NTV Telugu Site icon

Top Headlines @ 9AM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

గుడ్‌ న్యూస్.. నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కల నేటితో నెరవేరనుంది. తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. మొత్తం 10,006 మంది నియామక పత్రాలను అందుకోనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు జరిగే సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై కొంత మందికి నియామక పత్రాలను స్వయంగా అందజేస్తారు. హైదరాబాద్‌ జిల్లా నుంచి 761 మంది అత్యధికంగా.. అత్యల్పంగా పెద్దపల్లి నుంచి 82 మంది కొత్త టీచర్లు నియామక పత్రాలను పొందనున్నారు. మొత్తం 11,062 టీచర్ పోస్టులకు గానూ 10,006 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల 1,056 స్పెషల్‌ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పూర్తిచేశారు. 2 గంటల లోపు ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరు ఎల్‌బీ స్టేడియంకు చేరేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

 

వారికి గుడ్‌న్యూస్‌.. మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది.. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందుతున్నాయి.. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు 3396 మద్యం దుకాణాలకు మంగళవారం రాత్ర వరకు 41,348 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకు రూ. 826.96 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు చెబుతున్నారు.. అయితే, మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును పొడిగించింది ప్రభుత్వం.. మద్యం టెండర్ల షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తుండగా.. వారికి శుభావర్త చెబుతూ గడువు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు పలువురు దరఖాస్తుదారులు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసింది ఏపీ ఎక్సైజ్‌ శాఖ.. 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది.. ఇక, ఈ నెల 14వ తేదీన మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు అధికారులు.. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. అయితే, గడువు పొడగించిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు.. మొదట్లో మందకొడిగా సాగిన దరఖాస్తుల ప్రక్రియ.. చివర్లో ఊపందుకోవడంతో.. ప్రభుత్వానికి మద్యం టెండర్లు భారీగా ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి..

 

నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఇవాళ (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే, జమిలీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దసరా, దీపావళి పండగలు వస్తున్న నేపథ్యంలోనే.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, హర్యానాలో హ్యాట్రిక్ విజయం తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని పేర్కొన్నారు. హర్యానా రైతులు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నామని నిరూపించారు.. హర్యానాలో కమలం మూడో సారి కూడా వికసించిందన్నారు. ఇక, జమ్మూ కాశ్మీర్ ఎన్సీ- కాంగ్రెస్ కూటమికి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది.. బీజేపీకి మాత్రం గతం కంటే అధికంగా ఓట్లు లభించాయని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

 

