టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది:
వైసీపీ హయంలో జరిగిన ప్రమాదాలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయంలో ఫ్లెక్సీ వేశారు. ‘రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రమాద ఘటనలకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభాకర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని మాజీ మంత్రి ఆర్కే రోజా బెంజ్ కారు తెచ్చుకుందని విమర్శించారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడవద్దని రోజాను జేసీ హెచ్చరించారు.
రేపు ప్రారంభం కానున్న కోడి పందాలు:
సంక్రాంతి పండగ వేళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకపక్క పోలీసుల దాడులు కొనసాగుతున్నా.. మరొక పందెం నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చే జనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ షామియానాలు, టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ సౌకర్యాలతో కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట నిర్వహణకు సైతం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 150కి పైగా పందెం బరుల్లో పుంజుల కొట్లాటలు చూసేందుకు లక్షల సంఖ్యలో జనం తరలి రానున్నారు. కోడి పందాలు రేపు ఉదయం నుంచే మొదలు కానున్నాయి. ఎంతోమంది పందెం రాయుళ్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు.
కేటీఆర్‌కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు:
తాను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని ఆయన చెప్పారు. కానీ అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు. “మూసి పై కంటి తుడుపు చర్యల్లాగా బీజేపీ వాళ్లు ఒక్కరోజు మూసి నిద్ర చేశారు.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు.. వారి ఇళ్ళల్లో చేసిన జొన్న రెట్టేలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు.. నేను ఫైటర్ ను.. ఉప ఎన్నికను భయపడను.. నేను ఎప్పుడో జరిగిన అంశంపై స్టేట్మెంట్ ఇచ్చాను.. హైడ్రాపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాను.. దానిని కొంతమంది మీడియా వాళ్ళు చెడుగా ప్రచారం చేస్తున్నారు.. నేనేమీ కేటీఆర్ కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.. ఈ కార్ రెస్ పెట్టినప్పుడు కేటీఆర్ నా సలహా తీసుకున్నారు.. దానిపై నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను..” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
రేషన్ కార్డుల జారీపై మంత్రి కీలక సూచనలు:
రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల జారీ పై సమావేశంలో చర్చించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నేడు అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కడా ఆందోళన చేయాల్సిన అవసర లేదని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధి దారులకు అందరికీ రేషన్ కార్డులు అందుతాయని హామీ ఇచ్చారు. “గత పదేళ్లుగా రేషన్ కార్డులు విడుదల కాలేదు.. పెళ్ళైన మహిళలు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లిన వాళ్లకు పేర్లు మార్చునే అవకాశం కూడా ఉంటుంది.. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశం వినియోగించుకోవాలి.. ఫీల్డ్ వెరిఫికేషన్ తరువాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా గ్రామసభల్లో వెళ్లడిస్తాం.. అనర్హులకు ఎవరికైనా ఉన్నట్లు మీ దృష్టికి వస్తే ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పై అవసరమైన కసరత్తు చేస్తున్నాము..” అని మంత్రి వెల్లడించారు.
బీజేపీకి సవాలు విసిరిన అరవింద్ కేజ్రీవాల్:
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాలు విసిరారు. ముఖ్యంగా ఢిల్లీలోని మురికివాడల విషయంలో అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. మురికివాడలను కూల్చివేసిన వారికి అదే స్థలంలో ఇళ్లు ఇప్పించి, వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు. అలాగే డిసెంబర్ 27న షకూర్ బస్తీ రైల్వే కాలనీ సమీపంలోని మురికివాడల భూ వినియోగాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మార్చారని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో చాలా మురికివాడలు ఉన్నాయని, పదేళ్లలో బీజేపీ మురికివాడల స్థానంలో 4700 ఇళ్లు మాత్రమే ఇచ్చిందని అరవింద్ తెలిపారు. ఇక జరగబోయే ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అన్ని మురికివాడలను కూల్చివేస్తుందని ధ్వజమెత్తారు.
మూడు మీటర్ల దూరంలో స్పేడెక్స్ ఉపగ్రహాలు:
అంతరిక్షంలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను కనబరుస్తున్నాయి. తాజాగా స్పేడెక్స్ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ విషయాన్ని తాజాగా ఇస్రో ఎక్స్‌లో పోస్టు చేయడం ద్వారా వెల్లడించింది. ఈ ఉపగ్రహాలను 15 మీటర్ల దూరం వరకు తీసుకువచ్చి, ఆ తర్వాత ఆ దూరాన్ని కేవలం 3 మీటర్లకు తగ్గించినట్లు తెలిపింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం, రెండు ఉపగ్రహాలను సురక్షితమైన దూరానికి తీసుకువెళ్లినట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం ఇస్రో డాకింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన డేటాను విశ్లేషించనుంది.
ఆరోగ్య పరిస్థితి గురించి నోరు విప్పిన విశాల్:
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజాలు తెలియకుండా ఆయన హెల్త్ గురించి వరుస పుకార్లు పుట్టిస్తున్నారు. తాజాగా శనివారం ‘మద గజ రాజ’ ప్రీమియర్ కు హజరైన విశాల్.. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించారు. విశాల్ మాట్లాడుతూ.. ‘మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. ఆయనంటే నాకెంతో ఇష్టం. నా తండ్రిని చూసి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెళ్లిపోతున్నానని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యలు లేవు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్ కూడా కరెక్ట్ గా పట్టుకోగలుగుతున్నా. ఇటీవల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. గెట్ వెల్ సూన్, కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలే నన్ను కోలుకునేలా చేశాయి. నా తుది శ్వాస వరకు మీ అభిమానాన్ని మర్చిపోను’ అని విశాల్ తెలిపారు.
ఎమర్జెన్సీ మూవీ స్పెషల్ షో:
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఈ జనవరి 17న విడుదల కానుంది. అయితే తాజాగా నాగ్‌పూర్‌లో ‘ఎమర్జెన్సీ’ స్పెషల్ షోను ప్రదర్శించారు. వీక్షించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నటుడు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్ తో పాటుగా ఎమర్జెన్సీ టైమ్‌లో జైలు శిక్ష అనుభవించిన అప్పటి కార్మికులందరిని ఆహ్యానించారు.
నానా హైరానా కూడా వచ్చేసింది:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టిన సంగతి తెలిసిందే. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా ‘గేమ్ చేంజర్’ చిత్రం రూ.186 కోట్ల వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరచగా మొదటి రోజు ‘నా నా హైరానా’ పాట కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సాంకేతిక కారణాల వల్లే ‘నా నా హైరానా’ పాటను జోడించలేకపోయాని యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే నేటి నుంచి ఈ పాటను థియేటర్లో చూడొచ్చు అని యూనిట్ ప్రకటించింది. సినిమాలో ఈ పాటను యాడ్ చేసినట్టుగా చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది.