చికి రూ.11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం అని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి అచ్చం నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు.

మిర్చి రైతులను వైఎస్ జగన్ పరామర్శిస్తే తప్పేంటి?:
మిర్చి రైతులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తే తప్పేంటి? అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారన్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గం అని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వెంకటరామి రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వస్తే.. కూటమి ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వని విషయం తెలిసిందే.

హరీష్ రావు పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేశారు:
సిద్దిపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, కాంగ్రెస్‌ నాయకుడు చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి క్రిమినల్‌ కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు వంశీకృష్ణ, సంతో‌షకుమార్‌, పరశురామ్‌ తరఫు న్యాయవాది లక్ష్మణ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఒక్కొక్కరు రూ.20 వేల పూచీకత్తు, రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్‌ ఇచ్చింది. కాగా.. ఈ రోజు ముగ్గురు నిందితులు వంశి కృష్ణ, పరశురములు, సంతోష్ కుమార్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నిందితుడు వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశాడు. “నేను చక్రధర్ గౌడ్ దగ్గర నాలుగు నెలలు పని చేశాను. ఆ తరువాత హరీష్ రావు దగ్గర 3 నెలల పని చేశాను. ఆరోగ్యశ్రీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేశాను. నేను డబ్బులు అడిగినట్లు చక్రధర్ గౌడ్ వీడియోలు చేశాడు. విచారణలో హరీష్ రావు పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేశారు. హరీష్ రావుతో నేనుప్పుడూ మాట్లాడలేదు. చక్రధర్ గౌడ్ దగ్గర నేను పని చేశాను కాబట్టే నన్ను టార్గెట్ చేశారు. అందుకే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాను?” అని నిందితుడిలో ఒకరైన వంశీకృష్ణ తన స్పష్టం చేశాడు. “నాకు మొబైల్ నెట్వర్క్ షాప్ ఉంది. తెలిసిన వాళ్ళే కదా అని సిమ్ కార్డు ఇచ్చాను. సిమ్ కార్డు ఇచ్చినందుకు నన్ను అరెస్ట్ చేశారు. యాదగిరి పేరు మీద సిమ్ కార్డు తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ” అని సంతోష్ తెలిపాడు.

మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు:
కృష్ణా గోదావరి జలాల్లో వాటాపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “ఉత్తమ్ కుమార్ చెత్త ఆరోపణలతో లాభం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టారు. నాగార్జునసాగర్ , శ్రీశైలంలో నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడడం లేదు. ఇంత నీటి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు
తెలంగాణలో తాగునీరుకి కష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. తాగునీరు కోసం వాడాల్సిన నీటిని సాగు కోసం తరలించుకు పోతున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో వాటా కంటే ఎక్కువ నీటిని ఏపీ తరలించుకు పోతుంది. కృష్ణా, గోదావరి ల నీళ్లు ఏపీ తరలించుకు పోతుంది అని హరీష్ రావు మాట్లాడారు. హరీష్ రావు ను విమర్శలు చేయడం మానేసి.. చంద్రబాబును కేంద్రాన్ని అడగండి. అవినీతి అని కాంగ్రెస్ మాట్లాడితే నవ్వు వస్తుంది. తెలంగాణకి అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీలే..” అని జగదీశ్‌రెడ్డి వాఖ్యానించారు.

పర్వేష్ వర్మ.. మరో ఏక్‌నాథ్ షిండే అవుతాడా?:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని మీడియా కోడైకూసింది. కానీ చివరికి రేఖా గుప్తాను అదృష్టం వరించి సీఎం పోస్టు తన్నుకుపోయారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆమెకు మంచి సంబంధాలు ఉండడంతోనే సీఎం పదవి ఆమెకు దక్కిందని వార్తలు వినిపిస్తు్న్నాయి. అయితే సీఎం పదవి దక్కలేదన్న అసంతృప్తి.. పర్వేష్ వర్మ, ఆయన మద్దతుదారులకు ఉన్నట్లు సమాచారం. చాలా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన.. మరో ఏక్‌నాథ్ షిండే కావొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీకి 48, ఆప్‌కు 22 స్థానాలు దక్కాయి. ప్రభుత్వానికి కావాల్సింది 35 సీట్లు ఉంటే సరిపోతుంది.

నిరుద్యోగులకు సువర్ణ అవకాశం:
నిరుద్యోగ యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా జరగనుంది. ఉద్యోగంలో ఎంపికైన వారికి అధిక వేతనం లభించనుంది. ఈ నోటిఫికేషన్‌లో సీనియర్ మేనేజర్, మేనేజర్, ఆఫీసర్, డెవలపర్, క్లౌడ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, ఏపీఐ డెవలపర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

పిల్లలు చచ్చిపోతుంటే ఫొటోషూట్‌లా:
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, వైట్‌హౌస్ సలహాదారు ఎలోన్ మస్క్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే.. భార్యతో కలిసి ఫొటోషూట్‌ చేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు. ఉక్రెయిన్-రష్యా మధ్య గత మూడేళ్ల నుంచి భీకర యుద్ధం సాగుతోంది. యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు, పిల్లలు చనిపోగా.. ఆస్తులు ధ్వంసమయ్యాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా వేదికగా రష్యా-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ లేకుండానే అమెరికా చర్చలు జరుపుతోంది.

