NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

‘పెళ్లి కోసం అంబానీ కోట్లు ఖర్చుపెట్టారు.. అది మీ డబ్బే’

హర్యానాలో అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీలలో తమ అభ్యర్థుల కోసం అన్ని పార్టీల నేతలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బహదూర్‌ఘర్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడి పెళ్లికి కోట్లు ఖర్చు చేశారని, అయితే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు.

తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూను వివాదంలోకి తీసుకురావాలనేది వైయస్సార్ వైసీపీ ఉద్దేశం కాదని.. చంద్రబాబు వివాదమాయం చేయాలని ప్రయత్నించినప్పుడు… ఆయన చెప్పిన అబద్ధాలపై వివరాలను మాత్రమే ఇచ్చామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతోనే తాము స్పందించమన్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఈ అంశం ఉండడంతో మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడతామన్నారు. “సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడుతున్నారు. సనాతన ధర్మంలో చాలా రకాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో ఒక మనిషి విడాకులు తీసుకోకూడదని ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చినా సర్దుబాటు చేసుకోవాలే తప్ప విడిపోకూడదని సనాతన ధర్మం చెబుతోంది. ఇవన్నీ ఆచరించి సనాతన ధర్మం గురించి ప్రజలకు చెప్పాలి. సనాతన ధర్మం గురించి తెలుసుకోకుండా దాని గురించి మాట్లాడటం సరికాదు. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల

నిన్న సెప్టెంబర్ 30న అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సూపర్ స్టార్ రజనీకాంత్ వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. రజనీకాంత్ అక్కడ చికిత్స పొందుతున్నప్పుడు, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఒక బులెటిన్ విడుదల చేసింది. ఇది రజనీకాంత్ అభిమానులకు ఉపశమనం కలిగించింది. ప్రస్తుతం చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ పరిస్థితిపై ప్రకటన విడుదల చేసింది అపోలో సంస్థ.. ‘రజనీకాంత్‌ను నిన్న సెప్టెంబర్ 30న అపోలో ఆసుపత్రిలో చేర్చారు. గుండెకు వెళ్లే రక్తనాళంలో వాపు వచ్చింది.

రేషన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే నిత్యవసర సరకులు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేష‌న్ కార్డు దారుల‌కు స‌బ్సిడీపై కందిప‌ప్పు, పంచ‌దార పంపిణీ చేసే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి ప‌ట్టణంలో మంగ‌ళ‌వారం మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ చేతుల మీదుగా ప్రారంభించారు. స‌బ్సిడీపై కార్డు దారుల‌కు కిలో కందిప‌ప్పు, అర‌కిలో చ‌క్కెర ను మంత్రి మనోహర్ పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మ‌నోహ‌ర్ మాట్లాడుతూ.. ఈ నెల నుంచి ఒక్కొక్క కార్డు దారునికి 67 రూపాయ‌ల‌కే కిలో కందిపప్పు, 17 రూపాయలకే అరకేజీ చక్కెర పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని, బ‌హిరంగ మార్కెట్లో నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెరిగిపోతుండ‌గా వాటిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచ‌న మేర‌కు ఈ నిర్ణయం తీసుకోవ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 4 కోట్ల 30 ల‌క్షల మందికి ల‌బ్ధి చేకూరుతుంద‌ని చెప్పారు. అలాగే జ‌న‌వ‌రి నుంచి రేష‌న్ కార్డుల ద్వారా రాగులు , ఇతర మిల్లెట్స్ కూడా అందించ‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలియ‌జేశారు. గ‌త ప్రభుత్వం బ‌స్తాల్లో రేష‌న్ షాపుల‌కు కందిప‌ప్పు, పంచ‌దార పంపించేదన్నారు. ఇప్పుడు జీఎస్టీ అద‌న‌పు భార‌మైన‌ప్పటికీ ప్యాకింగ్ చేసి నాణ్యమైన వాటిని అందిస్తున్నామని తెలిపారు.

అందుకే ఏపీలో లులు మాల్‌ వద్దన్నాం..

