NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మూడంతస్తుల బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారుల సాహస దృశ్యాలు వైరల్

మహారాష్ట్రలోని పూణె నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హదప్సర్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. బిల్డింగ్ మధ్య ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతుండగా పక్క ఫోర్సన్‌లో ఇద్దరు చిన్నారులు చిక్కుకుపోయారు. నీళ్లు తెచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఏ మాత్రం కంట్రోల్‌ కాలేదు. క్రమక్రమంగా మంటలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఓ చిన్నారి దిగే ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో సమీపంలో ఉన్న స్థానికులు గోడల మీద నుంచి ఎక్కుకుంటూ ఇద్దరు చిన్నారులను రక్షించారు. మరికొందరు మెట్ల మీద నుంచి తప్పించుకుని బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పూణె అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

అమిత్‌షా హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఎన్నికల సంఘం అధికారులు (వీడియో)

ఎన్నికల సంఘం అధికారులు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెలికాప్టర్‌ను, బ్యాగును తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పంచుకున్నారు. ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన ఈరోజు హింగోలి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎన్నికల సంఘం అధికారులు ఆయన హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో ఇలా రాశారు. “ఈ రోజు మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో నా హెలికాప్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత ఎన్నికలు, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తుంది. గౌరవనీయమైన ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను అనుసరిస్తుంది. మనమందరం ఎన్నికల వ్యవస్థకు సహకరించాలి. భారతదేశాన్ని ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్యంగా ఉంచడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి.” అని రాసుకొచ్చారు.

గచ్చిబౌలి పరిధిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి రెండు గంటల సమయంలో డివైడర్ ను బైక్ ఢీ కొట్టింది. ఇద్దరు యువకులు త్రిబుల్ ఐటీ చౌరస్తా నుంచి విప్రో సర్కిల్ వైపు బైక్ లో వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ.. డివైడర్ ను ఢీ కొట్టారు. దీంతో ఇద్దరు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు. మృతులు అమెజాన్ లో పనిచేస్తున్న వైజాగ్ కు చెందిన దేవరకుమార్ స్వామి (25) గాజులరామారంలో నివాసం ఉంటున్న వేంకన్న స్వామి (30)గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు గచ్చిబౌలి పోలీసులు.

బర్త్‌డే పార్టీకి పిలిచి.. యువకుడిని కొట్టి చంపిన స్నేహితులు..

నార్సింగిలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. అల్కపూరి కాలనీ లో ఐడిపిఎల్ కు చెందిన రోహిత్ అనే యువకుడిని స్నేహితులు కొట్టి చంపేశారు. స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజు వేడుకలో పాల్గొనడానికి ఐడీపీఎస్ నుంచి అల్కాపూర్ కాలనీకి వచ్చాడు. బర్త్ డే పార్టీలో స్నేహితులు ఫుల్ గా మద్యం సేవించారు. అనంతరం రోహిత్ పై దాడి చేశారు. పార్టీకి వచ్చిన స్నేహితుడు బీర్ బాటిల్ తో తలపై మోదాడు. దీంతో రోహిత్ స్పాట్ లో కుప్పకూలాడు. అనంతరం మిగతా స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. పథకం ప్రకారం రోహిత్ ను బర్త్ డే పార్టీకి పిలిపించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో అక్బర్ తో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. హంతకుడి కోసం మూడు టీమ్స్ వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం

ప్రభుత్వం ‘సూపర్ సిక్స్ హామీలు’ కింద అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే, మొత్తం రూ.141 కోట్లు 15 లక్షల 81 వేల నగదు లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 1.55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కల్పించబడినట్టు ఆయన చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

