NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారు..

గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. సొంత జిల్లాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడో చూస్తుంటే కనిపిస్తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారు.. ఎలాంటి అభివృద్ధి చేశారో ఇక్కడ చూస్తుంటే కనపడుతుందని పేర్కొన్నారు. కడప జిల్లా ప్రజలు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డికి ఎన్నో సీట్లు ఇచ్చారు.. కానీ సొంత జిల్లా కడపను అభివృద్ధి చేయలేదని ప్రజలు గుర్తించి ఎన్డీఏ కూటమికి అవకాశం ఇచ్చారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు.

అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో ప్రభుత్వం అమలు చేస్తోంది..

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో ‘గుంతలు పూడ్చే’ పనులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో గత ప్రభుత్వం కనీసం గుంతలు పడిన రోడ్లను బాగు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించుకుని ఉంటే ఇబ్బంది ఉండేది కాదని పేర్కొన్నారు. రోడ్ల పరిస్థితిపై గత ప్రభుత్వ కాలంలో అయితే వాళ్లు పోయలేదని సమాధానం చెప్పగలిగే వాళ్ళమని, ఇప్పుడు వెళ్లడానికి తమకే సిగ్గేస్తుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలో నిధులు లేకపోయినా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్ల మరమత్తులకు 79 లక్ష రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని రోడ్లను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

పెంచిన రైతు భరోసా కాదుకదా ఉన్న రైతుబంధును ఎగ్గొట్టింది రేవంత్ ప్రభుత్వం

రుణమాఫీ చేస్తానని, రైతుబంధు పెంచి ఇస్తానని వాగ్దానాలన్నీ చేసి, ఇవ్వాళ పెంచిన రైతు భరోసా కాదుకదా ఉన్న రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వమన్నారని పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. రైతులకు రైతు బంధు రాదు, రుణమాఫీ పూర్తి కాదు, బోనస్ బొగస్ అయిపాయె, పంటలు కొనే దిక్కు లేదు. పత్తి రైతులకు మద్దతు ధర లేదని, రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే సమయంలో రేషన్‌ కార్డు ఆధారంగా ఇచ్చారా? మాఫీకి, దీనికి లింకు పెట్టడం ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం రైతు భరోసా ఎకరానికి రూ. 15,000 ఇస్తామని మాయ మాటలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక రైతు భరోసాను పక్కనబెట్టి రోజుకో మాట మాట్లాడుతూ రైతులను మోసం చేస్తోందని, కాంగ్రెస్ వచ్చాక 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షలు ఎప్పుడూ నిర్వహించారో చెప్పే దమ్ముందా? అని ఆయన అన్నారు. గతేడాది శాసనసభ ఎన్నికలకు ముందు అక్టోబర్ లో అశోక్ నగర్ కు వచ్చి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి విద్యార్థులకు నమ్మబలికారని, దాదాపు ఏడాది పూర్తైంది. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు అశోక్ నగర్ కు రావాలి. విద్యార్థులే వాళ్లకు సన్మానం చేస్తారన్నారు లక్ష్మణ్‌.

సూపర్ సిక్స్ అన్నారు.. సింగిల్ రన్ కూడా తీయలేదు.. మాజీ మంత్రి విమర్శలు

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పర్యటనలో స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడలేదని అన్నారు. అడిగితే దాటవేసే ప్రయత్నం చేశారు.. సీఎం చంద్రబాబే తాము కట్టిన కట్టడాన్ని మెచ్చుకున్నాడని అన్నారు. కానీ ప్రజలను తప్పు దోవ పట్టించి జగన్ కోసం కట్టుకున్న ప్యాలెస్‌గా చెప్తున్నాడని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చంద్రబాబు తాత్కలింగా అమరావతిలో నిర్మిస్తే జగన్ శాశ్వత అద్భుత భవనాల్ని నిర్మించారన్నారు. అమరావతిలో రూ.1100 కోట్లు ఖర్చు పెట్టి టెంపరరీ భవనాలు కట్టారు.. చంద్రబాబు కట్టిన భవనాల్లో వర్షం వస్తే నేరుగా ఛాంబర్ లోకి నీరు వచ్చేదని ఆయన పేర్కొన్నారు. కానీ జగన్ పర్మినెంటిగా ఋషికొండలో భవనాలు నిర్మించారని తెలిపారు.

