NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @1pm

Top Headlines @1pm

మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం:
మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీశాఖలో ఎలాంటి సంస్కరణలకైనా తాను సహకరిస్తానని.. అదనపు నిధులు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తీసుకువస్తానన్నారు. తనకు చిన్నప్పటి నుంచి అటవీశాఖ అంటే ఎంతో గౌరవం అని, అటవీశాఖలో అమరులైన 23 మందిని చరిత్ర తలుచుకునే లాగా ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పారు. నేడు గుంటూరులో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ, పోలీస్ శాఖలు.. డిప్యూటీ సీఎంకు గౌరవ వందనం సమర్పించాయి. ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు పవన్ ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించారు.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేప‌టి (నవంబర్ 11) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. నాలుగు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ నవంబర్ చివరితో ముగియనుండడంతో.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ప్ర‌తిప‌క్ష వైసీపీ హాజ‌రుకావ‌టం లేదు. కూటమి ప్ర‌భుత్వంలోని టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీలే హాజ‌రుకానున్నాయి. త‌మ‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్ర‌క‌టించారు.

చేనేతలను అన్ని విధాలా ఆదుకుంటాం:
కూటమి ప్రభుత్వంలో చేనేతలను అన్ని విధాల ఆదుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్ శాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. పీఐడబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలు, నూతన పద్మశాలీ భవన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి ఆయన ఫోటోలు దిగారు.

కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో అబద్ధాలు:
కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో అబద్ధాలు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని మాట తప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణలో మోసం చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ చేస్తాం అని చెప్పి మాట తప్పినం అని మహారాష్ట్రలో చెప్పాల్సి ఉండే అన్నారు. మహారాష్ట్రకు వెళ్లి అన్ని గ్లోబల్స్ ప్రచారం చేశారని ఆరోపించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, రైతు కూలీలకు డబ్బులు, వరిపంటకు బోనస్, అమలు చేయట్లేదు అని చెప్పాల్సి ఉండే అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీష్ రావు పేర్కొన్నారు.

యాదగిరిగుట్టకు పోటెత్తిన జనం:
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం భారీగా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండటంతో.. భక్తులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుంటున్నారు. కార్తీక మాసం, దానికి తోడు ఆదివారం సెలవుదినం కావడంతో ఇష్టదైవాలయ దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్రాలకు చేరుకుంటున్నారు. పార్కింగ్ స్థలం వాహనాలతో నిండిపోయి, మైదానం చుట్టూ ఉన్న రింగ్ రోడ్డుపై కూడా వాహనాలు నిలిచిపోయాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సత్యదేవుని వ్రతం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధనలు భక్తులతో కిటకిటలాడాయి.

మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, యువతపై ప్రత్యేక దృష్టి సారించారు. తీర్మాన లేఖను విడుదల చేసిన అమిత్ షా.. ‘ఇది మహారాష్ట్ర ఆకాంక్షల తీర్మాన లేఖ. ఇందులో రైతుల పట్ల గౌరవం, పేదల సంక్షేమం ఉన్నాయి. ఇందులోనే స్త్రీల ఆత్మగౌరవం ఉంది. ఇది మహారాష్ట్ర ఆశల మేనిఫెస్టో. ఈ తీర్మాన లేఖ రాతి రేఖ లాంటిది. అఘాడీ పథకాలన్నీ అధికారం కోసమే’ అని అన్నారు.

సూసైడ్ నోట్ రాసి ఫినాయిల్ తాగిన విద్యార్థిని:
టీచర్ల తిట్టడంతో మనస్తాపం చెందిన చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని మహారాజ్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ నగర్‌లో 14 ఏళ్ల విద్యార్థి శనివారం ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థి తల్లి తన కుమారుడు కేంద్రీయ విద్యాలయ నం.2లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడని ఆరోపించారు. అతని దుస్తులలో సూసైడ్ నోట్ కనుగొనబడింది. అందులో విద్యార్థి తన స్కూల్ క్లాస్ టీచర్, మరొక టీచర్ తనను హింసించారని ఆరోపించారు.

ఓటీటీలోనూ అదరగొడుతున్న దేవర:
నవంబరు 8న డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన దేవర సూపర్ రెస్పాన్స్ రాబడుతోంది. మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది. తాజగా ఈ వీక్ ఇండియా టాప్ టెన్ సినిమాల లిస్ట్ విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్. ఓటీటీలో రిలీజ్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ NO.1 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతు టాప్లో సాగుతోంది దేవర. దేవర జూనియర్ ఎన్టీఆర్ కనబరిచిన నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్స్లో సూపర్ హిట్ గా నిలిచి రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి తారక్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేసిన దేవర.. ఇప్పుడు ఓటీటీలోను రికార్డు వ్యూస్ తెచ్చుకోవడంతో అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.

పుష్పతో అఖండ ‘అన్ స్టాపబుల్ ఫైర్’:
అన్‌స్టాపబుల్ సీజన్ 4 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. హోస్ట్ గా బాలయ్య షోను ముందుండి నడిపిస్తున్నారు. ఈ సీజన్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్ గాను ఏపీ సీఎం చంద్రబాబు, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య అన్‌స్టాపబుల్ సెట్స్ లో సందడి చేసి వెళ్లారు. ఈ మూడు ఎపిసోడ్స్ అటు వ్యూస్ పరంగాను రికార్డు స్థాయిలో రాబట్టాయి. ఇక తాజాగా నాలుగవ ఎపిసోడ్ ప్రమోను రిలీజ్ చేసారు అహ మేకర్స్. ఈ ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. బన్నీ నటిస్తున్న ‘పుష్ప ది రూల్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్‌ అన్‌స్టాపబుల్ సెట్స్ లో సందడి చేశారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు హోస్ట్ బాలయ్యతో పంచుకున్నాడు బన్నీ.