NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

కేర్ హాస్పిటల్స్ సంచలనం:
అత్యాధునిక కార్డియాక్ కేర్‌తో క్రిటికల్‌గా ఉన్న రోగికి కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను రక్షించింది. హైదరాబాద్‌లో గుండె పోటుతో బాధపడుతున్న 68 ఏళ్ల శ్రీమతి సుభాషిణి (పేరు మార్పు)కు విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసు, అధునాతన కార్డియాక్ కేర్, వినూత్నమైన సాంకేతికతలు, మరియు మల్టీడిసిప్లినరీ విధానంతో ఎలా ప్రాణాలను రక్షించగలమో నిరూపించింది. రుమటాయిడ్ ఆర్థ్రిటిస్, ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్, కాలేజెన్ వాస్కులార్ డిసీజ్ మరియు డయాబెటిస్ వంటి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. అక్యూట్ మైకార్డియల్ ఇన్ఫార్క్షన్ (గుండె పోటు) కారణంగా శ్రీమతి సుభాషిణి ఆసుపత్రిలో చేరారు. ఆమె గుండె ఆర్టరీలలో తీవ్రమైన బ్లాకేజ్లు, ఎడమ వెంట్రిక్యులర్ సిస్టోలిక్ డిస్ఫంక్షన్ (గుండె వైఫల్యం), మరియు అధిక ప్రమాదకరమైన క్లినికల్ ప్రొఫైల్ కారణంగా సాంప్రదాయ కొరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ (CABG) చేయడం ప్రమాదకరమని కేర్ హాస్పిటల్స్ డాక్టర్లు నిర్ణయించారు. క్లినికల్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ వి.సూర్య ప్రకాశ రావు నేతృత్వంలో కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, నెఫ్రాలజిస్టులు సహా ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ టీమ్, ప్రాణాలను రక్షించే వైద్యం రూపొందించారు.

విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటు:
విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2016లో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చామని, అందులోని లోపాలు సరిదిద్ది కొత్త చట్టం తెస్తామన్నారు. ఎన్సీసీకి సంబంధించి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించామన్నారు. యువగళం పాదయాత్రలో చేనేతలో కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, చేనేత కళాకారులకు ఉచిత విద్యుత్‌కు క్యాబినెట్‌ ఆమోదం సంతోషాన్నిచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు. ‘బిట్స్ ప్రాంగణాన్ని అమరావతిలో ఏర్పాటు కోసం 70 ఎకరాలను కేటాయిస్తూ నిన్న కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. డీప్ టెక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారు. విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే చేయాలని ప్లాన్ చేస్తున్నాం. 2016లో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును తీసుకొచ్చాం. అందులో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్ది సరికొత్త చట్టాలను తెస్తాం’ అని మంత్రి లోకేష్ చెప్పారు.

అంబేద్కర్ కోనసీమలో దారుణం:
ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసేసి తండ్రి అదృశ్యమైన ఘటనతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తండ్రి పిల్లి రాజు గ్రామంలో రెండు కోట్ల రూపాయలు మేరకు అప్పులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక అదృశ్యం అయ్యాడు. పిల్లలు సందీప్, కారుణ్యలను రామచంద్రపురం మండలం తొగరువారి సావరం కాలువలో తోసివేసి.. ఆపై అదృశ్యమయ్యాడు. బాలుడు ఎలాగోలా ఒడ్డుకు చేరినా.. ఏడేళ్ల కారుణ్య ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని చూసి తల్లి విజయ శోకంలో మునిగిపోయారు. ఆర్థిక సమస్యలుంటే పరిష్కార మార్గాలు ఉంటాయని.. ఇలా చిన్నారులను తండ్రే ప్రాణాలు తీయాలనుకోవడం పట్ల వెంటూరు గ్రామంలో ఆవేదన వ్యక్తమవుతోంది. చెల్లెలు, తనను స్కూలు నుండి తీసుకుని వెళ్లి చనిపోదామని తండ్రి రాజు చెప్పాడని అంటున్నాడు ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన కుమారుడు సందీప్. మొదట తనను, తర్వాత చెల్లిని కాలువలోకి తోసివేశాడని చెబుతున్నాడు. తాను కాలువలో ఊస పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డానని, చెల్లి కాలువలో మునిగిపోయి చనిపోయిందని చెప్పాడు. ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగి ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో విషయం చెప్పినట్లు సందీప్ తెలిపాడు.

