NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని.. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపల్లి మండలం వానపల్లిలో గ్రామసభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 17500కిలో మీటర్లు సీసీ రోడ్లు వేస్తామన్నారు. మట్టి అంటకుండా బయటకు వెళ్లేలా చేస్తామన్నారు. 10వేల కిలోమీటర్లు మురికి కాల్వలు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం అభివృద్ది పనులు గ్రామాల్లో చేపడతామన్నారు. రీ సైక్లింగ్‌తో చెత్త ద్వారా సంపద క్రియేట్ చేస్తున్నామని చెప్పారు.

ప్రతి కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి ఇళ్ల స్థలంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించే భాధ్యత తీసుకుంటున్నామని.. గత ఐదేళ్లుగా రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని మండిపడ్డారు. గత నాయకుడు ఏనాడైనా గ్రామ సభ పెట్టాడా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జనంలోకి రావాలంటే పరదాలు,, చెట్లు నరికి వేయడం.. ఇదేమీ దారుణమంటూ విమర్శించారు. నరేగాలో ఎంతమందికి పని కావాల్సిన కల్పిస్తామన్నారు. రూ.4,550 కోట్లతో గ్రామీణ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. 2019- 24 చీకటి రాజ్యం నడిచిందని.. నరేగ నిధులు దొంగ బిల్లులతో దోచుకున్నారని ఆరోపించారు.

హేమకు అండగా ‘మా’… కానీ షరతులు వర్తిస్తాయ్!

బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన సరే తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసి పెను వివాదానికి కారణమైంది నటి హేమ. బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో తన పేరును కృష్ణవేణిగా నమోదు చేసిన ఆమె తన అసలు బెంగళూరు వెళ్ళలేదు అని ఆమె చెప్పిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు ఆమె మీద డ్రగ్స్ కేసుతో పాటు కేసును తప్పు దోవ పట్టిస్తుందని మరో కేసు కూడా నమోదు చేశారని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను డ్రగ్స్ తీసుకోలేదు అని మరోసారి చెప్పే ప్రయత్నం చేసింది.

హీరో రవితేజకు గాయం..శస్త్ర చికిత్స

మాస్ మహారాజా రవితేజకు షూటింగ్ లో గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం భాను దర్శకత్వంలో తన 75 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్లో రవితేజ కుడి చేతికి గాయమైనట్లుగా తెలుస్తోంది. గాయంతోనే రవితేజ షూటింగ్లో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. అయితే కుడి చేతికి అయిన గాయం ఎక్కువ కావడంతో యశోద ఆసుపత్రిలో రవితేజకు శస్త్ర చికిత్స చేయించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యులు సూచించారు. ఇక రవితేజకు శస్త్ర చికిత్స జరిగిందని ఆయనకు ఆపరేషన్ జరిగిందంటూ రవితేజ పిఆర్ టీం వెల్లడించింది.

వరద ప్రభావిత గ్రామాలను అన్ని విధాలా ఆదుకుంటాం..

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో వరద బాధితులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వరద ప్రభావిత గ్రామాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హై పవర్ కమిటీ వేసి అందరికి న్యాయం చేస్తామన్నారు. అందరి సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అందరి బాధలు వింటామని.. వరద బాధితుల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలు స్వీకరించారు. వరద బాధితులను గత ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా వరద బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు అర్జీలు ఇవ్వడానికి ప్రజలు ఎగబడ్డారు.

మా వాళ్ళు తిరగబడితే కాంగ్రెస్ గుండాలు ఒక్కరు కూడా మిగిలే వారు కాదు..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర డీజీపీని కలిశారు. నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారన్న నాయకులు మండిపడ్డారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరం పైన దాడి చేయడం టెంట్ పీకి వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక అరాచక పాలన కొనసాగుతుందని, చట్టానికి వ్యతిరేకంగా పోలీసులను వాడుకుంటూ శాంతి భద్రతలను నాశనం చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నేతలపై సోషల్ సర్వీస్ చేసే వారి మీద, రైతుల మీద దాడులు, జర్నలిస్ట్ ల మీద దాడులు జరుగుతున్నాయని, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో శాంతి యుతమైన ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ గుండాలు, పోలీసులు భాగస్వామ్యం తోనే దాడులు జరిగాయన్నారు జగదీష్‌ రెడ్డి. రాష్టంలో శాంతి భద్రతలకు విఘతం కలుగుతుందన్నారు. అనంతరం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రుణ మాఫీ పేరిట మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద శాంతియూతంగా నిరసన చేపట్టామని, ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు పాల్గొన్నామన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో రైతుల రుణ మాఫీ పై నిరసన తెలుపుతున్న నేపథ్యంలో నిరసన శిబిరం పై దాడులు చేసారని, మా వాళ్ళు తిరగబడితే కాంగ్రెస్ గుండాలు ఒక్కరు కూడా మిగిలే వారు కాదని, స్థానిక పోలీసులు గుండాలకు వత్తాసు పలికారన్నారు.

గ్రామాల అభివృద్ధే గ్రామసభల‌ ముఖ్య ఉద్దేశం

అవినీతి లేకుండా పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేసుకునే విధంగా గ్రామ సభలు జరగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిప‌ర మండ‌లం వ‌ల్లభాపురంలో గ్రామ స‌భ‌లో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. గ్రామ స‌భ‌లో ప్రజ‌ల నుంచి వ‌చ్చిన అర్జీలు స్వీక‌రించి , వాటి పరిష్కారానికి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. సోష‌ల్ ఆడిట్ స‌క్రమంగా నిర్వహించ‌లేదంటూ అధికారుల‌పై మంత్రి మ‌నోహ‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప‌నితీరు మెరుగుప‌రుచుకోక‌పోతే చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేయ‌వ‌ద్దంటూ అధికారుల‌పై మండిపడ్డారు. తాగునీరు, పెన్షన్, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం,మందుల సమస్యలు,మురుగు నీటి స‌మ‌స్యల‌ను మంత్రి మనోహ‌ర్ దృష్టికి గ్రామ‌స్థులు తీసుకువచ్చారు.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

కృష్ణా బేసిన్‌ ఎగువ పరీవాహకంలో వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పెరిగింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద వస్తుండగా.. అంతేస్థాయిలో శ్రీశైలానికి వదులుతున్నారు. రెండు వైపులా జలవిద్యుత్తు ఉత్పాదనతో శ్రీశైలం నుంచి 69,132 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదిలేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఘాట్‌రోడ్డులో ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.

ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి

మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లిజో జోస్ పెల్లిస్సేరి ‘ఆమేన్’ సినిమా నటుడు నిర్మల్ బెన్ని కన్నుమూశారు. ఆమెన్‌లో కొచ్చాచన్‌గా నిర్మల్‌ నటించారు. ఇక తాజాగా గుండెపోటుతో 37 ఏళ్ళ నిర్మల్ మృతి చెందాడు. నిర్మల్ మృతిని నిర్మాత సంజయ్ పాటియూర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నిర్మల్ పూర్తి పేరు నిర్మల్ వి బెన్నీ. గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు నిర్మాత స్పష్టం చేశారు. తన ప్రియ మిత్రుడికి శాశ్వత శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు నిర్మాత కూడా రాసుకొచ్చారు. నిర్మల్ వి బెన్నీ కామెడీ షోల ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించారు. నిర్మల్ వి బెన్నీ యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. ఆయన 2012లో విడుదలైన వెల్‌కమ్ టు న్యూబీస్ చిత్రంలో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆమెన్‌లో కొచ్చాచన్ పాత్ర ఆయనని నటుడిగా పాపులర్ చేసింది. నిర్మల్ వి బెన్నీ ధార అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు. ఆయన ఆమెన్, దర్శ సహా ఐదు చిత్రాలలో నటించారు.

పవన్‌ కల్యాణ్‌ను కదిలించిన మహిళా సర్పంచ్.. ఎవరీ కారుమంచి సంయుక్త?

దేశ సేవ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భర్త ఆశయం కోసం ఆయన భార్య నడుం బిగించింది. పచ్చని గ్రామాలే ప్రగతికి మెట్టు అన్న ఆయన ఆశయానికి ఆమె పునాది వేసింది. ఆ ఆశ నెరవేర్చడం కోసం ఆమె రాజకీయాలలోకి రంగ ప్రవేశం చేసింది. అయితే జనసేన పార్టీ ఆమెకు అండగా నిలిచింది. ఆమె ఆశయం విన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తనను కదిలించింది అనడం విశేషం….. ఇంతకు ఎవరు ఆ సర్పంచ్… ఏమిటి ఆమె ఆశయం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని మైసూర్ వారి పల్లి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. భర్త ఆశయం కోసం ఆమె రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. దేశ సేవ చేయడం కోసం ఆర్మీలో చేరిన కారుమంచి వెంకటసుబ్బయ్య తన పదవి అనంతరం గ్రామ సేవకు కంకణం కట్టుకున్నారు. కరోనా సమయంలో గ్రామస్థులకు అన్ని తానై నిలిచాడు. తిరుపతిలో కరోనా పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త మృతి చెందిన రెండు నెలలకే భార్య కారుమంచి సంయుక్త సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. 2021 లో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీస్తుంటే రైల్వే కోడూరు మండలం మైసూర్ వారి పల్లిలో మాత్రం జనసేన జెండా రెపరెపలాడింది. వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీల అభ్యర్థులు మధ్య జరిగిన హోరాహోరీ సర్పంచ్ ఎన్నికలలో కారుమంచి సంయుక్త 455 ఓట్లతో విజయ కేతనం ఎగురవేశారు. అయితే ఆమె కష్ట కాలంలో ఆమెకు జనసేన అండగా నిలిచింది. రాయలసీమలోనే మొదటి జనసేన సర్పంచ్ గా ఎంపికయ్యారు.

నా కొడుకును ఎవరో ఇరికించారు.. కోల్‌కతా రేప్ ఘటన నిందితుడు తల్లి

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సంజయ్ రాయ్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కుమారుడు ఎవరికి హాని చేయడని చెప్పింది. ఎవరో తన కొడుకును ఇరికించారని.. అతనిని కఠినంగా శిక్షించాలని రాయ్ తల్లి డిమాండ్ చేసింది. ‘తన తండ్రి చాలా కఠినంగా ఉండేవాడు. నేను కఠినంగా ఉంటే ఇలా జరిగేది కాదు. తన తండ్రిని నా కొడుకు గౌరవించేవాడు.” అని ఆమె చెప్పింది. అంతేకాకుండా.. రాయ్ తల్లి మాట్లాడుతూ, సంజయ్ రాయ్కి క్రీడలపై ఆసక్తి ఉండేదని.. అతను బాక్సింగ్ నేర్చుకునేవాడని తెలిపింది. రాయ్.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో, పాఠశాలలో టాపర్‌ అని చెప్పింది. తన కొడుకు తనను జాగ్రత్తగా చూసుకునేవాడని, తనకు వంట కూడా చేసేవాడని తెలిపింది. కావాలంటే.. తమ ఇంటి ఇరుగుపొరుగు వారిని అడగవచ్చు.. అతను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించడని ఆమె చెప్పింది. తాను తన కొడుకును కలిస్తే.. ‘బాబూ ఎందుకు ఇలా చేశావు?’ అని అడిగేదానినని.. తన కొడుకు ఎప్పుడూ ఇలా చేయడని ఆమె చెప్పింది.