ట్యాక్సీడ్రైవర్ నుంచి మెసేజ్ రాగానే.. లండన్‌లో పిల్లలను వదిలేసి హైదరాబాద్‌కు..
ఓ ట్యాక్సీ డ్రైవర్‌ నుంచి వెళ్లిన మెసేజ్.. తనకు వివాహమై భర్త పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయేలా చేసింది. ఏకంగా లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చేలా రప్పించింది. భార్య కనిపించకపోవడంతో భర్తకు అనుమానం మొదలై విచారించగా.. ట్విస్ట్‌లు బయటపడ్డాయి. అసలేం జరిగిందంటే.. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన దంపతులకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం 13 ఏళ్ల కొడుకు, 12 ఏళ్ల కూతురు ఉన్నారు. భర్త ఉద్యోగ రీత్యా కొన్ని నెలల కిందటే.. భార్యా, పిల్లలతో లండన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇలా సవ్యంగా సాగుతున్న వీరి సంసారంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఫిబ్రవరిలో ఆమె తల్లి చనిపోవడంతో పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చింది. తన తల్లి అస్తికల నిమజ్జనం కోసం ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని తిరిగాక.. ట్యాక్సీ డ్రైవర్‌తో ఆన్‌లైన్‌లో పేమెంట్‌ను చెల్లించింది. ట్యాక్సీ డ్రైవర్‌ ఆమె సెల్‌ ఫోన్‌ నంబర్‌ను సేవ్ చేసుకుని చాటింగ్ మొదలు పెట్టాడు. అతడి మాయమాటలకు ఆమె ఆకర్షితురాలైంది. అతడు రోజూ పంపే మెసేజ్‌లు చూసి ఆమె అతడి మాయలో పడిపోయింది. ఇలా ఇద్దరి మధ్య చాటింగ్ రోజురోజుకు పెరిగిపోయింది. సెప్టెంబర్‌ 16న ఆమె భర్త తల్లి మృతి చెందడంతో ఒంటరిగా హైదరాబాద్‌కు వచ్చాడు. భర్త లేకపోవడంతో సెప్టెంబర్‌ 30న తన పిల్లలను పార్క్‌లో వదిలేసి, ఆమె కూడా ఇండియాకు వచ్చేసింది. తల్లి కనిపించలేదంటూ పిల్లలు.. తన తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో అతను హుటాహుటిన లండన్ వెళ్లా్ల్సి వచ్చింది. చివరకు ఆరాతీయగా.. భార్య ముంబై వెళ్లి, అటు నుంచి అటే శంషాబాద్ మధునగర్ కాలనీకి వెళ్లినట్లు తెలిసింది. భార్యకు ఫోన్‌ చేయగా.. ఓ సారి ఎయిర్‌పోర్టుకు బయలుదేరానని, మరోసారి ఓ ట్యాక్సీ డ్రైవర్‌ కిడ్నాప్ చేస శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంచాడని నమ్మించింది. ఆందోళనకు గురైన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్ టవర్‌ లొకేషన్ ఆధారంగా ఆమె గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం ఆమెను విమానం ఎక్కించి లండన్‌కు పంపించారు. ట్యాక్సీ డ్రైవర్‌పై వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. ముత్యాల్లాంటి ఇద్దరు, పిల్లలు.. విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ఆమె మాయమాటలకు ఆకర్షితురాలైందని తెలిసింది. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు.. నేడు అమ్మవారి దర్శనానికి సీఎం, డిప్యూటీ సీఎం..
దసరా శరన్నవరాత్రులు బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై 7వ రోజు వైభవంగా సాగుతున్నాయి.. ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు.. వేలాదిగా భక్తులు క్యూలైన్లలో అర్ధరాత్రి 2 గంటల నుంచి వస్తున్నారు… హోల్డింగ్ ఏరియాలలో ఉండే భక్తులను విడతల వారీగా క్యూలైన్లలో వదులుతున్నారు పోలీసులు.. ఇవాళ రాత్రి 11 గంటల‌ వరకూ దర్శనం కొనాగుతుంది.. భక్తుల రద్దీని బట్టి మరో అరగంట వరకూ దర్శన సమయం పెంచే అవకాశం ఉంది అంటున్నారు ఆలయ అధికారులు.. ఇక, మూల నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.. రాత్రి నుంచి భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రి కొండ కిందకు చేరుకుంటున్నారు భక్తులు.. మరోవైపు.. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అమ్మవారిని దర్శించుకోనున్నారు.. ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ దర్శనం‌ చేసుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌… ఇక, మధ్యాహ్నం 2 గంటల నుంచీ 3 గంటల మధ్యలో కనకదుర్గమ్మకు సారె సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు.. సీఎంతో పాటు సీఎం సెక్యూరిటీ అనుమతిచ్చిన వారికి మాత్రమే ఆలయంలోనికి అనుమతి ఇవ్వనున్నారు.. మరోవైపు.. సీఎం, డిప్యూటీ సీఎంల రాక కారణంగా సామాన్య భక్తుల దర్శనాన్ని నిలుపుదల ఉండదని.. భక్తులకు యథావిథిగా దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయని వెల్లడించారు దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. అయితే, సాయంత్రం 4 గంటల తర్వాతే వీఐపీ దర్శనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు..