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే:
తెలంగాణ శాసన మండలిలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై కీలక విషయాలు వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ కి 2016లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరించడం వల్ల రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వెనుకబడుపోయిందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత RRR ను పట్టాలెక్కించామని అన్నారు. ఇప్పటికే రీజినల్ రింగ్ ఉత్తరాభాగానికి సంబంధించి 7,100 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగిందని తెలిపారు. దక్షిణ భాగానికి సంబంధించి నితిన్ గడ్కరితో సమావేశమై రిక్వెస్ట్ చేయడం జరిగింది. నితిన్ గడ్కరి.. దక్షిణ భాగానికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పారు. ఇప్పటికే డిపిఆర్ తయారు చేసేందుకు ఏజెన్సీని ఎంపిక చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇప్పటికే ఒక లక్ష కార్ యూనిట్ గా ఉంది. రాబోయే రోజుల్లో మరింత ట్రాఫిక్ పెరిగి జాతీయ రహదారుల పైన ట్రాఫిక్ అంతా నగరంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించడమేనని అన్నారు. వచ్చే మూడు నెలల్లో దక్షిణ భాగానికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని గడ్కరికి తెలియజేసామని చెప్పారు.

యువతులకు వల.. మహిళ అరెస్ట్:
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులను ఆకర్షించి విటుల వద్దకు పంపుతూ దారుణాలకు ఒడిగట్టింది. ఫిలిం కాస్టింగ్ మేనేజర్ నంటు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతలను ఆకర్షించింది నాగమణి అనే మహిళ. ఆతర్వాత వారిని విటుల వద్దకు పంపుతు వ్యభిచార కూపంలోకి దింపుతోంది. విశ్వసనీయ సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు, సరూర్ నగర్ పోలీసులు నాగమణినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. డాకయిట్ ఆపరేషన్ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు,సరూర్ నగర పోలీసులు నాగమణిని దిల్ షుఖ్ నగర్, కమల నగర్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. యువతుల ఫోటోలను వాట్సప్ ద్వారా విటులకు పంపించి.. వాళ్లకి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తుంది. తర్వాత లొకేషన్ కన్ఫర్మేషన్ తర్వాత స్వయంగా నాగమణి విటుల వద్దకు తీసుకెళ్తోంది. అవకాశాల పేరుతో యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతోంది. ఉపాధి కోసం వచ్చి బలవుతున్న యువతులు, మహిళలు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళలకు పోలీసులు సూచిస్తున్నారు.

ప్రజల సహకారంతో కుంభమేళా విజయవంతమైంది:
దేశ ప్రజల సహకారంతో మహా కుంభమేళా విజయవంతమైందని ప్రధాని మోడీ అన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసగించారు. కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభమేళాతో దేశ ప్రజలను ఐక్యం చేసిందని చెప్పారు. అలాగే భారత శక్తిని ప్రపంచమంతా చూపించామని మోడీ స్పష్టం చేశారు. ‘‘కుంభమేళా భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచింది. ఇదొక చారిత్రక ఘట్టం. యువత కూడా ఉత్సాహంగా కుంభమేళాలో పాల్గొంది. మన శక్తి సామర్థ్యాలపై ఉన్న అనుమానాలు.. కుంభమేళాతో పటాపంచలయ్యాయి.’’ అని మోడీ అన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపర్చడం బాధాకరం:
ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరచడం బాధాకరం అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై రాజ్యసభలో సోనియా మాట్లాడారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని క్రమపద్ధతిలో బలహీనపరచడం చాలా ఆందోళనకరం అని తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 86,000 కోట్లు స్తబ్దుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం బహుళ సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. వేతన చెల్లింపుల్లో నిరంతరం జాప్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే ప్రస్తుతం చెల్లిస్తున్న నగదు కూడా సరిపోదని.. దాన్ని రూ.400 కనీస వేతనంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సకాలంలో వేతనం ఇవ్వకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని సభ దృష్టికి సోనియా తీసుకొచ్చారు. ఇక పథకాన్ని మరింత విస్తరించడానికి తగినంతగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని సోనియా కోరారు.

