Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆరే.. కాంగ్రెస్, బీజేపీ వారి అభ్యర్థి చెప్పగలరా..?

బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ చిట్ చాట్ లో అన్నారు. కాంగ్రెస్, బీజేపి పార్టీల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. తాజాగా కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారని.. పొన్నాల బీఆర్‌ఎస్‌లోకి వస్తానని అంటే వారి ఇంటికి వెళతానని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు, రాసింది చదివే రీడర్ మాత్రమేనని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్‌ డిజిట్‌ దాటదని.. ఆ పార్టీ 110 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

మరోవైపు పెండింగ్ అభ్యర్థుల 5 స్థానాలను మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన తమ అభ్యర్థులు ప్రజల్లో ఉన్నారని.. ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 40 చోట్ల అభ్యర్థులు లేరని.. కానీ 70 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. అది చూసి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. గ్రేటర్ లో 20 స్థానాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరని అన్నారు. మరోవైపు ఈరోజు కర్ణాటకలో రూ.42 కోట్లు దొరికాయని.. తమకు ఉన్న సమాచారం ప్రకారం 8 కోట్లు కొడంగల్ లో రేవంత్ రెడ్డికి అందాయని ఆరోపించారు. నోట్ల కట్టలతో తెలంగాణ ప్రజలను అంగట్లో సరుకుల కొనాలని కాంగ్రెస్ అనుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్‌లో మొట్టమొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్ ఏర్పాటు చేసిన సివిటాస్

శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన ఇద్దరు దూరదృష్టి గల హైస్కూల్ విద్యార్థులు రిత్విక్ జంపన, సిదీష్ రెడ్డిలు మొట్ట మొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్‌ను రూపొందించారు. దానిని హైదరాబాద్‌లో చే శక్తి వంతమైన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (ఎన్జీఓ) సివిటాస్ మొట్ట మొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్‌ను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. భారతదేశంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను మార్చడానికి, వెనుకబడిన వర్గాలకు తమ మద్దతు విస్తరించాలనే సివిటాస్ మిషన్‌లో ఈ ముఖ్యమైన సందర్భం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

పర్యావరణ సుస్థిరత, సామాజిక బాధ్యత పట్ల తిరుగులేని నిబద్ధతతో, సివిటాస్ ఇప్పటికే హైదరాబాద్ వ్యర్థ పదార్థాల నిర్వహణ విభాగంలో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. ఈ సంస్థ 20కి పైగా నివాస సముదాయాల్లో ఇ-వేస్ట్, ఫాబ్రిక్ వ్యర్థాల సేకరణ డబ్బాలను ఏర్పాటు చేసింది, యెంకపల్లి, జీవన్‌గూడ గ్రామాలలో వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నెలకొల్పింది, ఇది రోజుకు 1000 కిలోల తడి, పొడి చెత్తను రీసైకిల్ చేస్తుంది. హైదరాబాద్‌లోని రాగ్‌పిక్కర్లకు 500 అవసరమైన ఆరోగ్య కిట్‌లు పంపిణీ చేస్తుంది.

హమాస్ ఇజ్రాయెల్ పై దాడి క్రూరమైనది, హింసాత్మకమైనది

హమాస్ ఇజ్రాయెల్ పై దాడి క్రూరమైనది, హింసాత్మకమైనదని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళీధర్ రావు అన్నారు. ప్రపంచ మానవాళి దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. కేవలం ఇజ్రాయెల్ Jews అనే కారణంగా మత పరమైన దాడికి పాల్పడ్డాయన్నారు. ఈ దాడికి సంబంధించి భారత దేశ దృక్పథాన్ని ట్వీట్ ద్వారా మోడీ స్పష్టం చేశారని ఆయన చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకం అని.. ఇండియా ఇజ్రాయెల్ కు సపోర్ట్ అని చెప్పారు. చాలా దేశాలకన్నా ముందుగా ప్రధాని ఖండించారని.. మద్దతు తెలిపారన్నారు.

పవన్ ఓ పొలిటికల్ టూరిస్ట్.. రాజకీయాలకు ఆంధ్రా, నివాసానికి తెలంగాణ కావాలా…?

ఏపీలో లోకల్స్, నాన్ లోకల్స్ మధ్య పోరాటం జరుగుతోందని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వాళ్లకు సమర్ధించే వాళ్ళంతా నాన్‌లోకల్సేనని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రజలు సమర్థిస్తున్నారని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూరిస్ట్ తప్ప రాష్ట్రం మీద ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదని మంత్రి విమర్శించారు. రాజకీయాలకు ఆంధ్రా, నివాసానికి తెలంగాణ కావాలా అంటూ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు.

జైల్లో చంద్రబాబు కేజీ బరువు పెరిగారని.. ఈ లెక్కన చంద్రబాబు ఇంట్లో వున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడా ఇంట్లో వున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇంటి నుంచి పంపించే ఆహారంపైనే మాకు అనుమానాలు ఉన్నాయన్నారు. చంద్రబాబుకు పెట్టె ఆహారం ముందు లోకేష్‌తో తినిపించిన తర్వాతే చంద్రబాబుకు ఇవ్వాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

ఉప ఎన్నికల్లో నన్ను ఎంత టార్చర్ చేశారో అందరికి తెలుసు

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే.. ఈనేపథ్యంలోనే పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది ఈసీ. అయితే.. తాజాగా తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై వికాస్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తోత్తులుగా వ్యవహారిస్తున్నారన్నారు. నేను అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తే… బీఆర్‌ఎస్‌వీ నేతల ద్వారా బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టె కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేను రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, బీఆర్‌ఎస్‌వీ ద్వారా మాపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.

చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. డీఐజీ కీలక ప్రెస్‌మీట్‌

చంద్రబాబు భద్రత, ఆరోగ్యానికి సంబంధించి జైల్లో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్నారు. జైల్లో చంద్రబాబుకు ఆరోగ్యపరంగా, భద్రతాపరంగా ఎలాంటి సమస్య లేదన్నారు. మొదటి నుంచి ఆయనను హైప్రొఫైల్‌ ఖైదీగానే ట్రీట్‌ చేస్తున్నామన్నారు. స్కిన్‌ సమస్య రాగానే ప్రభుత్వ వైద్యులతో రూల్స్‌ ప్రకారం వైద్యం చేయించామని వెల్లడించారు. తాగునీరు, భోజన విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో భద్రత ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు సంబంధించిన భోజనాన్ని జైలర్ స్టాయి అధికారులు చెక్ చేస్తారని.. చంద్రబాబు బ్యారక్ నుంచి బయటికి వచ్చిన సమయంలో ఇతర ఖైధీలు అధికారులు, సిబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. పూర్తిస్థాయిలో ప్రికాషన్స్ తీసుకుంటున్నామని.. సెక్యూరిటీ మెజర్మెంట్స్‌కు సంబంధించి ప్రతి 10 రోజులకు ఒకసారి అధికారులతో మాట్లాడుతామన్నారు. చంద్రబాబు ఆరోగ్య రీత్యా జైల్లోకి వచ్చిన రోజు కొన్ని మందులు తీసుకొచ్చారని.. ఈ మందులు ఎప్పటికప్పుడు వేసుకుంటున్నారో లేదో వైద్యులు పరిశీలిస్తున్నారన్నారు. రోజుకు మూడుసార్లు వైటల్స్ టెస్ట్ చేస్తున్నామని డీఐజీ రవికిరణ్‌ తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ అయినా..జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే

ఏపీకి సినీ పరిశ్రమ రావటంపై రాష్ట్ర ఫిల్మ్, టీవీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశాడు. నేడు నంది అవార్డుల గురించి జరిగిన సమావేశంలో పోసాని.. కీలక విషయాలను చెప్పుకొచ్చాడు. “సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమైన చేస్తామని జగన్ గతంలోనే చెప్పారు. చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి వంటి వారు వచ్చినప్పుడు స్టూడియోలు కడతా అంటే స్థలం ఇస్తామని జగన్ చెప్పారు. పాతుకు పోయిన తెలుగు ఇండస్ట్రీ రావటం కుదరదు. సినీ నటులు ఏపీకి వచ్చి పోవటం మాత్రమే చేయగలరు. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. గతంలో మద్రాస్ లో ఉన్నపుడు తెలుగు వారు ఉన్న చోటుకు అని పరిశ్రమ వచ్చింది. ఇపుడు ఉన్నది తెలుగు గడ్డ మీదే కాబట్టి అక్కడ నుంచి రావటానికి ఆసక్తి చూపరు” అని తెలిపాడు.

చంద్రబాబు భద్రతపై లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించింది

చంద్రబాబు భద్రతపై లోకేష్ చేసిన ట్వీట్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనని తెలిపారు. లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి భాదకరమని కేటీఆర్ పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవు, కానీ ఆయన భద్రతకు ప్రమాదం అయితే రాజకీయల్లో ఇది దురదృష్టకరమని తెలిపారు. లోకేష్ పరిస్ధితిని అర్ధం చేసుకోగలనని.. రాజకీయలు వేరైనా.. ఆయన కుటుంబం భాదను తాను అర్థం చేస్కోగలనన్నారు. వారికి తన సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.

నిమ్స్ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యం పై తాము కూడా చాలా ఆందోళన చెందామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ అధికారులు తమను తీవ్ర స్థాయిలో హెచ్చరించారన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి మానసిక స్ధితి ఉంటుందో అర్ధం చేస్కోగలనని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలగవద్దన్న నేపథ్యంలోనే ఇక్కడ ఆందోళన చేయడం వద్దు అన్నానని కేటీఆర్ తెలిపారు. రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయాలలోకి తెలంగాణను లాగవద్దుని కేటీఆర్ పేర్కొన్నారు

రేపు, ఎల్లుండి ఎస్సై పరీక్షలు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రేపు, ఎల్లుండి నిర్వహించే ఎస్సై పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల ఎత్తు కొలిచే పరికరాల్లో తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థులు అర్హత కోల్పోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎత్తు విషయంలో తమకు అర్హత వున్నప్పటికీ తమని అన్యాయంగా అనర్హతకు గురి చేశారని దాఖలైన పలు పిటిషన్లు మీద హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు సైటేషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అనర్హత పొందిన అభ్యర్థులు అందరికీ మళ్లీ శరీర ధారుడ్యం పరీక్షలకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఎలక్ట్రానిక్ యంత్రంతో కాకుండా మాన్యువల్‌గా పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ మొత్తం మూడు రోజులలోపు అర్హత వున్న ప్రతి అభ్యర్థికి సమాచారం ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. రేపు, ఎల్లుండి జరిగే తుది రాత పరీక్షపై ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. షెడ్యూల్‌ ప్రకారమే అక్టోబర్‌ 14, 15 తేదీల్లో మెయిన్‌ ఎగ్జామ్స్ ఉంటాయని ప్రకటించింది. కాగా ఎత్తు విషయంలో తమకు అర్హత ఉన్నప్పటికీ క్వాలిఫై చేయలేదని 5 వేల మంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వారికి మళ్లీ టెస్టులు చేయాలని కోర్టు ఆదేశించింది.

నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆపన్నహస్తం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సామర్లకోట పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వ‌ద్ద వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. త‌ప్పకుండా ఆదుకుంటామ‌ని ముఖ్యమంత్రి భ‌రోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు లబ్ధిదారుల అవసరాలకు ఇచ్చే నిమిత్తం శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో 17 మంది బాధితులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా పలువురు బాధితుల సమస్యలు విని తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.

ఆఫ్ఘానిస్తాన్ మసీదులో పేలుడు.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..

తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. బగ్లాన్ ప్రావిన్సు రాజధాని పోల్-ఏ-ఖోమ్రీలోని ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. దేశంలో మైనారిటీ వర్గమైన షియా మసీదులో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. 40 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఇమామ్ జమాన్ మసీదులో శుక్రవారం ప్రార్థనల కోసం షియా ప్రజలు గుమిగూడుతుండగా పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు.

తాలిబాన్లు ఆఫ్ఘన్ లో అధికారం చేపట్టిన తర్వాత నుంచి అక్కడ జరిగిన ఉగ్రదాడులన్నింటికీ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) బాధ్యత వహిస్తోంది. గతంలో అనేక మసీదుల్లో ఇలానే ఆత్మాహుతి బాంబర్లు తమను తాము పేల్చుకుని మరణించారు. ఈ సంఘటనల్లో ఐఎస్ ఉగ్రసంస్థ హస్తం ఉంది. ముఖ్యం షియాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు.

Exit mobile version