NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మొదటినుంచి తోడు దొంగల పార్టీలు..

సంగారెడ్డిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, BJYM జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి కేటీఆర్ తో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడేమో..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మొదటినుంచి తోడు దొంగల పార్టీ..నాణానికి బొమ్మ బొరుసు ఈ పార్టీలు అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, మెడిగడ్డ, సుంకిశాల విషయంలో రెండు పార్టీలు ప్రెస్ మీట్లతో సరిపెడుతున్నారు తప్ప యాక్షన్ లేదు అని, తప్పు చేసినోడు కొడుకైన, కూతురైన శిక్షించడానికి వెనుకాడనని కేసీఆర్ అన్నాడు కానీ ఆయన మనసు ఒప్పలేదన్నారు ఎంపీ రఘునందన్‌ రావు.

తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్యాయం చేస్తున్నాయి..

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 229 మందికి 56 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, రెండు పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకి మోసం చేశాయన్నారు. బీజేపీకి 8 సీట్లు ఇస్తే తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని, బీజేపీకి ఆంధ్రా తీపి అయింది… తెలంగాణ చేదు అయ్యిందా..? అని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలిపోతే కాళేశ్వరం మొత్తం కూలి పోయిందని ప్రచారం చేశారని, కాళేశ్వరం కూలి పోతే రంగనాయక సాగర్ లో నీళ్లు ఎలా వచ్చాయి..? అని ఆయన ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా, గోదావరి జలాలు, రైలు, మెడికల్ కాలేజ్ అన్ని కెసిఆర్ తోనే సాధ్యం అయిందని ఆయన వ్యాఖ్యానించారు.

కదులుతున్న రైలు నుండి దూకేసిన ప్రజలు.. 20 మందికి గాయాలు..

ఉత్తరప్రదేశ్‌ లోని షాజహాన్‌పూర్‌ లో ఆదివారం ఉదయం బిల్‌పూర్ – మిరాన్‌పూర్ కత్రా స్టేషన్ల మధ్య పంజాబ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కదులుతున్న రైలు నుండి దూకారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) క్షతగాత్రులను షాజహాన్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ 7 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ విషయంపై పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది

రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని వివేకానంద గౌడ్ విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంత షాడో మంత్రుల దందా నడుస్తుందని, కోవర్టు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. సుంకిశాల ప్రమాదం పై బీఆర్‌ఎస్‌ పార్టీ పలు ప్రశ్నలను ప్రభుత్వం ముందు ఉంచిందని, సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనలో ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. నిర్మాణం సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశామన్నారు వివేకానంద. ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిందని, స్టేట్ లో ప్రభుత్వం కంటే సోషల్ మీడియా వేగవంతంగా పని చేస్తోందన్నారు. ప్రమాదం పై మంత్రుల మాటలకు పొంతన లేదని, పెద్ద విపత్తు జరిగింది నష్టం వాటిల్లింది కేంద్ర మంత్రి, బీజేపీ నేతలు దీనిపైన మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఫైనాన్స్ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయి వీటిపైన మాట్లాడరని, బిల్లుల జారీ అంశంలో 7 శాతం ఒకచోట , 1 శాతం మరో చోట అంటూ దోచుకుంటున్నారన్నారు. స్కూల్ విద్యార్థులు మరణిస్తే.. బీజేపీ నేతలు దీని పైన మాట్లాడరని ఆయన మండిపడ్డారు.

కులం.. సమాజాన్ని సమానంగా నడిపిన వ్యక్తి సర్వాయి పాపన్న..

జై గౌడ్ ఉద్యమం కమిటీ ఆధ్వర్యంలో 374వ సర్దార్ పాపన్న మహారాజ్ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేఫ్టీ మోపులు ఇవ్వబోతున్నామని, ప్రభుత్వ.. అసైన్డ్ భూముల్లో యాభై శాతం తాటి.. ఈత.. కర్జూరా మొక్కలను పెంచాలని సీఎం చెప్పారని, బార్ల రూపంలో కల్లు షాపులను క్లాస్ గా మోడిఫై చేస్తామన్నారు. ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.. నాది బాధ్యత అని, మొన్ననే సీఎంతో కలిసి భూమి పూజ చేయాలి అనుకున్నాం.. స్థలం కూడా పరిశీలించామని ఆయన వెల్లడించారు.

ఈఫిల్ టవర్ ఎక్కిన ఓ వ్యక్తి.. అలర్ట్ అయిన పోలీసులు

కాసేపట్లో పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ కార్యక్రమానికి ముందు పారిస్లో ఒలింపిక్ నిర్వాహకులు ఊహించని సంఘటన జరిగింది. పారిస్‌లోని చారిత్రక ఈఫిల్ టవర్‌ను ఓ వ్యక్తి అధిరోహించాడు. దీంతో అధికారులు హడావుడిగా ఈఫిల్ టవర్‌ ప్రాంతం చుట్టూ ఉన్న వారిని అక్కడి నుంచి పంపించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఓ వ్కక్తి చొక్కా ధరించకుండా టవర్‌ను ఎక్కుతూ కనిపించాడు. అయితే.. అతను ఎటు వైపు నుంచి ఎక్కాడో తెలియలేదు. మొదటిసారి చూసినప్పుడు డెక్ పైన, రెండోసారి ఒలింపిక్ రింగుల పైన కనిపించాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుక సెయింట్ డెనిస్‌లోని స్టేడ్ డి ఫ్రాన్స్‌లో రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ప్రదేశం ఈఫిల్ టవర్‌కు చాలా దూరంలో ఉంది.

స్వాతంత్ర దినోత్సవ పండుగ ప్రారంభమైంది

సనత్ నగర్ అసెంబ్లీ బన్సీలాల్ పేట, న్యూ బోయి గూడలో జరిగిన బోనాల పండుగ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బన్సీ లాల్ పేట్ చాచా నెహ్రు నగర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని సి-క్లాస్ బన్సీలాల్‌పేట – శ్రీ బండ మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. తర్వాత బన్సీలాల్ పేట శ్రీ రేణుకా ఎల్లమ్మ, శ్రీ నల్ల పోచమ్మ ముత్యాలమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం న్యూ భోయిగూడ ఉప్పలమ్మ దేవాలయం, శ్రీ నల్ల పోచమ్మ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి గారు అనంతరం శ్రీ రామాలయంలో రాములవారిలో పూజాలో పాల్గొన్నారు , తర్వాత స్కంద గిరి సుబ్రమణ్య స్వామిని ఆలయంలో జరిగిన లలిత త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకొని కుంకుమర్చనలో పాల్గొన్నారు.

విద్యా విధానంలో మార్పులు రావాలి..

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప మున్సిపాలిటీలోని ఎం.కన్వెన్షన్ నందు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా.. ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనసభ్యులు, పలువురు ప్రముఖులు వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ఆవిష్కరించిన పుస్తకాలను అతిధులకు అందజేశారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లో మొదటిసారి పోటీ చేసినప్పుడు ఒక్క రూపాయ కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ప్రజలే తనకు ఎదురు డబ్బులు ఇచ్చిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. రెండవ సారి పోటీ చేసినప్పుడు తాను, జైపాల్ రెడ్డి గెలవాలి అని కోరుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యం మాతృభాష, ఆ తరువాత మరి ఏ భాష అయినా అని తెలిపారు. కనుక అందరూ ముందు మాతృభాష మాట్లాడాలని చెప్పారు. మాతృభాష కంటి చూపులాంటిది.. పరాయి భాష రేబాన్ కళ్ళజోడు లాంటిదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.