కడియంకి రేవంత్ రెడ్డిని కలిసే దిక్కు లేకుండా పోయింది…

జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతుండు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల్లో మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అని, నమ్మకద్రోహి, జిత్తులు మారి నక్కగా పేరున్న కడియం శ్రీహరి కేటీఆర్ పై మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ ప్రభుత్వం, అందుకే కేటీఆర్ పాదయాత్ర చేపడుతున్నారన్నారు. కేటీఆర్ పై కడియం నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు తాటికొండ రాజయ్య. కడియంకి రేవంత్ రెడ్డిని కలిసే దిక్కు లేకుండా పోయిందని, పార్టీలు మారడంలో కడియం శ్రీహరి మెరుపు వీరుడు,హైట్రిక్ సాధించాడన్నారు తాటికొండ రాజయ్య. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వీరుడు కడియం అని ఆయన సెటైర్లు వేశారు. కేసీఆర్ కు ఎవరు చేయని నమ్మకద్రోహం చేసి 100 కోట్లకు అమ్ముడు పోయినా నికృష్టుడు కడియం శ్రీహరి అని, తాత ముత్తాతల నుండి ఆస్తి పరులైన కేసీఆర్, కేటీఆర్ పై కడియం శ్రీహరి స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడన్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..

ఎంత టెక్నాలజీ వచ్చినా.. మూఢ నమ్మకాలు అనేవి కనుమరుగవడం లేదు. మూడనమ్మకాలు, క్షుద్రపూజలు జనాలను ఇంకా భయపెడుతున్నాయి. వ్యాపారం, ఆరోగ్యం, డబ్బులు బాగా సంపాదించాలని ఇలా అనేక వాటికి జంతువులను బలిస్తున్నారు. మూఢ నమ్మకాలపై పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా కనీసం చైతన్యం రావడం లేదు. తాజాగా.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో వజ్రాలగుట్ట దగ్గర క్షుద్రపూజల కలకలం రేపుతుంది.

వక్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకం..

విజయవాడలో వక్ఫ్ పరిరక్షణ మహా సభలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోందని అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారని తెలిపారు. ఈ బిల్లును క్యాబినెట్‌లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం ఏ మంత్రి విబేధించినా మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు రావాల్సి ఉంటుంది.. కానీ ఈ బిల్లుని రామ్మోహన్ నాయుడు ఆమోదించారని విజయసాయి రెడ్డి తెలిపారు. వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైసీపీ వ్యతిరేకించింది.. వైసీపీ తరఫున తాము డీసెంట్ నోట్ కూడా ఇచ్చామని పేర్కొన్నారు. ముస్లింల తరఫున వైసీపీ ఎప్పుడూ నిలపడే ఉంటుందని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేలు కోట్లు రుణమాఫీ చేశాం

గత నలభై ఏళ్లుగా ఇల్లందు నియోజక వర్గంతో నాకు అనుబంధం ఉందని, ఆదివాసీలు గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాచలం పినపాక ఇల్లందు నియోజక వర్గాల్లో ఎక్కువ సమయం కేటాయించా అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఇవాళ ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎర్ర బస్సు కరెంట్ బల్బు చూడని గుండాల ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు తో ప్రగతి బాట పట్టించానన్నారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డా అని ఆయన వ్యాఖ్యానించారు.

భట్టి విక్రమార్క గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు..

అత్యున్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 200 కోట్ల రూపాయలతో స్కూల్ నిర్మాణం జరగబోతుందన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. భట్టి విక్రమార్క గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, కాంగ్రెస్ పార్టీకి విధేయుడన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశాడని, భట్టి విక్రమార్క సమర్థవంతమైన నాయకత్వంతో రైతు రుణమాఫీ చేసామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. పరిచయం అవసరంలేని వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని, అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఘనత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది అని ఆయన కొనియాడారు.

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఎఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌గా 2009 బ్యాచ్ ఐఎఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ నియమించింది సర్కార్. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ కమిషనర్‌గా పని చేశారు. అలాగే.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా 2013 ఐఎఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ షా నియమించారు. ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా 2015 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అభిషిక్త కిషోర్‌కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Show comments