NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

టీ20 ఫార్మాట్‌కు రవీంద్ర జడేజా వీడ్కోలు

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌శర్మ బాటలోనే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 ఇంటర్నేషనల్‌కు వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఒక్కరోజు తర్వాత జడేజా ఈ ఫార్మాట్‌కు బై బై చెప్పాడు. రవీంద్ర జడేజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో 4 లైన్ల సందేశాన్ని రాసి తన భావాలను వ్యక్తం చేశాడు. జడేజా ఇలా రాశాడు.. “నేను కృతజ్ఞతతో నిండిన హృదయంతో T20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు వీడ్కోలు చెబుతున్నాను. దృఢమైన గుర్రం గర్వంగా దూసుకుపోతున్నట్లుగా, నేను ఎల్లప్పుడూ నా దేశం కోసం నా అత్యుత్తమమైనదాన్ని అందించాను. ఇతర ఫార్మాట్‌లలో కూడా అలానే కొనసాగిస్తాను. టీ20 ప్రపంచకప్‌ను గెలవడంతో ఒక కల నిజమైంది, ఇది నా టీ20 అంతర్జాతీయ కెరీర్‌కు పరాకాష్ట. జ్ఞాపకాలు, ఉత్సాహం, తిరుగులేని మద్దతు కోసం ధన్యవాదాలు.”అని రవీంద్ర జడేజా పేర్కొన్నారు.

JBS మీదుగా విజయవాడకు ఆర్టీసీ బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ప్రయాణికులకు విశ్రాంతినిస్తూ విజయవాడకు జూబ్లీ బస్ స్టేషన్ మీదుగా బస్సులు నడపాలని నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా ప్రయాణికులు చేస్తున్న అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. BHEL , మియాపూర్ నుండి బయలుదేరే 24 సర్వీసులు ప్రస్తుత మార్గంలో ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌కు బదులుగా జూబ్లీ బస్ స్టేషన్ ద్వారా నడపబడతాయి.

ఈ సర్వీసులు కెపిహెచ్‌బి కాలనీ, బాలానగర్, బోవెన్‌పల్లి, జెబిఎస్, సంగీత్ జంక్షన్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్), హబ్సిగూడ (పుష్పక్ పాయింట్), ఉప్పల్ (పుష్పక్ పాయింట్), ఎల్‌బి నగర్ మీదుగా విజయవాడకు నడుస్తాయి. ఎంజీబీఎస్‌ నుంచి నడిచే సర్వీసుల మాదిరిగానే టికెట్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ఈ సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

డిప్యూటీ స్పీకర్ బరిలో అయోధ్య ఎంపీ.. తృణమూల్ ప్లాన్..

సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్‌ని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆదవారం కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది. అవధేష్ ఇటీవల అయోధ్య రామ మందిరం నిర్మితమైన ఫైజాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రామమందిరం నిర్మించిన కొన్ని నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ఓడిపోయింది. దీంతో ఒక్కసారి అవధేష్ పేరు చర్చనీయాంశంగా మారింది.

విహారయాత్రలో విషాదం.. మహిళతో సహా నలుగురు పిల్లలు జలపాతంలో గల్లంతు..

విహారయాత్ర విషాదయాత్రగా మిగిలింది. జలపాతం చూసేందుకు వెళ్లిన ఓ కుటుంబం అందులో గల్లంతైంది. మహారాష్ట్రలోని లోనావాలాలో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం భుసీ డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలోని జలపాతం వద్ద ఐదుగురు గల్లంతయ్యారు. వెంటనే పోలీసులు, స్థానికుల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. జలపాతం దిగువన ఉన్న నాచు బండరాళ్ల వల్ల జారిపడి, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. 40 ఏళ్ల మహిళతో పాటు 13 ఏళ్ల బాలిక మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు, 6 ఏళ్ల ఇద్దరు బాలికలు, నాలుగేళ్ల బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు అధికారులు చెప్పారు. సంఘటన స్థలం భూసీ డ్యామ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని ఎస్పీ వెల్లడించారు.

గత ప్రభుత్వమిచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు

ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాల భర్తీ ముందుకు సాగలేదు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. ఇటీవలే 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ -2024ను టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనితో పాత డీఎస్సీను ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలోనే 16,347 పోస్టులతో నూతన డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుంది.

SCCL సీఎండీకి ‘ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ బిరుదు

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ బలరామ్‌ 18 వేలకు పైగా మొక్కలు నాటడంతోపాటు 35 మినీ ఫారెస్ట్‌లను రూపొందించినందుకు గుర్తింపుగా గ్రీన్‌ మాపుల్‌ ఫౌండేషన్‌ ‘ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ తెలంగాణ’ బిరుదును ప్రదానం చేసింది. తెలంగాణ జిల్లాలు సింగరేణిని పర్యావరణ సంక్షేమ సంస్థగా మార్చడంతోపాటు.

