NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

కేంద్ర జల్‌శక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ:
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు, పవన్ సమావేశం అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు కేటాయించగా.. నిధులు విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు. మరోవైపు పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపైనా విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కూడా ఉన్నారు.

రూ.337 కోట్ల పెనాల్టీ పడేలా చేశారు:
ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ, ఈడీ, అధికారులపై ఛైర్మన్‌ జీవీ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫైబర్‌ నెట్‌ అధికారుల్లో లెక్కలేనితనం, ఒళ్లు బద్ధకం కనిపిస్తున్నాయని మండిపడ్డారు. కోర్టు వాయిదాలకు వెళ్లకుండా రూ.337 కోట్ల పెనాల్టీ పడేలా చేశారన్నారు. తనకు అకౌంట్స్ బుక్స్ ఇవ్వడం లేదని, అధికారులు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. బిజినెస్ చేయకపోగా ఉన్నదాన్ని పోగొడుతున్నారని, ఫైబర్‌ నెట్‌ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఫైబర్‌ నెట్‌ కార్యాలయంలో నిర్వహించి మీడియా సమావేశంలో జీవీ రెడ్డి మాట్లాడారు.

రాజలింగమూర్తి హత్య కేసులో బీఆర్ఎస్పై ఆగ్రహించిన మంత్రి:
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసును కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ఈ హత్య కేసుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ధ్వజమెత్తారు. రాజలింగం హత్యను దారి మళ్లించేందుకు హరీష్ రావు కృష్ణా నీటి వివాదం గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ హత్య కేసు వెనక మాజీ సీఎం కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించిన ఆయన, ‘‘అవినీతి ప్రశ్నిస్తే చంపేస్తారా? రాజలింగంను హత్య చేయించి, ఇప్పుడు నేరాన్ని దాచేందుకు నీటి వివాదం లేపుతున్నారా?’’ అంటూ మండిపడ్డారు. అలాగే హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ‘‘కృష్ణా నదీ నీటి దోపిడీకి అసలు కారణం ఎవరు? వైఎస్ జగన్‌తో దోస్తానా చేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ నీళ్లు దోచి పెట్టింది నువ్వే కదా?’’ అని ఆయన నిలదీశారు.

ఇకనైనా మొద్దు నిద్ర వీడండి:
నాగార్జునసాగర్ నీటి విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకపడ్డారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ నుండి గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌కు కుడి కాలువ ద్వారా 10,000 క్యూసెక్కుల నీరు తరలించబడుతోంది. రోజూ సుమారు రెండు టీఎంసీల నీరు ఏపీకి చేరుతోంది. ఈ తరలింపును ఆపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సాగర్ నీటిని ఏపీ తరలించడంపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టమైన విజ్ఞప్తి చేసేందుకు వెనుకడుగేస్తోందని విమర్శలు వస్తున్నాయి.

జడ్జిలపై ఎంక్వైరీ చేయడం దారుణం:
హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆ ఉత్తర్వులు ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, లోక్‌పాల్ రిజిస్ట్రార్‌లకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై దాఖలైన రెండు ఫిర్యాదులను లోక్‌పాల్ దర్యాప్తు చేస్తుంది. లోకాయుక్త చట్టం 2013 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ జనవరి 27వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేపట్టి.. స్టే ఇచ్చింది. అలాగే, సదరు హైకోర్టు న్యాయమూర్తి పేరును బయటకు వెల్లడించొద్దని ఫిర్యాదుదారుడికి ఆదేశాలు ఇచ్చింది.

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం:
ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాంలీలా మైదానంలో ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 12:35 గంటలకి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖాతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ ప్రమాణం చేయగా.. మజీందర్ సింగ్ సిర్సా, పంకజ్ కుమార్ సింగ్, రవీందర్ సింగ్ ఇంద్రజ్, ఆశీష్ సూద్, కపిల్ మిశ్రా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు.

హాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోలు:
బాలీవుడ్ స్టార్ హీరోలు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారా, స్పెషల్ క్యామియోస్ తో ఆ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మున్నాభాయ్ సంజయ్ దత్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. అయితే బాలీవుడ్ మూవీలో కాదు హాలీవుడ్ సినిమాలో. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న అమెరికన్ త్రిల్లర్ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన సీక్వెన్స్ లో కనిపించబోతున్నారట ఈ సీనియర్ స్టార్ హీరోలు. గుట్టు చప్పుడు కాకుంగా సౌదీలో ఈ ఇద్దరిపై సీన్స్ షూట్ చేస్తోన్నట్లు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు మేకర్స్. సల్మాన్, సంజయ్ బాలీవుడ్ లోనే కాదు మిడిలీస్ట్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అక్కడ సల్మాన్ సినిమాలు మిలియన్ కలెక్షన్స్ రాబడతాయి. ఇప్పుడు ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకోవాలనుకుంటోంది హాలీవుడ్. గ్లోబల్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి ఈ హీరోలను ఫీల్ట్ లోకి దింపుతోంది. అలాగే ఈ స్టార్ హీరోల మధ్య మంచి ఫ్రెండిషిప్ ఉంది. గతంలో ఈ ఇద్దరు కలిసి చల్ మేరే బాయ్, సాజన్, హే హై జల్వాలో నటించారు. అలాగే చివరి సారిగా 2012లో వచ్చిన అజయ్ దేవగన్ హిట్ మూవీ సన్ ఆఫ్ సర్దార్ లో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిశారు. లాంగ్ గ్యాప్ తర్వాత సంజయ్, సల్మాన్ కలిసి చేస్తున్న ఈ హాలీవుడ్ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.

హీరోగా వద్దు.. డైరెక్షన్ ముద్దు:
కోలీవుడ్ లో టీనేజ్ అండ్ 20 ఏజ్ గ్రూప్ హీరోలు తగ్గిపోయారు. అంతా 30ప్లస్, 40 ప్లస్ బ్యాచే. దీంతో రొమాంటిక్ అండ్ లవ్ చిత్రాలు పెద్దగా రావడం లేదు. సీనియర్లు అంతా ఉగ్రవాదం, దేశభక్తి, స్మగ్లింగ్, గ్యాంగ్ స్టర్ అంటూ సినిమాలు చేస్తున్నారు. మరి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎవరు తీయాలి. అందుకే చాలా మంది స్టార్ వారసులపై హోప్స్ పెట్టుకున్నారు. విజయ్, ధనుష్, సూర్య, విజయ్ సేతుపతి, అజిత్ ఇలా వారసుల ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో కొత్త హీరోలు రాబోతున్నారని సినీ ప్రేమికులు ఆశిస్తుంటే మేం కెమెరా ముందుకు రాలేం కెమెరా బ్యాక్ ఉంటామంటున్నారు. ఇప్పటికే ఇళయదళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా మారి సందీప్ కిషన్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జాసన్ బాటలోనే నడుస్తున్నాడు ధనుష్ పెద్ద కొడుకు యాత్ర.పెద్ద కొడుకు యాత్రను హీరోను చేయాలంటే ధనుష్ కు పెద్ద మ్యాటరే కాదు. కానీ ఈ స్టార్ సన్ కొడుక్కి హీరో కన్నా డైరెక్టర్ అవ్వాలన్నది కల. ఆ దిశగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు టాక్. వీరినే ఫాలో అయిపోతున్నాడు స్టార్ డైరెక్టర్ శంకర్ కొడుకు ఆర్జిత్ కూడా హీరో మెటీరియల్ కావాలనుకోవడం లేదు. ఎప్పటి నుండో అతడ్ని నటుడిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ వద్దని కెమెరా పట్టుకుంటున్నాడు. ఏఆర్ మురుగుదాస్ మదరాసికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. వీరిలో విజయ్ సేతుపతి కొడుకు సూర్య మాత్రమే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక అజిత్ కొడుకు చిన్నోడు కావడంతో ఇప్పుడు ఏం డిసైడ్ చేయలేని పరిస్థితి. మరి సూర్య కొడుకు దేవా ఎటు వెళతాడో తెలియాలి. మరీ స్టార్ కిడ్స్ దర్శకులుగా ఉండిపోతారా రానున్న రోజుల్లోహీరోలుగా ఎంట్రీ ఇస్తారో లేదో.

తొలి సినిమానే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌:
సాధారణంగా తొలి సినిమా అంటే సేఫ్‌ జోన్‌లో ఉండేందుకు ట్రెండింగ్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకొని పాత పద్దతినే ఫాలో అవుతుంటారు నూతన దర్శకులు. కానీ కొద్ది మంది మాత్రమే తొలి సినిమాతోనే ప్రయోగం చేస్తారు. ఆ లిస్ట్‌లోకి యంగ్‌ డైరెక్టర్‌ గంగ సప్తశిఖర కూడా వస్తాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది డెవిల్స్‌ చైర్‌’. జబర్దస్త్ ద్వారా జనాల్లోకి వెళ్లిన అదిరే అభి హీరోగా నటిస్తున్నాడు. ఈ హారర్‌ సినిమా కోసం అప్డేటెడ్ ఏ ఐ టెక్నాలజీ ఉపయోగించాడట డైరెక్టర్‌. కాన్సెప్ట్‌తో పాటు మేకింగ్‌ కూడా డిఫరెంట్‌గా ఉండబోతుందట. గతంలో ఆయన తెరకెక్కించిన షార్ట్‌ ఫిలిమ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. లిమిటెడ్ బడ్జెట్‌లో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ తియ్యగల సత్తా ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ‘ది డెవిల్స్‌ చైర్‌’ని కూడా అదే తరహాలో డిఫరెంట్‌గా ఉండబోతుంది.