NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం..

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో టీచర్ల బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియకు తేదీలు ఖరారు చేసింది.దీనిపై శుక్రవారం విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల హైకోర్టు టీచర్ల బదిలీలకు అనుమతి ఇవ్వడంతో తాజాగా బదిలీ ల ప్రక్రియను ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.. రాష్ట్రవ్యాప్తం గా 1.05 లక్షల మంది టీచర్లు ఉన్నట్లు సమాచారం..రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో టీచర్స్ బదిలీ ల ప్రక్రియ ను ప్రభుత్వం స్పీడ్ అప్ చేస్తుంది.ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ఈ విధంగా వుంది.ఈనెల 3వ తేదీ నుంచి 5వ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది..ఈనెల 6 మరియు 7 వ తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది..అలాగే 8 మరియు 9 తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు అధికారులు వెల్లడిస్తారు. 10, 11 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు..

గురుగ్రహాన్ని ఢీకొట్టిన ఖగోళ శకలం.. భారీ విస్పోటనం.. ఈ వీడియో చూడండి..

సౌర కుటుంబంలో అత్యంత పెద్ద గ్రహం గురుగ్రహం. దాదాపుగా 1300 భూమిలను తనలో ఇముడ్చుకోగలదు. సూపర్ గ్యాస్ జాయింట్ అయిన గురుగ్రహం సౌరకుటుంబంలో ‘వాక్యూమ్ క్లీనర్’గా పనిచేస్తుంటుంది. తన అపారమైన గురుత్వాకర్షణ శక్తితో గ్రహశకలాలను, తోకచుక్కలను తనవైపు ఆకర్షిస్తుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఖగోళ శకలం గురు గ్రహాన్ని ఢీకొట్టింది. దీంతో గ్రహంపై భారీ విస్పోటనం ఏర్పడినట్లు కనిపించింది. ఆగస్ట్ 29 (ఆగస్టు 28న 1645 GMT) సమయంలో ఓ గుర్తుతెలియన ఓ ఖగోళ వస్తువు గురుగ్రహాన్ని ఢీకొట్టిన ఘటన ఆర్గనైజ్డ్ ఆటోటెలీస్కోప్‌లు ఫర్ సెరెండిపిటస్ ఈవెంట్ సర్వే (OASES) ప్రాజెక్ట్ మరియు ప్లానెటరీ అబ్జర్వేషన్ కెమెరా ఫర్ ఆప్టికల్ ట్రాన్సియెంట్ సర్వేస్ (PONCOTS) సిస్టమ్ ఈ ఖగోళ దృశ్యాన్ని గుర్తించాయి. వీటి ట్విట్టర్ అకౌంట్ లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.

దేశంలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ సాధ్యమా?

‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అనే చర్చ దేశంలో జోరందుకుంది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 1న, కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికలు వస్తే ఓటరు ఐదేళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే పోలింగ్‌ బూత్‌కు వెళ్తారు. ఒకేసారి స్థానిక, అసెంబ్లీ, లోక్‌సభ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. పాలనే ప్రధాన కేంద్ర బిందువుగా మారే ఈ ప్రక్రియతో ఎన్నికల ఖర్చులు, ఎన్నికల కోడ్‌లు లేకుండా ఎన్నికైన అన్ని విభాగాలు ఐదేళ్లపాటు సరిగా పాలనపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని వీటికి మద్దతు పలికే వారు వాదిస్తున్నారు. ఒకవేళ అన్ని ఎన్నికలు ఒకేసారి జరపాల్సి వస్తే వచ్చే సమస్యలపైనే ప్రధానంగా చర్చ జరగాలని వారు సూచిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా వీటి సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోంది. అయితే దీనిపై మాజీ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక కోణంలో అది మెరుగ్గా ఉంటుందని, మరోవైపు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు…

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు లాగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చేసిన తప్పులకు శేష జీవితంలో చంద్రబాబు ఫలితం అనుభవించక తప్పదు అని ఆయన విమర్శించారు. అవినీతి వ్యవహారాల్లో కాపాడమని కాళ్ళు మొక్కడానికే చంద్రబాబు ఢిల్లీ యాత్ర మొదలు పెట్టాడు అని మంత్రి అన్నారు. వంద రూపాయలు నాణెం విడుదలలో చంద్రబాబు కూర్చున్న సీటే ఆయన స్థాయిని చెప్పేసింది అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.

