NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

బెయిల్‌పై విడుదలైన ఐదుగురు ముద్దాయిలు:
మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు నేడు బెయిల్‌పై విడుదలయ్యారు. కడప జైలు నుంచి నలుగురు, విశాఖ జైలు నుంచి ఒకరు విడుదల అయ్యారు. కడప జైలు నుంచి పండుగ నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, వడ్డే కొండ, బజన రంగనాయకులు విడుదల కాగా.. విశాఖ జైలు నుంచి రేఖమయ్య రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చి వెంటనే.. నిందితులు తమ వాహనాల్లో బయల్దేరి వెళ్లారు.

నంబర్ వన్‌గా ఏపీఎస్ఆర్టీసీని నిలబెడతాం:
భారతదేశంలో నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)ని నిలబెడతాం అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు సిద్దంగా ఉంటుందన్నారు. గ్రామాలు నుండి నగరాలకు అనుసంధానం చేసే ఘనత ఏపీఎస్ఆర్టీసీ సొంతం అని పేర్కొన్నారు. కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంచి బస్‌లను సిద్దం చేశామని, కొద్ది రోజుల్లో 500 కొత్త బస్‌లను అందుబాటులోకి తీసుకువస్తాం అని మంత్రి చెప్పుకొచ్చారు. నేడు విశాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన డోర్ డెలివరీ సర్వీస్‌ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వండి:
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విషయంలో తెలంగాణలోని ఏసీబీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లేఖ రాసింది. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఈడీ కోరింది. కేటీఆర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ ఖాతాల నుంచి నగదు బదిలీకి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలంటూ ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు దాన కిషోర్ కేసు వివరాలను కూడా పంపాలని కోరింది. ఎంత మొత్తం బదిలీ చేసినా, ఎప్పుడు నగదు బదిలీ జరిగిందో వంటి వివరాలను స్పష్టంగా అందించాలని ఈడీ స్పష్టం చేసింది.

సీఎంను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు:
ఫార్ములా ఈ రేస్ పై కేబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రేస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా? లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి మీడియా సమావేశం అవినీతి జరుగలేదు అని పొన్నం ప్రభాకర్ చెప్పారన్నారు. ప్రోజీసర్ కరెక్ట్ గా లేదు.. అంతేకాని అవినీతి లేదని అన్నారు. నేను చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పడం జరిగిందని కేటీఆర్ అన్నారు. నేనేం భయపడటం లేదన్నారు. అయిన మేము అలానే ముందుకు పోతామంటే.. మేము కూడా లీగల్ గా ముందుకు వెళతామని కేటీఆర్ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్పాలన్నారు.

ఎంపీకి భారీగా ఫైన్ విధించిన ప్రభుత్వం:
కరెంటు చోరీకి పాల్పడిన కేసులో ఎస్పీ ఎంపీ జియా ఉర్ రహ్మాన్ బార్క్‌కు విద్యుత్ శాఖ పెద్ద షాకిచ్చింది. ఎస్పీ ఎంపీకి రూ.1 కోటి 91 లక్షల జరిమానా విధించారు. గతంలో విద్యుత్ చౌర్యం కేసులో ఎంపీపై ఆ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విద్యుత్ శాఖ ఉద్యోగులను బెదిరించినందుకు ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బుర్కే తండ్రి మమ్లుక్ ఉర్ రెహ్మాన్‌పై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వివాదాల మధ్య, స్మార్ట్ మీటర్ బిగించడానికి విద్యుత్ శాఖకు చెందిన వ్యక్తులు బుర్కే ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో డిపార్ట్‌మెంట్ బృందంతో పాటు మొత్తం పోలీసులు కూడా వచ్చారు. డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల వెంట పోలీసు ఏఎస్పీ, సీఓ, పీఏసీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటూ బర్కేపై రూ.1 కోటి 91 లక్షల జరిమానా విధించారు విద్యుత్ అధికారులు.

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత:
హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా (89) కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో ఈ రోజు (డిసెంబర్ 20) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయన 1989 నుంచి 2005 వరకు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, దేశానికి 6వ ఉప ప్రధానిగా పని చేసిన చౌదరి దేవి లాల్ కుమారుడే ఈ ఓం ప్రకాష్ చౌతాలా. 1935లో ఈయన జన్మించారు. 1989లో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. రికార్డు స్థాయిలో నాలుగు పర్యాయాలు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు.

