Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

పాకిస్థాన్‌లో ఎన్నికలు వాయిదా.. తీర్మానాన్ని ఆమోదించిన సెనేట్

పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఎన్నికలపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. చలి వాతావరణం, భద్రతాపరమైన కారణాలతో సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ పాకిస్థాన్ పార్లమెంట్ తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికల తేదీని 8 ఫిబ్రవరి 2024గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. నేటి సెషన్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని, ఎన్నికలను ఆలస్యం చేయాలనే తీర్మానాన్ని సెనేట్ ఆమోదించింది. ఈ తీర్మానం రెండుసార్లు సమర్పించబడింది. సమాచార శాఖ మంత్రి ముర్తజా సోలంగి గైర్హాజరు కావడంలో తొలిసారి, ఆయన సమక్షంలో రెండోసారి తీర్మానం ప్రవేశ పెట్టారు. రెండుసార్లు సెనేట్ మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించింది.

లక్ష్య సాధనకు సమష్టిగా ముందుకెళ్దాం

సింగరేణి కాలరీస్ ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనలో ప్రతీ రోజూ విలువైనదేనని.. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. బలరామ్ స్పష్టం చేశారు. దేశ ఇంధన అవసరాలు, రానున్న వేసవి కాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేందుకు వీలుగా రోజుకు 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని, రోజుకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించాలని ఆదేశించారు. సింగరేణి కాలరీస్ ఛైర్మన్ మరియు ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అన్ని ఏరియాల జీఎంలతోపాటు వివిధ విభాగాల జీఎంలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఉత్పత్తి, అడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టు సహా కంటిన్యూయస్ మైనర్లు, సీహెచ్పీలపై సమీక్ష చేయడంతోపాటు సంస్థ పురోభివృద్ధిపై దిశా నిర్దేశం చేశారు.

దావూద్ పూర్వీకుల ఆస్తి వేలం.. చిన్న ప్లాట్‌ రూ.2 కోట్లకు విక్రయం

చాలా కాలం తర్వాత ఈమధ్య అండర్ వరల్డ్ డాన్ ‘దావూద్ ఇబ్రహీం’ పేరు సోషల్ మీడియా లో తెగ వినిపిసుంది. ఆయనపై పాకిస్తాన్ లో విషప్రయోగం జరిగినట్టు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా లో ఉన్న దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తుల గురించి పెద్ద చర్చ నడుస్తుంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబానికి చెందిన పూర్వీకుల ప్లాట్‌ను రూ.15,440 రిజర్వ్‌ ధరతో శుక్రవారం వేలంలో రూ.2 కోట్లకు విక్రయించారు. పారిపోయిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నాలుగు పూర్వీకుల ఆస్తులలో ఇది ఒకటి. దీనిని స్మగ్లర్స్‌ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) అథారిటీ (SAFEMA) వేలం వేసింది.

కాళ్లు చచ్చుబడిపోయి.. బెడ్ పై లేవలేని స్థితిలో లేడీ కమెడియన్..

ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ విజయాలు ఉన్నంతవరకే గుర్తింపు వస్తుంది. ఒక్కసారి దాన్ని నుంచి బయటకు వస్తే పట్టించుకొనేవారు ఉండరు. ఇక సీనియర్ నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సీనియర్ నటులు బతికి ఉండగానే చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్. ఇక గత కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ లేడీ కమెడియన్ పావలా శ్యామల చనిపోయినట్లు కూడా రాసుకొచ్చారు. అయితే ఆమె చనిపోలేదు కానీ, దీనస్థితిలో ఉంది. నటి పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రావాలా, గోలీమార్ లాంటి సినిమాలో ఆమె కామెడీ.. ఇప్పటికీ మీమ్స్ రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి. ఇక గత కొన్నేళ్లుగా పావలా శ్యామల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక ఈ మధ్య అనారోగ్యం ఎక్కువ కావడంతో ఆమె బెడ్ కే అంకితమయ్యారు.

ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా.. వైసీపీకి ఎమ్మెల్యే గుడ్‌బై!

వైసీపీని వీడుతున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. సీఎంఓలో పార్టీ కీలక నేతలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు టికెట్‌ లేదని చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపుకు టికెట్‌ లభించకపోవడంతో ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతానని ఆయన వెల్లడించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. “నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను. నేను సీఎం మాట ఇంతవరకు మీరలేదు. ఇప్పుడు సర్వే పేరు చెప్పి నా గొంతు కోశారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం రెండు చోట్ల నుంచి నేను, నా భార్య పోటీ చేస్తాము. రాయదుర్గం నుంచి నా భార్య తప్పని సరిగా పోటీ చేస్తారు. సీఎంను కలిసి మాట్లాడడం మాకు కుదరలేదు.

ప్రపంచమంతా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోంది..