పదేళ్ల బీఆర్‌ఎస్‌ – ఏడాది మా పాలనపై చర్చకు సిద్ధం.. పీసీసీ చీఫ్ సవాల్

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై.. ఏడాది తమ పాలనపై చర్చకు తాము సిద్ధమని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దు అనే.. వికేంద్రీకరణ చేశామన్నారు. కేటీఆర్ తప్పు చేశా అని ఫీల్ ఐతున్నాడు.. కాబట్టి జైలుకు పోతా అంటున్నాడన్నారు. “మేం విచారణ జరపకుండా నే.. జైలుకు పోతా అంటున్నాడు. కొన్ని నియోజక వర్గాల్లో సమస్యలు ఉన్నాయి.. వాటిపై త్వరలోనే చర్యలు జరుపుతాం. పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ లో ఉన్న మాట వాస్తవం. మాది కార్యకర్తల పార్టీ.. వాళ్లకు పదవులు ఇవ్వాల్సి ఉంది.. కాస్త ఆలస్యం అయ్యింది. బీఆర్‌ఎస్ హయంలో అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయి. కాస్త సమయం పడుతుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ బస్సుల్లో వృద్దుల ప్రయాణానికి రాయితీ టికెట్లు.. మార్గదర్శకాలు జారీ

ఆర్టీసీ బస్సుల్లో వృద్దుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీ కి పాటించాల్సిన నియమాలతో సిబ్బందికి మరోసారి APSRTC మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని జిల్లాల డీపీటీవో, ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పల రాజు ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్దులకు బస్సుల్లో ప్రయాణానికి టికెట్ ధరలో 25 శాతం రాయితీ టికెట్లను ఎప్పట్నుంచో ఆర్టీసీ జారీ చేస్తోంది. టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్దారణ కోసం గుర్తింపు కార్డులు చూపించే విషయమై సిబ్బందికి, వృద్దులకు మధ్య బస్సుల్లో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది కేవలం ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటేనే జారీ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులను అంగీకరించడం లేదు. ఒరిజినల్ లేనప్పుడు డిజిటల్ కార్డులు చూపించవచ్చని తెలిపినా అవగాహన లేమితో టికెట్ల జారీకి నిరాకరిస్తున్నారు. దీనిపై పలు ప్రాంతాల నుంచి వృద్దులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.

స్వయం సహాయ‌క సంఘాల‌కు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్..

స్వయం సహాయ‌క సంఘాల‌కు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పారు. సంఘాల్లోని మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌హెచ్‌జీలకు వెయ్యి మేగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాల‌ని ప్రభుత్వాన్ని కోరినట్లు పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తెలిపారు. మంత్రి ఆదేశాల‌తో ఇంధ‌న కార్యద‌ర్శికి పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యద‌ర్శి లోకేష్ కుమార్ ప్రతిపాద‌న‌లు పంపారు. మ‌హిళా సంఘాల‌కు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వెయ్యి మేగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లను కేటాయించాల‌ని కోరినట్లు తెలిపారు. మ‌హిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయిస్తే అనువైన భూములను గుర్తించి మ‌హిళా సంఘాలకు లేదా స‌మాఖ్యల‌కు లీజుకు భూముల‌ను ఇప్పిస్తామ‌ని వెల్లడించారు.

ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటి మద్రాసు నిర్ణయించింది. ఐఐటిఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం, పరిశోధన, శిక్షణ, సాంకేతికతలో రాష్ట్రం ముందుకు పోవడానికి దోహదం చేస్తాయి.

మరింత ఆందోళనకరంగా ఢిల్లీ పొల్యూషన్.. ఆఫీసుల టైమింగ్స్‌లో మార్పులు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ఆందోళనకరంగా మారింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. అంత భయంకరంగా వాతావరణం పొల్యూషన్ అయిపోయింది. ఇక చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. జనాలను కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే పొల్యుషన్ కంట్రోల్‌కు ఢిల్లీ సర్కార్ చర్యలు చేపట్టింది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక పాఠశాలలను ఇప్పటికే మూసివేసేశారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా గవర్నమెంట్ ఆఫీసుల టైమింగ్స్‌ విషయంలో కూడా సీఎం అతిషి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.