గ్రౌండ్ లోనే చితకొట్టుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్
క్రికెట్ అంటే జెంటిల్‌మెన్స్ గేమ్ అని చెబుతారు. కానీ, అప్పుడప్పుడూ ఈ ఆటకు మచ్చ కలిగించే సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘోర సంఘటనే మే 28 (బుధవారం)న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. ఢాకాలో జరిగిన ఎమర్జింగ్ జట్ల మధ్య నాలుగు రోజుల అనధికారిక టెస్టులో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఒకరినొకరు గ్రౌండ్ లోనే తోసుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. అసలు ఎందుకు ఇలా జరిగిందన్న విషయానికి వెళితే.. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 105వ ఓవర్ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆఫ్ స్పిన్నర్ త్సెపో న్టులి బౌలింగ్ చేస్తుండగా, బ్యాటర్ రిపాన్ మోండోల్ అతని మొదటి బంతిని సిక్సర్‌గా మిడ్ వికెట్ మీదుగా బాదాడు. దీంతో కోపానికి గురైన న్టులి, బ్యాటర్ వద్దకు వెళ్లి ఏదో అంటూ వాగ్వాదానికి దిగాడు. దాంతో రిపాన్ అతన్ని వెనక్కి నెట్టాడు. అంతేకాకుండా కోపంతో ఉన్న న్టులి రిపాన్‌ను తోసి, అతని హెల్మెట్ గ్రిల్‌ను పట్టుకుని ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. గొడవ పెద్దవుతున్న సమయంలో అప్పటికే మధ్యలోకి వచ్చిన అంపైర్, దక్షిణాఫ్రికా ఫీల్డర్లు ఇద్దరినీ విడదీశారు.
నేడే క్వాలిఫయర్ 1.. ఫైనల్లో తొలి అడుగు ఎవరిదో?
ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్‌కు వేళైంది. నేడు ముల్లాన్‌పుర్ (చండీగఢ్)లో తొలి క్వాలిఫయర్ జరగనుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడనున్నాయి. క్వాలిఫయర్ 1లో విజేతగా నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఫైనల్లో చోటు కోసం ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2లో తలపడాల్సి ఉంటుంది. బెంగళూరు, పంజాబ్ జట్లు మంచి ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో హోరీహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్ రాత్రి 7.30 నుంచి ఆరంభం అవుతుంది.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారుడిగా వైదొలిగగిన ఎలన్ మస్క్..!
టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల సీఈవో.. ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన నుంచి వైదొలిగారు. ఫెడరల్ ప్రభుత్వంలో పునర్ఘటనం, వ్యర్థ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన “Department of Government Efficiency (DOGE)”లో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన పనిచేశారు. తన అధికారిక పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో మస్క్ బుధవారం X ద్వారా ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా నిర్ణీత కాలం ముగిసింది. ప్రభుత్వ వ్యర్థ వ్యయాన్ని తగ్గించే అవకాశాన్ని కల్పించినందుకు అధ్యక్షుడు ట్రంప్ కు కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. DOGE లక్ష్యం కాలక్రమేణా ప్రభుత్వంలో ఒక జీవనశైలిగా మారుతుందని మస్క్ వెల్లడించారు.
హృతిక్ రోషన్ తో హోంబలే ఫిల్మ్స్ గ్రాండ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్..!
భారతీయ సినిమా పరిశ్రమలో ఓ గ్లోబల్ లెవెల్ కలయిక శుక్రవారం అధికారికంగా వెలుబడింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన హోంబలే ఫిల్మ్స్ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ కలయిక దేశవ్యాప్తంగా సినిమాభిమానుల మధ్య భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ఈ కలియిక పై మేం చాలా ఆనందంగా ఉన్నాం.. హోంబలే ఫిల్మ్స్ లో మేము సరిహద్దులను దాటి ప్రేక్షకులను తాకే కథల్ని తీసుకొస్తామన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. హృతిక్ రోషన్ వంటి స్టార్ నటుడితో కలిసి పనిచేయడం ఆ దిశలో మరో ముందడుగు అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఊహాతీతంగా, శక్తివంతమైన అనుభూతిని తెచ్చే సినిమాను రూపొందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం అని వెల్లడించారు.
నేడు మూడోరోజు టీడీపీ మహానాడు.. 5 లక్షల మందితో బహిరంగ సభ!
కడప జిల్లాలో టీడీపీ ‘మహానాడు’ అంగరంగ వైభవంగా జరుగుతోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే మహానాడులో ఇప్పటికే రెండు రోజులు విజయవంతగా పూర్తయ్యాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్విరామంగా సమావేశాలు నిర్వహించారు. పసుపు పండగలో రెండోరోజు ప్రతినిధుల సమావేశాలు ముగిశాయి. ఇక చివరి రోజైన గురువారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మహానాడులో గురువారం మూడోరోజు భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుంది. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగిన తీరు, భవిష్యత్తు లక్ష్యాలపై పార్టీ అధినేత, ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనాలు తరలిరానున్నారు. గురువారం సమావేశం జరిగే చోట లక్ష మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కడపకు వచ్చే మార్గాల్లో మరో 2 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేశారు.
డొనాల్డ్ ట్రంప్కు షాక్ ఇచ్చిన అమెరికా కోర్టు.. ‘లిబరేషన్ డే’ టారిఫ్ పథకానికి బ్రేక్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ‘లిబరేషన్ డే’ టారిఫ్ లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలను అమెరికాలోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బుధవారం అడ్డుకున్నట్లు ప్రకటించింది. న్యాయస్థానం తన తీర్పులో ట్రంప్ తన అధికార పరిధిని మించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. మ్యాన్ హాటన్ లోని కోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల బృందం ఇచ్చిన తీర్పులో.. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్‌కే ఉందని, అధ్యక్షుడికి అత్యవసర అధికారాలు ఉన్నా అవి ఆ అధికారం మీద ప్రభావం చూపవని స్పష్టం చేసింది కోర్టు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం “లిబరేషన్ డే” పేరుతో అన్ని దిగుమతులపై కనిష్ఠంగా 10% సుంకాన్ని విధిస్తూ, ఎక్కువ ట్రేడ్ సర్ప్ ప్లస్ కలిగిన దేశాలపై మరింత అధిక సుంకాలు విధించనున్నట్లు ప్రకటించింది. ఈ చర్య ద్వారా స్థానిక పరిశ్రమల ఉత్పాదకతను పెంచాలని, ట్రేడ్ డెఫిసిట్‌ను తగ్గించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ (మే 29) ఉత్తర ఆంధ్ర తీరం దాటి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రానున్న మూడు రోజుల పాటు వరుసగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ వేగం 60 కిలోమీటర్లకు కూడా చేరవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి.
అదే జరిగితే.. ఫైనల్‌కు పంజాబ్!
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పంజాబ్, బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న గుజరాత్, ముంబై టీమ్స్ ఎలిమినేటర్‌లో ఢీకొంటాయి. క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరుతుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో (ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మ్యాచ్) మరో అవకాశం ఉంటుంది.
ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. గాయపడిన మహిళకు పాజిటివ్!
మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొవిడ్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళకు పరీక్షలో కోవిడ్ నిర్ధారణ అయింది. చిలకలూరిపేటకు చెందిన వృద్దుడు, బాపట్లకు చెందిన మరో మహిళకు పాజిటివ్‌గా తేలింది.
