Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ

దేశ భద్రతా వ్యవహారాలపై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని లోక్‌సేవాభవన్‌ కన్వెన్షన్‌ సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్‌ దోభాల్ తో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, ఇంటిలిజెన్స్, కోస్ట్‌గార్డ్, సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సులో ఈరోజు ( నవంబర్ 30) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.

నేడే దాయాదుల పోరు.. భారత్‌ను ఓడించే దమ్ము పాకిస్థానుకు ఉందా

ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి బిసిసిఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే ఈరోజు (నవంబర్ 30) మైదానంలో భారత్, పాకిస్థాన్ మధ్య మరో గొడవ జరగనుంది. అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్‌తో పోటీపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు జరగనుంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌, జపాన్‌, ఆతిథ్య యూఏఈతో పాటు భారత్‌ గ్రూప్‌-బిలో ఉంది. కాగా డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ గ్రూప్-ఎలో ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. డిసెంబర్ 6న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 8న ఫైనల్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, షార్జా క్రికెట్ స్టేడియంలలో ఈ టోర్నీ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.

దేవుడా మాకొద్దు ఈ యుద్ధం.. దేశం వదలి పారిపోతున్న ఉక్రెయిన్ సైనికులు

రష్యా దూకుడుగా దాడి చేస్తుండటంతో ఉక్రెయిన్‌ సైనికులు డీలా పడ్డారు. దీంతో రేపోమాపో కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు మొదలైతే ఉక్రెయిన్‌ రష్యాతో గట్టిగా బేరమాడలేని స్థితిలోకి జారిపోతుంది. రష్యాతో యుద్ధం మూడో ఏడాదిలోకి ప్రవేశించగా, అదనపు సైనికులను, ముఖ్యంగా 18 ఏళ్లు పైబడిన వారినీ ఆర్మీలోకి తీసుకోవాలని అమెరికా కీవ్‌పై బాగా ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ, 2022 ఫిబ్రవరిలో రష్యా దాడి చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష మంది ఉక్రెయిన్‌ సైనికులు యుద్ధ రంగం వదలి పెట్టి పరార్ అయ్యారు.

రెండో టెస్టుకు ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ ఔట్.. భారత్‌కు అడ్వాంటేజ్ కానుందా

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ టెస్టులో టీమిండియా విజయం సాధించి 1-0 తో సిరీస్ లో ముందంజలో ఉంది. ఇక రెండో టెస్టు మ్యాచ్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలెట్టాయి. అయితే, రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు కంగారూ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరగనున్న టెస్టు సిరీస్‌ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ దూరం కానున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ గాయానికి సంబంధించిన సమాచారాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ స్థానంలో ఏ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారనే సమాచారాన్ని కూడా అందులో పంచుకుంది.

నేడు పాలమూరులో సీఎం పర్యటన.. మూడంచెల భద్రత

నేడు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు కొనసాగిన రైతుల పండగ సభ ఇవాళ ముగింపు దశకు చేరుకుంది. కాగా.. రైతు పండగ ముగింపు సభలో సీఎం హాజరై ప్రసంగించనున్నారు. సీఎం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3:30 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌కు చేరుకుంటారు. సమీపంలోని రైతు పండగ సదస్సును సందర్శించి స్టాళ్లను పరిశీలించనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

నేటి నుండి కారంపూడిలో పల్నాటి వీర ఆరాధన ఉత్సవాలు

కారంపూడి గ్రామం ఉత్సాహంతో నిండిపోయి, ఏటా జరుపుకునే పల్నాటి వీరారాధన ఉత్సవాలకు సిద్ధమవుతోంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ ఐదు రోజుల వేడుకలు ఘనంగా కొనసాగనున్నాయి. 1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో అమరులైన వీరులను స్మరించుకునే ఈ ఉత్సవాలు వీరాచారుల మనస్సుల్లో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది వీరాచారులు కారంపూడికి చేరుకుంటారు. ఆచారాలను పాటిస్తూ, ఆయుధాలను దైవాలుగా కొలుస్తూ పూజలు నిర్వహిస్తారు. అనుబంధంగా గ్రామోత్సవాలు, కత్తి సేవలు వంటి పండుగ కార్యక్రమాలు జరుగుతాయి. అంకాలమ్మ తల్లి, చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఉత్సవాల్లో ప్రధానాంశంగా ఉంటుంది.

నేడు ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై పాక్‌తో ఐసీసీ కీలక భేటీ

ఛాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ కోసం టీమిండియాను తమ దేశానికి ఎలాగైనా రప్పించాలని చూసిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. పాక్‌కు వెళ్లే సమస్యే లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పడంతో.. భారత్‌ ఆడే మ్యాచ్‌లను వేరే తటస్థ వేదికలో నిర్వహించేలా ప్రతిపాదించిన హైబ్రిడ్‌ పద్ధతికి ఒప్పుకోవాలని.. లేదంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అల్టిమేటం జారీ చేసింది. కానీ, పాకిస్థాన్ హైబ్రిడ్‌ పద్ధతికి తాము వ్యతిరేకమని ఐసీసీకి వెల్లడించింది.

నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆయన లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఈరోజు చంద్రబాబు పర్యటించి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. డిసెంబర్ నెలలో పెన్షన్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో, ఆ రోజు పెన్షన్ పంపిణీ చేయడం కష్టమైన విషయంగా మారిపోతుంది. అందువల్ల, ప్రభుత్వం డిసెంబర్ 1న పెన్షన్ అందించలేని పరిస్థితిని నివారించాలనే ఉద్దేశంతో, పెన్షన్ ను ఈ రోజు (నవంబర్ 30) పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం 100 శాతం పంపిణీని ఈ రోజు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Exit mobile version