NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు కార్గిల్‌లో వీర అమరవీరులకు ప్రధాని నివాళి.. ఎత్తైన సొరంగం నిర్మాణానికి శంకుస్థాపన..!

25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్‌లోపర్యటించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర అమరవీరులకు నివాళులర్పించనున్నారు. నేటి ఉదయం 9:20 గంటలకు కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు మోడీ నివాళులర్పిస్తారు. అంతేకాకుండా షింకు లా టన్నెల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. అయితే, ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా ఇలా రాసుకొచ్చారు.. జూలై 26వ తేదీ ప్రతి భారతీయుడికి చాలా ప్రత్యేకమైన రో.. 25వ కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటాం.. మన దేశాన్ని రక్షించే వారందరికీ నివాళులు అర్పించే రోజు.. నేను కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి మన వీర వీరులకు నివాళులర్పించడంతో పాటు షింకు లా టన్నెల్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయబోతున్నాను.. ప్రతికూల వాతావరణంలో లేహ్‌కు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సొరంగం అనేక విధాలుగా ముఖ్యమైనదన్నారు. ఈ సొరంగం సరిహద్దుకు సరఫరాలను అందించడానికి వినియోగించబడుతుందన్నారు.

షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడుగా!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియం.. బంగారు నాణెంతో షారుఖ్‌ను సత్కరించింది. పారిస్‌కు చెందిన గ్రెవిన్ గ్లాస్ విడుదల చేసిన నాణెంపై షారుఖ్‌ చిత్రం, పేరు ఉండడం విశేషం. ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్యారిస్‌లోని ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియంలో చాలా మంది ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ షారూఖ్ ఖాన్ మైనపు విగ్రహం కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు షారుఖ్ గౌరవార్థం బంగారు నాణెం కూడా విడుదలైంది. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటుడు షారుక్ ఖానే. మహాత్మా గాంధీ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడు బాద్‌షా కావడం విశేషం. భారతీయ సినిమా ఇండస్ట్రీకి దాదాపుగా మూడు దశాబ్ధాలకు పైగా షారుఖ్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

సుజయ్ ఘోష్ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కింగ్ అనే టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాద్‌షా కూతురు సుహానా ఖాన్ ఒక కీలక పాత్రలో నటించనుందని టాక్. అంతేకాదు అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో జవాన్, పఠాన్, డంకీ సినిమాలతో షారుఖ్‌ భారీ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.

వ్యభిచార గృహానికి భద్రత కల్పించాలని హైకోర్టులో పిటిషన్..

మద్రాసు హైకోర్టులో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అని చెప్పుకునే వ్యక్తి తమిళనాడులో వ్యభిచార గృహం నడుపుతున్నందుకు భద్రత కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం పిటిషనర్‌కు జరిమానా విధించింది. కన్యాకుమారిలోని నాగర్‌కోయిల్‌లో పిటిషనర్ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నందుకు తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

నేడు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సందర్శించనున్న బీఆర్ఎస్ టీం..

నేడు మేడి గడ్డ లక్ష్మి బ్యారేజ్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సందర్శించనున్నారు. బీఆర్ఎస్ టీమ్ ముందుగా ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌజ్ పరిశీలన అనంతరం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్నారు. నిన్న కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బృందం పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మొదటగా కన్నెపల్లి పంప్ హౌస్ ని విజిట్ చేసి మీడియాతో మాట్లాడి మెడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు పయనం కానున్నారు. కాళేశ్వరం పర్యటన అనంతరం వీరంతా తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. మేడిగడ్డ వరదల నుంచి బయటపడిందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక బీఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.

రాహుల్ డ్రావిడ్ కుమారుడి తొలి ఒప్పందం..ఎంతకు కొనుగోలు చేశారంటే..

రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ తన కెరీర్‌లో తొలి కాంట్రాక్ట్‌ను అందుకున్నాడు. అతను మహారాజా ట్రోఫీ KSCA T20 లీగ్‌లో ఈ కాంట్రాక్ట్‌ను పొందాడు. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన మైసూరు వారియర్స్ సమిత్ ద్రవిడ్‌ను రూ.50 వేలకు కొనుగోలు చేసింది. బౌలింగ్ మీడియం పేస్‌తో పాటు మిడిల్ ఆర్డర్‌లో సమిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మహారాజా ట్రోఫీ KSCA T20 లీగ్ కోసం ఆటగాళ్ల వేలం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఇందులో 240 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరిగింది. ఈ ఆటగాళ్లలో శ్రేయాస్ గోపాల్, కృష్ణప్ప గౌతమ్ మరియు జె సుచిత్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

నేడు సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మొదటిసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు సాయంత్రంతో ముగియనుండటంతో ఆయన సాయంత్రం ఢిల్లీకి పయమనమవుతారు. సమావేశాలు ముగిసిన తరువాత సాయంత్రం 5గంటలకు చంద్రబాబు ఢిల్లీకి బయలు దేరుతారు. . సాయంత్రం 5.10గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు.. రాత్రి 7.30గంటలకు ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకుంటారు. రాత్రి 8గంటలకు వన్ జన్ పథ్ రోడ్డుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈనెల 27న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.

నేనెంతగానో మెరుగయ్యా.. నా ఆటను కోర్టులో చూస్తారు: సింధు

ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ పతకం సాధిస్తానని భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ధీమా వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్‌ దిగ్గజం ప్రకాశ్‌ పదుకొణె దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నానని చెప్పారు. తానేంతో మెరుగయ్యానని, తన ఆటను కోర్టులో చూస్తారని సింధు పేర్కొన్నారు. 2016 రియోలో రజతం, 2020 టోక్యోలో కాంస్య పతకాలను సింధు సాధించిన విషయం తెగెలిసిందే. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ పతకం గెలిచి.. ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున రికార్డు సృష్టించాలని చూస్తునారు. సింధు సహా రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ మాత్రమే వ్యక్తిగత విభాగాల్లో రెండేసి పతకాలు నెగ్గారు.

పారిస్ ఒలింపిక్స్‌ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ… ‘పతకం సాధించాలనే లక్ష్యం బరిలోకి దిగుతున్నా. స్వర్ణమా, రజతమా, కాంస్యమా అన్నది విషయం కాదు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచాను. ఏ పతకం సాధించాలని ఆలోచించుకుంటూ ఒత్తిడి పెంచుకోను. ఒలింపిక్స్‌లో ఆడుతున్న ప్రతిసారి మొదటిసారి బరిలోకి దిగుతున్నాననే అనుకుంటా. ప్రతిసారి మెడల్ గెలవాలనే భావిస్తా. హ్యాట్రిక్‌ సాధిస్తానని నమ్మకంగా ఉన్నా. ప్రకాశ్‌ సర్‌ దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నా. ఇప్పుడు నేనెంతో మెరుగయ్యా. నా ఆటను కోర్టులో చూస్తారు’ అని అన్నారు.

నేడు చివరిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నేడు చివరిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం టిడ్కో గృహాల అంశంపై లఘు చర్చ జరుగనుంది. ఆర్థిక పరిస్థితిపై నేడు ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ముఖ్యంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఐదేళ్ల జగన్​ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కొన్నసాగుతున్న వర్షాలు.. రాగల 3 రోజులు భారీ వానలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడనం ఏర్పడుతోంది. దీంతో ముసురు ఆగని పరిస్థితి.. వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు.. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగు రోజులుగా ముసురు ఉధృతంగా పడిపోవడంతో రెండు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగి చెరువులను నింపాయి. బ్యారేజీలకు వరద పోటెత్తుతోంది. భద్రాచలం సమీపంలో గోదావరి వరద ప్రవాహం 48 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దిగువ పోలవరానికి 11 లక్షల 31 వేల క్యూసెక్కుల వరద వెళుతోంది. తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మోసెండ్ నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.