NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

బంగ్లాదేశ్ ప్రధాని తండ్రి షేక్ ముజ్‌బిర్ రెహ్మాన్ విగ్రహం ధ్వంసం..!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, షేక్ హసీనా తండ్రి.. షేక్ ముజ్‌బిర్ రెహ్మాన్ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. షేక్ హ‌సీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వేల సంఖ్యలో యువత రోడ్ల మీదకు వచ్చిన పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢాకాలో ఉన్న ప్రధాని ప్యాలెస్‌లోకి ప్రవేశించడంతో పాటు అక్కడ ఉన్న వస్తువులను పూర్తిగా నాశనం చేశారు. అలాగే, ఢాకా వీధుల్లో జెండాల‌తో భారీగా ర్యాలీలు తీశారు. మ‌ధ్యాహ్నం షేక్ హ‌సీనా దేశం విడిచి వెళ్లపోయిన త‌ర్వాత‌.. షేక్ హ‌సీనా అధికార నివాసం గేట్లను కూల్చి వేసిన ఆందోళనకారులు.. ఢాకాలో ఉన్న ముజ్‌బిర్ రెహ్మాన్ విగ్రహం దగ్గర జ‌నం భారీ సంఖ్యలో ప్రోటెస్ట్ చేశారు. సుమారు నాలుగు లక్షల మంది ఆందోళ‌న‌కారులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మిలిట‌రీ విమానంలో ఇండియాకు పారిపోయిన షేక్ హ‌సీనా.. తొలుత ఢిల్లీకి వ‌చ్చి అక్కడి నుంచి లండన్ వెళ్లనున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొన్నారు.

కళ్ల ముందు దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు..

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తెచ్చారని తీవ్రంగా విమర్శించారు. రోజు రోజుకీ రాష్ట్రంలో ప్రేరేపిత హింస రెట్టింపు అవుతుందని ఆరోపించారు. కళ్ళముందు దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూసి కూటమి నేతలు సిగ్గుపడాలన్నారు. నంద్యాల సుబ్బారాయుడు అనే వైసీపీ నేత నన్ను చంపేస్తారు కాపాడండి అని ఎస్పీకి ఫోన్ చేసినా స్పందన లేదని వ్యాఖ్యానించారు. సుబ్బారాయుడు హత్య జరిగిన తరువాత పోలీసులు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో శ్రీనివాస్ అనే వైసీపీ కార్యకర్తను ప్రాణం పోయేలా కొట్టి పడేశారని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓ పాత డీజీపీ, పాత ఐజీ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

భారత సైన్యం అప్రమత్తం.. సరిహద్దుల్లో హైఅలర్ట్

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తం అయింది. భారత్‌- బంగ్లా సరిహద్దులో సైన్యం భారీగా మోహరించింది. దీంతో బీఎస్‌ఎఫ్ హైఅలర్ట్ ప్రకటించింది. గత నెల నుంచి బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరసనకారులు గాయాలు పాలయ్యారు. భారత్‌- బంగ్లా సరిహద్దులో 4, 096 కిలోమీటర్ల మేర అదనపు బలగాలను వెంటనే మోహరించాలని బీఎస్‌ఎఫ్ ఆదేశించింది. కమాండర్లందరూ సరిహద్దులోనే ఉండాలని సూచించినట్లు సీనియర్‌ అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో హింసాత్మక, రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉద్రికత్తలు పెరగడంతో సరిహద్దులో ఉన్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు వెళ్లాయి. తాజా పరిస్థితులను పర్యవేక్షించేందుకు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌ సింగ్‌ ఛౌదరి కోల్‌కతా చేరుకున్నట్లు సమాచారం.

రేషన్‌ బియ్యం అక్రమాలపై కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన

ఏపీ సెక్రటేరియట్‌లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖలపై ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ద్వారంపూడి ఫ్యామిలీ రేషన్ బియ్యం అక్రమాలపై కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ధరల నియంత్రణ కోసం ప్రత్యేక జేసీని నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ధాన్యం సేకరణ విషయంలో చాలా కాలంగా ఉన్న విధానం మంచిదేనని.. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో డబ్బులు ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితి ఉండకూడదని.. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలన్నారు.

2018-23 ఎంత మందికి రుణమాఫీ చేశారో చెప్పాలి

కేటీఆర్, హరీష్ రావు బావ బామ్మర్దులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు అన్నారు. కేసీఆర్ లాగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ఇంజనీర్లు కాదని, రైతు రుణమాఫీ అనేది చరిత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎవ్వరు ఎంత పెద్ద మొత్తంలో ఋణమాపి చేయలేదని, రుణమాఫీ చేసిన చరిత్ర బీఆర్ఎస్‌కు లేదన్నారు. 2018-23 ఎంత మందికి రుణమాఫీ చేశారో చెప్పాలని, హెల్ప్ లైన్ పెట్టుకొని రికార్డులు తెప్పించుకోవాలన్నారు విజయ రమణా రావు అన్నారు. గంగుల కమలాకర్ మంత్రి గా పని చేసి, ఇప్పుడు ఎంఎంఏ గా ఉండు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతుండని, నీళ్ల మీద ఆయనకు అవగాహన ఉందో తెలియకుండా ఉండన్నారు.

నా రాజీనామా అడిగే హక్కు ఆయనకు లేదు..

కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కార్ అవినీతి పాలన కొనసాగిస్తుంది.. తక్షణమే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని.. ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత యాడ్యూరప్ప చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచాయి. అయితే, ఈ వ్యాఖ్యలను కన్నడ సీఎం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా యాడ్యూరప్పపై ఉన్న కేసులను గుర్తు చేశారు. తన రాజీనామా అడిగే హక్కు ఆయనకు లేదని సిద్ధరామయ్య అన్నారు. అయితే, మాజీ సీఎం యాడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. యాడ్యూరప్పపై ఫోక్సో కేసుతో పాటు ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా..? అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండవచ్చా అని ప్రశ్నించారు. నా రాజీనామా అడిగేందుకు ఆయనకు ఏ నైతిక హక్కు ఉంది..? ఆయనపై ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలైంది.. కోర్టు బెయిల్‌ ఇచ్చింది కాబట్టి బయట తిరుగుతున్నారు.. లేదంటే ఫోక్సో కేసులో జైలులో ఉండేవారు అంటూ సీఎం మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోని 21 కేసులపై తాము విచారణకు ఆదేశించాం.. ఆదే విధంగా మిగతా కేసులలో కూడా ఎంక్వైరీకి ఆదేశిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.

బంగ్లాదేశ్కు భారత ట్రైన్స్ బంద్.. ఎల్ఐసీ ఆఫీసు క్లోజ్..!

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వేస్ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. రిజర్వేషన్ల అమలు కోసం బంగ్లాదేశ్ అంతటా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిపోవడంతో పాటు ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో పాటు పాలనా పగ్గాలను అక్కడి ఆర్మీకి అప్పగించడం లాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, గుర్తు తెలియని ప్రదేశానికి మాజీ ప్రధాని షేక్ హసీనా తరలి వెళ్లారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. బంగ్లాదేశ్ కు వెళ్లే ట్రైన్ సర్వీసులను భారతీయ రైల్వే క్యాన్సిల్ చేయడం గమనార్హం.

రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం

వికారాబాద్ జిల్లా తాండూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రులు స్పీకర్ గడ్డం ప్రసాద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా.. తాండూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్, బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణస్వీకారంలో పాల్గొ్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో అవాకులు చివాకులు తేలడం తప్ప ప్రతిపక్ష నాయకులు చేసిందేమీ లేదని, రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి వీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఇద్దరు కేంద్ర మంత్రులున్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రానికి 18 లక్షల పైచిలుక ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎం రాజశేఖర్ రెడ్డి మంజూరు చేశారన్నారు..

వాలంటీర్ల కొనసాగింపుపై మంత్రి కీలక ప్రకటన

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీకి ఎన్‌డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. వాలంటీర్లకు అపోహలొద్దని ఆయన ఖచ్చితంగా తేల్చి చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు జరుగుతోన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు. వాలంటీర్లు తమ భవిష్యత్‌ పట్ల ఎలాంటి భయాందోళనలకూ గురికావాల్సిన పని లేదని వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసే దుష్ట చర్యలను ఉపేక్షించమన్నారు.ప్రభుత్వ సేవల ముసుగు వేసి.. వాలంటీర్‌ వ్యవస్థను రాజకీయంగా వాడుకున్నది వైసీపీ పాలకులేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఏడాది కాలంగా వాలంటీర్‌ సేవలను రెన్యూవల్‌ చేయకుండా గత పాలకులు దగా చేశారన్నారు. వాలంటీర్ల భవిష్యత్‌నూ దెబ్బకొట్టేందుకు నిరాధార, ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లో 14 గేట్లు ఎత్తివేత

ఏడాది పొడవునా క్రాప్ హాలిడేను ముగించడంతోపాటు, 26 క్రెస్ట్ గేట్లలో 14 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (6.3 లక్షల ఎకరాలు), ఆంధ్రప్రదేశ్ (11.74 లక్షల ఎకరాలు)లో విస్తరించి ఉన్న 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు తీవ్ర కొరత ఏర్పడింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్‌ఎస్‌పి) ఎత్తివేతతో సోమవారం డ్యామ్ నుండి వరద ప్రవాహాన్ని విడుదల చేశారు.

ప్రాజెక్ట్ దాని రెండు ప్రధాన కాలువలతో సహా అన్ని అవుట్‌లెట్ల నుండి కలిపి 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఔట్ ఫ్లోను విడుదల చేస్తోంది. అప్‌స్ట్రీమ్ ప్రాజెక్టుల నుంచి వచ్చే ఇన్‌ఫ్లోలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే వాల్యూమ్ మరింత పెంచబడుతుంది. నల్గొండ, పల్నాడు జిల్లాల్లోని నదీ తీర గ్రామాలను ఒకరోజు ముందుగానే అప్రమత్తం చేశారు. మత్స్యకారులు నదిలోకి వెళ్లవద్దని సూచించారు.

ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయాలనే నిర్ణయం 4.22 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రాజెక్ట్ నిల్వకు రోజుకు 33 నుండి 35 టిఎంసిలు జోడించడం ద్వారా ప్రేరేపించబడింది, ఎక్కువగా శ్రీశైలం జలాశయం నుండి భారీ అవుట్‌ఫ్లోల కారణంగా , ఇది నాలుగు అప్‌స్ట్రీమ్ ప్రాజెక్టులలో ఒకటి. ఇప్పటికే కృష్ణానదికి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది.