12 ఏళ్ల ఆయుర్దాయం ఖతం.. ఢిల్లీ వాసులకు పొంచి ఉన్న ప్రమాదం..
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ఈ కాలుష్యం రానున్న కాలంలో ఢిల్లీ వాసులపై పెను ప్రమాదాన్ని మోపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. దేశ రాజధాని ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉందని, ప్రస్తుతం కాలుష్య స్థాయిలో ఇలాగే కొనసాగితే ఢిల్లీ నివాసితులు తమ 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే అవకాశం ఉందని తేలింది.
భారతదేశంలోని 1.3 బిలియన్ల ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిర్ధేశించిన కాలుష్య పరిమితిని దాటిన ప్రాంతాల్లోని నివసిస్తున్నారని చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (AQLI) వెల్లడించింది. దేశంలో 67.4 శాతం మంది ప్రజలు జాతీయ వాయునాణ్యత 40 μg/m3ని మించిన ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తెలిపింది.
కేంద్రం గ్యాస్ ధరను తగ్గించడంపై విసుర్లు.. కారణాలివేనన్న దీదీ
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. విపక్షాల కూటమి ‘ఇండియా’ రెండు సమావేశాలు జరిగాయని, అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీ ధరలు తగ్గించాయని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మమతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “గత రెండు నెలల్లో ఇప్పటివరకు, ‘భారత్’ కూటమి యొక్క రెండు సమావేశాలు మాత్రమే జరిగాయి, ఈ రోజు మనం ఎల్‌పిజి గ్యాస్ ధరను రూ. 200 తగ్గించడం చూస్తున్నాము. .” ఇది #భారతదేశం యొక్క శక్తి! అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఎన్టీఆర్ బొమ్మతో చంద్రబాబు రాజకీయం
విశాఖలో మత్స్యకారుల సమస్య 30 ఏళ్ల క్రితంది అని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు.. మత్స్యకారులతో చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖ మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్‌తో మాట్లాడాను.. మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. చంద్రబాబు ఢిల్లీలో స్పాన్సర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు.. అదే వేదికపై ఎన్టీఆర్ కి భారతరత్న ఎందుకు అడగలేదు.. ఎన్టీఆర్ గౌరవం తగ్గించారు.. బీజేపీ పెద్దల మెప్పు కోసం చంద్రబాబు లాబీయింగ్ చేశారు అని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు.
హిమాచల్‌లో వర్షాల విధ్వంసంతో 381 మంది మృత్యువాత.. రూ.8642 కోట్ల నష్టం
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రుతుపవనాలు వర్షాన్నే కాదు విపత్తును కూడా తెచ్చిపెట్టాయి. వర్షం కారణంగా ఇప్పటి వరకు 381 మంది వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. వివిధ సంఘటనలలో 360 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 38 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.8642.83 కోట్ల నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో 2, 446 ఇళ్లు పూర్తిగా.. 10, 648 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు 312 దుకాణాలు, 5 వేల 517 పశువుల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. జూన్ 24 నుండి, రాష్ట్రంలో 161 కొండచరియలు, 72 ఆకస్మిక వరద సంఘటనలు నమోదయ్యాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ రాష్ట్రంలో గరిష్ఠంగా రూ.2927.01 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
విద్యార్థుల ముందే భార్యకు ట్రిపుల్ తలాక్..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. భారత ప్రభుత్వం దీన్ని నిషేధించినప్పటికీ కొందరు ట్రిపుల్ తలాక్ చెబుతున్నారు. తాజాగా యూపీ బారాబంకీకి చెందిన ఓ వ్యక్తి కట్నం డిమాండ్ చేస్తూ.. తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
తమన్నా అనే స్కూల్ టీచర్ 2020లో షకీల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నుంచి షకీల్ కట్నాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల స్కూళ్లో తన విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో షకీల్ వారి ముందే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ
రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లతపాటు అర్బన్, ఈసీ. ఆర్బిఎస్ కే ,104 తోపాటు వివిధ రకాల ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో 2వ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2014 లో మీ ఎన్నికల హామీల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని, వైద్యరంగంలో గ్రామీణ స్థాయిలో ANM వ్యవస్థ బలమైనదన్నారు ఎంపీ కోమటిరెడ్డి .
అభ్యర్థుల ప్రకటన త్వరలోనే చేస్తాం
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. దీంతో రోజు రోజు రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని పార్టీల వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ పార్టీ 119 స్థానాలకు గానూ 115 స్థానాల్లో బరిలో దిగే అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించింది. అయితే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం తెలంగాణలో అభ్యర్థుల లిస్ట్‌ను రెడీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజాసింగ్ విషయంలో కేంద్రపార్టీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామని.. ఎవరితోనీ పొత్తులు ఉండవని ఆయన క్లారిటీ ఇచ్చారు. 119 స్థానాల్లో పోటీచేస్తామని, ఎలక్షన్ కమిటీ వేస్తాం, మీటింగ్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అభ్యర్థుల ప్రకటన త్వరలోనే చేస్తామని ఆయన తెలిపారు. రాఖీ కానుకగా సిలెండర్ పై 200 తగ్గింపు సంతోషకరమని ఆయన వ్యాఖ్యానించారు.
విశాఖలో సీఐ కాలర్ పట్టుకుని కేఏ పాల్ ఓవరాక్షన్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖపట్నంలో చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరుకుంది. అయితే, పాల్ దీక్షను పోలీసులు భగ్నం చేసుందుకు రావడంతో ఆయన ఓవరాక్షన్ చేశాడు. తనకు వైద్యం అక్కర్లేదని, కేజీహెచ్ దగ్గర పోలీసులతో ఆయన గొడవకు దిగారు. అడ్డుకోబోయిన సీఐ కాలర్ ను కేఏ పాల్ పట్టుకున్నాడు. పోలీసులపై అరుస్తూ, కేకలు పెడుతూ నానా హంగామా చేశాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వదిలిపెట్టాలని పాల్ గొడవకు దిగాడు. కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేఏ పాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ఇవాళ ( మంగళవారం ) పోలీసులు భగ్నం చేశారు.
టీడీపీకి భారీ షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే
టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్‌సీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్సార్‌సీపీ పార్టీ కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనకాపల్లి టీడీపీ నేత మలశాల భరత్ కుమార్, తల్లిదండ్రులు రమణారావు (విశాఖ డెయిరీ డైరెక్టర్), ధనమ్మ (మాజీ ఎంపీపీ) చేరారు. ఈ సందర్భంగా భరత్‌కుమార్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన గంగుపాం నాగేశ్వరరావు (మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్), మలశాల కుమార్ రాజా (విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు.
ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది..!
జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం సృహుద్భావ వాతావరణంలో జరిగింది అని పేర్కొన్నారు. మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదు అని చంద్రబాబు అన్నారు.. చంద్రబాబు ముసలి నక్క, జిత్తులమారివి అని రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడిచి చావుకు కారణం.. చంద్రబాబుకు బుర్ర పాడైపోయిందా?.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీపీఎస్ విషయంలో ఉద్యోగ సంఘాల మధ్య పంచాయతీ
జీపీఎస్ విషయంలో ఉద్యోగ సంఘాల మధ్య పంచాయతీ కొనసాగుతుంది. మిగిలిన ఉద్యోగ సంఘాలపై ఏపీసీపీఎస్ సంఘాల నేతలు విమర్శలు గుప్పించారు. తమ వల్లే చలో విజయవాడ కార్యక్రమంలో విజయవంతం అయ్యింది అని ఏపీసీపీఎస్ఎస్ఈఏ నేతలు అంటున్నారు. మిగిలిన ఉద్యోగ సంఘాలు తమను వాడుకుని వదిలేశాయని ఆరోపణలు చేశారు. ఓపీఎస్ మినహా మరో ప్రత్యామ్నాయం అంగీకరించమని వారు పేర్కొన్నారు. ఓపీఎస్ ఇచ్చే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది అంటూ వెల్లడించారు.
ఇక ఏపీ సచివాలయంలో జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 92 రోజుల పాటు ఉద్యమం చేసిన చరిత్ర మాది అని పేర్కొన్నారు. సహ ఉద్యోగ సంఘాల నేతలపై విమర్శలు చేయటం కరెక్ట్ కాదు అంటూ ఆయన పేర్కొన్నారు.