శనివారం రాత్రి నగరంలో జరిగిన గ్రీన్ మాపుల్ ఫౌండేషన్-2024 అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం, గ్రీన్ మాపుల్ దేశంలోని పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ , ప్రైవేట్ రంగ సంస్థలకు , ప్రభావవంతమైన వ్యక్తులకు ఇటువంటి ప్రోత్సాహక అవార్డులను అందజేస్తుంది. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు తమ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, సింగరేణి వ్యాప్తంగా 6 కోట్ల మొక్కలను నాటామని తెలిపారు.

నిధుల విడుదల, పొడిగింపుపై గతంలో 3సార్లు లేఖ రాసిన

స్మార్ట్ సిటీ మిషన్ దేశవ్యాప్తంగా పొడిగింపు.. నిధుల విడుదల, పొడిగింపుపై గతంలో 3సార్లు లేఖ రాశానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కేంద్ర నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ పట్టణాల అభివ్రుద్ధికి మహార్ధశ పట్టనుందని, గత బీఆర్ఎస్ సర్కార్ స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లించడంవల్లే అభివ్రుద్ధి కుంటుపడిందన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ మిషన్ ను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి, కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి ధన్యవాదాలు.  కేంద్ర నిర్ణయంవల్ల కరీంనగర్, వరంగల్ పట్టణాలు పూర్తిస్థాయిలో అభివ్రుద్ధి అయ్యే అవకాశాలు మెరుగయ్యాయని ఆయన తెలిపారు.

ఏపీలో పింఛన్ల పండుగ.. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి సర్వం సిద్దం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తోంది. రేపు(జులై 1న) రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది.‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో ఇకపై ఇంటి వద్దనే సామాజిక పింఛన్ల పంపిణీ చేయనున్నారు. స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్దిదారులకు సీఎం పింఛను ఇవ్వనున్నారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పింఛను అందజేయనుంది ఏపీ ప్రభుత్వం. పింఛను పెంచడంతో పాటు గడిచిన మూడు నెలలకు కూడా పింఛను పెంపును సీఎం చంద్రబాబు వర్తింపజేశారు. పెరిగిన పింఛను రూ.4000, గత మూడు నెలల సొమ్ము రూ.3000 కలిపి రూ.7000 ప్రభుత్వం ఇవ్వనుంది.

మణిపూర్ సందర్శించేందుకు ప్రధానికి తీరిక దొరకడం లేదా..?

ఏడాది కాలంగా మణిపూర్ సమస్య చెలరేగుతోంది. కుకీ, మైయిటీ కమ్యూనిటీల మధ్య జరిగిన జాతి ఘర్షణలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గతంతో పోలిస్తే పరిస్థితి కొంతమేర ప్రశాంతంగానే ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ మణిపూర్ సమస్యను మరోసారి లేవనెత్తింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఆ ప్రాంత ప్రజల్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అన్నింటికి ప్రధాని మోడీకి సమయం ఉంటుంది కానీ మణిపూర్ సందర్శించేందుకు ప్రధానికి తీరిక దొరకడం లేదని విమర్శించారు.

కొత్త క్రిమినల్ చట్టాలు వాయిదా వేయాలి

మూడు కొత్త క్రిమినల్ చట్టాలను చుట్టుముట్టిన వివాదాలు, వాటి దుర్వినియోగానికి అవకాశం ఉందని దేశవ్యాప్తంగా వినిపిస్తున్న తీవ్ర ఆందోళనల దృష్ట్యా వాటి అమలును వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తూ బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌ లేఖ రాశారు. 2024 జూలై 1వ తేదీ కంటే ముందే వాటిని వాయిదా వేయడానికి ఉన్నత స్థాయి జోక్యం అర్ధరాత్రి వస్తుందని దేశం మొత్తం ఆశాభావంతో ఉందని వినోద్ కుమార్ ఆదివారం అన్నారు. తెలంగాణ భవన్‌లో సీనియర్ న్యాయవాదులు, పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత , భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టం తక్షణమే అమలులోకి రానున్నాయని, ఇవి భారతదేశంలోని నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చేందుకు ఉద్దేశించినవని అన్నారు. . దేశంలోని న్యాయ నిపుణులు , కార్యకర్తలు కొన్ని నిబంధనలను అధికారులు దుర్వినియోగం చేస్తారని ఆందోళన చెందారు, ప్రత్యేకించి నిఘా , నిర్బంధ పరంగా హక్కుల ఉల్లంఘన , స్వేచ్ఛల ఉల్లంఘనకు దారి తీస్తుంది.