 

నేడు మహారాష్ట్రలో రూ. 7600 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (బుధవారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో సుమారు 7,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్‌గ్రేడ్‌కు దాదాపు రూ.7,000 కోట్ల అంచనా వ్యయంతో ఆయన శంకుస్థాపన చేస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఇది నాగ్‌పూర్- విదర్భ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే, షిర్డీ విమానాశ్రయంలో రూ. 645 కోట్ల విలువైన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణాన్ని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఈ టెర్మినల్ షిర్డీని సందర్శించే మతపరమైన పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సాయిబాబాకు సంబంధించిన వేప చెట్టు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. అలాగే, ముంబై, నాసిక్, అమరావతి సహా మహారాష్ట్ర అంతటా 10 కొత్త వైద్య కళాశాలలను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక, టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ముంబై.. అధునాతన సాంకేతికత- మెకాట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటి రంగాల్లో ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వనుంది. దీంతో పాటు చాట్‌బాట్ టెక్నాలజీ ద్వారా విద్యార్ధులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులకు కీలకమైన అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ డేటాను అందించడానికి విద్యా సమీక్షా కేంద్రాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్రదాడికి ప్లాన్.. ఆఫ్ఘన్‌ యువకుడి అరెస్ట్
నవంబర్ 5వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ పై యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల రోజున ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్‌ న్యాయశాఖ ప్రకటించింది. అయితే, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో నాసిర్‌ అహ్మద్‌ తౌహేదీ ప్రత్యేక వలస వీసాపై అమెరికాకు వచ్చాడు. ప్రస్తుతం ఓక్లహోమా నగరంలో జీవనం కొనసాగిస్తున్నాడు. అమెరికాలో ఎన్నికల రోజున ఐఎస్‌ఐఎస్‌ పేరుతో ఉగ్రదాడి చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. కెమెరాలను యాక్సెస్‌ చేయడం, లైసెన్స్‌లు లేకుండా గన్‌లు దొరికే రాష్ట్రాల గురించి అహ్మద్‌ సోషల్ మీడియాలో సెర్చ్ చేశాడు. అందులో భాగంగా వైట్‌ హౌస్‌, వాషింగ్టన్‌ వెబ్‌ కెమెరాలను సందర్శించినట్లు తెలింది. రెండు ఏకే- 47 రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని కొనుగోలు చేసినట్లు యూఎస్ అధికారులు గుర్తించారు. అలాగే, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే ప్రాంతాలే లక్ష్యంగా దాడికి ప్రణాళిక చేసినట్లు అహ్మద్‌ విచారణలో వెల్లడైందని అధికారులు చెప్పారు. ఆ సమయంలో నిందితుడు, అతడి సహచరులు ఆత్మాహుతిదళంగా మారిపోవాలనుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అమెరికా జాతీయ భద్రతకు ఐఎస్‌ఐఎస్‌.. దాని మద్దతుదారుల నుంచి వచ్చే ముప్పును సమర్థంగా యూఎస్ ఇంటలిజెన్స్ బృందం ఎదుర్కొంటుంది. అమెరికన్‌ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే వ్యక్తులను గుర్తించి.. అరెస్ట్ చేస్తామని యూఎస్‌ అటార్నీ జనరల్‌ మెరిక్‌ గార్లాండ్‌ వెల్లడించారు. ఇక, ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్‌కు సపోర్టుగా నిలిచింది. ఈ కారణాలతో అమెరికాలో దాడులు జరిగే ఛాన్స్ ఉందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ వెల్లడించింది. ఇస్లామిక్‌ స్టేట్‌, ఆల్‌ఖైదాతో సహా విదేశీ ఉగ్రవాద సంస్థలు అమెరికాలో దాడులు నిర్వహించాలని ప్లాన్ చేశాయని గత నెల విడుదల చేసిన తమ నివేదికలో తెలిపింది.

