NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

శుక్రవారం నుంచి 3 రోజుల పాటు శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లుండి(శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ కూరగాయలు, ఆకులు, ఆకు కూరలతో అర్చకులు, అధికారులు అమ్మవారిని అలంకరించనున్నారు. కూరగాయలతో అలంకారంలో కనకదుర్గమ్మ కనిపించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయం మొత్తాన్ని కూరగాయలతో అలంకరించనున్నారు. వారాంతపు సెలవులు ఉండే సమయం కావడంతో భక్తుల రద్దీకై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు నేడు ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారె సమర్పించారు.

తెలంగాణ వ్యాప్తంగా ‘యుమ్-ఇ అషూరా’ను జరుపుకున్న ముస్లింలు

హిజ్రీ క్యాలెండర్‌లోని మొదటి నెల మొహర్రం పదవ రోజున వచ్చే ‘యుమ్-ఇ అషూరా’ను తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు బుధవారం ఆచరించారు. శతాబ్దాల క్రితం జరిగిన కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వీరమరణం పొందిన జ్ఞాపకార్థం ఈ రోజు. నగరవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, సమావేశాలు, అన్నదాన శిబిరాలు నిర్వహించారు. యువకులు ప్రజల మధ్య ప్రధాన కూడళ్లలో వాటర్ బాటిళ్లు , షర్బత్‌లను పంపిణీ చేశారు, అలాగే ఆసుపత్రులు , వృద్ధాశ్రమాలను సందర్శించి ఆహారం , పండ్లు పంపిణీ చేశారు.

పాత నగరంలో, బీబీ కా ఆలమ్ (ప్రామాణిక) డబీర్‌పురాలోని బీబీ కా అలవా నుండి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు షేక్ ఫైజ్ కమాన్, యాకుత్‌పురా రోడ్డు, ఎతేబార్ చౌక్, అలీజా కోట్లా, చార్మినార్, గుల్జార్ హౌజ్, పంజేషా, మండి మీర్ ఆలం, దారుల్షిఫా మీదుగా చాదర్‌ఘాట్‌లోని మసీదు ఇ-ఇలాహి వద్ద ముగియడానికి ముందు సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

గురువారం బీజేపీ ఆఫీస్‌ను సందర్శించనున్న మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం 7 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని.. పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హెడ్‌ ఆఫీస్ దగ్గర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మోడీ రాక కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఆర్ నారాయణ మూర్తి

పీపుల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆర్.నారాయణమూర్తి అనారోగ్యం పాలైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు ఏమైందో తెలియక ఆయన అభిమానులైతే ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన వెల్లడించారు. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాను, దేవుడి దయ వల్ల బాగానే కోరుకుంటున్నాను.

జేఎన్టీయూ హస్టల్‌లో ఆహారం తిన్న పిల్లి ఘటన.. వివరణ ఇచ్చిన ప్రిన్సిపాల్‌

“జేఎన్టీయూ యూనివర్సిటీ హాస్టల్ లోనీ మంజీర బాలుర వసతిగృహము లో ఆదివారము రాత్రి పిల్లి వచ్చి ఆహారం తింటున్నది” అన్న సంఘటన పై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్‌ జీవీ నరసింహ రెడ్డి , హాస్టల్ వార్డెన్ డా యన్ దర్గాకుమార్ , హాస్టల్ కేర్ టేకర్ పలువురు అధికారులు విచారణ చెప్పట్టి జరిగిన సంఘటన పట్ల వివరణ ఇచ్చారు. నిజానికి హాస్టల్‌లో ఓ కిటికీ తెరిచిన కారణంగా లోపలికి పిల్లి వచ్చే అవకాశము ఉండవచ్చును కాని అదికూడా హాస్టల్ పూర్తి గా మూసేసిన రాత్రి సమయం లో , విద్యార్థుల భోజనాలు ముగిసిన తరువాత నే వచ్చి ఉండవచ్చు తప్ప , విద్యార్థుల భోజనం సమయం లో కాని, లేదా వంట చేసిన సమయం లో కాని వచ్చింది కాదు అని ప్రిన్సిపాల్ డా జి వి నర్సింహా రెడ్డి అన్నారు.

ముద్రగడ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు..

ముద్రగడ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్‌ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని ఆయన కొనియాడారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. ముద్రగడ పేరు మార్చుకున్నారని తెలిసి అభినందించడానికి వచ్చానని అంబటి రాంబాబు చెప్పారు. సవాల్‌కు కట్టుబడి ముద్రగడ పేరు మార్చుకున్నారని.. చాలామంది సవాళ్లు చేస్తారు.. నాకు తెలిసి ఎవరూ కట్టుబడి ఉండలేదన్నారు. పేరు మారినా ముద్రగడ ముద్రగడే అంటూ అంబటి ప్రశంసించారు.వంగవీటి రంగా జైలులో ఉన్నప్పుడు కాపునాడు సభకు హాజరు కావడానికి తన పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అంటూ పేర్కొన్నారు. కాపు ఉద్యమానికి కారణం ముద్రగడ, దానివలన పొలిటికల్‌గా చాలా నష్టపోయాడన్నారు.

