NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మేయర్ వీడియోస్ మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) మేయర్‌ గద్వాల్‌ విజలక్ష్మి, తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కించపరిచేలా వీడియోను రూపొందించి, ప్రచారం చేసినందుకు గాను ఓ ఫోటోగ్రాఫర్‌ను ఆగస్టు 10వ తేదీ శనివారం నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఉప్పల్ సమీపంలోని పీర్జాదిగూడలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల చామకూరి లక్ష్మణ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను మేయర్ , రాష్ట్ర మంత్రి బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను అనుచితమైన, అవమానకరమైన ఫార్మాట్‌లో మార్ఫింగ్ చేసి X, Instagram , Facebookతో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేశాడు.

అనంతనాగ్‌ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాల తనిఖీలు చేస్తుండగా.. అహ్లాన్ గగర్మండు ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇంకా.. అహ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. సెర్చ్ టీమ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. దీనికి ధీటుగా సైనికులు కూడా కాల్పులు జరుపుతున్నారు.

అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై దాడి.. రాజ్యాంగంపై జరిగినట్లే

విజయవాడలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి, శిలాఫలకం ధ్వంసం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై దుండగులు చేసిన దాడి ఘటనను, రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ దాడిని నిరసిస్తూ.. వైసీపీ శ్రేణులు గుంటూరు శంకర్ విలాస్ నుండి లాడ్జి సెంటర్ వరకు క్యాండిల్ నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం మీద సుత్తెలు, రాళ్ళతో దాడి చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ దాడి అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో అరాచక పాలన సాగుతున్నదని.. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తగలబెడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని.. ఏదో ఒకరోజు టీడీపీ ప్రభుత్వం కూడా కూలిపోతే, ఇదే దుష్ట సంప్రదాయాన్ని వైసీపీ కొనసాగిస్తే ఏమవుతుందో టీడీపీ నాయకులు ఆలోచించుకోవాలని అంబటి పేర్కొన్నారు. జరుగుతున్న దాడులపై హోంమంత్రి స్పందించాలని.. చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి డిమాండ్ చేశారు.

దేశాన్ని అభివృద్ధి పంథాలో నడిపేలా కేంద్ర బడ్జెట్ ఉంది

దేశాన్ని అభివృద్ధి పంథాలో నడిపేల కేంద్ర బడ్జెట్ ఉందన్నారు లోక్ సభ బీజేపి విప్ కొండ విశ్వేశ్వర రెడ్డి. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కన పెట్టీ …35 వేల కోట్ల రూపాయలను రాష్ట్రానికి ఇచ్చిన కేంద్రమని, వాస్తవాలు పక్కన పెట్టీ… పార్టీలు రాజకీయాలు మాట్లాడతాయని, యూపీ, గుజరాత్ పేరు కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు విశ్వేశ్వర్‌ రెడ్డి. ఎంపీలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ ఇవ్వాలంటే… యూపీ, ఎంపీ లకు అధిక నిధులు ఇవ్వాల్సి ఉంటదన్నారు. ఎంపీల సంఖ్యతో సంబంధం లేకుండా బడ్జెట్ ఉంటుందని, ఒక వైపు మీ బడ్జెట్ బాగాలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇంకో వైపు మా బడ్జెట్ కాఫీ కొట్టారని అంటుందని, అంటే మీ ఐడియా బాగాలేదని ఒప్పుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

ఈనెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు..

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పనికి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుండగా.. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అందుకు సంబంధించిన సమాచాారాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన లాంఛనంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ప్రతి గ్రామంలోనూ రెవిన్యూ సదస్సులు పెడతామన్నారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా.. చిన్న రెవిన్యూ గ్రామాల్లో సగం రోజు సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.

పంచాయితీల నిధుల విషయంలో డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయితీలకు అందించే నిధుల విషయంలో కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ఖర్చుల కోసం ఏటా ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు రూ.100, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.250 ఇచ్చేదని.. గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంతే మొత్తంలో నిధులు ఇచ్చేదని పవన్ తెలిపారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆ మొత్తాన్ని భారీ స్థాయిలో పెంచారు. మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.25 వేలు, మైనర్ గ్రామ పంచాయతీలకు రూ.10 వేల రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన టీటీడీపీ నేతల భేటీ..

హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍లో తెలంగాణ టీటీడీపీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుంది. కాగా.. ఈ సమావేశంలో టీటీడీపీ ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో టీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ నేతలతో చర్చిస్తున్నారు.

తెలంగాణకు స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ సహకారం

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి.

క్వార్టర్ ఫైనల్‌లో రితికా ఓటమి.. కాంస్యం మీదే ఆశలు

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో రీతికా హుడా ఓటమి పాలైంది. 1-1తో కిర్గిస్థాన్‌కు చెందిన టాప్-సీడ్ ఐపెరి మెడెట్ కైజీ చేతిలో ఓడిపోయింది. కైజీ ఫైనల్‌కు చేరితే.. రిపీచేజ్ రౌండ్‌లో రీతికా కాంస్య పతకాన్ని సాధించే అవకాశం ఉంది. అంతకుముందు రీతికా 12-2 టెక్నికల్ ఆధిక్యతతో హంగరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ క్రమంలో.. ఓటమి పాలవ్వడంతో కాంస్య పతకం పైనే ఆశలు ఉన్నాయి.

కాంగ్రెస్ ఎగవేత… కోతల ప్రభుత్వం…

కాంగ్రెస్ ప్రభుత్వం జులై, ఆగస్టు నెలలో 10 రోజులు కావస్తున్నా లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వలేదని మాజీ మంత్రి టీ హరీష్‌ రావు అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హరీష్‌ రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో తాము వాగ్దానం చేసిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. వానకాలం పంట కాలం ముగుస్తున్నప్పటికీ ప్రభుత్వం రైతు భరోసా ఆర్థిక సాయం విడుదల చేయలేకపోయింది. రైతుబంధు సాయాన్ని జూన్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసేదని, రైతు భరోసా కోసం రూ.7,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు రూ.5వేలు కూడా పొడిగించలేకపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద వధువుకు అదనంగా తులాల బంగారం అందజేయాలన్న మాటను పక్కన పెడితే గత ఎనిమిది నెలలుగా కల్యాణలక్ష్మికి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.

Show comments