NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తిరుమల భక్తులకు అలర్ట్:
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్‌ కోటా టికెట్లను జనవరి 18న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ల కోసం జ‌న‌వ‌రి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారు జనవరి 20 నుంచి 22 మధ్యాహ్నం 12లోపు డబ్బులు చెల్లిస్తే.. లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు.

మైదుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన:
నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో స్వచ్చాంద్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు మైదుకూరుకు చేరుకుంటారు. 12.20 గంటలకు కేఎస్సీ కల్యాణ మండపానికి చేరుకొని.. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.

సింగపూర్‌ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్‭తో మంత్రి భేటీ:
తెలంగాణ పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు సింగపూర్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ (SSIA)తో ప్రత్యేక రౌండ్ టేబుల్ చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో SSIA ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొని, తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బ్రియాన్ టాన్ (SSIA ఛైర్మన్), టాన్ యూ కాంగ్ SSIA వైస్ ఛైర్మన్, గ్లోబల్ ఫౌండ్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్), అప్లైడ్ మెటీరియల్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమ స్థాపనకు అనుకూల పరిస్థితులను విశ్లేషించారు.

ఏసీబీ విచారణలో గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలు:
ఫార్ములా ఈ రేసు కేసులో భాగంగా గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు నేడు ఆంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ముందు విచారణకు హాజరుకానున్నారు. సీజన్ 9 రేసుకు సంబంధించి రెండు కంపెనీలపై ఏసీబీ పలు ప్రశ్నలు సంధించనుంది. ఫార్ములా ఈ సీజన్ 9 కోసం గ్రీన్కో కంపెనీ కేవలం మొదటి విడతగా 30 కోట్లు మాత్రమే చెల్లించింది. అయితే మిగతా రెండు విడతల డబ్బులు ఫార్ములా ఈ ఆర్గనైజర్ (FEO)కు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీజన్ 10తో పాటు నాలుగు సీజన్లకు గ్రీన్కో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఎందుకు వెనక్కి వెళ్లిందనే అంశంపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది.

రాహుల్ పై విచారణను నిలిపేసిన కర్ణాటక హైకోర్టు:
కాంగ్రెస్ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణను నిలిపివేస్తూ కర్ణాటక హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది శశి కిరణ్ శెట్టి, ఈ కేసు విచారణకు రావడం ఇదే తొలిసారి అని జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం ముందు అన్నారు. వాస్తవానికి, రాహుల్ గాంధీపై బిజెపి దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వార్తాపత్రికలలో తప్పుడు ప్రకటనల ద్వారా ఆయన పార్టీ ప్రతిష్టకు ప్రమాదం కలిగించారని ఆరోపించింది.

ఛత్తీస్‌గఢ్‌లో బయటపడ్డ మావోయిస్టు బంకర్:
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హత మార్చేశాయి. ఈ క్రమంలోనే బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రైల్లి అటవీలో నక్సల్స్ బంకర్‌ను డీఆర్జీ సైనికులు గుర్తించారు. ఈ క్రమంలో బంకర్లో నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని హస్తగతం చేసుకున్నారు. అయితే, కొత్త టెక్నాలజీతో భద్రతా బలగాలకు హాని కలిగించేలా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు మావోయిస్టులు గాజు సీసాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇక, ఆయుధాలు తయారు చేసే యంత్రాలతో పాటు ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్లో మంటలు:
ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ నిల్వ ప్లాంట్లలో ఒకదానిలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో వందలాది మందిని ఖాళీ చేయమని ఆదేశించారు మరియు ఉత్తర కాలిఫోర్నియాలోని జాతీయ రహదారి 1లోని ఒక భాగాన్ని మూసివేశారు. మీడియా నివేదికల ప్రకారం, గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు, నల్లటి పొగ పెరగడం ప్రారంభమైంది. మాస్ ల్యాండింగ్, ఎల్ఖోర్న్ స్లఫ్ ప్రాంతాలను వదిలి వెళ్ళమని దాదాపు 1,500 మందికి ఆదేశాలు ఇవ్వబడ్డాయి. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా దాదాపు 77 మైళ్లు (సుమారు 124 కిలోమీటర్లు) దూరంలో ఉన్న మాస్ ల్యాండింగ్ పవర్ ప్లాంట్, టెక్సాస్‌కు చెందిన విస్ట్రా ఎనర్జీ కంపెనీకి చెందినది. వేలాది లిథియం బ్యాటరీలను కలిగి ఉంది. సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుండి శక్తిని నిల్వ చేయడానికి ఈ బ్యాటరీలు చాలా ముఖ్యమైనవి.. కానీ అవి మంటల్లో చిక్కుకుంటే వాటిని ఆర్పడం చాలా కష్టం.

