ఐదేళ్ల పాలన స్వార్థ రాజకీయాలకు నిదర్శనం:
వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. స్వార్థ పరమైన వ్యక్తులు అధికారపీఠం ఎక్కితే.. ఏం నష్టం జరుగుతుందో గత ఐదేళ్లలో జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండా నాశనం చేశారని, గత ప్రభుత్వ పాలన వల్ల భూముల ధరలు పడిపోయాయని మండిపడ్డారు. మరో సైబరాబాద్ నిర్మాణం ఏపీలో సీఎం చంద్రబాబు విజన్ వల్ల ఏర్పాటు అవుతుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.
సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలి:
సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆడ పిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతామో.. మగ పిల్లలను కూడా అలాగే పెంచాలన్నారు. కావాలని ఎవ్వరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడరని, పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఎప్పుడు ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మత్తు పదార్ధాలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని హోంమంత్రి తెలిపారు. ‘ఆడ బిడ్దలను రక్షిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం’ అని పిలుపునిచ్చారు.
అభ్యర్థుల లగేజ్ కోసం రూ.50 వసూలు:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే మరికొద్ది క్షణాల్లో పరీక్ష ప్రారంభం కానుండగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలో వద్ద గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనకు దిగారు. యాజమాన్యం లగేజ్ కౌంటర్ వద్ద ఒక్కో అభ్యర్థి నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తను ఎన్ టీవీలో ప్రసారం చేసింది. దీంతో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. ఎన్టీవీ వార్త కథనాలతో కాలేజీ వద్దకు జిల్లా కలెక్టర్ చేరుకున్నారు. లగేజ్ కోసం గ్రూప్-2 అభ్యర్థుల వద్ద తీసుకున్న రూ.50 వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించారు. మళ్ళీ ఇటువంటి ఘటనలు రిపీట్ కావొద్దని హెచ్చరించారు.
కొంప ముంచిన నిమిషం నిబంధన:
గ్రూప్-2 విద్యార్థులకు ఒక్క నిమిషం నిబంధనం కొంపముంచింది. నిమిషం నిబంధనతో కొందరు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. తెలంగాణలో ఇవాళ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు మొదటి పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అయితే కొందరు అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అయితే సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో కొందరు అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు.
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస:
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు బీహార్‌కు చెందిన కూలీలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శనివారం సాయంత్రం కక్చింగ్ జిల్లాలో ఇద్దరు కార్మికులను కాల్చి చంపారు. మృతులు 18 ఏళ్ల సునీలాల్ కుమార్, 17 ఏళ్ల దశరత్ కుమార్‌గా గుర్తించారు. వారు బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలోని రాజ్‌వాహి గ్రామ నివాసులు. కాగా.. యువకులిద్దరూ కక్చింగ్‌లోని మెయిటీ ఆధిపత్య ప్రాంతంలో నివసిస్తున్నారు. కక్చింగ్-వాబగై రోడ్డులోని పంచాయతీ కార్యాలయం సమీపంలో సాయంత్రం 5:20 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు వారిని కాల్చేశారు.
ఐసీయూలో అద్వానీ:
దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇంద్రప్రస్థ అపోలోలో చేర్పించారు. ఇంద్రప్రస్థ అపోలో శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఎల్‌కె అద్వానీని వైద్య నిర్వహణ, పరీక్షల కోసం ఐసీయూలో చేర్చారు. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి సంరక్షణలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది. అయితే అద్వానీని ఐసీయూలో ఎందుకు చేర్చాల్సి వచ్చిందో ఆస్పత్రి వర్గాలు వెల్లడించలేదు. ఆయన వయసు 97 ఏళ్లు. ఈ ఏడాది ఆగస్టు నెలలో కూడా ఆయన అపోలో చేరారు. ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేశారు.
ప్రైజ్‌మనీ ప్రకటించిన నాగార్జున:
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. కొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు శుభం కార్డు పడనుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ సీజన్‌లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఫినాలేలో సందడి చేశారు. సీజన్ ప్రైజ్‌మనీ రూ.54,99,999 అని ప్రకటించిన నాగార్జున దానిని రూ.55 లక్షలుగా నిర్ణయించారు. గెలిచిన విజేతకు టైటిల్‌తోపాటు ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. లక్ష్మిరాయ్, నభానటేశ్ డ్యాన్సులతో అలరించారు. ఉపేంద్ర, ప్రగ్యాజైశ్వాల్ అతిథులుగా హాజరయ్యారు.
ఉపాసన పోస్ట్ వైరల్:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. తరచూ సోషల్ మీడియా వేదికగా తమ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తన తాతయ్య తనకు బోధించిన సనాతన ధర్మం యొక్క నిర్వచనాన్ని ప్రస్తావిస్తూ… ఎక్స్ లో ఓ పోస్ట్ పంచుకుంది. గౌరవ, మర్యాదలతో ఇతరులకు వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని తన తాత ఆమెకు చెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
సెంచరీతో చెలరేగిన హెడ్:
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లో జరుగుతోంది. రెండో రోజు తొలి సెషన్ టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా రాణించింది. తొలి సెషన్‌లో టీమిండియా 29.4 ఓవర్లు బౌలింగ్ చేసి 76 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. మూడు వికెట్లలో జస్ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు లభించగా, నితీష్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టాడు. అయితే రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి సెంచరీతో చెలరేగాడు. అతనితో పాటు స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా.. వికెట్ల కోసం భారత్ బౌలర్లు శ్రమిస్తూనే ఉన్నారు.