స్టార్ హీరోలతో జోడీ కడుతోన్న పూజా హెగ్డే:
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డేకు టాలీవుడ్ తో అస్పలు పొసగడం లేదు. ఎక్కడో దర్శక నిర్మాతలతో రిలేషన్స్ దెబ్బతిన్నట్లున్నాయి. దీంతో బాగా హర్టయిన అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం జరుగుతూ ఫుల్ గా తమిళంపైనే ఫోకస్ చేస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అదీ కూడా స్టార్ హీరోలతో జోడీ కడుతుంది. సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తోన్న క్యూరియస్ మూవీ రెట్రోలో ట్రెడిషన్ లుక్కులో కనిపించి మెస్మరైజ్ చేసింది బ్యూటీ. రెట్రోతో పాటు జన నాయగన్ లాంటి బిగ్ హీరో భారీ ప్రాజెక్ట్ పూజా హెగ్దే ఖాతాలో ఉన్నాయి . ఇళయదళపతి విజయ్ చివరి సినిమాగా వస్తోన్న జననాయగన్ లో మేడమ్ దే మెయిన్ రోల్. అలాగే కాంచన4లో రాఘవ లారెన్స్ తో కలిసి స్టెప్పులేయబోతుంది అమ్మడు. దీనితో పాటు హిందీలో ఓ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇవే కాదు ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మరో క్రేజీ ఫిల్మ్ పడ్డట్టు టాక్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్- రజనీకాంత్ కాంబోలో వస్తోన్న మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ కూలీలో కనిపించబోతుంది. హీరోయిన్ గా కాదు ఐటమ్ నంబర్ కోసం దర్శకుడు ఆమెను అప్రోచ్ అయ్యాడట. పూజాతో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడించాలని అనుకున్నాడట లోకేశ్. ఇప్పటికే రంగస్థలం, ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన బ్యూటీ ఒప్పుకుంటే ఇదే తొలి తమిళ్ ఐటమ్ సాంగ్. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగా ఐటమ్ సాంగ్ అంటే ఆలోచించాల్సిన హీరోయిన్లు ఆలోచనలో పడుతుంటారు. కానీ పూజా తీరే వేరుగా కనిపిస్తోంది. తన కెరీర్ బిల్ట్ కావడానికి కారణమైన కోలీవుడ్ లో ఏ ఆఫర్ వచ్చినా చేసేందుకు రెడీ అన్నట్లే కనిపిస్తోంది.

హీరోయిన్ తో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు:
తమిళ సంగీత దర్శకులలో జీవి ప్రకాష్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. తన మ్యూజిక్ తో జీవి ప్రకాష్ ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది అమరన్ అలాగే లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు జీవీ. అలాగే హీరోగాను జీవి ప్రకాష్ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. కాగా గతేడాది జీవి ప్రకాష్ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంన్నాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్ననాటి స్నేహితురాలు ప్రముఖ సింగర్ సైంధవితో విడాకులు తీసుకున్నారు. 2013 లో ఒక్కటైనా ఈ జంటకు 2020లో ఆడపిల్లకు జన్మనిచ్చారు. అయితే 11 ఏళ్ల వీరి వివాహ బంధానికి ముగింపు పలుకుతూ గతేడాది పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. కాగా జివి ప్రకాష్ కు సంబంధించి కొన్నాళ్లుగా ఓ న్యూస్ చెన్నై సిర్కిల్స్ వినిపిస్తుంది. జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచ్ లర్ సినిమాలోని హీరోయిన్ దివ్య భారతీతో ప్రేమలో ఉన్నాడని, కొన్నాళ్లుగా ఈ జోడి డేటింగ్ ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలో స్పందించిన జీవి రూమర్స్ ను ఖండించాడు. జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ‘నేను దివ్య భారతి కలిసి నటించినంత మాత్రాన మా మధ్య ఎదో ఉందనుకోవడం పొరపాటు. నేను దివ్య మంచి ఫ్రెండ్స్. సినిమా షూట్ లో మాత్రమే కలుస్తాం. అంతకు మించి బయట మేము ఎక్కడ కనీసం కలుసుకోము. మీడియాలో ఏవేవో రాస్తుంటారు.. చూసి నవ్వుకొని వాటిని వదిలీయేమని దివ్య కు చెప్తాను’ అని అన్నారు.