సుదీక్ష తల్లిదండ్రులు సంచలన నిర్ణయం:
కోనంకి సుదీక్ష చౌదరి (20) భారత సంతతి విద్యార్థిని. అమెరికా పౌరురాలు. వర్జీనియాలో నివాసం ఉంటుంది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. అయితే ఐదుగురు స్నేహితులతో కలిసి మార్చి 5న కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. మార్చి 6న రిసార్ట్ బార్‌లో స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నారు. అనంతరం ఒక యువకుడితో కలిసి చాలా క్లోజ్‌గా బీచ్‌లోకి నడుచుకుంటూ వెళ్లింది. కానీ ఎంతసేపటికి తిరిగి రాలేదు. దీంతో స్నేహితులు.. స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలతో గాలించారు. కానీ ఆచూకీ లభించలేదు. దీంతో బీచ్‌లో కొట్టుకుపోయిందని తేల్చిచెప్పారు. అయితే పోలీసుల వాదనను సుదీక్ష తల్లిదండ్రులు కొట్టిపారేశారు. తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని వాదించారు.

సిరియా, లెబనాన్‌పై కూడా ఐడీఎఫ్ దాడి:
ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి శ్రీకారం చుట్టింది. గాజాలో హమాస్ అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులకు పాల్పడింది. హమాస్ ఉగ్రవాద సంస్థలపై దాడులు చేయగా 300 మంది చనిపోయారు. పదులకొద్దీ గాయాలు పాలయ్యారు. ఇక గాజాతో పాటు దక్షిణ సిరియా, లెబనాన్‌పై కూడా వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా.. 52 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పరిస్థితులు మరింత దిగజారకుండా లెబనాన్ దిగొచ్చినట్లుగా తెలుస్తోంది. కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని తెలిపినట్లుగా సమాచారం.

షాకిచ్చిన సుశాంత్:
టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో ఆయన కూడా ఒకరు. నాగార్జున సోదరుడి కొడుకుగా.. తెరంగేట్రం చేసిన ఈ హీరో.. కాళిదాసు, కరెంట్ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. నటన పరంగా మార్కులు పడినప్పటికీ, స్టార్ హీరో క్రేజ్ అయితే రాలేదు. ఈ క్రమంలో అథిది పాత్రలు ఎంచుకుంటూ ‘అలా వైకుంఠపురం’. ‘బోలా శంకర్’, ‘రావణాసుర’ వంటి చిత్రాలలో నటించాడు. కానీ ఇలా కూడా సుశాంత్‌కి ఫేమ్ రాలేదు. ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకుని, పూర్తి కొత్త జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుశాంత్ హీరోగా, త్విరాజ్ చిట్టేటి దర్శకత్వంలో ‘SA10’ ఈమూవీ తెరకెక్కుతుంది. వరుణ్ కుమార్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ప్రేక్షకులు థ్రిల్లింగ్, హారర్, సైకో మూవీస్ బాగా చూస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని సుశాంత్ కూడా అలాంటి హారర్ థ్రిల్లర్‌ కథను ఎంచుకున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా‌కు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మెకర్స్. కాగా సుశాంత్ ఈ లుక్‌లో చాలా కొత్తగా కనిపించాడు. భయంకరమైన చీకటి వాతావరణంలో, నిలబడి ఉన్న సుశాంత్ ప్రతిబింబం, కింద నీటిలో కనిపించగా.. అతని పాత్రలో ఓ మిస్టీరియస్ ఎలిమెంట్ దాగి అర్థమవుతుంది. మొత్తానికి ఈ సారి పక్క ప్లాన్నింగ్ సుశాంత్ రాబోతున్నట్లు‌గా తెలుస్తోంది. మరిక నెక్స్ట్ అప్డేట్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

ఒకే ఒక్క సినిమాతో బిజీ స్టార్ గా:
బుల్లితెర నుండి వెండితెరపైకి ఎదిగిన మరో టాలెంట్ యాక్టర్ దీక్షిత్ శెట్టి. కన్నడలో షార్ట్ ఫిల్మ్స్, డ్యాన్స్ షోల్లో మెరిసి దియాతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇతడి టాలెంట్ గుర్తించిన టాలీవుడ్ ఆఫర్స్ ఇచ్చి మరింత ఎంకరేజ్ చేసింది. ముగ్గురు మొనగాళ్లు, రోజ్ విల్లా సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో తెలియదు కానీ కెరీర్ మొత్తాన్ని మార్చేసింది దసరా. సూరీ పాత్రలో నానికి ధీటుగా నటించి ఔరా అనిపించుకున్న దీక్షిత్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద సైమా అవార్డ్ కూడా అందుకున్నాడు. దసరా తర్వాత కన్నడలో కేటీఎం, బ్లింక్ సినిమాలు వచ్చాయి కానీ సరైన సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయినా దీక్షిత్ శెట్టి ఆఫర్లకు వచ్చిన ఢోకా లేదు. చెప్పాలంటే ఇప్పుడు మరింత దూకుడు పెంచాడు. లైనప్ పెంచుకుంటున్నాడు. యంగ్ హీరోల్లో దీక్షిత్ రేంజ్‌ ఆఫర్లు కొల్లగొట్టిన హీరో మరొకరు లేరనే చెప్పొచ్చు. ఒకటా రెండా ఏడు సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. సౌత్ ఇండస్ట్రీపై ఫుల్ పోకస్ పెట్టాడు. తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ద గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నారు. రష్మిక బాయ్ ఫ్రెండ్‌గా కనిపించబోతున్నాడు దీక్షిత్. అలాగే కింగ్, జాకీ, క్వీన్ చేస్తున్నాడు కన్నడ హీరో. కన్నడలో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు సెట్స్ పై ఉండగా జ్ స్ట్రాబెరీ, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మీ కంప్లీట్ చేశాడు. అలాగే మలయాళంలోనూ ఊప్స్ అనే మూవీ చేస్తున్నాడు దీక్షిత్. ఏడాది క్రితం ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు శాండిల్ వుడ్ హీరో. రామ్ వెంకట్ అనే దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు. రీసెంట్లీ ఈ సినిమా లాంచ్ అయ్యింది. ఇలా ఫుల్ బిజీలో ఉన్న దీక్షిత్.. నెక్ట్స్ బాలీవుడ్ ను టార్గెట్ చేసేట్లే కనిపిస్తున్నాడు.

ఆన్ లైన్ లో అమ్ముడుపోని టికెట్లు:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకాబోతోంది. మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనున్నది. ఇప్పటికే ఏర్పా్ట్లన్నీ పూర్తయ్యాయి. ఐపీఎల్ సంగ్రామానికి జట్లన్ని సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ అందించే ఎంటర్ టైన్ మెంట్ అంతాఇంతాకాదు. తమ ఫేవరెట్ క్రికెటర్స్ సిక్సులు, ఫోర్లు బాదుతుంటే గ్రౌండ్ ను హోరెత్తిస్తుంటారు. మ్యాచ్ ల కోసం స్టేడియాల్లో వాలిపోతుంటారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ లకు జనాదారణ కరువైపోయింది. ఐపీఎల్ మ్యాచ్ ల పై క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపించడం లేదు. ఆన్ లైన్ లో ఐపీఎల్ టికెట్స్ అమ్ముడుపోవడంలేదు. విశాఖపట్నంలో ఈనెల 24వ తేదీన లక్నో తో ఢిల్లీ తలపడనున్నది. సాధారణంగా హోమ్ టౌన్ లో మ్యాచ్ అంటే టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. కానీ, ఈ మ్యాచ్ కు మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ నుంచి స్పందన రావడం లేదు. నాలుగు రోజులు అవుతున్న ఆదరణ కనిపించడం లేదు. టికెట్ల అమ్మకాలకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం, నిర్వహణ లోపంతో టిక్కెట్లు అమ్ముడుపోవట్లేదని భావిస్తున్నారు.