తీరం దాటిన వాయుగుండం:
రాష్ట్ర వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ – దక్షిణ ఛత్తీస్‌గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగనున్నట్లు కూడా హెచ్చరిక జారీ చేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ:
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎప్పటిలాగే ఈ వారం చివరలోనూ భక్తుల భారీ రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు విపరీతంగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో కంపార్టుమెంట్లకు వెలుపల కూడా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామిని 69,019 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 37,774 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
అమెరికాలో కామారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి:
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాల్లో, మరికొందరు కాల్పుల్లో మరణిస్తున్నారు. తమ కలల్ని నిజం చేసుకునేందుకు అమెరికా వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్తుండడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తాజగా అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
పాక్ ప్రయోగించిన PL-15E క్షిపణిని కూల్చేసిన భారత్:
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్‌కి చెందిన చైనీస్ ఆయుధాలను, పరికరాలను తుక్కు తుక్కు చేసింది. ముఖ్యంగా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని దెబ్బకొట్టింది. ఇదే కాకుండా చైనా పాకిస్తాన్‌కి అందించిన PL-15E క్షిపణిని భారత్ కుప్పకూల్చింది. భారత్ ఇటీవల పాకిస్తాన్ ప్రయోగించిన చైనా ఆయుధాల పనితీరుపై వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై తొలిసారిగా చైనా ఆర్మీ స్పందించింది. భారత్ చేస్తున్న వ్యాఖ్యల్ని తిరస్కరించింది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియావోగాంగ్ మాట్లాడుతూ.. భారత్ పేలని PL-15Eని స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఇది రాడార్ గైడెడ్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి, చైనా తయారు చేసిన అత్యంత అధునాతన రాకెట్ అని చెబుతుంటారు. ‘‘మీరు పేర్కొన్న క్షిపణి ఎగుమతి చేసిన పరికరం. స్వదేశంలో, విదేశాల్లో రక్షణ ప్రదర్శనల్లో చాలాసార్లు ప్రదర్శించబడింది’’ అని జాంగ్ అన్నారు. మే 7-10 మధ్య జరిగిన భారత్-పాకిస్తాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
విజయ్ పార్టీ కీలక నిర్ణయం:
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ సారి అధికార డీఎంకే, అన్నాడీఎంకే, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) మధ్య ముక్కోణపు పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వాదనలు తమిళనాట జోరుగా వినిపిస్తున్నాయి. అయితే, జరుగుతున్న ప్రచారంపై విజయ్ కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. దీనికి తోడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేయడానికి టీవీకే పార్టీ పని ప్రారంభించింది.
వివేక్ రామస్వామి జంటపై జాత్యహంకార వ్యాఖ్యలు:
భారత సంతతి ఎంటర్‌ప్రెన్యూర్, అమెరికా అధికార పార్టీ రిపబ్లికన్ నేత వివేక రామస్వామి, ఆయన భార్య జాత్యహంకార వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నారు. ఇటీవల, తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివేక్ రామస్వామి, తన భార్య అపూర్వతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. తన పోస్ట్‌లో అపూర్వతో తన తొలి డేటింగ్ స్టోరీని షేర్ చేశారు. రెండు ఫోటోలను పోస్ట్ చేశారు, ఇందులో ఒకటి మొదటి డేట్ సమయంలోది కాగా, మరొకటి ఇద్దరు ఇటీవల విహారయాత్రలో ఉన్న సమయంలోనిది. 2011లో తాను తెలివైన వైద్య విద్యార్థిని కలిశానని, ఆ తర్వాత రాకీ పర్వతాల్లో ట్రెక్కింగ్‌కి వెళ్లినట్లు చెప్పాడు. 14 సంవత్సరాలు పరిచయం, ఇద్దరు పిల్లల తర్వాత, ఈ వారాంతంలో మా 10 సంవత్సరాల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు రామస్వామ రాశారు.
ఒకే వేదికపై లష్కరే ఉగ్రవాదులతో మంత్రులు:
పాకిస్తాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి బహిర్గమయ్యాయి. భారత్ ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుందని చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్ జిల్లాలో మే 28న జరిగిన భారత వ్యతిరేక ర్యాలీలో పంజాబ్ ప్రావిన్స్ మంత్రులతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆహార మంత్రి మాలిక్ రషీద్ అహ్మద్ ఖాన్, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ ఇద్దరూ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్ లకు అత్యంత సన్నిహితులు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు సైఫుల్లా కసూరి, తల్హా సయీద్ (హఫీజ్ సయీద్ కుమారుడు) మరియు అమీర్ హంజా వంటి వారితో వేదికను పంచుకున్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశంపై విషం కక్కారు. నిఘావర్గాలు ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరిని భావిస్తున్నారు.
చైనా వ్యతిరేక కుట్రతో భారత్‌ను నాటో ఆకర్షిస్తోంది:
రష్యా-భారతదేశం-చైనా (RIC) ఫార్మాట్‌లోని కార్యకలాపాల పునరుద్ధరణకు రష్యా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం అన్నారు. చైనా వ్యతిరేక కుట్రలోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో బహిరంగంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాజీ రష్యన్ ప్రధాని యెవ్జెనీ ప్రియాకోవ్ చాలా ఏళ్ల క్రితమే రష్యా, భారత్, చైనా అనే త్రయం ఫార్మాట్‌కి చొరవ చూపారాని, దీని పునఃప్రారంభంపై మాకు ఆసక్తి ఉందని ఆయన వెల్లడించారు. దీనిపై మంత్రుల స్థాయిలో అప్పటి నుంచి 20 సార్ల కంటే ఎక్కువగా సమావేశాలు నిర్వహించామని, విదేశాంగ విధాన ముఖ్యుల స్థాయిలో మాత్రమే కాకుండా, మూడు దేశాల ఇతర ఆర్థిక, వాణిజ్య మరియు ఆర్థిక సంస్థల అధిపతులతో కూడా సమావేశం జరిగినట్లు లావ్రోవ్ అన్నారు.
సంబరాలు చేసుకుందాం, సిద్ధమా:
ఇంకా ఒక్క మ్యాచే మిగిలి ఉందని, కలిసి సంబరాలు చేసుకుందామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ అభిమానులకు పిలుపునిచ్చాడు. చిన్నస్వామి స్టేడియమే కాదు.. ఎక్కడ మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీపై ఆదరణ చూపిస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లు పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నారని, స్పిన్నర్ సుయాశ్ శర్మ బౌలింగ్ అద్భుతం అని పాటీదార్ ప్రశంసించాడు. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది.
నేడు ఎలిమినేటర్ మ్యాచ్:
ఐపీఎల్ 2025లో నేడు మరో ఆసక్తికర సమరం జరగనుంది. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముల్లాన్‌పుర్‌లో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఓడిన టీమ్ లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. గుజరాత్, ముంబై జట్లలో స్టార్స్ ఉన్నారు కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
తల్లికి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన యువ క్రికెటర్:
భారత క్రికెట్ జట్టు, పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు. ఐపీఎల్ లో 2025లో తన అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో పాటు, తన అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఒక పని చేశాడు. యువ క్రికెటర్ తన తల్లికి ప్రీమియం కారును బహుమతిగా ఇచ్చాడు. అర్ష్‌దీప్ తన తల్లికి టాటా కర్వ్ ఎస్‌యూవీ అనే లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. తల్లిపట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ మరుపురాని క్షణాల వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నారు.
పూరీ-విజయ్ సేతుపతి మూవీలో రాధికా ఆప్టే:
పూరీ జగన్నాథ్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు భారీ ప్లాపులను మూటగట్టుకున్నాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంత క్రేజ్ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు తమిళ హీరోతో పూరీ సినిమా చేయలేదు. ఫస్ట్ టైమ్ చేస్తుండటంతో అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇందులో రాధికా ఆప్టే నటిస్తోందని ఈ నడుమ ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. వాటిపై తాజాగా ఆమె స్పందించింది. తాను ఆ మూవీలో నటించట్లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి తన వద్ద వాటితో బిజీగా ఉన్నట్టు చెబుతోంది. పూరీ, సేతుపతి సినిమా గురించి తాను కూడా విన్నానని.. కానీ ఇప్పటి వరకు వారు తనను సంప్రదించలేదని తెలిపింది. ఏదైనా అప్డేట్ ఉంటే చెబుతానంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఈ మూవీని విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. మరి ఇందులో ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారో చూడాలి.
ఘాటుగా స్పందించిన రకుల్ ప్రీత్:
రీసెంట్ గా విరాట్ కోహ్లీ ఓ నటి విషయంలో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. అలా అని ఆ నటితో విరాట్ మాట్లాడింది లేదు.. కనీసం బయట ఇద్దరూ కలిసింది కూడా లేదు. దానికి కారణం ఒకే ఒక్క లైక్. అవును.. టీమిండియా స్టార్ క్రికెటర్ గా విరాట్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇన్ స్టాలో ఇండియాలోనే అత్యధికి ఫాలోవర్లు ఉన్నది విరాట్ కే. అలాంటి విరాట్ రీసెంట్ గా నటి అవనీత్ కౌర్ రీల్ కు ఒక లైక్ కొట్టాడు. ఆ దెబ్బతో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. చివరకు విరాట్ కూడా స్పందించాడు. అది టెక్నికల్ ఇష్యూతో జరిగిందంటూ తెలిపాడు. అయినా సరే రూమర్లు మాత్రం ఆగట్లేదు. దీనిపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించింది. మనం ఎంత ఖాళీగా ఉన్నామో దీన్ని బట్టి అర్థం అవుతోంది. విరాట్ లైక్ కొట్టడం వల్ల ఆమెకు 2 మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగారంటూ ఏకి పారేసింది. విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీ ఒక లైక్ కొట్టినా సరే అది ఇంత పెద్ద న్యూస్ అవడం అంటే.. మనం ఎంత జాబ్ లెస్ గా ఉన్నామో అర్థం అవుతోంది. దయచేసి ఇలాంటి వాటిని పెద్దది చేయొద్దు. ఎందుకంటే అది ఒక వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయం. ఒక సెలబ్రిటీ ఏం చేసినా దాన్ని ఇంత మంది న్యూస్ చేసేస్తున్నారంటే. ఇది అనవసర రాద్దాంతం’ అంటూ రకుల్ సీరియస్ వ్యాఖ్యలు చేసింది.
కళ్లు తిరిగి పడిపోయిన ’వీరమల్లు’ నిర్మాత:
వీరమల్లు టీమ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూవీ నిర్మాత ఏఎం రత్నం సడెన్ గా కళ్లు తిరిగి పడిపోయారు. రిలీజ్ టెన్షన్ తట్టుకోలేక ఆయన ఇలా పడిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా డబ్బింగ్ పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే ఏళ్లకు ఏళ్లు మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 12న రిలీజ్ కాబోతోంది. మ్యూజిక్ వర్క్ కీరవాణి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ పనులు చూసుకునేందుకు ఏఎం రత్నం శుక్రవారం ఉదయం 5 గంటలకు ఆఫీసుకు వచ్చారు.
