Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఖమ్మంలో లక్ష మందితో బీజేపీ సభ.. హాజరుకానున్న అమిత్ షా..

తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో ఇప్పటికే తొలి జాబితాను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఇక, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బహిరంగ సభలు పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగానే నేడు ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అయితే, నిన్నటి( శనివారం ) సభతో కాంగ్రెస్‌లో కొంత ఉత్సాహం పెరిగింది. కొత్త హామీలు ఇచ్చిన ఆ పార్టీ.. అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు దాన్ని మించిన స్థాయిలో తమ వ్యూహం ఉండాలని కమలం పార్టీ భావిస్తోంది. ఎందుకంటే.. ప్రజలు ఏ పార్టీ ఎలా ఉందో బేరీజు వేసుకుంటారు. అప్పుడు బీజేపీ డౌన్ ఉన్నట్లు అనిపిస్తే.. వారు కాషాయాన్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. అలా జరగకుండా కమలదళం పార్టీ పక్కా ప్లాన్ వేస్తోంది.

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇవే..!

శ్రావణ మాసంలో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు ఫుల్ రద్దీగా మారాయి. అయితే, బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట దొరికింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1914 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు సైతం 24.23 డాలర్ల మార్క్ దగ్గర అమ్ముడవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారక విలువ ఇవాళ రూ. 82.623 మార్క్ దగ్గర ట్రేడ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను ఒకసారి చూస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా, ఇక, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది.

వరల్డ్‌ ఛాంపియన్‌గా పాక్.. ఫైనల్లో టీమిండియా ఓటమి

తొలి బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్‌ ఫైనల్లో టీమిండియా పురుషుల అందుల క్రికెట్‌ జట్టుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా నిన్న (శనివారం) పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో రజత పతకాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 రన్స్ చేసింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో డాక్టర్ టోంపాకీ పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. సల్మాన్‌, మునీర్‌ తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో పాక్‌ను ఛాంపియన్‌గా నిలిపారు. కాగా, భారత బౌలర్లు ఎక్స్‌ట్రాలా రూపంలో ఏకంగా 42 పరుగులు ఇవ్వడం గమానార్హం.

ఉద్యోగం చేయొద్దని భార్య చేయి నరికిన సీఆర్పీఎఫ్ జవాన్

ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నా.. ఓ జవాన్.. ఆయన భార్య కూడా ప్రభ్వుత్వ ఉద్యోగిణి.. కానీ ఆమె ఉద్యోగం చేయడం అతడికి ఇష్టం లేదు.. అయినా ఆమె రోజూ డ్యూటీకి వెళ్తుంది. ప్రమోషన్ కోసం పరీక్ష రాసేందుకు కూడా రెడీ అయింది. పరీక్ష రాసేందుకు వేరే ప్రాంతానికి వెళ్లి హోటల్ రూమ్ లో ఉండగా.. ఆ టైంలో అక్కడికి వచ్చిన భర్త ఆమె అర చేయి నరికేసి వెళ్లిపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ కు చెందిన సతీష్ కుమార్ కుష్వాహా సీఆర్పీపీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నాడు. అతడి భార్య ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు. తన భార్య ఉద్యోగం చేయడం సతీష్ కుమార్ కు ఇష్టం లేదు.. అయినా ఆమె ప్రతీ రోజు డ్యూటీకి వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్ కు అర్హత పొందేందుకు పరీక్ష రాయాలని ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం భర్తతో కలిసి వెళ్లింది.

కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనవాళ్ళే.. బాల్కాసుమన్‌ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో ఉన్నది మనవాళ్లేనని, మననే పంపారని అన్నారు. వెంకన్న రాలేదా.. అలాగే వాళ్లుకూడా వస్తారంటూ చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉన్నది మనవాళ్లేనని వెంకన్న బీఆర్‌ఎస్‌ లోకి వచ్చినట్లు అలాగే వాళ్లుకూడా వస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది నిజమా కాదా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఇంకా చెప్పాలంటే మనమే కొందరిని పార్టీ లోకి పంపించామని, కాంగ్రెస్ పార్టీలోకి కొందరు కోవర్ట్‌లను పంపామని అన్నారు. రాజకీయాలు అన్నప్పుడు కొన్ని తెలివి తేటలు ప్రదర్శిస్తాం కదా అని అన్నారు. వాళ్లు అక్కడక్కడ తిరిగితే వాళ్లను ఏమీ అనవద్దు అంటూ సుమన్‌ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయొద్దని బాల్కసుమన్‌ కోరారు. ఆ కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికల తర్వాత మా పార్టీలో చేరతారని అన్నారు.

గతంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంపీ వెంకటేష్ మా పార్టీలో చేరారు.. ప్రస్తుత కాంగ్రెస్ నేతలు.. బీఆర్‌ఎస్‌కు కూడా వస్తారని.. తమ ప్రచారాన్ని ఆపవద్దని కార్యకర్తలను ఉద్దేశించి సుమన్ అన్నారు. కాంగ్రెస్‌లో తన బినామీలు ఉన్నారని అన్నారు. దయచేసి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను, నాయకులను కోరుతున్నా అని వారు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరైనా చెన్నూరు వస్తే దయచేసి వాళ్లను ఏమీ అనకండి అన్నారు. సోషల్‌ మీడియాలో కానీ, ఊళ్లలో వచ్చినా కానీ దయచేసి వాళ్లను ఎవరు ఏమీ అనకండి అన్నారు. వాళ్ల ప్రచారం వాళ్లు చేసుకుంటారు మన ప్రచారం మనం చేసుకుంటామన్నారు. వాళ్లు రెండు తిట్లు ఎక్కువ తిట్టిన మీరేమి అనకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. నన్ను తిడితేనే కదా నమ్మేది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రాజకీయంలో 15 రోజులు 20 రోజులు ఇలా నడుస్తుంటాయి కాబట్టి పౌరుషానికి పోవద్దని సూచించారు. ఎవరి పార్టీవారు ఎవరి ప్రచారం వారు చేసుకుంటారు.

నేడు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన

ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉంది. ఇది ఇప్పటికే శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కొన్ని చోట్ల వర్షం కురిసింది. నేడు (ఆదివారం) కూడా అలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా అలాంటిదేమీ జరగకపోయినా… తూర్పు ఆసియా, ఆగ్నేయ దేశాల నుంచి వస్తున్న మేఘాలు… బంగాళాఖాతంలో కురుస్తూ… అల్పపీడనంలా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల వైపు వచ్చి వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల, జనగాం, సిద్దిపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

సిద్దిపేటలో హరీష్‌ రావు పర్యటన.. కోమటి చెరువులో 4500 డ్రోన్లతో షో

మంత్రి హరీష్ రావు నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ కార్యక్రమంలో హరీష్‌ రావు పాల్గొననున్నారు. తెలంగాణ అభివృద్దిని డ్రోన్ షో ద్వారా తెలిసేలా నిర్వహించనున్నారు. హరీష్‌ రావు శనివారం సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే.. నెల రోజుల్లో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని, ఈ ప్రక్రియ పూర్తయితే మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట శివారు రంగనాయక్ సాగర్ వద్ద తెలంగాణ తేజోవనం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని కోట్లాది మొక్కలు నాటారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట రైల్వే స్టేషన్‌లో రైలు ట్రయల్ రన్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి హరీశ్‌రావు తొలిసారి నియోజకవర్గానికి రావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్‌లో మంత్రి హరీశ్‌రావుకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

 

 

Exit mobile version