Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

బీజేపీ వద్ద ఆధారాల్లేవ్.. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకానున్న టీఎంసీ ఎంపీ

‘క్యాష్ ఫర్ క్వెరీ’ కేసుకు సంబంధించి నవంబర్ 2న లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా మంగళవారం (అక్టోబర్ 31) తెలిపారు. కాగా, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలను మహువా పూర్తిగా తోసిపుచ్చారు. బూటకపు ఆరోపణలను రుజువు చేసేందుకు బీజేపీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అంతకుముందు, మహువా మొయిత్రా లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యేందుకు మరింత సమయం కోరారు. క్యాష్ ఫర్ క్వెరీ కేసులో అభియోగాలపై అక్టోబర్ 31న హాజరు కావాలని మహువాను పిలిచారు.

బహుమతులు, డబ్బు కోసం ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. మహువా డబ్బు తీసుకుని ఓ వ్యాపారవేత్తపై ప్రశ్నలు సంధిస్తున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. దీని కారణంగా మహువా పార్లమెంటు సభ్యత్వానికి కూడా ముప్పు పొంచి ఉంది.

జైలు నుంచి బయటకు వస్తూనే దేవాన్ష్‌ను ముద్దాడిన చంద్రబాబు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో 53 రోజుల జైలులో శిక్ష అనుభవించారు. ఇక, చంద్రబాబకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ని జైలు అధికారులు రిలీజ్ చేశారు. దీంతో చంద్రబాబు రిలీజ్ కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌లు చంద్రబాబుకు ఎదురెల్లి స్వాగతం పలికారు. ఇకపోతే, చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రధాన గేటు వరకు కాలి నడకన వచ్చారు. ఇక, 53 రోజుల తర్వాత తన మనవడు నారా దేవాన్ష్‌ను చూసిన చంద్రబాబు ఒక్కసారిగా ముద్దాడారు. ఆ తర్వాత భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణీ, బావమరిది నందమూరి బాలకృష్ణలతో మాట్లాడారు. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ఆయన కౌగిలించుకున్నారు. ఇక, చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు హారతిలిచ్చారు.

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. వీసా లేకుండానే థాయ్‌లాండ్‌కు ప్రయాణించవచ్చు..

ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆగ్నేయాసియా దేశం టూరిజంను పెంచాలని చూస్తున్నందున భారతీయులు నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు వెళ్లవచ్చు. థాయ్‌లాండ్‌కు ప్రధాన పర్యాటక వనరులలో భారతదేశం ఒకటి.

నవంబర్ 10, 2023 నుంచి మే 10, 2024 వరకు భారతీయులు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు ప్రయాణించవచ్చు. ఒక ప్రవేశంపై ఒక వ్యక్తి 30 రోజుల వరకు ఉండగలరు. థాయ్‌లాండ్ భారతదేశంతో సహా పర్యాటకాన్ని పెంచాలని చూస్తోంది. ఈ సెప్టెంబర్‌లో ఇలా వీసా రహిత కార్యక్రమాన్ని చైనీయుల కోసం అమలు చేసింది. ద్వీప దేశం శ్రీలంక కూడా పర్యాటకులను ఆకర్షించేందుకు ఏడు దేశాలను ఎంచుకుని పైలట్‌ ప్రాజెక్టుగా వీసా రహిత విధానాన్ని ప్రకటించింది. ఈ పైలట్‌ ప్రాజెక్టు మార్చి 31, 2024 వరకు అమలు చేసింది. ఏడు దేశాల ప్రజలు వీసా లేకుండా శ్రీలంకలో పర్యటించవచ్చు. ఆ ఏడు దేశాల్లో ఇండియా, చైనా, రష్యా కూడా ఉన్నాయి.

చంద్రబాబు అరెస్టైన ఈ 53 రోజులు క్షణం ఒక యుగంలా గడిచింది..

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇక, తాజాగా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు విడుదల అయ్యారు. దీంతో చంద్రబాబు విడుదల కావడంతో నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు అరెస్టుతో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన.. తట్టుకోలేనంత బాధతో క్షణం ఒక యుగంలా గడిచింది అని ఆమె తెలిపారు. ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు మాకు ఎంతో ఊరటనిచ్చింది.. సత్యం తన బలమెంతో చూపించింది.. ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో, రోడ్డెక్కి చేసిన నిరసనలు చేశారు అని నారా భువనేశ్వరి తెలిపారు.