అమెరికా- భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలు అద్భుతం:
భారత్- అమెరికా దేశాల మధ్య రక్షణ సంబంధాలు అద్భుతమైన మార్గాల్లో ముందుకు వెళ్తుందని ఇండో పసఫిక్ భద్రతా వ్యవహారాల కార్యదర్శి ఎలీ రాట్నర్ తెలిపారు. అమెరికా- భారత్‌ల మధ్య మంచి రక్షణ సంబంధాలు ఉన్నాయి.. ఇది రక్షణ పారిశ్రామిక సహకారంతో పాటు కార్యాచరణ సహకారానికి సంబంధించినదని చెప్పుకొచ్చారు. ఇటీవల 31 ఎంక్యూ-9బీ ప్రీడేటర్ డ్రోన్లను తక్కువ మొత్తంలో అందించడానికి అమెరికా ముందుకొచ్చిందన్నారు. దీంతో పాటు ఈ ఏడాది ఇరు దేశాల మధ్య పలు రక్షణ పరికరాల సరఫరాకు కీలక ఒప్పందాలు జరిగాయని ఎలీ రాట్నర్ చెప్పుకొచ్చారు.

శంకర్ కీలక కామెంట్స్:
ఇండియన్ – 2 సినిమా కథను కొన్ని కారణాల వలన రెండు భాగాలుగా తీసుకువస్తున్నామని శంకర్గతంలో ప్రకటించాడు. కానీ ఇండియన్ 2డిజాస్టర్ తో ఇక సీక్వెల్ ను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేస్తారు అని విపరీతమైన చర్చ నడిచింది. పార్ట్ -2 సమయంలోనే పార్ట్ -2 కు సంబంధించి మెజారిటీ షూట్ చేసేయడంతో ఓటీటీ రిలీజ్ చేసి పార్ట్ -2 నష్టాలలో కొంత మేర రికవరీ చేసుకోవచ్చని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు అప్పట్లో గాసిప్ లు వినిపించాయి. అయితే తాజాగా దర్శకుడు శంకర్ ఈ గాసిప్స్ కు చెక్ పెడుతూ ఇండియన్ -3 తప్పకుండా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది. త్వరలోనే ఇండియన్ -3 షూటింగ్ చేస్తామని అని రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయితే రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు శంకర్.

స్ట్రీమింగ్ కు వచ్చేసిన జీబ్రా:
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా.. జీబ్రా సినిమా డిజిటల్ రైట్స్ ను మంచి ధరకే కొనుగులు చేసింది. ఈ రోజు నుండి ఆహాలో జీబ్రా స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసారు. ఇటీవల ఈ సినిమాకు స్పెషల్ కాంటెస్ట్ కూడా నిర్వహించారు జీబ్రా యూనిట్. ఈ చిత్రంలో హీరో సత్యదేవ్ ఆహా OTT ద్వారా నిర్వహించబడుతున్న ప్రత్యేక Zebra పోటీలో భాగంగా తనకు ఇష్టమైన వాచ్ మరియు గ్లాసెస్‌ని ప్రేక్షకులకు అందజేసే అవకాశాన్ని కల్పించాడు. ఆహా గోల్డ్‌కి సబ్‌స్క్రైబ్ చేసి, సినిమా చూసే అభిమానులు సత్యదేవ్ మరియు నటుడు సునీల్‌తో పాటు లీడ్ రోల్ లో నటించిన యాక్టర్స్ ధరించే ఈ ప్రత్యేకమైన గెలుచుకునే ప్రత్యేక అవకాశం ఉంటుంది. మరి నేటి నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న జీబ్రా ను ఈ వీకెండ్ లో చూసి గిఫ్ట్ లు గెలిచుకోండి.

ఓపెనర్ ను మార్చేసిన టీం మేనేజ్‌మెంట్‌:
ఆస్ట్రేలియా భారతదేశంపై బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల కోసం తమ జట్టును ప్రకటించింది. జట్టులో ఓపెనర్ సామ్ కాన్ట్సాస్‌ను ఎంపిక చేయగా, నాథన్ మెక్‌స్వీనీని జట్టు నుండి తప్పించారు. ఆల్‌రౌండర్ బో వెబ్‌స్టర్, ఫాస్ట్ బౌలర్లు సీన్ అబాట్, జై రిచర్డ్సన్‌లను కూడా మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల కోసం 15 మంది సభ్యుల జట్టులో చేర్చారు. ఈ నేపథ్యంలో సామ్స్ కాన్ట్సాస్ కు ఆడే అవకాశం లభిస్తే 2011లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ తర్వాత ఆసీస్ తరఫున టెస్టు ఆడే అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధిస్తాడు. ఇదివరకు బ్రిస్బేన్‌లో జరిగిన టెస్టులో భారత్‌తో డ్రా చేసిన జట్టులో నుంచి కేవలం మెక్‌స్వీనీనే తప్పించబడ్డాడు. ఈ సిరీస్‌లో మూడు టెస్టులలో ఆరు ఇన్నింగ్స్ ఆడి 72 పరుగుల మాత్రమే చేయగలిగిన మెక్‌స్వీనీని జట్టు నుండి తొలగించారు. ఈ జట్టు ఎంపిక ఆసీస్ క్రికెట్ జట్టుకు కొత్త శక్తిని చేకూరుస్తూ, యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను చూపించుకునే అవకాశాన్ని అందిస్తోంది.

 

Show comments