NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఒడిశాలో భట్టి విక్రమార్క.. రాహుల్‌ గాంధీతో కలిసి ప్రచారం..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నేడు ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఒడిశాలోని భద్రకు చేరుకున్నారు. అనంతరం లోక్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువ నేత రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారంలో మల్లు పాల్గొననున్నారు. గత వారం రోజులపాటు పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహించారు. నిన్న బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్న డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తుది దశకు చేరుకున్న రాష్ట్ర గీతంపై సమీక్ష చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ముందు ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లోను డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం నిర్వహించారు. ఓ వైపు ప్రచారం నిర్వహిస్తూనే మరో వైపు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల భారీ సభలను సమన్వయం చేస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశాలు నిర్వహించారు. పార్టీ సోషల్ మీడియా విభాగాలు పనిచేయవలసిన తీరు పైన పార్టీ శ్రేణులను ఆయన సమాయత్తం చేశారు.

రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు.. నేడు బీఆర్‌ఎస్‌ ఆందోళన..
నేడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేడు ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఇవాళ చార్మినార్ దగ్గర నిరసనలో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది తెలంగాణ రాజముద్ర ఎందుకు మార్పు చేస్తున్నారని క్లారిటీ ఇవ్వాలని పేర్కొంది. రాజముద్ర మార్చకూడదంటూ డిమాండ్‌ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతీరణం, చార్మినార్ తొలగింపు ఎందుకు మార్పు చేయాలని నిరసనలో ప్రశ్నించనున్నారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు నిచ్చింది. కాకతీయ కళాతోరణాలు, చార్మినార్ లను ఎందుకు తీస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలో కేటీఆర్ తో సహా పలువురు బీఆర్ఎస్ మంత్రులు పాల్గొన్నారు. కాగా.. నిన్న తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాలు తీసివేయడానికి నిరసిస్తూ ఖిలా వరంగల్లోని కాకతీయ కళాతోరణం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాకతీయ రాజుల పాలన దీక్షకు ప్రతీక అయిన కాకతీయ కళా తోరణాన్ని దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తన్నట్టు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

నేడే ఏపీ ఈసెట్, ఐసెట్‌ ఫలితాలు విడుదల..
ఆంధ్రప్రదేశ్‌లో ఈసెట్, ఐసెట్‌ 2024 పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలను ఇవాళ (మే 30న) ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 36, 369 మంది విద్యార్థులు ఎక్జామ్ కు హాజరయ్యారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీ- ఫార్మసీ సెకండ్ ఇయర్ లో నేరుగా ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. అలాగే, ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు కూడా నేటి సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ మురళీకృష్ణ తెలిపారు. మే6వ తేదీన ఏపీలో 111, తెలంగాణళో 2 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 48, 828 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 44, 446 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల ప్రకటన తర్వాత త్వరలోనే కౌన్సెలింగ్‌ తేదీలను కూడా రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

కౌంటింగ్కు ముందు ఏపీలో కేంద్రమంత్రి పర్యటన.. నేడు, రేపు తిరుమలలో అమిత్ షా..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి భారీ ఎత్తున జరిగిన పోలింగ్.. అన్ని పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ రెపుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈసారి టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేత అమిత్ షా నేడు ( గురువారం) రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రచారం చేసి వెళ్లిన ఆయన ఫలితాలకు ముందు మరోసారి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా దేశవ్యాప్తంగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు చివరి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది. నేటితో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో నేటి సాయంత్రం 6 గంటలకు తిరుమలకు అమిత్ షా రానున్నారు. కాగా, ప్రత్యేక విమానంలో వస్తున్న అమిత్ షా.. నేరుగా వకుళ మాత గెస్ట్ హౌస్ కు చేరుకోని రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం 8.30 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్ కోట్ కు తిరిగి వెళ్లిపోతారు. అయితే, ఈ పర్యటనలో ఎన్డీయే మిత్రపక్ష నేతలు చంద్రబాబు, పవన్ తో భేటీ ఉంటుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్..
తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో మొదటి ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి అగ్నిబాన్ ప్రైవేటు రాకెట్ నింగికెగిరి చరిత్ర సృష్టించింది. ఈ రోజు ఉదయం 7. 15 గంటలకు విజయవంతంగా షార్ లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అయితే, గతంలో చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో నాలుగు సార్లు ప్రయోగం వాయిదా పడింది.. కానీ, 5వ ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగించిన చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థ.. భూమికి 700 కిలో మీటర్లు ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లో 300 కిలోల లోపు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా సాగుతున్న ప్రయత్నాలలో కీలకంగా మారిన ప్రయోగం.. ప్రయోగ ప్రక్రియను ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పర్యవేక్షించారు. కాగా, దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ఇంజిన్ ఆధారిత రాకెట్ ఇది.. భవిష్యత్లో చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి.. ఈ తరహా ప్రయోగాలను ఇస్రో ప్రోత్సహిస్తుంది.