లాక్ డౌన్లో అలా పుట్టిందే ‘కీడా కోలా’ : తరుణ్ భాస్కర్

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమాగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై అంచనాలని పెంచింది. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

షమీ వేసిన బాల్స్ బుల్లెట్ కంటే తక్కువేమీ కాదు.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

ప్రపంచకప్ 2023లో మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని బౌలింగ్ పై మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 కీలక వికెట్లు తీసి.. జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత.. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ షమీపై పొగడ్తల వర్షం కురిపించాడు.

ఐసీసీ షేర్ చేసిన వీడియోలో న్యూజిలాండ్ మాజీ వెటరన్ బౌలర్ షమీ గురించి మాట్లాడటం కనిపించింది. మహ్మద్ షమీ అంటే ఇష్టమని.. షమీకి అద్భుత ప్రదర్శన చేయడం ఇది తొలిసారి కాదన్నాడు. అతను జట్టు నుండి బయటకు వెళ్లి తిరిగి వచ్చి మళ్లీ అదే ప్రదర్శన ఇస్తాడని తెలిపాడు. అతని బౌలింగ్ శైలి అంటే ఇష్టమని చెప్పాడు. అతను బౌలింగ్ చేసే సీమ్ పొజిషన్ క్రికెట్‌లో అత్యుత్తమమైనదిగా పేర్కొన్నాడు. అతని బౌలింగ్ బుల్లెట్ అని సైమన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అతనికి జట్టులో తిరుగులేదని.. టీమ్లో మంచి పొజిషన్ను ఉంచుకున్నాడని తెలిపాడు.

దేశంలోనే పెద్ద నగరాలను తలదన్ని హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో ఉంది

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొని హామీలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు బంధు డబ్బులు దుబారా అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, 3 గంటల విద్యుత్ చాలు అని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారన్నారు. అది కాంగ్రెస్ పార్టీ దృక్పదం, వైఖరి అని ఆయన విమర్శించారు. దళిత భందు నిరంతర ప్రక్రియ అని కేసీఆర్‌ వెల్లడించారు. 30వేల కోట్ల రూపాయలతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని, దేశంలోనే పెద్ద నగరాలను తలదన్ని హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రంలో శాంతి భద్రల అదుపులో ఉన్నాయని, శాంతి భద్రతల విషయంలో రాజీపడమన్నారు. కాంగ్రెస్ పార్టీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని, దుబ్బాకలో BRS అభ్యర్ధి పై కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడిందన్నారు.

వరుణ్ పెళ్ళి.. నేనే కాదు వాళ్లను కూడా పంపడం లేదు

మెగా ఫ్యామిలీ ఇంట ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగితేనే కుటుంబం మొత్తం తరలివస్తుంది. అల్లు- మెగా కుటుంబాలు రెండు ఒక్కటిగా కనిపిస్తాయి. ఆ వేడుకలో కచ్చితంగా పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ పిల్లలు అకీరా, ఆధ్య కూడా పాల్గొంటారు. రేణు.. మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా పిల్లలను మాత్రం మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంచుతుంది. పవన్ తో ఎంత బాండింగ్ అయితే ఉందో.. మెగా ఫ్యామిలీకి కూడా పిల్లలకు అంతే బాండింగ్ ఏర్పరుస్తుంది. ఇక నిహారిక పెళ్ళిలో కూడా అకీరా, ఆధ్య కూడా సందడి చేశారు. ఈ పెళ్లిలోనే పవన్ నలుగురు పిల్లలను చూడగలిగారు అభిమానులు. ఇక వరుణ్ పెళ్లిలో కూడా అలాంటి ఫ్యామిలీ పిక్ వస్తుంది అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ, ఆ ఆశలను అడియాశలు చేసింది రేణు.

సచిన్ పైలట్, సారా అబ్దుల్లా విడాకులు తీసుకున్నారు.. ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడి

కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లా దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. రాబోయే రాజస్థాన్ ఎన్నికల కోసం సచిన్‌ పైలట్ ఎన్నికల అఫిడవిట్‌లో జీవిత భాగస్వామి వివరాలను కోరుతున్న కాలమ్‌లో కాంగ్రెస్ నాయకుడు “విడాకులు తీసుకున్నాను” అని పేర్కొన్నందున ఇది వెలుగులోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కుమార్తె అయిన సారా అబ్దుల్లా నుంచి 46 ఏళ్ల సచిన్ పైలట్ విడిపోయిన విషయాన్ని వెల్లడించడం ఇదే మొదటిసారి.

