NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్‌లో సోమవారం స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. మంగళవారం కాస్త తగ్గాయి. అయితే నేడు పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,440గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు రాష్ట్రాల్లో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,570గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,440గా కొనసాగుతోంది.

జూలై 31 నాటికి 88% బ్యాంకులకు వచ్చిన రూ. 2,000 నోట్లు

RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) 31 జూలై 2023 నాటికి మొత్తం 88 శాతం 2000 రూపాయల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు తెలిపింది. RBI ప్రకారం.. మే 19, 2023 వరకు మొత్తం 3.56 లక్షల కోట్ల రూపాయల విలువైన 2,000 రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయి. జూలై 31, 2023 నాటికి రూ.3.14 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. ఇప్పుడు రూ.42,000 కోట్ల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి 30 సెప్టెంబర్ 2023 చివరి తేదీ.

2000 రూపాయల నోట్లకు సంబంధించిన స్టేటస్‌ను ఆర్‌బీఐ విడుదల చేసింది. మే 19, 2023న ఆర్‌బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. మార్చి 31, 2023 వరకు రూ. 2,000 నోట్ల చెలామణిలో మొత్తం రూ. 3.62 లక్షల కోట్లు ఉండగా మే 19, 2023 నాటికి రూ. 3.56 లక్షల కోట్లకు తగ్గింది. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం జూలై 31, 2023 వరకు రూ.3.14 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణి నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం రూ.42,000 కోట్ల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. అటువంటి పరిస్థితిలో, మే 19, 2023 న RBI యొక్క 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుండి 88 శాతం నోట్లు తిరిగి వచ్చాయి.

200 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన వెస్టిండీస్‌.. టీమిండియాదే వన్డే సిరీస్‌!

ప్రయోగాలు చేసి రెండో వన్డేలో ఓడిన భారత్.. మంగళవారం జరిగిన మూడో వన్డేలో మాత్రం వెస్టిండీస్‌ను 200 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 352 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ 35.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. గుడాకేష్‌ మోటీ (39 నాటౌట్) టాప్‌ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో అథనేజ్‌ (32), అల్జారీ జోసెఫ్‌ (26), కరియా (19) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4/37) నాలుగు వికెట్స్ పడగొట్టగా.. ముకేశ్ కుమార్‌ (3/30) మూడు వికెట్స్ తీశాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. గురువారం నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు (351/5) చేసింది. ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌ (77; 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. మొదటి రెండు వన్డేల్లో తేలిపోయిన శుభ్‌మన్‌ గిల్ (85; 92 బంతుల్లో 11 ఫోర్లు) కూడా భారీ ఇన్నింగ్స్‌ఆడాడు. సంజు శాంసన్ (51; 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (70; 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.సూర్యకుమార్‌ యాదవ్‌ (35) ఫర్వాలేదనిపించాడు. విండీస్‌ బౌలర్లలో షెఫర్డ్ 2 వికెట్స్ పడగొట్టగా.. కరియా, జోసెఫ్‌, మోటీ ఒక్కో వికెట్ పడగొట్టారు. సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడకున్నా.. యువ ఆటగాళ్లు 300లకు పైగా స్కోర్ చేశారు.

సామాన్యులకు గుడ్ న్యూస్ త్వరలో తగ్గనున్న పాల ధరలు

సామాన్యులకు శుభవార్త. వర్షాకాలం తర్వాత పాల ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశంలో పాల ధరలు మూడేళ్లలో 22 శాతం పెరిగాయి. గత ఏడాది 10 శాతం పెరిగింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా మాట్లాడుతూ పచ్చిమేత ధరలు తగ్గుముఖం పట్టాయని, వర్షాకాలం తర్వాత పాల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు.

రూపాలా మాట్లాడుతూ.. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు పంటలను దెబ్బతీస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దాణా కొరత లేదన్నారు. రాష్ట్రాలు తగినంత స్టాక్‌ను కలిగి ఉన్నాయని చెప్పారు. సరఫరా ఖాళీని పూరించాలని కోరారు. పాల ఉత్పాదకతను మెరుగుపరచడానికి.. తీవ్రమైన పరిస్థితులను తట్టుకునే వాతావరణాన్ని తట్టుకునే జాతులపై ప్రభుత్వం కృషి చేస్తోందని రూపాలా చెప్పారు.

వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పులు.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

అక్టోబర్, నవంబర్ మాసాల్లో భారత్ గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. మెగా టోర్నీలో పాల్గొనే పలు జట్ల అభ్యర్థనతో పాటు సెక్యూరిటీ ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని మ్యాచ్‌లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. ఈ వివరాలను అటు ఐసీసీ కానీ ఇటు బీసీసీఐ అధికారికంగా ప్రకటించకున్నా.. ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్స్ ప్రపంచకప్ రిషెడ్యూల్ తేదీలను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

ఐసీసీ ఇదివరకే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అక్టోబర్ 15 నవరాత్రి ఉత్సవాల ప్రారంభం నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బీసీసీఐ రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వస్తారని, ఆ సమయంలో భారత్-పాక్ మ్యాచ్‌కు సెక్యూరిటీ కల్పించలేమని పోలీసులు బీసీసీఐకి స్పష్టం చేశారు. దాంతో ఉన్నపళంగా సమావేశం అయిన బీసీసీఐ.. ఇండో-పాక్ మ్యాచ్‌ను ఒకరోజు ముందుగా అక్టోబర్ 14న రీషెడ్యూల్ చేసింది.

ఆర్నెళ్లలో రూ.5వేలకోట్లు.. మహిళల కాస్మోటిక్స్ ఖర్చు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి కథ ఇది. అప్పట్లో కాస్మోటిక్స్ దేశంలో తయారు చేయబడలేదు, భారతీయ మహిళలు విదేశాల నుండి తెచ్చుకునేవారు. సౌందర్య సాధనాల ఈ దిగుమతి దేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూను ఇబ్బంది పెట్టింది. దాని పరిష్కారం కోసం అతను పారిశ్రామికవేత్త JRD టాటాను సంప్రదించాడు. ఈ విధంగా లాక్మే బ్రాండ్ 1952లో ప్రారంభమైం. ఇది లక్ష్మీ దేవి ఫ్రెంచ్ పేరు.

సౌందర్య సాధనాల అమ్మకాలు ఎందుకు పెరుగుతున్నాయి?
కాంతర్ వరల్డ్‌ప్యానెల్ కేవలం 6 నెలల్లోనే భారతదేశంలో సౌందర్య సాధనాలపై రూ. 5,000 కోట్ల వ్యయం జరిగినట్లు అధ్యనయంలో తేలింది. దీని ప్రకారం ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలు పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లడమే కాస్మోటిక్స్ అమ్మకాలు పెరగడానికి కారణం. కాస్మోటిక్స్ విక్రయాల్లో 40 శాతం ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది.

ఇది మాత్రమే కాదు, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సౌందర్య సాధనాలను కొనుగోలు చేసే మహిళల్లో ఎక్కువ మంది పని చేసే మహిళలే. వారు సౌందర్య సాధనాల కోసం సగటు కొనుగోలుదారు కంటే 1.6 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తారు. కాస్మోటిక్స్‌కు వినియోగం పెరగడంతో పాటు రానున్న కాలంలో ఈ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాన్ని కాంటార్ వరల్డ్‌ప్యానెల్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ (దక్షిణాసియా) కె.రామకృష్ణన్ చెప్పారు.

కిలో టమాటా రూ.224.. మదనపల్లిలో నయా రికార్డు!

గత కొన్ని రోజులుగా ‘టమాటా’ ధర పైపైకి దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా 2 నెలలుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. కొన్ని మార్కెట్‌లలో కిలో టమాటా రూ. 200 పైనే పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే జనాలు భయపడుతున్నారు. చాలామంది టమాటా బదులుగా చికెన్ కొనేసుకుంటున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా టమాటా ధర గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధర కొత్త రికార్డు సృష్టించింది.

మదనపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 1) నాణ్యమైన టమాటా రికార్డు స్థాయిలో కిలో రూ. 224 పలికింది. 2-3 రోజుల క్రితం కిలో టమాటా 200 ఉండగా.. ఇప్పుడు 224గా ఉంది. మంగళవారం దాదాపుగా పది వేల క్రేట్ల సరకు రాగా.. వేలంలో క్రేటు ధర రూ. 5600 పలికిందట. ఈ విషయాన్ని టీవీఎస్‌ మండీ యజమాని బాబు, మేనేజర్‌ షామీర్‌ మీడియాతో తెలిపారు. ఇక్కడికి వచ్చిన టమాటాను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారు తెలిపారు.