కన్యాకుమారిలో ధ్యానం చేయనున్న మోడీ.. షెడ్యూల్ ఇదే
కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద గురువారం నుంచి 45 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోడీ బస చేసేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో మోడీ ఇక్కడ ధ్యానం చేయనున్నారు. దేశం దక్షిణ చివరలో ఉన్న ఈ జిల్లాలో రెండు వేల మంది పోలీసులను మోహరిస్తారు. ప్రధానమంత్రి కార్యక్రమం సందర్భంగా వివిధ భద్రతా సంస్థలు గట్టి నిఘా ఉంచుతాయి. ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల ప్రచారం తర్వాత కేదార్‌నాథ్ గుహలో ధ్యానం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసిన తర్వాత స్వామి వివేకానందకు నివాళులు అర్పించేందుకు ఇక్కడ నిర్మించిన స్మారక రాక్ మెమోరియల్‌పై ప్రధాని మోదీ దృష్టి సారిస్తారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు తెలిపారు. ఈరోజు సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ఆయన ధ్యాన మండపంలో ధ్యానం చేయనున్నారు. ఆధ్యాత్మిక గురువు వివేకానందకు ఈ ప్రదేశంలోనే భారతమాత గురించి దైవ దర్శనం లభించిందని విశ్వసిస్తున్నారు. సమాచారం ప్రకారం, జూన్ 1 మధ్యాహ్నం 3 గంటలకు, సమీపంలోని రాతిపై నిర్మించిన మహాకవి తిరువల్లువర్ విగ్రహాన్ని ప్రధాని మోడీ సందర్శించి, ఆయనకు పూలమాల వేస్తారు.

జూన్ 1 నుంచి మారనున్న ట్రాఫిక్ రూల్స్‌.. వారికి రూ.25 వేల జరిమానా..
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు ఆగడం లేదు. మద్యం మత్తు, అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపడం.. రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు పోలీసు బాసులు. మారనున్న ట్రాఫిక్ నిబంధనల ప్రకారం నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్ల జేబులకు చిల్లులు పడనున్నాయి. అతివేగంతో పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా. మైనర్లకు వాహనం నడిపితే రూ.25 వేలు జరిమానా, 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా నిషేధం విధించనున్నారు. మరోవైపు ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిందే. అక్కడ స్లాట్ బుక్ చేసుకొని కొన్ని గంటలపాటు వేచి ఉండి.. డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితే లైసెన్స్ జారీ చేస్తారు. అయితే జూన్ 1 నుంచి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ పొందండి. కొత్త నిబంధన ప్రకారం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అధీకృత ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్ నుండి డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించండి. ఎంపిక చేసిన ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలలకు ప్రభుత్వం సర్టిఫికెట్లు మంజూరు చేస్తుంది, ఈ డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించడానికి వారికి అధికారం ఇస్తుంది. అక్కడికి వెళ్లి లైసెన్స్ తీసుకోవచ్చు.

‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజూకు మరో ఆఫర్.. హీరో ఎవరంటే?
‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం మమితా బైజు దోచుకున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రేమలు చిత్రం మలయాళంలో పాటు తమిళం, తెలుగులోనూ అనువాదం అయ్యి సూపర్‌ హిట్‌ అయ్యింది. దాంతో మమితాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తాజాగా మమితాకు మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘రెబల్‌’ చిత్రంతో కోలీవుడ్‌లో మమితా బైజు పరిచయం అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ కోలీవుడ్‌లో మమితాకి మరో అవకాశం వరించిందట. యువ నటుడు, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ సరసన మమితా నటించానున్నారట. ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ నిర్మించనున్న చిత్రంలో ప్రదీప్‌ హీరో కాగా.. ఆయనకు జంటగా మమితా ఎంపిక అయినట్లు సమాచారం. ఈ సినిమాకు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం.

నీ బాధ్యత నాది.. నీకేమీ కానివ్వను! అభిమానికి ఎంఎస్ ధోనీ హామీ
ఐపీఎల్ 2024లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ మధ్యలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలో ఉండగా.. ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చి మహీ పాదాలను తాకాడు. అనంతరం ధోనీ అతడిని హత్తుకుని.. మాట్లాడాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ అభిమానితో ధోనీ ఏం మాట్లాడాడో ఎవరికీ తెలియలేదు. తాజాగా మహీ తనతో ఏం మాట్లాడాడో సదరు అభిమాని స్వయంగా చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంఎస్ ధోనీ అభిమాని మాట్లాడుతూ… ‘నా పేరు జై జానీ. ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమానిని. మహీ ఒక లెజెండ్‌. చెన్నై, గుజరాత్‌ మ్యాచ్‌ జరుగుతుండగా ధోనీ మైదానంలోకి వచ్చారు. ఏది ఏమైనా అతడిని కలవాలనిపించింది. అందుకే ఫెన్సింగ్ దూకి మైదానంలోని ధోనీ దగ్గరకు పరిగెత్తా. మహీ భాయ్ పరిగెత్తగానే వెళ్లిపోతాడేమో అనుకున్నాను. చేయి పైకెత్తి గట్టిగా సార్ అని అరిచాను. అప్పుడు నేను సరదాగా పరిగెత్తాను అని నాతో అన్నారు. ఆయన పాదాలను తాకా. ధోనీని చూడగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని తెలిపాడు.