NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

హమాస్‌ అధినేత జాడ తెలిసినా చంపకుండ వదిలేసిన ఇజ్రాయెల్..

హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ ఉన్న ప్రదేశం తెలిసిన కూడా ఇజ్రాయెల్‌ అతడిని మట్టుబెట్టకుండా వదిలేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌12 న్యూస్‌ ఓ కథనంలో తెలిపింది. ఇటీవల ఐడీఎఫ్‌ బలగాలకు సిన్వార్‌ కదలికలపై బలమైన ఇంటెలిజెన్స్‌ సమాచారం వచ్చింది. అక్కడే పలువురు బందీలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆ ఛాన్స్ ను వినియోగించుకొని అతడిని చంపేస్తే.. అది బందీల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సిన్వార్‌ తన చుట్టూ బందీలను కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఎన్‌12 కథనంలో ప్రచురించింది.

జపాన్‌లో భట్టి విక్రమార్క మూడు రోజుల పర్యటన ప్రారంభం

వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మూడు రోజుల పర్యటనకు జపాన్ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం హానిడా విమానాశ్రయంలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూదన్, అమన్ ఆకాష్ ఆయనకు స్వాగతం పలికారు. ఆయనతోపాటు రాష్ట్ర బృందం లో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణ రావు, ఇంధన శాఖ కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండి ఎన్ .బలరామ్ ఈ పర్యటన లో పాల్గొంటున్నారు. పర్యావరణహిత పరిశ్రమలు, అత్యాధునిక మైనింగ్ సంబంధిత టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాల పరిశీలనకై ఈ బృందం జపాన్ లోని పలు ప్రముఖ పరిశ్రమలను సందర్శించడంతోపాటు వివిధ దిగ్గజ కంపెనీలతో సమావేశాలు నిర్వహించనున్నది. అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు పరిశ్రమలకు తోడ్పాటు, వివిధ పరిశ్రమల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ దేశ ప్రముఖ కంపెనీల, పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు.

ముగిసిన నాలుగో రోజు ఆట.. బంగ్లా వెనుకంజ

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. క్రీజులో షాద్ మాన్ ఇస్లాం (7), మోమినుల్ హక్ ఉన్నారు. కాగా.. రెండు వికెట్లను స్పిన్ మాయజాలం అశ్విన్ పడగొట్టాడు. బంగ్లాదేశ్ ప్రస్తుతం 26 పరుగుల వెనుకంజలో ఉంది. కాగా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉంది. రెండు, మూడో రోజు ఆట వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రా అవుతుందని అనుకున్నారు.. కానీ ఇప్పుడు మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఐదవ రోజు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను వీలైనంత త్వరగా ముగించేందుకు భారత్ ప్రయత్నించాలి.

దేశవాళీ ఆవులను రాజ్యమాత- గోమాతగా ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్..

మహారాష్ట్రలో ఎన్నికలకు ముందే అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ ఆవులను ‘రాజ్యమాత- గోమాత’గా ప్రకటిస్తు ఆదేశాలు జారీ చేసింది. వేద కాలం నుంచి ఆవుల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంది సర్కార్. మానవ పోషణలో దేశవాళీ ఆవుల పాత్ర కీలకంగా ఉంది. వాటి పాల ప్రాముఖ్యత, ఆయుర్వేద, పంచగవ్య చికిత్సలు, సేంద్రియ వ్యవసాయంలో ఆవు ఎరువుల వినియోగం ఉంది. ఎన్నో రకాలుగా దేశవాళీ ఆవులు ఉపయోగ పడుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధి, పశు సంవర్ధకాల్లో దేశీయ ఆవుల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. భారత సమాజంలో ఆవుల ఆధ్యాత్మిక, శాస్త్రీయ, చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని చెప్పుకొచ్చారు.

మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్కార్‌ ఒక్క ఇల్లు కూడా తొలగించలేదు

మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్కార్‌ ఒక్క ఇల్లు కూడా తొలగించలేదని టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో సీఎంకి వ్యతిరేకంగా పెయిడ్ ప్రచారం చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని, బీఆర్‌ఎస్‌ వందల కోట్లు సోషల్ మీడియా పై పెట్టుబడి పెట్టిందని ఆయన ఆరోపించారు. జన్వాడ ఫాం హౌస్ చుట్టూ జరిగిన అభివృద్దే.. హైదరాబాదు అభివృద్ధా? 2015_16 లో మల్లన్న సాగర్ లో 12 గ్రామాల ప్రజలను ముంచేయలేదా? పోలీసులను పెట్టీ అరెస్టులు చేయించలేదా..? అని ఆయన ప్రశ్నించారు. చేతికి వచ్చిన పంట కూడా కోసుకోకుండ చేశాడు హరీష్ అని, కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. నేరెళ్లలో దళితుల పై కేసులు పెట్టించి వేధించింది మర్చిపోయావా? నియంతలా పాలించి..ఇప్పుడు నీతులు చెప్తున్నారని ఆయన అన్నారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు అయింది. ముడా కుంభకోణంపై కేసు నమోదు చేసినట్లు ఈరోజు (సోమవారం) ఈడీ అధికారులు తెలిపారు. ఇటీవల రాష్ట్ర లోకాయుక్త ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. మనీలాండరింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసినట్లు వెల్లడించింది. కాగా, ఇప్పటికే ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటు మరో ఇద్దరిపై మైసూరు లోకాయుక్త పోలీసులు శుక్రవారమే కేసును నమోదు చేశారు. కాగా, ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యను ఏ1గా, ఆయన భార్య పార్వతిని ఏ2గా లోకాయుక్త పోలీసులు చేర్చారు. అంతేకాదు.. ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపేందుకు ఇప్పటికే కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ సైతం అనుమతిని ఇవ్వడంతో రాష్ట్రంలో తీవ్ర దుమారం కొనసాగుతుంది.

ఏపీలో మద్యం ప్రియులకు శుభవార్త.. దసరా పండుగకు ముందే

ఏపీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా దోపిడీ చేసింది.. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రెండు రోజుల్లో షాపుల ఏర్పాటుపై గైడ్ లైన్స్ ఇస్తాం.. ఏ జిల్లాలో ఎన్ని షాపులు అనే వివరాలు వస్తాయని చెప్పారు. 7 రోజుల పాటు దరఖాస్తులు చేసుకోవచ్చు.. మధ్యలో 2 రోజులు సెలవులు వస్తున్నాయి.. పదో రోజున డ్రా తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 2 లక్షలు ఒక దరఖాస్తు ఫీజు.. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు ఎన్నైనా వేయవచ్చన్నారు.

కూల్చివేతలు కాదు..చెరువుల పునరుద్దరణ హైడ్రా లక్ష్యం

పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదని హైడ్రా అధికారులు వెల్లడించారు. ప్రజలు గమనించాలి.. అసత్య ప్రచారాలు నమ్మొద్దని, హైడ్రా ప‌రిధి ఔట‌ర్ రింగు రోడ్డు వ‌ర‌కే అని తెలిపారు. న‌గ‌రంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖ‌రుకు ఇత‌ర రాష్ట్రాల్లో కూల్చివేత‌లు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్య‌మాలు ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయని, హైడ్రా పేద‌ల నివాసాల జోలికి వెళ్ల‌దు. అలాగే నివాసం ఉంటే ఆ ఇళ్ల‌ను కూల్చదన్నారు. కూల్చివేత‌ల‌న్నీ హైడ్రావి కావు. ప్ర‌జ‌లు, సామాజిక మాధ్య‌మాలు గుర్తించాలని, ప్రకృతి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ‌, చెరువులు, కుంట‌లు, నాలాలను కాపాడ‌డం, వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ర‌హ‌దారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చ‌ర్య‌లు… వ‌ర‌ద నీరు సాఫీగా సాగేందుకు ఏర్పాటు… ఇలా న‌గ‌ర ప్ర‌జ‌లకు మెరుగైన జీవ‌న ప్ర‌మాణాలు పెంపొందించ‌డమే హైడ్రా ల‌క్ష్యమన్నారు.

ఎన్టీవీ వార్త కు స్పందన.. సీఎంఆర్‌ ధాన్యం పక్కదారిపై మంత్రి “తుమ్మల”కన్నెర్ర

ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కన్నెర్ర చేశారు. అధికారుల అలసత్వం మిల్లర్లు ఇష్టారాజ్యంతో కోట్లాది రూపాయల ధాన్యం అక్రమార్కుల చేతిలో కి వెళ్లడం పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కు మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అక్రమంగా ధాన్యం తరలింపు పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. ధాన్యం పక్కదారి పట్టడానికి కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక అధికారులతో లోతైన విచారణ చేపట్టి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. జిల్లాలో కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారని దీనిలో బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు.

తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారంలో మరో ట్విస్ట్..

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ యాంటీ కొలికపూడిగా వ్యవహారం మారింది. చిట్టేల సర్పంచ్ ను ఎమ్మెల్యే కొలికపూడి దూషించారని మొదలైన వ్యవహారం సర్పంచ్ భార్య ఆత్మహత్య ప్రయత్నం చేయటంతో పెద్దదైంది. ఆ తర్వాత ఎమ్మెల్యే మీద నిరసనగా తిరువూరు టీడీపీ నేతలు ధర్నాలు చేసి రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో సేవ్ తిరువూరు అని సెప్టెంబర్ 30న ర్యాలీ చేద్దామని ఎమ్మెల్యే నిర్ణయించగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడటంతో ర్యాలీ వాయిదా వేస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు.