Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

వైసీపీని ఓడించి తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలి..

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కసారి ఛాన్స్ అడిగితే ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం ఛాన్స్ తీసుకోండని అన్నారు. వైసీపీని ఓడించి అప్పుడు తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలని తెలిపారు. లే అవుట్లు వేయాలన్నా.. ఇళ్ళు కట్టాలన్నా వైసీపీ వాళ్లకు లంచాలు ఇవ్వాలని చెప్పారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాల బాబు అని విమర్శించారు. సింహాచలం భూమి ఆక్రమించి ఎమ్మెల్యే భారీ భవంతి కడితే అడిగే దిక్కు లేదని పేర్కొన్నారు. కన్నబాబు రాజు లాంటి ఎమ్మేల్యేలు అధికారంలో ఉంటే ఎన్ని రాజ్యాంగాలు ఉన్నా న్యాయం జరగదని పవన్ కల్యాణ్ తెలిపారు.

సూపర్ సిక్స్, కేజీ బంగారం అంటున్నారు.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..

పేదలకు సాయం చేస్తుంటే పెత్తందారులు తట్టుకోలేకపోతున్నారని.. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం జగన్‌ అన్నారు. ఏలూరులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మన రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులు కోటీ 40 లక్షలు ఉన్నారని.. పేదలందరికీ పథకాలు అందాలా వద్దా అంటూ ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబును అడుగుతున్నా.. ఒక నిజమైన లీడర్ ఇంత మందికి రాష్ట్రంలో మంచి జరిగేలా చూస్తుంటే.. ఎవరు నిజమైన లీడర్ అని అడుగుతున్నామన్నారు. చరిత్రలో ఎప్పుడు జరగని జరగని విధంగా.. పిల్లల చదువు కోసం అనేక పథకాలు తీసుకువచ్చామన్నారు. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి పథకం తీసుకువచ్చింది జగన్ కాదా అంటూ ప్రశ్నించారు. గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన వంటి పథకాలు అందుబాటులో తీసుకు వచ్చామని చెప్పారు. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని మార్పులు.. ఇవన్నీ మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతున్న మార్పులని వ్యాఖ్యానించారు.

ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నా

ఉప్పల్‌ స్టేడియం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. దీంతో.. రేపటి మ్యాచ్ పై నీలినీడలు అలుముకున్నాయి. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని సిబ్బంది ఆరోపణ చేస్తూ ధర్నాకు దిగారు. కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు ముందు ఉప్పల్ స్టేడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ సహా 94 మంది సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. ఆరు నెలలుగా తమకు బోనస్ ఇవ్వడం లేదని, ఇంక్రిమెంట్లు వేయడం లేదని నిరసిస్తూ సిబ్బంది ధర్నా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన మ్యాచ్ టికెట్లను ఇవ్వకుండా హెచ్ సీఏ ఆఫీస్ బేరర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు సిబ్బంది.

మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దౌర్భాగ్యం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మేడే సందర్భంగా ఇక్కడ ఎటుచూసినా శ్రామికులే గుర్తుకు వస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మరో పది రోజులు ఓపిక పడితే అధికారం మనదేనంటూ చీరాల ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చీరాల చరిత్ర కలిగిన ప్రాంతమని.. చీరాల – పేరాల ఉద్యమం అందరికీ తెలుసన్నారు. అప్పట్లో చీరాలను బ్రిటిష్ వాళ్ళు మున్సిపాలిటీగా చేసి పన్నులు బాదేశారని ఆయన చెప్పారు. ఇవన్నీ పుస్తకాల్లో చదువుకున్నామని.. పన్నులు వేయటంతో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో ప్రజలు పోరాటాలు చేశారన్నారు. అందరూ పన్నులు కట్టలేమని ఊరు ఖాళీ చేసి రాంనగర్ అని అక్కడకు వెళ్లి కొత్త ఊరు కట్టారన్నారు. సంపద పెంచి సంక్షేమానికి వాడాలన్నారు. నేను చేసిన అభివృద్ధితో వచ్చిన ఆదాయంతో అప్పులు తెచ్చాడని ఆరోపణలు చేశారు. పది రూపాయలు ఇచ్చి వంద దోచేసుకుంటే మీ జీవితాల్లో మార్పులు వస్తాయా అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి నుంచి అదిరిపోయే మేనిఫెస్టో ఇచ్చామని.. అభివృద్ధి, సంక్షేమం ఇచ్చే కూటమి ఎన్డీఏ కూటమి అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఒక విజన్ ఉన్న నాయకుడన్నారు.

కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు ఈసీ నిషేధం

తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల కోసం ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ప్రచారంలో ప్రత్యర్థులు విమర్శలు, ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. అయితే.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ చర్యలు నేటి రాత్రి 8గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీరియస్‌ అయిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబు ఇచ్చే హామీలు బీజేపీ కూడా నమ్మట్లేదు..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ప్రచార జోరును పెంచారు. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్‌, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. మొదట విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి కేశినేని నాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా కేశినేని నాని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అని ప్రజలందరూ చెబుతున్న పరిస్థితి ఉందన్నారు. బీజేపీతో సంబంధం లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశారు.. చంద్రబాబు ఇచ్చే హామీలు బీజేపీ కూడా నమ్మట్లేదని విమర్శించారు. అందుకనే మేనిఫెస్టో నుంచి వాళ్ళ సింబల్, వాళ్ల ఫోటోలు పార్టీ పేరు లేకుండా మేనిఫెస్టో డిలీట్ చేశారన్నారు. కూటమిలో ముఖ్య భాగస్వామి చంద్రబాబు నాయుడిని నమ్మడం లేదు ఇంక ప్రజలేం నమ్ముతారు అని అందరూ అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. వైయస్ఆర్సీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గెలవబోతోందని కేశినేని నాని స్పష్టం చేశారు.

మరోసారి మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్..

కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.డైరెక్టర్ గా ,యాక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు.అలాగే లారెన్స్ సేవా కార్యక్రమాలు చేయడంలోనూ ముందుంటారు .అనాథ బాలలు,దివ్యాంగులు,పేదవారికి సాయం చేస్తూ వుంటారు.అలాగే టాలెంట్ వున్న దివ్యాంగులకు తన సినిమాలో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆపదలో ఆదుకోవడానికి లారెన్స్ ఎప్పుడు ముందు వుంటారు.ఇదిలా ఉంటే లారెన్స్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.నేడు కార్మికుల దినోత్సవం సందర్భంగా తాజాగా లారెన్స్ తన ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేస్తూ ‘సేవే దేవుడు’ అంటూ తాను చేయబోయే మరో సేవా కార్యక్రమం గురించి తెలియజేసారు.

జాతీయస్థాయిలో ఇండియా కూటమిని బలోపేతం చేస్తున్నాం..

తెలంగాణలో పోటీ చెయ్యకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని.. కాంగ్రెస్‌ను అడిగినా సీట్లు ఇవ్వలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీకి మద్దతివ్వలేమని.. పొత్తులు, పోటీలపై మాకు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. జాతీయస్థాయిలో ఇండియా కూటమిని బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులు, పోటీలు ఉంటాయన్నారు. కేరళలో ఎప్పటి నుంచో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే పోటీ నెలకొంటుందన్నారు. వయనాడ్‌లో రాహుల్‌గాంధీపై పోటీ చేస్తున్నామని.. వయనాడ్‌లో ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌తో సర్దుబాట్లు కుదరని చోట విడిగా పోటీ చేస్తున్నామని వెల్లడించారు. కేరళలో ప్రత్యర్థులమే, ఇండియా కూటమిలో మిత్రులమన్నారు. బెంగాల్లో మమతపై కలిసి పోటీ చేస్తున్నామన్నారు. రేవంత్ కేరళకు వెళ్లి కేసీఆర్‌ను విమర్శించినట్లు విజయన్‌పై మాటలేంటని ప్రశ్నించారు. సీఎం విజయన్‌పై రేవంత్‌ వ్యక్తిగత వ్యాఖ్యలు సరైందేనా అంటూ ప్రశ్నలు గుప్పించారు. రేవంత్ చుట్టే బోలెడు కేసులున్నాయన్నారు. లెఫ్ట్‌ను విమర్శించినప్పుడు రాజకీయాలు మాట్లాడాలని సలహా ఇచ్చారు.

 

Exit mobile version