ఎంతటి వారున్నా శిక్షిస్తాం:
గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం అని, భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తాం అని మంత్రి అనగాని హెచ్చరించారు.
డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం:
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కమీషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అవుతున్నారని, ఉపాధ్యాయులకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా చూసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని మంత్రి లోకేశ్ చెప్ప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ప్రసంగించారు.
గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తాం:
నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరవు నివారించాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సీఎం మొదటి ప్రాధాన్యత పోలవరం అని, రెండో ప్రాధాన్యత ఉత్తారాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అని తెలిపారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి.. 2025 జులై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి.. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఏపీ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానాలు ఇచ్చారు.
సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డి సెంటర్:
వందేళ్ళ చరిత్ర కలిగిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్ లోని సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డి సెంటర్ ను ఏర్పాటు చేయబోతోందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లో అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ కొత్త R&D సెంటర్ ప్రకటించింది. ఆటోమోటివ్ సెమీకండక్టర్స్‌లో గ్లోబల్ లీడర్, టెస్లా, టాటా వంటి అగ్ర EV బ్రాండ్‌లకు కీలకమైన సరఫరాదారు అయిన అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్‌లో అత్యాధునిక R&D కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈవీ, ఆటోమోటివ్ పరిశ్రమలలో భారతదేశం యొక్క సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ కోసం ఈ ప్రధాన మైలురాయిని ప్రకటించినందుకు మంత్రి అభినందించారు. వందేళ్ళ చరిత్ర కలిగిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్ లోని సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డి సెంటర్ ను ఏర్పాటు చేయబోతోందని అన్నారు.
శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం:
ఈనెల 21 నుండి 24 వరకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం జరుగునున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ , పూజనీయ RSS సరసంఘ్ చాలక్ మోహన్ భాగవత్ , గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. అంతేకాకుండా.. 12 దేశాల ప్రతినిధులు, 100 మంది వక్తలు, 350 రకాల ప్రదర్శనలు, 1500 మంది కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. లోక్ మంథన్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సారి శిల్పకళా వేదికగా హైదరబాద్ లో జరుగుతుందని తెలిపారు. ఈనెల 21 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించ నున్నట్లు తెలిపారు.
కంటతడి పెట్టించనున్న ఉల్లి:
రాబోయే కొద్ది నెలల వరకు సామాన్యుల ప్లేట్‌లో ఉల్లిపాయ కనిపించకుండా పోయే అవకాశం ఉంది. దీని ధరలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా తగ్గుతాయని ఆశ పడవద్దు. దీనికి సంబంధించి ఓ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఉల్లి మాత్రమే కాకుండా టొమాటో, క్యాబేజీ, సీసా వంటి ఇతర కూరగాయల ధరలు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ నివేదిక ప్రకారం దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ లాసల్‌గావ్‌లో ఉల్లి ధర ఐదేళ్ల గరిష్టానికి చేరుకుంది. దీని ధర క్వింటాల్‌కు రూ.5500 పైనే చేరింది. ఇవి హోల్‌సేల్ మార్కెట్ ధరలు, కాబట్టి త్వరలో రిటైల్ మార్కెట్‌లో ఉల్లి చౌకగా మారుతుందన్న ఆశ లేదు.
ఇండియన్ సింగర్స్ ఇళ్ల దగ్గర కాల్పుల కలకలం:
భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కెనడాలోని టొరంటోలో ఇండియన్ సింగర్స్ ఉంటున్న ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపుతుంది. ఈ ఘటన రికార్డింగ్ స్టూడియో బయట జరిగింది. దుండగులు దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఈ కాల్పులపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక, కెనడియన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు దుండగులు చోరీ చేసిన వెహికిల్ లో ఘటన జరిగిన ప్రదేశానికి వచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత స్టూడియో బయట కాల్పులకు దిగారన్నారు. దీనికి ప్రతిగా స్టూడియోలో ఉన్నవారు కూడా ఎదురు కాల్పులు చేశారని చెప్పుకొచ్చారు. ఈ కేసులో కెనడా పోలీసులు 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 ఆయుధాలను రికవరీ చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నా్ం.. ఈ కాల్పుల ఘటనపై భారత ఏజెన్సీలు నిఘా పెట్టాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో పలువురు పంజాబీ సింగర్స్ ఇళ్లు ఉన్నాయి.. అలాగే, వారి మ్యూజిక్ స్టూడియోలు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
టీమిండియాకు బిగ్ షాక్:
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టు ఇంట్రాస్క్వాడ్‌తో వార్మప్ మ్యాచ్ బరిలోకి దిగింది. భారత్ ఏ టీమ్‌తో బ్యాటర్లు, బౌలర్లుగా విడిపోయి మ్యాచ్ ఆడింది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇక, పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏలో ఈరోజు (శుక్రవారం) ఉదయం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. కుడి మోచేతికి బంతి బలంగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ప్రాథమిక చికిత్స చేయగా.. నొప్పి తగ్గకపోవడంతో మైదానాన్ని వీడాడు. దీంతో పెర్త్ టెస్టులో అతడు ఆడటంపై అనుమానాలు రేగాయి. దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
పాక్కి బదులు భారత్లోనే ఆతిథ్యం:
వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ ఏ రికార్డులు, ఘనతలు నమోదు అవుతాయనే విషయం పక్కన పెడితే.. అసలు టోర్నీ నిర్వహణపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతుంది. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేదే లేదని తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. టోర్నీ ఆతిథ్య హక్కులను దక్షిణాఫ్రికాకు తరలిస్తారనే న్యూస్ ప్రచారం అవుతుంది. ఇలా చేయడం వల్ల పాక్‌కు రావాల్సిన దాదాపు రూ.548 కోట్లు రాకుండా పోయే ప్రమాదం ఉంది. టీమిండియా జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ఐసీసీ ఎలాగూ ఇంట్రెస్ట్ చూపించదు. ఈ క్రమంలో తాజాగా మరొక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. భారత్ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అటు ఐసీసీ కానీ.. బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటనా వెల్లడించలేదు. డిసెంబర్ 1 లోపే పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించాల్సి ఉంది. లేకపోతే ఐసీసీ ఛైర్మన్‌గా జైషా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టోర్నీ మార్పు ఫిక్స్ అవుతుందనే వార్తలు వినబడుతున్నాయి.
యమధర్మరాజు ఈ డాకు మహారాజ్:
వీర సింహారెడ్డి లాంటి హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా ఎన్.బి.కె 109. తెలుగులో పాలు హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ముందు నుంచి అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి కానీ ఫైనల్ గా ఈ సినిమాకి డాకు మహారాజ్ అనే పేరు ఫిక్స్ చేస్తూ ఈరోజు అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ సగర్వంగా నిర్మిస్తున్నారు.
మలయాళ దర్శకుడుతో నాని:
వరుస హిట్లు కొడుతూ దూసుకు పోతున్న నేచురల్ స్టార్ నాని అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అయినా కొత్త సినిమాలు లైన్ లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను ఇప్పుడు కొత్త సినిమాల కోసం చర్చలు జరుపుతున్నాడు. గతంలో షైన్ స్క్రీన్స్‌కి చెందిన సాహు గారపాటితో కలిసి టక్ జగదీష్ కోసం పనిచేశాడు. వీరిద్దరూ మళ్లీ జతకట్టనున్నారు. ఈసారి ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు విపిన్ దాస్ దర్శకత్వం వహించనున్నారు. జయ జయ జయ జయ హే, గురువాయూర్ అంబలనాదయిల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. విపిన్ దాస్ చేసిన ఆలోచన నానికి నచ్చి, తన ఆమోదం తెలిపాడు. అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.