కొనసాగుతున్న అల్పపీడనం.. కోస్తాంధ్రకు 2 రోజుల పాటు భారీ వర్షసూచన

మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తు నివారణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపారు. మిగిలిన చోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101ను అధికారులు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద ఉండొద్దని సూచనలు చేశారు.

రేపట్నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం

రేపట్నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదును సంబరంలా చేద్దాం జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని జనసేన నాయకులకు సూచించారు. పది రోజులపాటు ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమం జరగాలన్నారు. ఎన్నికల అనంతరం పార్టీ తీసుకున్న కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేపట్టాలని.. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు సభ్యత్వ నమోదు కోసం వేచి చూస్తున్నారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ 100 శాతం స్ట్రయిక్ రేటు విజయం సాధించామన్నారు. పార్టీకి ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలున్నాయన్నారు. ఇప్పటికే ఉన్న 6.47 లక్షల క్రియాశీలక సభ్యత్వాన్ని రెన్యూవల్ చేయించాలని.. మరింత మంది క్రియాశీల సభ్యులను పార్టీలో చేర్పించాలని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులకు సూచించారు. ఏ పార్టీలో లేని విధంగా జనసేనలో క్రియాశీల సభ్యులకు రూ. 5 లక్షల భీమా సౌకర్యం ఉందని నాదెండ్ల స్పష్టం చేశారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం అయ్యే క్రియా శీలక సభ్యత్వ నమోదులో 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యం అని జనసేన ప్రకటించింది. దీనికి అనుగుణంగా పార్టీ నాయకులు, నియోజకవర్గ నేతలు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని పార్టీ సూచించింది.

తెలంగాణలో మహిళలకు గుడ్‌న్యూస్‌.. మహిళా స్వయం సహాయక సంఘాలకు మీ సేవా కేంద్రాలు

మహిళా శక్తి పథకం కింద త్వరలో మహిళా స్వయం సహాయక సంఘాలు మీ సేవా కేంద్రాలను నిర్వహించనున్నారు. కేంద్రాలను కేటాయించడంతో పాటు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఫర్నిచర్ , ఇతర పరికరాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి కింద రూ.2.50 లక్షల రుణాన్ని మంజూరు చేస్తుంది . కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఎస్‌హెచ్‌జిలకు నెలవారీ వాయిదాలలో రుణ మొత్తాన్ని క్లియర్ చేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇంటర్మీడియట్ , డిగ్రీ చదివిన గ్రూప్ సభ్యులను ఆపరేటర్లుగా ఎంపిక చేసి కేంద్రాల నిర్వహణలో శిక్షణ ఇస్తారు.

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల హతం..

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 6 గంటల పాటు భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉన్న వందోలి గ్రామంలో 15మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో మహారాష్ట్ర పోలీసులు ఉదయం 10 గంటలకు గడ్చిరోలి నుంచి భారీ బందోబస్తుతో బయలుదేరారు. డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలోని ఏడు సి-60 పోలీసులు దట్టమైన అడవుల్లోకి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు వెళ్లారు. మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమైన ఎదురుకాల్పులు ఆరు గంటల పాటు కొనసాగాయి. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు, 3 ఏకే 47లు, 2 ఇన్సాస్, 1 కార్బైన్, ఒక ఎస్‌ఎల్‌ఆర్ సహా ఏడు ఆటోమోటివ్ ఆయుధాలు లభ్యమయ్యాయి. మరణించిన మావోయిస్టుల్లో తిప్పగడ్డ దళం ఇన్‌ఛార్జ్ డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం లియాస్ విశాల్ ఆత్రం ఉన్నారు.

GCC రాబోయే 2 సంవత్సరాలలో 2600 మందికి ఉపాధి కల్పిస్తుంది

ఈ రోజు హైదరాబాద్‌లో సనోఫీ హెల్త్‌కేర్ ఇండియా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జిసిసి) విస్తరణలో తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సనోఫీ రాబోయే 6 సంవత్సరాలలో € 400 MN పెట్టుబడులకు కట్టుబడి ఉంది, వచ్చే ఏడాదికి € 100 MN కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. GCC రాబోయే 2 సంవత్సరాలలో 2600 మందికి ఉపాధి కల్పిస్తుందని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. సనోఫీ హైదరాబాదులోని GCCని స్కేల్‌లో AI ద్వారా ఆధారితమైన మొదటి బయోఫార్మా కంపెనీగా అవతరించాలని కోరుకుంటోందని తెలిసి సంతోషిస్తున్నానన్నారు. హైదరాబాద్ సరైన సాంకేతిక ప్రతిభను , ఫార్మా ప్రతిభను కలిగి ఉన్న ఏకైక సంగమం వద్ద ఉంది. పరివర్తన యొక్క ప్రధాన అంశంగా డిజిటలైజేషన్‌ను అనుసరించే దిశగా సనోఫీ యొక్క వ్యూహాత్మక పుష్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా స్థానం పొందిందని ఆయన తెలిపారు. ఈ విస్తరణ మన స్థానిక ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడుతుందని మేము విశ్వసిస్తున్నామని, గ్లోబల్ ఫార్మా మేజర్‌లు తమ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి, విస్తరించడానికి తెలంగాణను ఎంచుకోవడానికి ఆవిష్కరణ, వృద్ధిని పెంపొందించే ఒక అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి మా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు.