ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది..
తిరుపతికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఇక, 140 రోజుల్లో ముఖ్యమంత్రి ఐదు ఫైళ్లపై సంతకం చేశారు.. ప్రతి పేద వాడికి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే, ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూస్తోంది అని వ్యాఖ్యానించారు. రాబోయే 2, 3 సంవత్సరాల్లో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అభివృధ్ది చేస్తాం.. అభివృధ్ది,సంక్షేమం రెండు కళ్ళ లాంటివని ఆయన అన్నారు. బీజేపీ, జనసేనతో కలిపి కూటమి ప్రభుత్వం అభివృధ్ది చేస్తోంది.. తిరుపతి ఇంకా అభివృధ్ది చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.. పులికాట్ సరస్సు అభివృధ్ది చేయడానికి కలెక్టర్ ప్రణాళికలు రూపొందించారు.. తిరుపతిలో భూ కబ్జాలపై చర్యలు తీసుకుంటాం.. రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించి 15 రోజుల్లో సీఎం వివరాలు చెబుతారు.. గంజాయి, డ్రగ్స్ కు బానిసైన వారిలో చైతన్యం తీసుకోవడానికి ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారు అని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం..
9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 628 మంది పార్ట్ టైమ్ యోగా ఇన్‌స్ట్రక్టర్లకు మంత్రి అపాయింట్‌మెంట్ లెటర్లు అందించారు.. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం అని, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారన్నారు. మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నామని, యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదన్నారు మంత్రి దామోదర. మానవాళికి సంబంధించిన అంశం. మానవశరీరం, జ్ఞానం, మనస్సుకు సంబంధించిన అంశమన్నారు. ఇప్పుడిప్పుడే దీని ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, పిల్లలకు దీన్ని నేర్పించాలన్నారు మంత్రి దామోదర. యోగా, ఆయుర్వేదను గ్రామాల్లోకి తీసుకెళ్లాలని, యోగా వల్ల కలిగే లాభాలు ఏంటో ప్రజలకు వివరించి, వారికి అవగాహన కల్పించాలన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా.
తెలంగాణ పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌ల బడ్జెట్ విడుదల
పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విడుదల చేసింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌ల బడ్జెట్‌గా రూ.182.48 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం (అక్టోబర్ 29) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బడ్జెట్‌ను మంజూరు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని అనుసరించి, సరెండర్ లీవ్‌లకు సంబంధించి భారీ స్థాయిలో బడ్జెట్ విడుదల చేయడం ద్వారా పోలీస్ సిబ్బంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థనను తీర్చింది. పోలీస్ అధికార సంఘాలు ఈ బడ్జెట్ విడుదలపై హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు, మిగిలిన బకాయిలను త్వరగా దశలవారీగా మంజూరు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
నవంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. అమరావతిలో గల సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీతాకాల అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తుంది. నవంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ యోచిస్తున్నట్లుంది.
అలాగే, రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా మంత్రులు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే బడ్జెట్‌పై కసరత్తులు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. నవంబర్ 12వ తేదన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు పలు కంపెనీలకు సంబంధించిన ఆహ్వానాలపైనా ఈ మంత్రి వర్గ భేటీలో మంత్రులు చర్చించనున్నారు. పలు నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.
దేవాలయాలలో నెయ్యి సరఫరాపై కమిటీ వేసిన మంత్రి ఆనం
దేవాలయాలలో నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేశారు. దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులు చేశారు. ఈ కమిటీ పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాలకు నెయ్యి సరఫరా తీరు తెన్నులపై వివిధ డెయిరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో వివిధ అవసరాల నిమిత్తం ఏటా సుమారు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరం అవుతుంది. దీనిని పూర్తి నాణ్యత ప్రమాణాలతో, సకాలంలో, నిర్దేశిత పరిమాణంలో సేకరించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు.