హెరిటేజ్ వ్యాపారం వల్లే లక్షల కోట్లు ఎలా సంపాదించగలిగారో చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాలి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు పిండింది అవుపాలో గేదే పాలో కాదు రాష్ట్ర ఖాజానాను.. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల రూపంలో కోట్లు కొల్లగొట్టారు అంటూ ఆయన విమర్శలు సంధించారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించాలి.. ఆయన పీఏ శ్రీనివాసే మొత్తం చిట్టా బయట పెట్టాడు అని మంత్రి అమర్నాథ్ అన్నారు.

విపక్షాలు ఏకమైతే బీజేపీ గెలవడం అసాధ్యం

ప్రతిపక్షాలు ఏకమైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ వేదిక 60 శాతం భారత జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుందని, ఈ వేదికపై ఉన్న పార్టీలు ఏకమైతే బీజేపీ ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని అన్నారు. సాధ్యమైన రీతిలో కలిసి రావాలని కాంగ్రెస్ నాయకుడు ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రెండు పెద్ద అడుగులు వేశామని చెప్పారు. ఇందులో 14 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం, సభ్య పార్టీల మధ్య సీట్ల పంపకం చర్చలను వేగవంతం చేయడం, వీలైనంత త్వరగా వాటిని జరిగేలా చేయడం అనే నిర్ణయాలు జరిగాయన్నారు. ఇండియా కూటమి బీజేపీని ఓడిస్తుందని నమ్మకం ఉందని రాహుల్‌ గాంధీ చెప్పారు. కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ కూటమి నేతల మధ్య కుదిరిన సంబంధాలే అసలైన పని అని.. ఈ రెండు సమావేశాలు అందరి మధ్య సాన్నిహిత్యం పెంచడంలో పెద్ద ఎత్తున కృషి చేశాయని విశ్వాసంతో చెప్పగలనన్నారు. నాయకులందరూ ఒక్కటిగా పనిచేసేలా చూస్తామన్నారు.

ఇది చాలా విశిష్టమైన సందర్భం.. ప్రతి భారతీయుని బాధ్యత

హెచ్‌ఐసీసీలో శుక్రవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన మీ అందరికీ హార్థిక శుభాకాంక్షలు అనిఆయన అన్నారు. ఇది చాలా విశిష్టమైన సందర్భం. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాట చరిత్రనీ, స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవటం ప్రతి భారతీయుని బాధ్యత. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రనూ ఆదర్శాలనూ, నేటి తరానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో గత సంవత్సరం వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా 15 రోజులపాటు నిర్వహించుకున్నాం. నేడు ముగింపు ఘట్టానికి చేరుకున్నాం ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలలో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

నౌకాదళంలోకి మరో యుద్ధనౌక.. ముంబయితీరంలో ‘మహేంద్రగిరి’ జలప్రవేశం

ముంబైలోని మజగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ సారథ్యంలో ప్రాజెక్ట్‌ 17–ఏ ఫ్రిగేట్స్‌లో భాగంగా 7వ యుద్ధనౌక మహేంద్రగిరిని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సతీమణి సుదేశ్‌ ధన్‌ఖడ్‌ చేతుల మీదుగా శుక్రవారం ముంబయి తీరంలో జలప్రవేశం చేయించారు. 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధనౌక నిర్మితమైంది. అధునాతన ఆయుధాలు, సెన్సార్‌లు, ఫ్లాట్‌ఫామ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధనౌకగా ‘మహేంద్రగిరి’ రూపొందింది. భవిష్యత్‌లో భారతదేశం గొప్ప నావికా వారసత్వానికి చిహ్నంగా నిలవనుందని తయారీదారులు అభివర్ణించారు. తూర్పు కనుమల్లో భాగమైన, ఒడిశాలోని ‘మహేంద్రగిరి’ పర్వతం మీదుగా ఈ యుద్ధనౌకకు పేరు పెట్టడం గమనార్హం.

సెప్టెంబర్ లోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర

వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు జనసేన మద్దతిస్తోంది అని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై పవన్ కళ్యాణ్ తో కేంద్ర పెద్దలు చర్చించారు.. దీనిపై లోతైన చర్చ జరగాలి.. ప్రజా ధనం ఆదా అవ్వాలి.. పార్లమెంటులో కూడా చర్చ జరిగి.. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశానికి కూడా మంచి జరుగుతుంది.. జనసేన తరపున ఈ విధానాన్ని సమర్ధిస్తున్నామని నాదేండ్ల అన్నారు. జమిలీ ఎన్నికలపై చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది.. కేంద్రంలో ఉన్న నాయకత్వం దీనిపై బలంగా ముందుకు వెళుతున్నారు.. ఇది మంచి నిర్ణయం.. కాబట్టి మార్పులు చేస్తారని భావిస్తున్నామని మనోహర్ తెలిపారు.

ఏపీలో వర్షాల కొరతపై సీఎం జగన్ సమీక్ష

వర్షాల కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎంకు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. జూన్‌ నుంచి ఆగస్టు వరకూ రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 419.6 మి.మీ. కాగా.. ఈ ఏడాది కురిసిన వర్షపాతం 314.6 మి.మీ. మాత్రమే.. 25శాతం తక్కువగా వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు. కోనసీమ, కాకినాడ, ప.గో, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు.

మానవత్వం చాటుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు క్షతగాత్రులకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సహాయం అందించి వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అయితే, బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన పినపోలు నాగేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సంజయ్ బైక్ మీద ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం విశాఖ వైపు వెళ్తున్నారు. అయితే, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న వెహికిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న అల్యూమినియం రైలింగ్‌ ని ఢీ కొట్టింది.. దీంతో కింద పడటంతో వీరిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నాగేశ్వరరావుకు తలతో సహా పలు చోట్ల గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. అలాగే సంజయ్ అనే బాలుడు సుమారు 10 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడికి కూడా తీవ్ర రక్తస్రావంతో రోడ్డు మీద పడి ఉన్నారు.

చంద్రుడిని చేరుకున్నాం, త్వరలోనే సూర్యుడి దగ్గరికి చేరుకుంటాం..

భారత్‌ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 ప్రారంభానికి కౌంట్‌డౌన్‌లు ప్రారంభమవుతున్న వేళ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం మాట్లాడుతూ.. మనం చంద్రుడిని చేరుకున్నామని, త్వరలో సూర్యుని దగ్గరికి చేరుకుంటామని చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండింగ్ చేసి భారత్‌ చరిత్ర సృష్టించింది. చంద్ర మిషన్‌ చంద్రయాన్‌-3 సక్సెస్‌ తర్వాత అదే ఉత్సాహంతో ఇస్రో తొలి సౌర మిషన్‌ ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం కోసం సిద్ధమైంది.

‘మేం 75 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. చంద్రుడిని చేరుకున్నాం, త్వరలోనే సూర్యుడి దగ్గరికి చేరుకుంటాం. అయితే ఇది సరిపోదు’ అని అమిత్ షా ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమంలో అన్నారు. ఆయన ఇంకా శాస్త్రవేత్తలను కొనియాడుతూ చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకుందని చెప్పారు. “చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకుంది. అనేక రహస్యాలు ఇప్పుడు బట్టబయలు కానున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి వ్యక్తిని దేశ అభివృద్ధికి, దాని భవిష్యత్తుకు అనుసంధానించడం నాయకత్వం ఎదుర్కోవాల్సిన సవాలు” అని ఆయన చెప్పారు.

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..

యుఎస్ ఆధారిత స్పెషాలిటీ గ్లాస్, సిరామిక్స్ సంబంధిత మెటీరియల్స్, టెక్నాలజీస్ ప్రొవైడర్ కార్నింగ్ ఇంక్ తెలంగాణతో గొరిల్లా గ్లాస్ తయారీ యూనిట్‌తో భారతదేశానికి అరంగేట్రం చేస్తోంది. 934 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రతిపాదిత తయారీ కేంద్రం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలోని మార్కెట్ లీడర్‌ల కోసం కవర్ గ్లాస్‌ను తయారు చేస్తుందని ఒక పత్రికా ప్రకటన తెలియజేసింది. కార్నింగ్ ఇంక్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. గ్లాస్ సైన్స్, సెరామిక్స్ సైన్స్, ఆప్టికల్ ఫిజిక్స్‌లో నైపుణ్యం కలిగిన ఫార్చ్యూన్ 500 మెటీరియల్స్ సైన్స్ కంపెనీ ఇది.