 

హిజ్బుల్లా భూగర్భ కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. 50 మంది ఉగ్రవాదులు మృతి
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) దక్షిణ లెబనాన్‌ లోని హిజ్బుల్లా లోని భూగర్భ కమాండ్ సెంటర్లపై అనేక వైమానిక దాడులు నిర్వహించింది. ఇందులో ఏకంగా 50 మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిలో హిజ్బుల్లా సౌత్ ఫ్రంట్, రద్వాన్ ఫోర్స్‌కు చెందిన ఆరుగురు సీనియర్ కమాండర్లు పాల్గొన్నారు. సోమవారం నాడు IAF దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా లోని నాజర్ యూనిట్, బదర్ యూనిట్, అజీజ్ యూనిట్‌పై దాడి చేసింది. హిజ్బుల్లా సంస్థ సదరన్ ఫ్రంట్ దక్షిణ లెబనాన్‌లో భూగర్భ మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్‌ల పెద్ద నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీని ఉద్దేశ్యం యుద్ధ సమయంలో IDF సైనికులపై దాడి చేయడం. అంతేకాకుండా ఉత్తర ఇజ్రాయెల్‌ లోని కమ్యూనిటీలపై దాడులకు ప్లాన్ చేయడం. ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ నివేదిక ప్రకారం, వైమానిక దళం ఈ అవస్థాపనను ధ్వంసం చేయడానికి, సైట్‌లో ఉన్న ఆపరేటర్లు అలాగే కమాండర్‌లను నిర్మూలించడానికి, ఇజ్రాయెల్‌పై దాడులు చేయడానికి అనేక దాడులు చేసింది. ఈ దాడులు దక్షిణ లెబనాన్‌లో IDF అధికారాన్ని అలాగే ఉత్తర ఇజ్రాయెల్‌లో భద్రతా పరిస్థితిని మార్చే దిశగా మరో అడుగుగా చెప్పవచ్చు.

 

నేడే రెండో టి20.. టీమిండియా జోరును బంగ్లాదేశ్ తట్టుకుంటుందా?
ఈరోజు (9 అక్టోబర్ 2024) మూడు మ్యాచ్‌ల T20 అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండవ మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించడం ద్వారా భారత్ ఆధిక్యంలో ఉంది. ఇక సిరీస్ ను చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో భారత్ నేటి మ్యాచ్ లోకి రంగంలోకి దిగనుంది. భారత్, బంగ్లాదేశ్ రెండో టీ20 మ్యాచ్ పరిస్థితి, ఈ మైదానంలో ఇప్పటివరకు ఈ రెండు జట్ల గణాంకాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మూడు T20 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండవ T20 మ్యాచ్‌లో ఈ రోజు భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. నేటి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ టీ20 సిరీస్‌లో తొలి టీ20 మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉండగా.., టీ20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు తిరుగులేని ఆధిక్యంతో రెండో టీ20లోకి అడుగుపెట్టనుంది. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా , బంగ్లాదేశ్ టీ20 జట్టుకు నజ్ముల్ హొస్సేన్ శాంటో నాయకత్వం వహిస్తాడు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈరోజు టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు మరోసారి గత మ్యాచ్‌లో అదే టీమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్‌లో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. నేటి మ్యాచ్ ఢిల్లీలో ఉంది, కాబట్టి అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌పై ఉందిచెప్పవచ్చు. దీనికి కారణం అతని హోమ్ గ్రౌండ్ ఇదే. గత టీ20 మ్యాచ్‌లో తన ఫాస్ట్ బంతులతో అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారిగా మెరిసిన అతడు ఈరోజు హోమ్ గ్రౌండ్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది. టీ20 చరిత్రలో బంగ్లాదేశ్‌తో ఆడిన 15 మ్యాచ్‌లలో భారత్ ఇప్పటివరకు 14 గెలిచింది. అయితే బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు భారత్‌పై ఒక మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. ఢిల్లీ పిచ్ ఎల్లప్పుడూ బ్యాట్స్‌మెన్‌లకు సహాయకరంగా ఉంటుందని తెలిసిందే.

Show comments