జనాభా గణనలో అడిగే 30 ప్రశ్నలు ఇవే..
భారత ప్రభుత్వం జనాభా గణనను నిర్వహించడానికి పూర్తి సన్నాహాలు చేసింది. వచ్చే ఏడాది నుంచి జనాభా గణన ప్రారంభించి ఏడాదిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ జనాభా గణన డేటా 2026లో మాత్రమే పబ్లిక్ చేయబడుతుంది. ఈ జనాభా గణన 2021లోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి మరికొంత జాప్యం జరిగింది. ఇప్పుడు దీనిపై ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ జనాభా గణన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దాని ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల విభజన జరుగుతుంది. లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్ గత 50 ఏళ్లుగా నిలిచిపోయింది. 2029లో సీట్లు పెరుగుతాయని, మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేయాలన్నారు.
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ లేఖ.. ఈ సమస్య వారే పరిష్కరించుకుంటారు..
వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ ఈ మేరకు వైఎస్‌ఆర్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా బాదేస్తుందన్నారు. రాజశేఖర్ రెడ్డి, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్లం.. కానీ, నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదు.. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. జరగకూడనివి అన్ని నా కళ్ళముందే జరిగి పోతున్నాయి.. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారని వైఎస్ విజయమ్మ వాపోయారు.
ట్రాఫిక్ పోలీసులకు హైడ్రా వాలంటీర్ల సహకారం..
ట్రాఫిక్ పోలీసులకు హైడ్రా వాలంటీర్ల సహకారం అందివ్వనున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించేందుకు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మొదటి విడతగా 50 మందికి శిక్షణ ఇస్తున్నారు ట్రాఫిక్ అధికారులు. ఈక్రమంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ మెలుకువలు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నేర్చుకుంటున్నారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్‌లు పేరిట ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలు అందించనున్నారు హైడ్రా వాలంటీర్లు. ట్రాఫిక్ రద్దీ, ఇతర ముఖ్యమైన సమయాల్లో పోలీసులకు సహకరించే విధంగా హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల సేవలుంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ పేరిట రేడియం జాకెట్లు వేసుకుని సేవలకు అందించనున్నారు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది. వర్షాలు, వరదలు.. ఇలా ప్రకృతి వైపరీత్యాలు లేని సమయంలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించే విధంగా హైడ్రా ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. త్వరలో ముఖ్యమైన కూడళ్లలో విధులు నిర్వహించనున్నారు హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు.
డాక్టర్ లేకుండా ప్రసవం చేసిన ఆసుపత్రి యాజమాన్యం.. తల్లి బిడ్డ మృతి
ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో గల సాయి స్ఫూర్తి హాస్పిటల్ డాక్టర్స్ నిర్లక్ష్యానికి తల్లి, బిడ్డ మృతి చెందింది. పురిటి నెప్పులతో ఈ నెల 26వ తేదీ రాత్రి సాయి స్ఫూర్తి హాస్పిటల్ లో జాయిన్ అయినా వెంకటాపురం గ్రామానికి చెందిన కోడూరి పరిమళ కిరణ్ అనే గర్భవతి. అర్థరాత్రి ప్రసవం చేయటంతో పురిట్లోనే బిడ్డ మరణించింది. సాయి స్ఫూర్తి హాస్పిటల్ లో డాక్టర్ లేకుండానే ప్రసవం చేశారని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకుపోవడంతో.. సాయి స్ఫూర్తి హాస్పిటల్ లో తనిఖీ చేశారు. ఇక, చింతలపూడిలోని సాయి స్పూర్తి హస్పటల్ దగ్గర మృతదేహంతో వెంకాటాపురం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తక్షణమే హస్పటల్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. బాధిత కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించారు. ఆసుపత్రిపై దాడికి ప్రయత్నించిన మృతురాలి బంధువులు.. ఆసుపత్రి దగ్గర స్వల్ప ఉద్రిక్తత కొనసాగింది. హస్పటల్ బయట ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.