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటైపోయి స్టీల్ ప్లాంట్ లో 4వేల మంది కార్మికులను తొలగించటానికి సిద్ధం అవుతున్నాయని ఎమ్మెల్సీ బోత్స సత్యనారాయణ అన్నారు. ఏ ఒక్కరినీ తొలగించటానికి అడుగులు వెయ్యొద్దని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారని… అవి ఇస్తారో చేస్తారో తెలియదు గానీ ఈ 4 వేల మంది ఉద్యోగాలు తొలగించవద్దని కోరారు. వాలంటీర్లకు 10వేలు ఇస్తారాన్నారు.. కానీ వాళ్ళ ఉద్యోగాలకు హామేనే లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వ పెద్దలని హెచ్చరించారు. మందు ధరలు తగ్గించామని సంబర పడిపోతున్నారని..నిత్యావసర కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో సుమారు రెండు కోట్లు పెట్టి మార్కెట్ రెన్యూ వేషన్స్ చేశామని చెప్పారు.

త్వరలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం..

ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గత 2022 కాలంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా అందులో 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల వాయిదా పడడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ (సివిల్)- 3580; కానిస్టేబుల్ (APSP) -2520 పోస్టుల ప్రక్రియ వాయిదా పడిందన్నారు.


కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తిరుమల లడ్డు తయారీలో కల్తీ అంశంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈరోజు ఆ దీక్ష విరమించేందుకు తిరుమలకు బయల్దేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు పవన్‌. పవన్ వెంట ఆయన సన్నిహితుడు, సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. ఇక తిరుమలకు పవన్‌ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పవన్‌ కల్యాణ్.. శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారని సమాచారం. ఇక రేపు ఉదయం 8:15 నిమిషాలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల వరకు అన్నదానం సముదాయం, క్యూలైన్లను పవన్ తనిఖీ చేయనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో పాల్గొననున్న పవన్‌ రాత్రి 8:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరంకు పవన్‌కల్యాణ్ బయలుదేరి వెళ్లనున్నారు.

3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం..

ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ జారీ చేసామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. రిజర్వేషన్ షాపులు మినహయించి మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం అయ్యిందన్నారు. నూతన మద్యం పాలసీ అమలుకు దరఖాస్తులు మూడు విధాలుగా సబ్మిట్ చేయవచ్చని నిషాంత్ కుమార్ తెలిపారు. పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్, క్రెడిర్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్ పేమెంట్ పద్ధతి ద్వారా పూర్తి చేయవచ్చన్నారు. దరఖాస్తు కోసం https://hpfsproject.com ద్వారా వివరాలు నమోదు చేయాలని , సబ్ మిషన్ తదుపరి పేమెంట్ మోడ్ వచ్చినప్పుడు బ్యాంకు కార్డ్స్ ద్వారా పని పూర్తి చేయవచ్చన్నారు. హైబ్రిడ్ విధానంలో వివరాలు నింపిన తరువాత సి ఎఫ్ ఎం ఎస్ ద్వారా ఎస్ బి ఐ నుండి చలానా వినియోగించి దరఖాస్తును సబ్మిట్ చేయాలన్నారు. మూడో పద్దతిలో డీడీ తీసుకుని నేరుగా రాష్టంలోని ఎక్సైజ్ స్టేషన్ కు వచ్చి అప్లికేషన్ పొందవచ్చని తెలిపారు. డీడీ నంబర్ ఆధారంగా ఎక్సైజ్ అధికారులు వెరిఫై చేసిన తదుపరి వారి రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందన్నారు. మంగళవారం నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించామని, 12వ తేదీ నాటికి ప్రైవేటు మద్యం షాపులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేయగా, అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమలవుతుందన్నారు.

సురేఖ అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా

తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా అని, అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా వేశా అని ఆయన అన్నారు. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని, అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్త అని ఆయన అన్నారు. పోస్టు పెట్టిన అకౌంట్ డీపీ హరీష్ రావు ఫోటో, కేసీఆర్‌ ఫోటో ఉందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదా.? అని ఆయన అన్నారు. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండన్నారు ఎంపీ రఘునందన్‌ రావు.

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ శుభాకాంక్షలు

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. బతుకమ్మ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దుల తో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ సందర్భంగా పల్లెలు పట్టణాలు బేధం లేకుండా మహిళలతో పిల్లా పాపలతో ప్రత్యేక సందడి నెలకొంటుందని కేసీఆర్ తెలిపారు.

 

Show comments