జనవరి 22 అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఉండబోతోందన్నారు బీజేపీ మధ్యప్రదేశ్ రాస్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచమంతా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోందని, కాంగ్రెస్ ఇండియా కూటమి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడుతోందన్నారు. హిందు వ్యతిరేక శక్తులతో కలిసి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీ రాముడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి పనిచేస్తోందని, హిందు వ్యతిరేక కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్నారని ఆయన వెల్లడించారు. శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్టలో మేము భాగస్వాములం అవుతున్నామని ఆయన అన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హిందు వ్యతిరేక శక్తులను వ్యతిరేకించకపోవడం దురదృష్టకరమని, అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న ప్రకటనలకు పొంతన లేదన్నారు.

ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తా.. మూడోసారి ఎంపీని నేనే..

విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంతపార్టీ, అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో నా నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీలో కొనసాగాలా ? వద్దా ? అనే విషయంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పెలా అవుతుందని కేశినేని ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచానని, స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి మూడోసారి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో జరుగనున్న పార్టీ సమావేశానికి రావొద్దని తనకు సమాచారం అందించారని, చంద్రబాబు ఆదేశాలను శిరసా వహిస్తానని పేర్నొన్నారు. ఏడాదిగా కేశినేని నాని పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తరుచూ పార్టీపై ఆరోపణలు చేస్తుండడంతో పార్టీలో ఆయన కేంద్ర బింధువుగా మారారు. పార్టీ మారుతాడని ప్రచారం జరుగుతున్నా వాటిని ఖండిస్తున్న నాని కొద్ది రోజుల్లో తన అనుచరులు, నాయకులతో కలిసి నిర్ణయం తీసుకోనున్నారు.

సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

సంక్రాంతి పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ సంక్రాంతికి ఆర్టీసీ అధికారులు అదనపు ఛార్జీల్లేకుండా ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది. సంక్రాంతి కోసం 6795 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. జనవరి 6 నుంచి 18 వరకూ స్పెషల్ బస్సులను నడపనున్నారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువ కావడంతో నియంత్రించడానికే స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 7 వ తేది నుంచి 15 వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హైదరాబాద్ బస్ భవన్ లో శుక్రవారం ఉన్నతాధికారులు, ఆర్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బావ బామ్మర్దులు ఇద్దరూ జోగడు.. బాగడు…

అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే సీఎం రేవంత్‌ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారని, కేటీఆర్.. హరీష్ బస్సులో తిరిగరు.. వాళ్లంతా బెంజ్ కార్ల లో తిరుగుతారు కాబట్టి వాళ్లకు ఆర్టీసీ బస్సు తెలియదన్నారు కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు కేటీఆర్.. హరీష్ అని, నేను సభలో ఉంటే హరీష్..కేటీఆర్ ని ఆడుకునే వాణ్ణి అన్నారు. టైం బాగోలేక ఓడిపోయినని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్.. హరీష్ కి సవాల్.. ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు బస్సులో తిరిగారు.. మీకు అమరవీరుల స్థూపం మాత్రమే తెలుసు.. వచ్చి నివాళి అర్పించి పోతరు.. మా వాళ్లకు మీరు అధికారంలో ఉన్నప్పుడు సభలో మైక్ ఇచ్చారా..? ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంచింది మేము. కేసీఆర్ కుటుంబానికి అక్కర లేకపోవచ్చు కానీ.. పేదలకు ఇది ఎంతో అవసరం.. హరీష్.. కేటీఆర్..మీ తొమ్మిదేళ్లు పాలన ని.. కేసీఆర్ పాలన అన్నారు.. కాంగ్రెస్ అధికారంలో రాగానే ప్రజా పాలన అన్నారు కానీ.. రేవంత్ పాలన అనలేదు. ప్రజా పాలన అనే సంస్కారం మీకు లేనే లేదు. మీకు.. మా కాంగ్రెస్ కి తేడా అదే. 9 ఏండ్లలో సీఎం సెక్రటేరియట్ కి పోలేదు.

రాజారెడ్డి, వైఎస్సార్ ఆత్మలతో మాట్లాడతా.. కేఏ పాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం అందరికి తెలిసిన విషయమే. షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పెద్ద తప్పిదమన్నారు. ఆస్తులు, పదవి కోసం సోనియాకు షర్మిల తన పార్టీని అమ్మేశారని విమర్శించారు. షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా? అంటూ మండిపడ్డారు. రాజారెడ్డి, వైయస్ ఆత్మలతో తాను మాట్లాడుతానన్నారు. వారు బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునేవారని, ఇప్పుడు వారి ఆత్మ ఘోషిస్తుందని వెల్లడించారు. షర్మిల నీకు రాజకీయాలు అవసరమా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. జగన్‌ను తిట్టడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం షర్మిల పని అంటూ ఆయన వ్యాఖ్యానించారు. షర్మిలను ఏపీకి తీసుకువచ్చి నాశనం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

 

Exit mobile version