సచిన్ పైలట్, సారా అబ్దుల్లా 2004లో వివాహం చేసుకున్నారు. వారికి ఆరన్, వెహాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తన అఫిడవిట్‌లో తన కుమారులిద్దరూ తనపై ఆధారపడిన వారని పైలట్ పేర్కొన్నాడు. గత ఐదేళ్లలో సచిన్‌ పైలట్ సంపద దాదాపు రెండింతలు పెరిగిందని అఫిడవిట్‌లో తేలింది. 2018లో అతని మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 3.8 కోట్లు. 2023 నాటికి అది రూ.7.5 కోట్ల అంచనా విలువకు చేరుకుంది. రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.

విజనరీ లీడర్ కి.. విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారు..!

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేటి సాయంత్రం విడుదల అయ్యారు. అయితే, స్కిల్‌ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు నిజం గెలిచింది, వస్తున్నా మీ కోసం అంటూ సంబరాలు చేసుకున్నారు. దీనికి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబుకి వచ్చిన బెయిల్‌ మానవతా దృక్పథంతో ఇచ్చింది మాత్రమేనని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చారని, దీనిపై టీడీపీ ఎందుకంత హంగామా చేస్తుందని ఆయన మండిపడ్డారు. బాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మాత్రమే బెయిల్ వచ్చిందన్నారు. వస్తున్నా.. మీ కోసం కాదు..! వస్తున్నా కంటి ఆపరేషన్ కోసం అని మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు. కళ్లు కనిపించకే మధ్యంతర బెయిల్‌ ఇచ్చారు.. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనంటూ ఆయన విమర్శించారు. విజనరీ లీడర్ కి.. విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారు!.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.

మూడోసారి సీఎం అయితే ఇంకో లక్ష కోట్లు సంపాదిస్తారు కేసీఆర్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాలమూరు ప్రజాభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఈ సభకు ప్రియాంక గాంధీ రావాల్సిందని.. కానీ, ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో రాలేకపోయారని చెప్పారు. మూడోసారి సీఎం అయితే ఇంకో లక్ష కోట్లు సంపాదిస్తారు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. నీ ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు పదవులు ఇచ్చావు.. మూడో సారి వస్తే వాళ్ళ ఇంట్లో మనవడు..కూడా పదవులు ఇచ్చు కోవడానికా..? అని ఆయన ప్రశ్నించారు.

అంతేకాకుండా.. ‘తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కి ఈ సారి అధికారం ఇవ్వండి. నల్లమల బిడ్డగా అడుగుతున్న…14 సీట్లు గెలిపించండి. పాలమూరు ను పసిడి పంటల జిల్లాగా మార్చాలి అంటే మనవాడే కీలక పదవిలో ఉండాలి. ఇవాళ నన్ను కాంగ్రెస్ అద్యక్షుడు గా.. అవకాశం ఇచ్చారు సోనియాగాంధీ. ఈ సారి.. 14 సీట్లు గెలిపించండి. మా ఆరు గ్యారెంటీ లే..మా అభ్యర్థులు. కేసీఆర్ కి బుద్ది ఉందా. కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదు అని అనడానికి బుద్ది ఉండాలి. రైతులకు 15 వేలు.. భూమి లేని వాళ్లకు 12 వేలు ఇస్తాను అని సోనియాగాంధీ చెప్పింది వినలేదా..? ఇందిరమ్మ ఇళ్ల ఇస్తాం.. దుబ్బాక లో వాళ్ళ అభ్యర్థి ని ఎవడో కత్తి తో పొడిచాడు. కేసీఆర్.. కాంగ్రెస్ మీద నెపం మోపుతున్నాడు. మేము కత్తులతో పొడిచే వాళ్ళమే అయితే..నువ్వు..ని కొడుకు..అల్లుడు తిరిగే వాళ్ళా..? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం మా పార్టీ. చిల్లర మల్లారా మాటలు మాట్లాడితే..చూస్తూ ఊరుకునేది లేదు’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరగబోతుంది

కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల తెలంగాణ… దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ ఉండే.. దాన్ని వద్దనుకుని కొల్లాపూర్ కి వచ్చానని, కేసీఆర్ కుటుంబం ఒక వైపు.. తెలంగాణ సమాజం.. యువత.. మహిళ లు మరోవైపు ఉన్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో సమాజం చూస్తూనే ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దగా చేసిందన్నారు రాహుల్‌ గాంధీ. కాళేశ్వరం కట్టించి ఏడాది కూడా కాలేదని, అప్పుడే కూలిపోయే పరిస్థితి వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవచ్చునన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులు కట్టింది.. నాగార్జున సాగర్, సింగూర్, జూరాల కట్టింది కాంగ్రెస్సే.. మేము కట్టిన అన్ని ప్రాజెక్టులు చూడండి.. మరో వైపు కాళేశ్వరం చూడండి.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్యనే పోటీ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటై పని చేస్తున్నాయని రాహుల్‌ గాంధీ వెల్లడించారు.

హైకోర్టుకు చంద్రబాబుపై సీఐడీ ఫిర్యాదు చేసే ఛాన్స్..?

ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టై అయ్యారు. గత 53 రోజులుగా రాజమండ్రి సెట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబుకి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ను హైకోర్టు మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు అనగా నవంబర్ 24వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

అయితే, బెయిల్‌ మంజూరు చేసిన తర్వాత ఏపీ హైకోర్టు పలు కండిషన్లు జారీ చేసింది. కేవలం కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి బెయిల్‌ మంజూరు చేశామనింది. చంద్రబాబు కేసుని ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మీడియా, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని కోర్టు పేర్కొనింది. హస్పటల్, ఇంటికి మాత్రమే చంద్రబాబు పరిమితం కావాలని కోర్టు ఆదేశించింది. ఇక, ఈ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ క్యాన్సిల్ అవుతుందని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలోనే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు.

రెచ్చిపోయిన అశ్విని, యావర్..రచ్చ చేసిన అమర్ దీప్..

బిగ్ బాస్ 7 సీజన్ తొమ్మిదో వారం నామినేషన్స్ నిన్న మొదలయ్యాయి.. హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. గత వారం ప్రశాంతంగా ముగిసిన నామీనేషన్ ప్రక్రియ.. ఈ వారం డోస్ పెరిగింది.. నిన్నటి ఎపిసోడ్ లో నామినేట్ చేయబడ్డ హౌస్ మేట్ ముఖాన డ్రాగన్ స్నేక్ రంగు చిమ్ముతుంది..

ఇక పల్లవి ప్రశాంత్… అమర్ దీప్, తేజాలను నామినేట్ చేశాడు. అనంతరం వచ్చిన ప్రియాంక.. రతిక, భోలేలను చేసింది. ఇక అర్జున్… అమర్, శోభా శెట్టిలను చేశాడు. శివాజీ… అమర్ దీప్, తేజాలను చేశాడు. రతిక సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభాలను చేసింది. తేజ… అర్జున్, రతికలను నామినేట్ చేశారు. భోలే… ప్రియాంక, అమర్ లను నామినేట్ చేశాడు… ఆ తర్వాత ఈరోజు నామినేషన్స్ లో యావర్ రతిక, అశ్వినిలను నామినేట్ చేశాడు. అశ్విని-యావర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భోలే తనని నామినేట్ చేసిన క్రమంలో యావర్ తిరిగి భోలేను నామినేట్ చేశాడు. కాగా యావర్ అశ్వినిని నామినేట్ చేయగా ఆమె కూడా తిరిగి నామినేట్ చేసింది.

రేపు వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ

భారత మాజీ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్‌‌కి మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ముందు సచిన్ టెండూల్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. నవంబర్ 2వ తారీఖున ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌ ఆరంభానికి ముందు సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అహ్మద్‌నగర్‌కి చెందిన ప్రమోద్ కంబల్ అనే శిల్ఫి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అయితే, ఏప్రిల్ 24వ తేదీన సచిన్ టెండూల్కర్ 50వ పుట్టిన రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. అయితే, పనులు పూర్తి కావడానికి ఆలస్యం కావడంతో రేపు ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది.

 

Exit mobile version