NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టా:
జాతీయ ఉపాధి హామీ పథకంపై తాను ప్రత్యేక దృష్టి పెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని, రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, అవినీతి కి పాల్పడ్డ కొంతమందిని సస్పెండ్ చేశామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సమాధానాలు ఇచ్చారు. ‘గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది. మేం అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి పెట్టాం. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ డైరెక్టరే అవినీతికి పాల్పడ్డాడు. అందుకే మేం అధికారంలోకి రాగానే అతడిని పక్కన పెట్టాం. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్‌లో కొత్త అధికారులను నియమించాం. ఉపాధి హామీ పథకంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. అవినీతికి పాల్పడ్డ కొంతమందిని సస్పెండ్ చేసాము. దుర్వినియోగం అయిన కొంత సొమ్ము రికవరీ చేశాం. ఉపాధి హామీ పథకంపై నేను ప్రత్యేక దృష్టి పెట్టాను’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.

ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలి:
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో నీటి సమస్య, పశు వైద్య కళాశాలపై క్వశ్చన్ అవర్‌లో చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతుండడంను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గమించారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని, ఫోన్‌ను సభ్యులు సైలెంట్‌లో పెట్టుకోవాలని సూచించారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయని డిప్యూటీ స్పీకర్ హెచ్చరించారు. అసెంబ్లీలో జామర్లు పెట్టాలని సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు అనగా.. మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దని డిప్యూటీ స్పీకర్ సమాధానం ఇచ్చారు.

డైట్ చార్జెస్ 40 శాతం పెంచాం:
డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీల పెంపు అమలుపై మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో డైట్ చార్జెస్ ఏడేళ్ల తర్వాత 40% పెంచామన్నారు. 16 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వంలో కాస్మోటిక్ ఛార్జీలు 212% పెంచామని తెలిపారు. నేను కూడా ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగులో చదివాను. ఆనాడు అవకాశాలు తక్కువగా ఉన్నా ఎంతోమంది పట్టుదలతో చదువుకొని అత్యున్నత స్థానాల్లోకి వచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్ లోకి వస్తున్నారు. సరైన తిండి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో అర్థాకళితో కడుపు మాడుతుంటే చదువుకోవడం ఇబ్బందిగా ఉంటుందని సీతక్క తెలిపారు.

సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు:
మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని అన్నాడు. ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ గా ఉన్నాడని వెల్లడించాడు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు.

మెడలో మిర్చి దండలు వేసుకొని:
కౌన్సిల్ ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన తెలిపారు. మెడలో మిర్చి దండలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని రూ. 25వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైంది. ధర లేక ఈ సీజన్లో 2లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు.

చిక్కుల్లో ఓర్రీ:
బాలీవుడ్ సోషలైట్ మరియు ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి చిక్కుల్లో చిక్కుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రాలో వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ప్రాంతాన్ని పవిత్ర ప్రాంతంగా భక్తులు భావిస్తారు. అలాంటి స్థలంలో ఓర్రీ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. దీంతో ఓర్రీ సహా చట్టాన్ని ఉల్లంఘించిన ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. కొంత మంది అతిథులు మద్యం సేవించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఫిర్యాదు పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మార్చి 15న ఓర్రీ, శ్రీ దర్శన్ సింగ్, శ్రీ పార్థ్ రైనా, శ్రీ రితిక్ సింగ్, శ్రీమతి రాశి దత్తా, శ్రీమతి రక్షిత భోగల్, శ్రీ షగున్ కోహ్లీ, శ్రీమతి అనస్తాసిలా అర్జమస్కినా హోటల్ ప్రాంగణంలో మద్యం సేవించారని తెలిపారు. ఈ హోటల్‌లో ఆల్కహాల్ మరియు నాన్ వెజ్‌కు అనుమతించబడదని చెప్పారు. దివ్య మాతా వైష్ణో దేవి తీర్థయాత్ర స్థలం కాబట్టి నిషేధం ఉందని చెప్పారు. అలాంటి స్థలంలో వారంతా మద్యం సేవించడం చట్ట విరుద్ధం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారందరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు:
కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారంతో రన్యారావు పట్టుబడింది. ఇక రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఇదే యవ్వారంపై బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ స్పందిస్తూ.. రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు పార్ట్స్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రన్యారావు ఏఏ పార్టుల్లో బంగారం దాచిందో తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. అలాగే ఈ స్మగ్లింగ్‌లో మంత్రుల ప్రమేయం ఉందని.. ఆ విషయాలన్నీ తనకు తెలుసు అని చెప్పుకొచ్చారు. శాససభ సమావేశాల్లో ఒక్కొక్కరి బండారం బయటపెడతానని తెలిపారు. తండ్రి రామచంద్రరావు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి.. స్మగ్లింగ్‌కి ఎలా సహకరిస్తారని నిలదీశారు. ఇక ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల లోపాలు కూడా కనిపిస్తున్నాయని.. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రన్యారావు తన శరీరమంతా బంగారంతో కప్పేసిందని.. ఇంకా ఏ చోటులో దాచిందో కూడా తనకు తెలుసు అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి పాయింట్‌ అసెంబ్లీలో వివరిస్తానని పేర్కొన్నారు.

ఆస్పత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఫొటో విడుదల:
పోప్ ఫ్రాన్సిస్‌(88)కు చెందిన తాజా ఫొటోను వాటికన్ విడుదల చేసింది. ఆస్పత్రిలో ఉన్న ఫొటోను ఆదివారం విడుదల చేసింది. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఫిబ్రవరి 14న రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన బాహ్య ప్రపంచానికి కనబడలేదు. తాజాగా పోప్‌కు సంబంధించిన ఫొటో రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే వైద్యులు.. పలు రకాలైన టెస్టులు నిర్వహించారు. అనంతరం న్యుమోనియాకు డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వాటికన్ తెలిపింది. ఆస్పత్రిలో ఒక ప్రార్థనా మందిరాన్ని పోప్ కోసం ఏర్పాటు చేశారు. బలిపీఠం ఎదురుగా కూర్చున్న ఫొటోను వెనుక నుంచి తీశారు. పోప్ ముఖం మాత్రం ఫొటోలో కనిపించలేదు. కుడి చేయి ఒడిలో పెట్టుకున్నారు. అయితే ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లుగా ఎలాంటి పరికరాలు మాత్రం కనిపించలేదు. అంటే ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందించడం లేదని తెలుస్తోంది.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం:
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలం టేకులపల్లికి చెందిన ప్రణీతరెడ్డి (35), ఆమె కుమారుడు అరవింద్‌ (6), ఆమె అత్త సునీత (56)గా గుర్తించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

నిర్మాత నానికి లాభాలు తెచ్చిపెట్టిన కోర్ట్:
వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన మూవీ ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. హాస్య నాటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా కోర్ట్ సూపర్ హిట్ టాక్ తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది కోర్ట్. ప్రీమియర్స్ రూపంలో దాదాపు రెండు కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో మొత్తంగా రూ. 8.10 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీకెండ్ కావండంతో శని, ఆదివారం అన్ని సెంటర్స్ లో ఫుల్స్ తో భారీ కలెక్షన్స్ రాబట్టింది కోర్ట్. వీకెండ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని థియేటర్స్ ను యాడ్ చేసారు మేకర్స్. ఇక రెండు రోజులుకు గాను వరల్డ్ వైడ్ గా రూ.15.90 కోట్లు రాబట్టింది. మొదటి వీకెండ్ మూడురోజులకు గాను రూ. 24.4 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఓవర్సీస్ లోను కోర్ట్ అద్బుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. ప్రీమియర్స్ తో పాటు మూడు రోజుల మొత్తం కలెక్షన్స్ 600K డాలర్స్ కొల్లగొట్టి దూసుకెళుతోంది కోర్ట్.

మెగా – అనిల్ షూటింగ్ స్టార్ట్ ఎప్పుడంటే:
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు చిరు. నందమూరి బాలకృష్ణ తో భగవంత్ కేసరి, విక్టరి వెంకీ తో F2 వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగా స్టార్ చిరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత సాహూ గారపాటి భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అలాగే సంగీత దర్శకుడు భీమ్స్ తో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని మెగాస్టార్ సినిమా స్క్రిప్ట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భాంగా అనిల్ మాట్లాడుతూ ‘ మెగాస్టార్ తో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళుతుంది. ఇప్పటికే 90శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. మూడు నెలల్లో షూటింగ్ ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ చిరును చూస్తారని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని’ అన్నారు. మరోవైపు ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా అతిధి రావు హైదరి వంటి భామల పేర్లు పరిశీలిస్తున్నారు మేకర్స్.

గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్:
గత కొద్ది రోజుల వరకు పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు తగ్గముఖం పడుతున్నాయి. రెండు రోజుల నుంచి గోల్డ్ ధరలు దిగొస్తున్నాయి. పసిడి ధరలు తగ్గుతుండడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. పుత్తడి ధరలు నేడు పడిపోయాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు తులం బంగారంపై రూ.110 తగ్గింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,956, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,210 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ. 82,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గడంతో రూ. 89,560 వద్దకు చేరింది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 89,710 వద్ద ట్రేడ్ అవుతోంది.

యువరాజ్ సింగ్, టినో బెస్ట్ మధ్య గొడవ:
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఇండియా మాస్టర్స్- వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ జట్టు విజయం సాధించింది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ T20 ఫైనల్‌లో భారత దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ టినో బెస్ట్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇండియా మాస్టర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా యువరాజ్, బెస్ట్ మధ్య గొడవ జరిగింది. బెస్ట్ తన ఓవర్ పూర్తి చేసిన తర్వాత గ్రౌండ్ వదిలి వెళ్లాలనుకున్నాడు. ఈ విషయం యువరాజ్ అంపైర్‌కు తెలియజేశాడు. దీంతో బెస్ట్ గ్రౌండ్ లోకి తిరిగి రావాల్సి వచ్చింది. ఇదంతా టినో బెస్ట్ కి నచ్చలేదు. ఈ సంఘటన 13 ఓవర్ల తర్వాత జరిగింది. టినో బెస్ట్ తిరిగి మైదానంలోకి వచ్చిన వెంటనే యువరాజ్ వైపు వెళ్లి వాదించడంతో హీట్ పెరిగింది. ఇద్దరు ఆటగాళ్ళు ఒకరికొకరు వేళ్లు చూపించుకుంటు గొడవపడ్డారు. పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు గమనించిన అంపైర్, వెస్టిండీస్ మాస్టర్స్ కెప్టెన్ బ్రియాన్ లారా జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. అంబటి రాయుడు యువరాజ్ సింగ్‌ను విడదీస్తున్నట్లు కనిపించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇది చూసిన యూవీ ఫ్యాన్స్ యూవీ ఆన్ ఫైర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.