NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మాజీ సీఎం జగన్‌కు రాఖీలు కట్టేందుకు పోటీపడిన మహిళలు

సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వాగతం పలికారు. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి రాఖీలు కట్టేందుకు మహిళలు పోటీపడ్డారు. చాలా మంది మహిళలు జగనన్న అంటూ ఉత్సాహంతో అరిచారు. అభిమాన నాయకుడికి రాఖీ కట్టే అవకాశం రావడంతో మహిళలు ఆనందంలో మునిగిపోయారు. అనంతరం జగన్మోహన్‌ రెడ్డి గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారణ

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో వీవీ ప్యాట్లల్లో ఓట్లు సరిపోల్చాలని మాక్ పోలింగ్ వద్దని బాలినేని పిటిషన్ వేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి తరఫు న్యాయవాది ఇవాళ వాదనలు వినిపించారు. బాలినేని తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు జడ్జి మెంట్ ప్రకారం ఈవీఎం, వీవీ ప్యాట్లను లెక్కించి సరిపోల్చాలని కోరామని కోర్టుకు వివరించారు. అందుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం మాక్ పోలింగ్ నిర్వహిస్తోందని తెలిపారు. పోలింగ్‌కు ముందే మాక్ పోలింగ్ ఒకటికి రెండు సార్లు మెషీన్లు సామర్థ్యం చూసేందుకు చేపడతారన్నారు.

రుణాల మాఫీలో వారం ఆలస్యమైన ఫలితం ఉండదు

ప్రజా భవన్‌లో బ్యాంకర్స్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లెక్కలు కాదు ఆత్మ ఉండాలి.. 18 వేల కోట్లు బ్యాంకులకు చేర్చాము, రైతులకు మాత్రం నేటి వరకు 7500 కోట్లు మాత్రమే చేరాయి, రుణాల మాఫీలో వారం ఆలస్యమైన ఫలితం ఉండదన్నారు. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాము. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్న ము. వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తాం. రుణమాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, భారీ మధ్యతర సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నాం. ఉచితంగా 24 గంటల విద్యుత్తును అందిస్తున్నాం. రెండు లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నాం. ఇది వ్యవసాయం అనుబంధ రంగాలను బలోపేతం చేస్తాయన్నారు భట్టి విక్రమార్క.

వెలుగొండ ప్రాజెక్టు పటిష్టతపై మంత్రి నిమ్మల సంచలన కామెంట్లు

వెలుగొండ ప్రాజెక్టు పటిష్టతపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలుగొండ హెడ్ రెగ్యులెటర్ పనుల్లో నాణ్యత లేదని మంత్రి నిమ్మల మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులెటర్ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత సరిగా లేదని ఆయన విమర్శించారు. హెడ్ రెగ్యులెటర్ పనుల నాణ్యతపై అనుమానం ఉందన్నారు. వెలుగొండ హెడ్ రెగ్యులెటర్ పనులు కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ చేపట్టాడని.. ఒక్క పైసా పెండింగ్ లేకుండా బిల్లులన్నీ డ్రా చేసేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. వెలుగొండ పనులు చేపట్టిన అధికారులే ఈ విషయం మా సమీక్షల్లో చెబుతున్నారని ఆయన తెలిపారు. వాళ్ల మెడకు చుట్టుకుంటుందనే భయంతో అధికారులు వాస్తవాలు బయట పెడుతున్నారని వెల్లడించారు. కాంట్రాక్టర్ చేపట్టిన హెడ్ రెగ్యులెటర్ పనులను నాడు అధికారులు కూడా సరిగా పర్యవేక్షించ లేదన్నారు మంత్రి రామానాయుడు.

పల్లెలను అభివృద్ధి పథంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు

టూరిజాం అంటే కొన్ని పట్టణాలకే పరిమితమైందని, కాలక్రమేణా చారిత్రాత్మక కట్టడాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు మంత్రి సీతక్క. గుర్తింపు కు నోచుకోక ఇబ్బందులు పడుతున్నామని, పల్లెలో ఉన్న ఆరోగ్యం, ఆనందం, పర్యాటకం ఎక్కడ ఉండదన్నారు మంత్రి సీతక్క. పల్లెలను అభివృద్ధి పథం లో తీసుకురావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. గోదావరి పర్యాటక ప్రాంతాలు ఇక్కడా ఉన్నాయి… ప్రకృతి సంపదను కాపాడుకుంటూ టూరిజాన్ని డెవెలప్ చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.. భవిష్యత్ తరాలకు కలలను,కళా కాండలను కాపడికోవాలని మంత్రి అన్నారు. .ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.

యువతి దారుణ హత్య.. రక్తపు మడుగులో మృతదేహం.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ హోటల్ ప్రీత్ ప్యాలెస్‌లో 28 ఏళ్ల యువతి రక్తంతో తడిసిపోయి కనిపించింది. మహ్మద్ ఆలం అనే వ్యక్తి ఐడీని ఉపయోగించి బుక్ చేసిన హోటల్ గదిలో మహిళ శవమై కనిపించింది. ప్రస్తుతం ఈ వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ గొంతు కోసి దారుణంగా హతమార్చారు. బట్టలు చిందరవందరగా ఉన్నాయి. మృతదేహం దగ్గర విడివిడిగా బురఖా పడి ఉండడంతో ఆ మహిళ ముస్లిం అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో మహిళ మృతదేహాన్ని పోర్ట్‌మార్టం కోసం పంపినట్లు బరేలీ పోలీసులు తెలిపారు. మహిళ హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పామును నోటితో కరిచి చంపేసిన చిన్నారి.. వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే..!

పామును చూడగానే కొందరు ఆమడం దూరం పారిపోతారు. పామును చూసి అంతగా భయపడుతుంటారు. చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరైనా హడలెత్తిపోతారు. అంతెందుకు? ఇంట్లోకి వచ్చే చిన్న చిన్న పురుగులను చూసి కూడా చాలా మంది భయపడుతుంటారు. అలాంటిది స్నేక్ కనిపిస్తే మామూలుగా ఉంటుందా? బెంబేలెత్తిపోరు. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. బీహార్‌లో ఓ చిన్నారి పామును చంపేశాడు. ముక్కుపచ్చలారని పసి బిడ్డ ఏకంగా పామును నోటితో కరిచి చంపేశాడు. దీంతో ఆ పాము ఇంటి ఆవరణలోనే ప్రాణాలు వదిలింది. అయితే చిన్నారిని పామును చంపేసిన తీరు చూసి కుటుంబ సభ్యులు హడలెత్తిపోయారు. భయాందోళనతో వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్ చికిత్స అందించారు. అనంతరం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతోంది.

గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు.. వచ్చే జనవరి నుంచి జన్మభూమి 2.0..

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలను సీఎంకు డిప్యూటీ సీఎం వివరించారు. గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు వచ్చేలా పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి ఏమి అవసరమో గుర్తిస్తామని.. సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే జనవరి నుండి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తామని.. గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

ప్రభుత్వ విజన్‌పై చర్చలు జరిపాం.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీపై సీఎం ట్వీట్

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. భేటీ విశేషాలను సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతి అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ విజన్ పై వారితో చర్చలు జరిపినట్టు సీఎం ట్వీట్ చేశారు. భవిష్యత్ రాజధాని అమరావతిలో భాగస్వామ్యం కావాల్సిందిగా రెండు బ్యాంకులను ఆహ్వానించినట్టు వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఆ నిధులను సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి నిధులు అందించే విషయమై చర్చించారు. అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన నేపథ్యంలో ఈ చర్చలు జరిగినట్లు తెలిసింది. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు, దశలవారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు చర్చలు జరిపారు.

కవితకు బెయిల్ ఇప్పిస్తోంది కాంగ్రెస్సే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ యే కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు విన్పిస్తున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగానే అభిషేక్ సింఘ్వీకి తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ వేయించారని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. కేసీఆర్ చెబితేనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్లు, ప్రభత్వంలో మంత్రి పదవులిస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫాంహౌజ్ కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యనించారు.