బందీల విడుదల ఒప్పందాన్ని ఆమోదించిన ఇజ్రాయెల్ కేబినెట్‌:
ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు బందీల విడుదలకు ఇజ్రాయెల్‌ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ ఒప్పందానికి లైన్ క్లియర్ చేయాలని కేబినెట్‌కు ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహు కార్యాలయం చెప్పుకొచ్చింది. అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను పరిశీలించిన తర్వాత.. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజనకరమా కాదా అనేది అర్థం అయిన తర్వాతే ఒప్పందాన్ని ఆమోదించినట్లు ఇజ్రాయెల్ కేబినెట్ వెల్లడించింది.

శుభవార్త చెప్పిన శోభితా:
పెళ్లి చేసుకుని రెండు నెలలు కూడా పూర్తికాకముందే గుడ్ న్యూస్ చెప్పింది శోభిత. ఏంటి అంటే.. ‘ది మంకీ మాన్’ అనే సినిమాలో శోభిత నటించింది. ఇప్పుడు ఆ సినిమా అంతర్జాతీయ అవార్డ్స్ నామినేషన్ లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు ‘రాటన్ టమాటోస్ టు బెస్ట్ రివ్యూడ్’ మూవీ గా కూడా అగ్ర స్థానం సంపాదించింది. ఈ సినిమాకు ఇటీవల బాఫ్తాలో కూడా ‘బెస్ట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్’ మూవీస్ క్యాటగిరి లో కూడా చోటు సంపాదించుకుంది. దీంతో తను నటించిన ఈ సినిమా ఇలా సక్సెస్ అందుకోవడం కలనా? నిజమా? అంటూ శోభిత ఇన్ స్టా లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం శోభిత పెట్టిన ఆ పోస్ట్‌ నెట్టింటా వైరల్‌ అవుతుండటంతో ఫ్యాన్స్ ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

దాడి తర్వాత బట్టలు మార్చుకుని:
జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డ ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్ న్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు, అక్కడ సైఫ్ అలీఖాన్ శస్త్రచికిత్స నాలుగు గంటల పాటు కొనసాగింది. సీసీటీవీలో అనుమానితుడు కనిపించడంతో పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడు కనిపించాడని ముంబై పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ విషయంలో కొత్త అప్‌డేట్ బయటకు వస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన తర్వాత నిందితుడు బట్టలు కూడా మార్చుకుని ఉదయం 8 గంటల వరకు బాంద్రాలోనే ఉన్నాడు.

చరిత్ర సృష్టించే దిశగా జకోవిచ్‌:
25వ టైటిల్‌తో చరిత్ర సృష్టించే దిశగా టెన్నిస్‌ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ (సెర్బియా) సాగిపోతున్నాడు. గతేడాది ఒక్క గ్రాండ్‌స్లామ్‌ కూడా గెలవని జకో.. తన అడ్డా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జోరు సాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో జకోవిచ్‌ 6-1, 6-4, 6-4తో మచాక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో సెట్‌ కోల్పోయిన జకో.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో సెట్‌ ఆరంభంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పటికీ.. కోర్టులోనే చికిత్స తీసుకుని సునాయాస విజయం సాదించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.