అండమాన్ & నికోబార్ దీవుల్లో భూకంపం.. ఐదు రోజుల్లోనే రెండోసారి

బుధవారం అండమాన్ & నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల సమయంలో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 5.0గా నమోదైంది. అయితే.. ఇది 10 కిలోమీటర్ల లోతులో సంభవించడంతో, ఎలాంటి నష్టం జరగలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గడిచిన 5 రోజుల్లోనే ఈ ప్రాంతంలో భూకంపం సంభవించడం ఇది రెండోసారి. గత శనివారం (జులై 29న) అర్ధరాత్రి 12.53 గంటలకు ఈ దీవుల్లో బలమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదవ్వగా.. ఈ భూకంపం 69 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది.

ఐదు రోజుల్లోపే రెండుసార్లు భూకంపం సంభవించిన నేపథ్యంలో.. అండమాన్ దీవుల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాబోయే ప్రళయానికి ఇవి సంకేతాలు ఇస్తున్నాయేమో? అని కంగారు పడుతున్నారు. 2004 నాటి విధ్వంసం రిపీట్ కాకపోతే చాలని కోరుకుంటున్నారు. అటు, అధికారులు కూడా ఏదైనా ప్రమాదం సంభవిస్తే, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారని సమాచారం.

చైనాలో వరద బీభత్సం.. 20 మంది మృతి,30 మంది గల్లంతు..

ప్రపంచ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మొన్నటివరకు భారత దేశాన్ని వణికించిన భారీ వర్షాలు.. ఇప్పుడు చైనాను ముంచేస్తున్నాయి.. బీజింగ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ వరదల పరిస్థితి ఏర్పడింది.. ఇకపోతే ఈ వరదల్లో ఇప్పటివరకు 20 మంది మరణించగా, 30 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మీడియా లో వార్తలు వస్తున్నాయి.

ఇక భారీ వర్షాల కారణంగా రైల్వే స్టేషన్లను మూసివేయాల్సి వచ్చిందని ప్రభుత్వ ప్రసార సంస్థ ‘సీసీటీవీ’ మంగళవారం (ఆగస్టు 1) తెలిపింది. దీంతో పాటు చిక్కుకుపోయిన రైల్వే ప్రయాణికులను ప్రస్తుతానికి పాఠశాలల్లోనే ఉంచారు. అదే సమయంలో వారిని సరఫరా చేయడానికి సైనిక హెలి కాప్టర్‌లను మోహరించారు. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ప్రకారం.. వరద నీరు ప్రజల ఇళ్లను నింపింది. వేలాది మంది ప్రజలను ప్రభావితం చేసింది… చాలా మంది వరదలో చిక్కుకున్నారు..

బీజింగ్, పరిసర ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం ప్రారంభమైంది. ఇది సుమారు 40 గంటల పాటు కొనసాగింది. భారీ వర్షాల కారణంగా పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రాజధాని బీజింగ్‌లో రోడ్లన్నీ నదిలా కనిపించడం ప్రారంభించాయి. గ్లోబల్ టైమ్స్ మంగళవారం తన నివేదికలో ఇప్పటివరకు 20 మంది మరణించగా, 30 మంది అదృశ్యమయ్యారని తెలుస్తుంది.. ఈ 26 మంది సైనికులు, నాలుగు హెలికాప్టర్లతో కూడిన సైనిక బృందం పశ్చిమ బీజింగ్ జిల్లాలోని మెంటౌగౌలోని రైల్వే స్టేషన్ చుట్టూ చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. బీజింగ్‌లోని ఫాంగ్‌షాన్, మెంటౌగౌ తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల మూడు రైళ్లు వాటి మార్గంలో చిక్కుకున్నాయి. దీంతో పాటు కొన్ని చోట్ల ప్రధాన రహదారులు నీటిలో కొట్టుకుపోయాయి.. మొత్తంగా చైనా పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి.. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..