NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏపీలో లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌

ఏపీలో అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ కారణాల వల్ల పలు పథకాలు అందని వారి ఖాతాల్లో నేడు నగదు జమ చేయనున్నారు. డిసెంబర్ 2022- జూలై 2023 మధ్య కాలంలో పథకాలు అందని 2,62,169 మందిని గుర్తించారు. వీరి ఖాతాల్లో రూ.216.34కోట్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా బటన్ నొక్కి జమ చేయనున్నారు. అయితే.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని జగన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అధికారులు వివరించారు. సంక్షేమ ఫలాలకు అర్హులైన వారెవరూ రాకుండా చూసేందుకు పూర్తి కట్టుబడి, అర్హులకు మరో అవకాశం కల్పిస్తున్నారు. “గతంలో ఏ కారణం అర్హులై ప్రయోజనాలను కోల్పోయిన వారు, గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. వారి దరఖాస్తులు ధృవీకరించబడతాయి. అర్హులుగా గుర్తించబడితే, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రయోజనం వారికి అందించబడుతుంది.” సామాజిక తనిఖీ కోసం పారదర్శకంగా గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లలో లబ్ధిదారులందరి జాబితా ప్రదర్శించబడుతుంది.

వరుసగా మూడోరోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,230గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. ఇక దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,400గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,660లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,630 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,230గా కొనసాగుతోంది.

మూడో టీ20లో వరుణుడిదే విజయం.. సిరీస్ భారత్‌ సొంతం!

భారత్, ఐర్లాండ్ మధ్య బుధవారం జరగాల్సిన మూడో టీ20లో వరణుడు విజయం సాధించాడు. టాస్ కూడా పడకుండానే మూడో టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దాంతో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్‌.. 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. మరోవైపు ఐర్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా మూడో టీ20 సిరీస్‌ విజయం కావడం విశేషం. ఇక టీమిండియా ఆసియా కప్ 2023 ఆడేందుకు సిద్ధంగా ఉంది. ఆగష్టు 30న ఆసియా కప్ ఆరంభం కానుంది.

బుధవారం డబ్లిన్‌లో వర్షం తెరిపినివ్వకపోవడంతో మూడో టీ20లో టాస్‌ వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మ్యాచ్‌ ఆరంభ సమయం నుంచి మూడు గంటల తర్వాత వాన తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరీక్షించారు. అయితే మైదానం చిత్తడిగా ఉండడంతో కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ కూడా సాధ్యం కాదని తేల్చేశారు. ఐర్లాండ్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్‌ రద్దుపై అంపైర్లు అధికారిక ప్రకటన చేశారు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7.30 ఆరంభం కావాల్సి ఉండగా.. 11 గంటల ప్రాంతంలో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

నేడే పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. ఏశాఖ ఇవ్వనున్నారు?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మరోవైపు కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ సర్కార్. ఇందులో భాగంగా.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమైంది. అయితే నేడు మధ్యాహ్నం 3గంటలకు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికార పార్టీ నేతలు వెల్లడించారు. అయితే మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌కు బర్తరఫ్‌ పచేసినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇన్ని రోజులు ఆరోగ్య శాఖను హరీష్ రావు చూసుకుంటున్నారు. కాగా, ఈటల ప్లేస్ ఇప్పుడు బర్తీ చేసేందుకు సన్నాహాలు జరగుతున్నాయి. ఇద్దరు బీఆర్‌ఎస్‌ నేతలకు ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తుండగా.. మహేందర్‌రెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే.. గతంలో మంత్రిగా పనిచేసినా మహేందర్ రెడ్డికి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పట్నం మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిశారు.

ఇంటర్‌ విద్యార్థులకు ఇకపై ఏటా రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్

జాతీయస్థాయిలో నూతన విద్యా విధానం రూపొందించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు పరీక్షల విధానంలోనూ మార్పులకు సిద్ధమైంది. ఇకపై జాతీయ బోర్డుల అధ్వర్యంలో కొనసాగే ఇంటర్మీడియట్‌ పరీక్షలను ఇకపై ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి నూతన కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌సీఎఫ్‌) ప్రతిపాదనలను రూపొందించింది. భారతీయ భాషలు తప్పనిసరిగా చదవాలని, 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు కనీస సబ్జె్క్టులను పెంచాలని ఎన్‌సీఎఫ్‌ సూచించింది. ఎన్‌సీఎఫ్‌ రూపొందించిన మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం జాతీయ విద్య పరిశోధక శిక్షణా మండలి(ఎన్‌సీఈఆర్‌టీ)కి పంపించారు. ఎన్‌సీఎఫ్‌ను ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరిరంగన్‌ నేతృత్వంలోని జాతీయ స్టీరింగ్‌ కమిటీ రూపొందించింది. బోర్డు పరీక్షల్లో సంస్కరణలు తొలిసారి కాదు. 2009లో 10వ తరగతిలో ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానాన్ని ప్రవేశపెట్టగా.. 2017లో రద్దుచేసి తిరిగి వార్షిక పరీక్షల విధానాన్ని తీసుకొచ్చారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..!

తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇవాళ కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని, వాతావరణం పొడిగా ఉంటుందని వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కానీ భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 మధ్య విరామం అనంతరం సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ తెలిపింది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. రేపు ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ అందుబాటులో ఉంచనుంది. ప్రత్యేక దర్శనం, వసతి గదులను తమ అఫీషియల్ వెబ్ సైట్.. https://tirupatibalaji.ap.gov .inలో బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. అయితే.. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సువర్ణవకాశమనే చెప్పాలి. ఎందుకంటే ఒకే రోజు మూడు టికెట్లను విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. అందులో ముఖ్యమైనవి అంగప్రదక్షిణ టోకెన్లను టీటీడీ నేటి ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. భక్తులు అలర్ట్ గా ఉండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరింది.

 

 

Show comments